ఈ నాటకమంతా ఆడినందుకు వెంకటాచలానికి ఖర్చు వెయ్యి లోపే అయుంటుంది. కానీ తనలాంటి ఆడవాళ్ళు వెయ్యి రూపాయలకు కక్కుర్తి పడరు గదా! ఒకటికాదు రెండు కాదు డెబ్బై రెండు వేల రూపాయల నగ అంటే తనకు మతిపోయింది. సర్వస్వమూ వాడికి అప్పగించింది.
లోతుగా ఆలోచిస్తే తప్ప వెంకటాచలం మోసగాడు అనుకోవడం కష్టం. అంతా అయిపోయాక అతడి మోసాన్ని గ్రహించి ప్రయోజనమూ లేదు. అందని పండ్లనూ అందీ అందని ధరలు చూపి అందుకోగలుగుతున్నాడు వెంకటాచలం.
వివాహితురాలైన స్త్రీ ఈ పరిస్థితుల్లో ఏం చేయగలదు.
ఇన్స్ పెక్టర్ వెనక్కు తిరిగాడు. కానిస్టేబుల్ తలుపు తీశాడు. అక్కడ వొక ముప్పై ఏళ్ళ యువకుడు ఎదురు నిలబడి "మీకు ఆ నగకు బిల్లు కావాలి గదా -- అది నా దగ్గర వుంది" అన్నాడు. అంటూనే అతను వొక్క వుదుటున లోపలకు ప్రవేశించి రెండే రెండు దెబ్బలతో కానిస్టేబుల్ని నెలకూల్చాడు. మెరుపులా ఇన్ స్పెక్టర్ని సమీపించాడు. అతడి గతీ అంతే అయింది.
ఆ యువకుడు నగను అందుకుని "మంజులా ఇవి నీ దగ్గరుంచు. ఈపోలీసుల సంగతి యింకా చూడాలి" అన్నాడు.
6
"మిస్టర్ వెంకటాచలం వొక్కసారి స్పెషల్ రూంలోకి వస్తారా?" అన్నాడా యువకుడు.
"తప్పకుండా . మీకే నగలు ఎంతలో కావాలి!" అన్నాడు వెంకటాచలం.
"డెబ్బై రెండు వేలలో కావాలి" అన్నాడా యువకుడు. "ఏ నగైనా ఫరవాలేదు."
వెంకటాచలం ఉలిక్కిపడి "పదండి లోపలకు" అన్నాడు.
ఇద్దరూ స్పెషల్ రూంలోకి వెళ్ళారు.
"ఈ రూం లో కింకేవతూ రారు కదూ" అన్నాడా యువకుడు.
"రారు" అన్నాడు వెంకటాచలం.
"అయితే శ్రద్దగా విను. నన్ను మంజుల పంపించింది" అన్నాడు యువకుడు.
"ఎవర్నువ్వు?" అన్నాడు వెంకటాచలం.
"మంజుల నిన్ను దేనికి పంపింది?"
"మంజుల దగ్గర నగ వుంది. అది సోదాలో పోలీసులకు దొరికింది. ఆమె దగ్గర బిల్లు లేదు. అందుకని వాళ్ళది దొంగ సొమ్ముగా భావిస్తున్నారు. లేదా ఆ నగ యెలా వచ్చిందో చెప్పమని వాళ్ళమెను వేధిస్తున్నారు. అందుకోసం మంజుల బిల్లు కోసం నన్ను నీ దగ్గరకు పంపింది" అన్నాడా యువకుడు.
"బిల్లు నేనిస్తాననే అనుకుంటున్నారా?"
"ఇవ్వకపోతే నీకే కష్టం. మంజుల తన వద్ద కా నగ యెలా వచ్చిందో చెప్పేస్తుంది?"
"చెబితే నష్టమెమరికి?" అన్నాడు వెంకటాచలం అదోలా నవ్వుతూ.
"అలా నవ్వకు. మంజులకేం నష్టం లేదు. ఆమె కింకా పెళ్ళి కాలేదు. పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యమూ లేదు. పెళ్ళి కాదేమోనని భయమూ లేదు" అన్నాడా యువకుడు.
"మరి వీరేంద్ర....?" అన్నాడు వెంకటాచలం.
"గొప్పవాళ్ళను వలలో వేసుకునేందుకు అలాంటి వాళ్ళను చాలామందిని ఉపయోగించుకుందామే" అన్నాడు యువకుడు.
"అదా సంగతి -- అయినా నాకేం భయం లేదు. నేనామె గదిలో ఉన్నట్లు సాక్ష్యాలుండాలి గదా!" అన్నాడు వెంకటాచలం.
"అయితే చూడు -- ఇది సాక్ష్యం నెంబర్ వన్ .... అన్నాడా యువకుడు. అది ఒక ఫోటో . అందులో మంజుల, వెంకటాచలం అసభ్యకరమైన భంగిమ లో ఉన్నారు. ఇద్దరి ముఖాలూ స్పష్టంగా కనబడుతున్నాయి. "ఇంకా కావాలంటే మంజుల గదిలో నువ్వు మసిలి వెళ్ళినందుకు మంజుల పోలీసులకు చెప్పేస్తానంటోంది --"
"ఒక్క రాత్రికి డెబ్బై రెండు వేలు అన్యాయం-- బిల్లు మరే చిన్న మొత్తానికైనా అడుగు --"
"రేటు ఫిక్సు చేసింది నువ్వు -- ఇవ్వాల్సిందే!" అన్నాడు యువకుడు.
వెంకటాచలం బేరానికి దిగాడు కానీ ప్రయోజనం లేకపోయింది. అతను ఆ నగకు బిల్లు రాస్తూ -- "దేవుడు మంజుల దృష్టిని నా మీదనే పడేలా చేయాలా?" అంటూ వాపోయాడు.
"మంజుల దృష్టి నీమీద పడ్డానికి కారణం దేవుడు కాదు. ధనాశకు లొంగి నీచే మోసగించబడిన ఓ వివాహిత వనితా నా సాయం కోరి నీ పీచమణచమంది. నేను మంజులను యేన్నుకున్నాను. ఈ కేసులో నాకు బాగానే కిట్టింది. మంజుల కిచ్చేది ఆమె కిచ్చి నాకొచ్చేది నేను తీసుకుంటాను-- ఇంతకీ హెచ్చరిక ఏమిటంటే యింకేప్పుడూ యిలాంటి పన్లు చేయకు. నా దగ్గర యిలాంటి రహస్యపు సమాచారాలు చాలా వున్నాయి. నేరాల్నరికట్టడమే గానీ నేరస్థుల్ని పట్టివ్వడం నా అభిమతం కాదు. అయితే నేరాన్నరిక్కట్టడానికి నేరస్తుడ్ని పట్టివ్వడం తప్పనిసరి అయితే అందుకూ సందేహించను నేను. నాకా అవసరం కలగనంతటివరకూ నీకేం భయం లేదు. నీలాంటి వాళ్ళ మోసాలేలా వుంటాయో తెలియజేయడానికి నా కెలాగూ ఓ ప్రముఖ పత్రిక ఉంది. అర్ధమైందా?"
వెంకటాచలం అతడి వంక వెర్రి చూపులు చూసి -- "ఇంతకూ నగ పోలీసుల దగ్గరుందా?' మంజుల దగ్గరుందా ?' అన్నాడు.
"అన్నట్లు చెప్పడం మరిచాను. మంజుల కివతలి పక్క గది నువ్వు తీసుకుంటే అవతలి పక్క గది నీ మనుషులు తీసుకుని సమయానికి పోలీసుల వేషాల్లో వచ్చారు. వాళ్ళిద్దర్నీ వాళ్ళ గదిలోనే కట్టి పారేశాను. ఇదీ ఆ గది తాళం. నువ్వే వాళ్ళని విడిపించి ఇంకెప్పుడూ అలాంటి వేషా లేయ్యవద్దని చెప్పు. నగ మంజుల దగ్గరే వుంది. కానీ మంజుల ఆ హోటల్ గదిలో లేదు. నీ కిచ్చేది యిచ్చి తనకు రావలసింది రాబట్టుకుంది. మరింక నేను వస్తాను" అంటూ ఓ తాళం అతడికి అందించాడా యువకుడు.
"ఇంతకూ నువ్వు ....మీరు ...ఎవరు?" అనడిగాడు వెంకటాచలం.
"నన్ను డిటెక్టివ్ వెంకన్న అంటారు?" అన్నాడా యువకుడు.
వెంకటాచలం బిల్లందించిన మరుక్షణం లో ఆతనక్కడ్నించి మాయమయ్యాడు.
***
