దిండులోని డబ్బు
వసుంధర

అమ్మయ్య!' అని కుర్చీలో కూలబడ్డాడు పరంధామయ్య.
"ఏమండీ-- డబ్బు దొరికిందా?' అనడిగింది పరంధామయ్య భార్య రంగమ్మ.
"దొరికిందో లేదో నా ముఖం చూస్తె తెలియడం లా?" అన్నాడు పరంధామయ్య.
"సరేలెండి -- హటాత్తుగా దేవుడు ప్రత్యక్ష మై ఈ ఇల్లంతా బంగారంతో నింపినా మీ ముఖం లో నవ్వుండదు. మీ ముఖం చూస్తె ఏం తెలుస్తుంది? ఎప్పుడు ఒక్కటే...."
"ఏడుపు గొట్టు ముఖమంటావ్? అదేనే ..... అదే రోజు డబ్బు సంపాదించి పెట్టింది. ఒకటి కాదు - రెండు కాదు . ఏడు వేలు సంపాదించి పెట్టింది" అన్నాడు పరంధామయ్య ఉత్సాహంగా.
"నిజంగా!" అంది రంగమ్మ సంతోషంగా.
ఈ ఏడువేల వెనుక ఓ జీవితానికి సంబంధించిన కద వుంది.
పరంధామయ్య కు ఇద్దరంటే ఇద్దరు పిల్లలు. పెద్ద ఆడపిల్ల పేరు రుక్మిణి. వయసు ఇరవై రెండు. రుక్మిణి తమ్ముడు జోగారావు. వయసు ఇరవై . ఇంక చదువుతున్నాడు.
అయిదారేళ్ళుగా పరంధామయ్య రుక్మిణి కి సంబంధాలు చూస్తున్నాడు. ఆర్నెల్ల క్రితమే ఓ సంబంధం కుడురింది. కుర్రాడు కాలేజీలో లెక్చరర్. కట్నం ఎనిమిది వేలు కావాలి.
అన్నింటికీ అంగీకరించాడు పరంధామయ్య. తాంబూలాలు కూడా అయిపోయాయి.
ఒక్కర్తే కూతురు కాబట్టి తర్వాత కొడుక్కు కట్నం వస్తుంది కాబట్టి -- పరంధామయ్య అప్పు చేసైనా ఈ పెళ్ళి జరిపించడానికి సిద్దంగా వున్నాడు. కొడుకు చదువుకి బాగా ఖర్చువుతుండడం వల్ల అయన వద్ద క్యాషు సిద్దంగా లేదు. ప్రావిడెంట్ ఫ్న్డులో లోన్ కు అప్లై చేశాడు. అదికాక నలుగురైదగురు స్నేహితులు ఒకటి రెండు వేలు ఇచ్చి సాయపడడానికి సిద్దంగా వున్నారు. పెళ్ళి కింకా రెండు నెలల వ్యవధి వుంది. పరంధామయ్య నెమ్మదిగా ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో పిడుగులా ఉత్తరం వచ్చింది పెళ్ళి వారి దగ్గర్నుంచి.
కట్నం డబ్బులో ఏడు వేలు అర్జంటుగా అడ్వాన్సు గా కావాలిట! ఉత్తరం అందిన నాటికి పెళ్ళి వారిచ్చిన గడువు నాలుగురోజులు మాత్రమే వుంది.
అంతవరకూ అన్నీ సాఫీగా నడిచిపోయాయి. పెళ్ళి వారి నిజాయితీ పైన పరంధామయ్య కు నమ్మకముంది. కానీ అయన వద్ద డబ్బు లేదు. ఈ విషయం పెళ్ళి వారికి తెలియచేస్తే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. అనవసరంగా అపార్ధాలు వస్తాయి. తనేలాగూ కట్నం ఇవ్వదల్చుకున్నాడు. ఒకటి రెండు నెలల్లో తను బాగుండిపోయేదేమీ లేదు. అడిగిన వెంటనే ఇచ్చేస్తే తనకు మర్యాదగా వుంటుంది.
"ఒకవేళ వాళ్ళు మోసం చేస్తే?" అంది కూతురు అనుమానంగా.
"వెర్రి దానా-- కట్నం డబ్బులు ఇమ్మనమని స్వహస్తాలతో మీ మామగారు రాసిన ఉత్తరం వుంది. ఆయన్ను కటకటాల వెనక్కు పంపించడానికి ఒక్క ఉత్తరం చాలు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. మోసాలేమీ వుండవు. నాకు నమ్మకమే! ఒకవేళ మోసమే జరిగిందనుకో -- అలాంటి మోసగాళ్ళ బెడద నీకు వదిలిపోయినట్లవుతుంది" అన్నాడు పరంధామయ్య.
"అవతలి వాళ్ళు మోసగాళ్ళని తెలుసుకునేందుకు ఒకొక్కరికె ఏడు వేలు చొప్పున ఇచ్చుకుంటూ పొతే మనమేం కావాలి?" అన్నాడు జోగిరావు.
"ఇలాంటి దేదో జరుగుతుందనే నాన్నా నీకు జోగారావని పేరు పెట్టారు?" అంది రుక్మిణి.
"ఆడపిల్ల తర్వాత పుట్టిన కొడుక్కి ఏ తండ్రైనా ఇదే పేరు పెట్టాలి" అన్నాడు జోగారావు.
"మీరు విషయం ఇంకో దారికి మళ్ళిస్తున్నారు. పెళ్ళి వారు మర్యాదస్తులు. అందులో ఏమీ సందేహం లేదు. ఎటొచ్చీ నా కిప్పుడు ఏడు వేలు దొరక్కపోతే మనకు మర్యాద దక్కదు" అన్నాడు పరంధామయ్య.
ప్రావిడెంట్ ఫండ్ అప్పు రావడానికాయనకింకా నెల రోజులు పడుతుంది. అప్పిస్తానన్న స్నేహితులు కూడా పెళ్ళికి ముందు ఇద్దామని అనుకుంటున్నారు. అటువంటిప్పుడు వున్న పళంగా అప్పు కావాలంటే ఎలా దొరుకుతుంది?
అయినా పరంధామయ్యకు ఆశ వుంది. కానీ ఒకటి రెండు రోజులు తిరిగాక ఆ ఆశ అడుగంటింది. ఆశ పోవడమే గాక భయం కూడా ఏర్పడింది.
ఇలాంటి సమయంలో ఓ పెద్ద మనిషి పరంధామయ్యకు తను హామీ వుండి మార్వాడీ కొట్లో పదిహేను శాతం వడ్డీ మీద ఏడు వేల రూపాయలూ అప్పుగా ఇప్పించాడు. ఈ అప్పును పరంధామయ్య ఒక నెలరోజుల్లో తీర్చే యగలడు. అందుకు వడ్డీ నూరు రూపాయల చిల్లర అవుతుంది. ఆ మాత్రం డబ్బు పరంధామయ్య కు తక్కువదేమీ కాదు. అయితే పెళ్ళివారి దగ్గర మర్యాద నిలబెట్టుకోడానికి రానున్న అపార్ధాలను తొలగించడాని కీ ఆ మాత్రం వృధా చేయక తప్పదు.
పరంధామయ్య అప్పు తీసుకుని ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు.
తలిదండ్రుల సంభాషణ జోగారావు కూడా విని -- "అయితే నాకు ప్రయాణం తగిలిందన్న మాట!" అన్నాడు.
"ప్రయాణాలలో జాగ్రత్త కూ, పెద్దవాళ్ళతో వ్యవహరించడానికీ జోగారావు పెట్టింది పేరు. వయసులో చిన్నవాడైనా అతని లాంటి పెద్ద కార్యాలు చాలా చేశాడు. పరంధామయ్యకు ప్రయాణాలు పడవు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప అయన బస్సు, రైలు ఎక్కడు.
అనారోగ్యం వంకలో కొడుకును వ్యవహారానికి చంపడం వల్ల పరంధామయ్య కింకో లాభం కూడా వుంది. వ్యవహారంలో తన అంచనా తప్పి -- ఏదైనా పొరపాటు జరిగితే -- అది అనుభవం లేని కారణం గా కొడుకు చేసిన పొరపాటు అని సర్ది చెప్పుకునేందుకు వీలుంటుంది. పెళ్ళిళ్ళ లాంటి భారీ వ్యవహారాల్లో ఇలాంటి అవకాశం అదృష్టమే!
'అవున్రా -- నువ్వే వెళ్ళాలి--" అన్నాడు పరంధామయ్య.
ప్రయాణానికి ముందు - అయన మొత్తం డెబ్బై వందల రూపాయల నోట్లను జాగ్రత్తగా తను లెక్క పెట్టి -- కుటుంబ సభ్యులందరి చేతా లెక్క పెట్టించి తలగడ గలేబీలో పెట్టి- "ఈ దిండు ప్రస్తుతానికి నీ సర్వస్వం. దీన్ని క్షణం కూడా వదలకు. డబ్బును జాగ్రత్తగా పెళ్ళి వారికి అందజేయి" అన్నాడు.
2
ట్రైన్ రావడానికింకా పావుగంట టైముంది.
డిటెక్టివ్ వెంకన్న ప్లాట్ ఫారం మీదున్న ఓ ముసలాయన్నూ, పడుచు కుర్రాడినీ పరీక్షగా చూస్తున్నాడు. వాళ్ళ వ్యవహారం అతడికి కుతూహలంగా వుంది.
వెంకన్న కు ప్లాట్ ఫారం మీద వచ్చిన పని వేరు. అతను రెగ్యులర్ గా చదివే మాగజైన్ ఈ పర్యాయం దొరకలేదు. అది రైల్వే బుక్ స్టాల్ లో వుందని తెలిసి వచ్చాడు. దొరికింది. కొన్నాడు. ఈలోగా ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూశాడు.
ముసలాయన చేతిలో దిండు ఒకటి వుంది. దాన్నాయన గుండెలకు గట్టిగా హత్తుకుని పడుచు వాడికి ఏదో చెప్పి ఆ దిండు అందించాడు. పడుచువాడు దాన్ని గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. అతడా దిండును పట్టుకునే ముసలాయనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా దిండు నతడు వదులుగా పట్టుకుంటే ముసలాయన హెచ్చరిస్తున్నాడు.
వెళ్ళిపోదామానుకున్నవాడే వెంకన్నకు వాళ్ళ వువహారం పూర్తిగా చూసి వెళ్లాలనిపించి వాళ్లకు కాస్త దగ్గరకు వెళ్ళాడు.
వాళ్ళ దగ్గరగా వుండి జాగ్రత్తగా వాళ్ళ సంభాషణ వింటే వెంకన్న కు మొత్తం వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిపోయింది. ముసలాయన పరంధామయ్య, పడుచువాడు కొడుకు జోగారావు. ఆ దిండులో ఏడు వేల రూపాయలుంది. ఆ డబ్బుని జోగారావు జాగ్రత్తగా మగపెళ్ళి వారికి అందజేసి రావాలి.
జోగారావు తండ్రి చాదస్తానికి విసుక్కుంటూన్నాడు. తండ్రి తన చాదస్తాన్ని వదలడం లేదు. వాళ్ళ సంభాషణ నెమ్మదిగానే నడుస్తున్నప్పటికీ ఎవడైనా వింటే మాత్రం ఆ దిండు బలవంతాన్న లాక్కుని మరీ వెళ్ళిపోతాడు.
అసలు ముసలాయన ఏ గొడవా చేయకునా వుంటే ఫరవాలేదు. ఎవ్వరికీ ఏమీ తెలియదు. కొంతమంది చాదస్తాలు దొంగల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.
వెంకన్న ఇలా అనుకుంటూండగానే హటాత్తుగా "దొంగ!" అన్న కేక వినబడింది. అప్రయత్నంగా వెంకన్న జోగారావు ని చూశాడు. అతడి హృదయానికున్న దిండు లేదు.
"అడుగో దొంగ పట్టుకోండి"పరంధామయ్య కేక కేకలా కాక ఆర్తనాదంలా వుంది.
వెంకన్న మారాలోచన లేకుండా ఎవర్నీ ఏమీ అడక్కుండా చటుక్కున అక్కణ్ణించి పరుగెత్తాడు. దూరంగా ఓ మనిషి చేతిలో దిండుతో , మెరుపు వేగంతో పరుగెడుతున్నాడు. మనుషులేవరికీ అందకుండా చాకచక్యంతో పరుగెడుతూ -- ప్లాట్ ఫారం మీద వుండే కటకటాల గేటుకు అవతల వైపుకు చూశాడు.
వెంకన్న కూడా అలాగే చేశాడు.
దొంగ కాస్త వేగం తగ్గించి వెనక్కు చూశాడు.
అప్పటికి దొంగను వెంకన్న తప్ప ఎవ్వరూ అనుసరించడం లేదు. వాడికి ధైర్యం కలిగించడం కోసం వెంకన్న తనూ ఆగిపోయి కాస్త పక్కకు తప్పుకున్నాడు.
