Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 9

                       

                        4

    కాంపు నుండి వస్తూ వరండాలో కూర్చుని గీతా పఠనంలో మునిగి వున్న ముసలాయన వేపు ఓ క్షణం రెప్ప వాల్చకుండా చూశాడు భానుమూర్తి. మరి రెండడుగులు ముందుకు కేసి పరీక్షగా చూశాడు.    
    "మాస్టారూ!' ఆనందమూ, ఆశ్చర్యమూ మిళితమైన కంఠంతో అన్నాడు.
    రాఘవయ్య తలెత్తి కళ్ళద్దాల్లో నుండి సూటిగా భానుమూర్తి వైపు చూశాడు.
    "నన్ను గుర్తు పట్టలేదా, మాస్టారూ! నేను భానుమూర్తిని!" సంతోషంగా అన్నాడు భానుమూర్తి.
    "భానుమూర్తివా? అంటే లెక్కల్లో ఫస్ట్ వచ్చే...."
    "ఆ! ఆ! ఆ భానుమూర్తినే, మాస్టారూ!" ఆనందంలో మునకలవుతూ అన్నాడు భానుమూర్తి.
    "రా! బాబూ! ఇలా కూర్చో! అప్పుడెప్పుడో చూసిందాయే! గుర్తు పట్టలేకపోయాను." కళ్ళద్దాలు తీసి కనుకొలకులల్లో నిలిచిన ఒకే ఒక ఆనందాశ్రువును తుడుచుకుంటూ అన్నాడు.
    "గుర్తు పట్టడం కష్టమే, మాస్టారూ! ఆ తర్వాత మీరెప్పుడూ నన్ను చూడలేదాయే."
    "అవును, బాబూ! ఆ తర్వాత నేనిక్కడ్నించి ట్రాన్స్ ఫర్ అయ్యానాయే - నిల్చున్నావెం? కూర్చో."
    "ఫర్వాలేదు మాస్టారూ!"
    "నీ వినయ సంపద నిన్ను వదల్లెదోయ్! అన్నట్టు ఇప్పుడెం చేస్తున్నావు?" ఆర్ద్రమైన హృదయంతో అన్నాడు.
    "డి.ఐ గా పనిచేస్తున్నాను."
    "ఓ!నువ్వభివృద్ది లోకి వస్తావని నాకు ఆరోజే తెలుసోయ్! ఈరోజు నాకెంత సంతోషంగా వుందని౧ కాసేపు కూర్చుని మాట్లాడకూడదు? తొందరగా వెళ్ళాలా?"
    "తొందరేం లేదు, మాస్టారూ! ఈ ప్రక్క వాటాలోనే ఉంటున్నాము."
    "ప్రక్క వాటాలోనా? అయితే ఇంకేం? వెళ్ళచ్చులే. కూర్చోనోయ్!"
    భానుమూర్తికి కూర్చోక తప్పింది కాదు. "మీ ఆరోగ్యమేలా వుంది?'
    "నా ఆరోగ్యం గురించి ఏం చెప్పనోయ్! ఉబ్బసపు రోగులేలా వుంటారు? ఈ రోజు కాస్త తిరిగితే రేపు పడుకోవలసిందే! నా ఆరోగ్యం కేంలే! నీ విషయం చెప్పు. పిల్లలా?"
    "లేదు"
    "మీరొచ్చి వారం పైగా అయిందా ? మీ గురించి కొంచెం కూడా నాకు తెలీదు. తెలుసు కోవాలనే అభిలాష కూడా లేదనుకో.... ఇంట్లో పరిస్తితులూ అలాగే వున్నాయి. ఏదీ .... అమ్మాయినిలా రమ్మను. చూస్తాను."
    "నాన్నా! కాఫీ అక్కడికే తీసుకురావా?" అంది వరండాలోకి వచ్చి విశాల.
    "రెండు గ్లాసులో తీసుకురా, అమ్మా!"
    విశాల , భానుమూర్తి ముఖం లోకి ఓసారి చూసి లోపలికి వెళ్ళిపోయింది.
    "ఏం పేరు?'
    "ఎవరి పేరు, మాస్టారూ?"
    "అదే! అమ్మాయి పెరోయ్!'
    "అంటే?'
    "మీ ఆవిడ పేరు?'
    "తెలీదు." సన్నగా నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
    "పేరు తెలీకుండా పెళ్లైలా చేసుకున్నా వోయ్ ! గట్టి వాడివే!"
    "ఇంకా పెళ్ళి కాలేదు మాస్టారూ!"
    "నిజమా!"
    "మీతో సరసాలేమిటి?"
    "ఇంకా చేసుకోకపోవడమేమిటి? ఆలస్యంగా పెళ్ళి చేసుకుని జనాభా సమస్య పరిష్కరిద్దామనుకుంటున్నావా?"
    "అదీ ఒక కారణం కాకపోదు."
    "ఇంకా కారణాలు చాలా వున్నాయన్నమాట!"
    విశాల రెండు గ్లాసుల్లో కాఫీ తెచ్చింది.
    "విశాలా! ఇతను..." పరిచయం చేయబోయాడు రాఘవయ్య.
    "తెలుసు, నాన్నా!" ఓరగా భానుమూర్తి వేపు చూస్తూ అంది విశాల.
    "తెలుసా?'
    "మరీ బావగారు, నాన్నా!"
    "అలాగా! అయితే నీకూ మా విశాల తెలుసన్నమాట!"
    "ఏదో .... కొద్ది పరిచయం." నసిగాడు భానుమూర్తి.
    ఇద్దరూ కాఫీ త్రాగారు. విశాల గ్లాసులు తీసుకొని వెళ్ళిపోయింది.
    భానుమూర్తి తన చరిత్ర నంతా పూస గ్రుచ్చినట్లు చెప్పాడు. మీనాక్షి విషయం కూడా ఏం దాచలేదు. రాఘవయ్య అంతా శ్రద్దగా విన్నాడు.
    "మాస్టారూ, మీరంతా విన్నారుగా? నా బెంగల్లా మీనాక్షి గురించే."
    "ఎంతవరకూ చదువుకుంది?"
    "ఎంతో ఎక్కడిది? ఎనిమిదో తరగతి ఫెయిలయింది. దానితో చదువు ఆగిపోయింది."    
    "పోనీ మళ్ళీ చదివిస్తే?"
    "స్కూలుకు పంపా?"
    "ఇంట్లోనే చదువుకోవచ్చు. నువ్వు ట్యూషన్ యిచ్చి మెట్రిక్ పరీక్ష కు కట్టించవచ్చు."
    "నాకూ యీ అభిప్రాయం వుంది. కానీ మీనాక్షి ఏమంటుందో?' సందేహంగా అన్నాడు భానుమూర్తి.
    "అనేందుకిందులో ఏముందని? తన జీవితాన్ని బాగు పరుచుకొనేందుకు మీనాక్షి మటుకు ఎందుకు ప్రయత్నించదు?"
    "అతను చనిపోయినప్పట్నుండీ అది బాగా మారిపోయింది. నా భయమల్లా...."
    "నేనా మాత్రం అర్ధం చేసుకోలేదనుకున్నావా? చదివించి పరీక్షలు పాసు చేయించాలనే కాదు నా ఉద్దేశం. పఠనాభ్యాసం ఏర్పడుతుంది. ఉత్తమ సాహిత్యంతో మీనాక్షి కి పరిచయం కలిగించు. దానివల్ల సంకుచితమూ , కఠినమూ అయిన హృదయం కాస్త విశాలమూ, మృదులమూ కావచ్చు."
    'అలాగే, మాస్టారూ! ఇప్పుడు మీవాడెం చేస్తున్నాడు?'
    "మవాడా?' రాఘవయ్య హృదయం కలుక్కుమంది. దానితో ఒక్షణం ఎలాంటి జవాబూ చెప్పలేకపోయాడు.
    "భానూ, ఒక్క విషయం చెప్తాను. తల్లి తండ్రులకు శిక్షంటూ ఏదైనా భగవంతుడు విధించాలనుకుంటే , కన్నబిడ్డలను శత్రువులుగా మారిస్తే చాలు! అంతకన్నా ఘోరమైన శిక్ష ముల్లోకాల్లోనూ మరొకటి లేదు. అవును. నాకు తెలిసినంత వరకూ ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను." విషణ్ వదనంతో అన్నాడు రాఘవయ్య.
    భానుమూర్తికి రాఘవయ్య మాస్టార్ని ఎలా ఓదార్చాలో తెలీలేదు.
    "జీవితంలో నే వింతగా దగా పడతానని అనుకోలేదోయ్! ఎన్నో ఆశలు పెట్టుకున్న మురళి మా వృద్దాప్యంతో ఇంతటి కష్టాన్ని కలిగిస్తాడని తెలమంటే...." గద్గగ కంఠంతో అన్నాడు.
    "ఊర్కోండి, మాస్టారూ! ఈ ప్రస్తావన తీసుకురాకుండా ఉండవలసింది."
    "నువ్వు మంచిపనే చేశావు. భానూ! హృదయంలో ఘనీభవించిన ఈ విషాదాన్ని కాస్త కరగానివ్వు." భాష్ప పూరితములైన కళ్ళను తుడుచుకుంటూ అన్నాడు.
    భానుమూర్తి మౌనంగా తప్పు చేసినవాడిలా తలవంచుకు కూర్చున్నాడు.
    "జీవితం మధ్య ఒకరికొకరు ఏమీ కాము. భార్యా, బిడ్డలూ అంటూ ఈ మహాసాగరంలో కొట్టుకొచ్చి కలుసుకున్న పుల్లలు. ఎలా కలుసుకున్నారో అలాగే విడిపోతారు. ఇంతా తెలిసి ఎందుకిలా మమకారాలకు లొంగి పోతామో అర్ధం కాదు." జీర గొంతుతో అన్నాడు రాఘవయ్య.
    "అదేమిటి , మాస్టారూ! మనుషులకు మమకారాలు లేక ఏమౌతాయి? అందులోనూ కడుపున పుట్టిన బిడ్డ మీద ప్రేమ లేకుండా ఎలా పోతుంది?'
    "నా ఆశలకూ , ఆశయాలకూ ప్రతి రూపుగా వాణ్ణి తీర్చిదిద్దాలనుకున్నాను. భానూ! ప్చ్! కానీ ఈ రోజు వాణ్ణి చూస్తె గుండెలో మండి అగ్ని పర్వతాలు బ్రద్దలౌతాయి."
    "ఊర్కోండి, మాస్టారూ! మురళి ఏ రోజయినా తన తప్పును తెలుసుకోకపోతాడా? మీ మనసుకు తప్పకుండా సాంత్వన కలుగుతుంది."
    "సాంత్వనా? నాకా? అది కల్లో మాట, భానూ! సాంత్వనం లో ఏదైనా ఉంటె.... అది ఆ విశాల తల్లి వల్లనే!" కళ్ళు మూసుకుని బరువుగా నిట్టూర్చి అన్నాడు రాఘవయ్య.
    "పోనీ, అదన్నా కాస్త నయం. భగవంతుడు మరీ అంత కఠినాత్ముడు కాదు." విచారంగా నవ్వి అన్నాడు భానుమూర్తి.
    "అవును, భగవంతుడు కఠినాత్ముడు కాదు" అన్నాడు మెల్లగా రాఘవయ్య.
    "ఇక వెళ్తాను, మాస్టారూ!"
    "వెళ్ళావోయ్ ! అప్పుడప్పుడూరా! కాస్త మాట్లాడుకోవచ్చు."
    అలాగేనంటూ భానుమూర్తి వెళ్ళిపోయాడు.

                               *    *    *    *
    ఆరాత్రి భోజనాలయ్యాక మీనాక్షిని మాటల్లోకి దింపాడు భానుమూర్తి.
    "ఊరికే ఇలా ప్రొద్దుబుచ్చడం కన్నా ఏదన్నా చదువుకుంటే మంచిది కదా, మీనాక్షి?" అన్నాడు మాటల సందర్భంలో.
    "ఏం చదువు?' ముఖం చిట్లించి అంది మీనాక్షి.
    "మెట్రిక్ పుస్తకాలు తెచ్చిస్తాను. చదువుకో."
    "నాకు రాదు బాబూ!"
    "ఎందుకు రాదూ? రానివి చెప్పేందుకు నేనున్నానుగా?'
    "చదవాలని లేదు."
    తీక్షణంగా చెల్లెలి ముఖంలోకి చూశాడు భానుమూర్తి.
    మీనాక్షి చప్పున తల మరో వైపుకి తిప్పుకుంది.
    "చదువుకోవాలని లేదా? ఎందుకని?" సాధ్యమైనంతగా కంఠాన్ని మృదువుగా మార్చి అడిగాడు భానుమూర్తి.
    "చదువుకుని మటుకు చేసేదేముంది?" బిరుసుగా జవాబు చెప్పింది మీనాక్షి.
    భానుమూర్తి ఆశ్చర్యపోయాడు. కాసేపటి  వరకూ ఏం జవాబు చెప్పాలో తోచలేదు.
    "చదువుకుని చేసేదేముంది! అందరేం చేస్తారు? చదువు చదువుకోసమే! దాని వల్ల జ్ఞానమోస్తుంది. మంచి పుస్తక పఠనం వల్ల ఆనందం కలుగుతుంది. ఇంటింటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుని కాలక్షేపం చెయ్యవలసిన పని వుండదు."
    "ఏం అక్కర్లేదు! ఉత్త దండుగ!"
    "పోనీ, ఉద్యోగం చేసుకోవచ్చుగా?"
    "ఏం? నీకు బరువయ్యానా?"
    భానుమూర్తి నెత్తిన పిడుగు పడ్డట్లయింది. ముఖం వెలవెలా పోయింది. విపరీతమైన బాధతో హృదయం , సుడులు తిరిగిపోయింది. కళ్ళల్లో నీళ్ళచిప్పిల్లాయి. చెమ్మగిల్లిన కళ్ళను మీనాక్షి కళ్ళల్లో పడనీకుండా టేబిలు మీద ఉన్న పేపరు తీసి ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు.
    "నా జీవితం నాశనమైంది. ఇప్పుడు ఏ విషయం మీద నాకు ఆసక్తి లేదు. నేను చదువుకోనన్నానని నాకు ఆసక్తి లేదు. నేను చదువుకొనన్నానని ఏమనుకోకు." నేల చూపులు చూస్తూ మెల్లగా అంది మీనాక్షి.
    "నీ జీవితం నాశనమైంది. నిజమే! ఆ విషయం ఎవరూ కాదనరు. కానీ వాడిపోయిన నీ జీవితాన్ని తిరిగి పుష్పించేటట్లు చేసుకునే శక్తి నీచేతిలో వుందన్న విషయం మరిచి పోతున్నావు."
    "నా చేతిలో ఏం లేదు." నిర్లిప్తంగా అంది మీనాక్షి.
    "అలా అనకు."
    "అవును , ఆ విషయం ఎప్పుడో ఋజువైంది."
    "గతం గతం. దాన్ని గురించి ఇకా ఆలోచించరాదు. ఆలోచించవలసిందల్లా భవిష్యత్తును గురించే. పోనీ, ఆగతం గుర్తు రాకుండా ఉండేందుకైనా యీ చదువు పనికొస్తుంది. నా మాట కాదనకు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS