Previous Page Next Page 
దివిసీమ ఉప్పెన పేజి 9


    కందుల సుబ్బారావు            ఊటగుండం గ్రామము
    
    వయస్సు 28 సం||
    

          
    
    ప్రతి శుక్రవారం కోడూరులో సంత జరుగుతుంది. మేము వెళ్ళి వారానికి సరిపోను సరుకులను తెచ్చుకొంటాము అందుకనే నేను కోడూరు వెళ్ళాను సరుకులను తీసుకొన్నాను. ఇంటికి వెళ్ళటానికి వీలు పడలేదు. అందుకని ఆ రోజు అక్కడేవున్నాను. తెల్లవారుఝామున నేను. మరి కొందరు కలిసి బయలుదేరాము. ఆ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మావూరు జేరుకొన్నాము.
    
    నా భార్య ఒక్కతే మాయింట్లోనే వుంది. గాలి ఉధృతంగా వీస్తోంది. చెట్లు విరిగి పడిపోతున్నాయ్. మా యింటి కప్పు కొంచెం కొంచెం లేచి పోతోంది. నేను యిల్లెక్కి మోకులేసి బిగించి కట్టాను. నాకు ఆకలేస్తుంది కాని నా భార్య అన్నం వండలా. ఇంట్లో పుల్లలు లేవు. ఒకవేళ వాటిని తెచ్చినా గాలికి పొయ్యిమండటంలేదు. అందుకని ఆమె మాత్రము ఏమి చేస్తుంది? నేను కడుపునిండా నీళ్ళు త్రాగి తృప్తి పడ్డాను. మేము రొయ్యల కొరకూ గర్రులతో కట్టుకడతాము. ఆ కట్టుకాడికి బయలుదేరాను.
    
    మాకు సముద్రం చాలా దగ్గర. దానికి మాకు మయానా ఒక కట్టవుంది. దాన్ని ఉప్పు నీటి కట్టంటారు. అక్కడే మురుగు కాలువ వుంది దానిలో రొయ్యల కొరకు గర్రులేస్తుంటాము ఆ గర్రులే మయ్యాయోనని నాకు ఆదుర్దాగా వుంది. అందుకని నేను మరో నలుగురు కలసి బయలుదేరాము. మురుగు కాలువ వద్దకు జేరుకొన్నాము ఆ కాలువ నిండా నీరు పొంగి పోర్లుతోంది గాలికి వాగలులేస్తున్నాయ్. మా గర్రులు కొట్టుకపోయాయి. కాలువ మాకు అందటంలేదు. కరకట్ట సముద్రము ఒకే లెవిల్ గా కనపడుతున్నాయ్. చూస్తుండగానే మేమున్న పర్రకూడా పొడిచిపోయింది. మేమక్కడుంటే చచ్చిపోతామనిపించింది. ఒకరి చేయినొకరు పట్టుకొని గాలిలో తూలుతూ మేము యింటికి జేరుకొన్నాము.
    
    తుఫాను వున్నా కొలది యెక్కువయింది, గాలి చాలా ప్రమాద స్థాయిలో వీస్తోంది. మా యింటి కప్పంతా పోయింది. గోడలు కూడా వూగుతున్నాయి నా భార్య యేడ్వటం మొదలుపెట్టింది. నాకు లోనభయమేస్తున్నా! ఆమెకు కొంత ధైర్యం చెప్పాను. మేము మా యింట్లో వుంటే చచ్చిపోతామని పించింది. అందుకనే యింట్లో సామాన్లన్నీ సర్దటం మొదలుపెట్టాము. పది తులాల వెండి, రెండు నవర్సుల బంగారం ఒక సంచీలో వేసి కావిడి పెట్టెలో పెట్టాము నాలుగు బిందెలుంటే వాటిని గోతాములో వేసి కట్టాము. నేను, నా భార్య యింటి తలుపులను ముందుకు లాగి తాళం వేశాము.
    
    ఆరోజు సాయంత్రం మూడుగంటలయింది. తుఫాను గాలులు తారస్థాయి నందుకొన్నాము. ఇళ్ళన్నీ పడిపోతున్నాయి. ఇంటి కప్పులు యెగిరిపోతున్నాయి. మాకు దగ్గరలో నా అన్నగారి యిల్లుంది. ఎంతో కష్టపడి మేమా యింట్లోకి వెళ్ళాము. అప్పటికి ఆ యిల్లేమి లేవలేదు నా అన్నగారి పిల్లలతో పాటు, ఆ యింటిలో కోమట్లు కూడా వుంటున్నారు. నాకు పిల్లలు లేరు. నేను, నా భార్య వారితోపాటు అక్కడేవున్నాము. మేము వెళ్ళిన కొంతసేపటికి ఆ యింటి కప్పుకూడా లేచిపోవటం మొదలుపెట్టింది. ఎగిరిపోయే యింటికి మోకులతో కట్టటానికి వాకిట్లోకి వెళ్ళాము. ఇంకేముంది? నురుగులు గక్కుతూ వాగ వస్తోంది. కొండంతా కావురు కమ్మింది. నేనొకే కేక వేశాను. ఇంటిలో వాళ్ళనంతా జాగ్రత్త పడమని. వాళ్ళంతా ఘొల్లున యేడ్వటం మొదలుపెట్టారు కోమట్లు యేడుస్తూనే సామానులు సర్దుకొంటున్నారు. నేను నా భార్యను తీసుకొని మా ప్రక్కనున్న దేవనబోయిన మస్తానుగారి యింటిలోకి వెళ్ళాను. నా వెనుక మిగిలినవాళ్ళుకూడా వచ్చారు. మేమంతా ఆయింటిలో కిక్కిరిసినట్లున్నాము. ఉక్కిరి బిక్కిరయిపోతున్నాము.
    
    ఆ యిల్లు చుట్టిల్లేగాని చాలా గట్టిగా వుంది. కప్పు యెగర కుండా గొరల వలలు కప్పి, మోకులతో బిగించి కట్టారు. గోడ కూడా చాలా మందంగా వుంది. చూస్తుండగానే ఉప్పునీరు యింటి లోకి వచ్చింది. ఆ యింటిలో అరవై యేడుగురు వున్నారు. అందరూ గోలజేసి యేడుస్తున్నారు. ఇల్లంతా యేడ్పులతో నిండిపోయింది. ఒకర్ని ఒకరు తప్పించుకొని బయటపడేటట్లు లేరు. ఇంటిలో మొలలోతు నీరొచ్చింది. పై కెక్కటాని కా యింటికి అరప కూడా లేదు. నన్ను నలుగురు వాటేసుకొని, అటూయిటూ కదలనివ్వటంలేదు. ఎట్లాగో తెప్పరించుకొని యెల్లవ కడ్డీమీదకు యెక్కాము. నాతో పాటు మరో యిద్దరెక్కారు. ఆ యింటి కప్పులోంచి పైకి వెళదామనుకొన్నాను. కాని అది సాధ్యపడలా! ఎందుచేతనంటే ఆ యింటి కప్పు గెడలుకావు. తాటి వాసాలేశారు. అవి మాకు విరగలేదు, మరో ఇద్దరొచ్చారు. తలలు పోటీపెట్టి బలవంతాన ఒక వాసాన్ని విరిచాము. మెల్లగా పైకి యెక్కాము. అప్పటికే ఇంటిలో నీరు రొమ్ముల లోతు వచ్చింది. ఇంటి గోడలు పడిపోవటం మొదలు పెట్టాయి. మాలో యెవరూ గోడలక్రింద పడలేదు. ఒక్కొక్కరినే ఇంటిపైకి లాగేసుకొన్నాము. ఇంటిగోడలు పూర్తిగా పడిపోయాయి. ఇల్లు తేలిపోయింది. మేమంతా ఆ ఇంటిమీద కూర్చున్నాము. ఎవరెక్కడున్నారో తెలియదు అందరూ గోలజేసి యేడుస్తున్నారు. మా తెప్ప ముందుకు పోతున్నది.
    
    మేమెటు పోతున్నామో తెలియదు. నా భార్య యెచ్చటుందో కనిపించుటలేదు. మా తెప్ప మహా వేగంగా పోతోంది నా చుట్టూ జనమే నన్ను కావిటించుకొని వదిలిపెట్టడంలా. మొల త్రాడుతో సహా మొత్తం నా వంటిమీద నున్న బట్టల్నికూడా లాగేశారు. వాళ్ళకుకూడ యెవరికి బట్టలు లేవు. ఎవరికి యే విధమైన సాయం చేసే పరిస్థితిలో నేను లేను. ఎవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకొనేటందుకు సతమతమైపోతున్నారు, చూస్తుండగానే మా తెప్పొక వేపచెట్టుకు పట్టుకొంది. గాలి తావుకు మే మొకరిమీద ఒకరు పడిపోయాము ఒక్కొక్కసారి వాగలు మామీదుగా పోతున్నాయి. మేమంతా ఉక్కిరిబిక్కిరై పోతున్నాము. దానిమీదనే వున్నాము.
    
    వలలు, మోకులు బిగించి కట్టి వుండుటవల్ల మేమున్న ఇల్లు విడిపోలేదు. కొంతసేపక్కడే వున్నాము. ఉన్నకొలది ఉప్పెన వాగ లెక్కువగుతున్నాయి పెద్దపెట్టున వాగొకటి మామీదుగా పోయింది. దానితోపాటు ఒక ఇల్లు వచ్చి మామీద పడింది. మేమంతా దాని క్రింద పడిపోయాము. మిగిలిన అరవై ఐదుగురు దానిక్రిందేవున్నారు. అందరూ చనిపోయారు నాతోపాటు నీళ్ళలో పడినతడేమయ్యాడో తెలియదు. నేనుమాత్రం నీళ్ళలో కొట్టుకొంటున్నా. అటూయిటూ చూశా! అంతా ఆగమ్యగోచరంగా వుంది నేనొక్కడనే సముద్రమయాన వున్నట్టున్నా! వాగలు తాడియెత్తున వస్తున్నవి. నేను యెటూ చూడలేకపోతున్నా! నేనున్నా ప్రదేశమంతా చీకటిమయమయింది. కొంచెం తెప్పరించుకొని నీళ్ళలో కొట్టుకొంటూపోతున్నా! నేను భూమినుంచి నాలుగైదు గజాల యెత్తులో వున్నాను. నా కాళ్ళకు అప్పుడప్పుడు ముళ్ళచెట్ల చివళ్ళు తగులుతున్నాయి. నేను యెంతో వేగంగా కొట్టుకపోతున్నా. అప్పుడు నాకొక తాటివాసం దొరికింది. దానిని ఆధారం చేసుకొని పోతున్నాను.
    
    ఒక్కొక్కసారి తాడియెత్తున వాగలొస్తున్నాయ్. అప్పుడప్పుడు వాగలు నామీదుగ పోతున్నాయ్ నా ప్రక్కనుంచే ఒక పట్టెమంచము కొట్టుకపోతోంది నేనా మంచపు వెనుక పట్టెను పట్టుకొన్నాను. తాటివాసాన్ని కూడా వదలలేదు. మంచం కొట్టుక పోతోంది. దాన్ని వెన్నంటి నేను పోతున్నా. ఒక బండి నీళ్ళలో బోల్తాలేస్తూ నావైపు వచ్చింది. అది నామీద పడాలా. నేనొకవైపు అదొకవైపు తప్పుకపోయాము నేను ముందుకు కొట్టుకపోతున్నా. కొంతదూరం పోయేటప్పటికి ఒక తాడి వేళ్ళతోసహా పెళ్ళగించుకొని నీళ్ళలో సుడి తిరుగుతోంది నేను అమాంతం దాని దాపులోకి వెళ్ళిపోయాను ఇప్పటి కెన్నో ప్రమాదాలను తప్పుకొన్నాను. ఇప్పుడీ తాడికి తగిలి చావవలసినదే ననుకొన్నా. తాడి గిర్రున తిరిగి దాని చివర నామీద పడపోయింది అప్రయత్నంగా కళ్ళు మూసుకొన్నా. కొంతదూరం కొట్టుకపోయా ఆ తాడి నన్నేమి చేయలా దాని నుంచి నేనెలా తప్పుకొన్నానో తెలియదు.
    
    ప్రతిక్షణమూ ఒక గండమే నేనెప్పు డెక్కడ చచ్చిపోతానో తెలియదు. ఏది యేమయినా నేను మాత్రం ధైర్యాన్ని వీడలా. నాలో యెవరో వున్నట్టుంది. నాముందు యెవరో బటను చూపిస్తున్నట్టుంది. నీళ్ళలో పోతున్నప్పటికీ, గాలిలో బెలూన్ పట్టుకొని యెగిరిపోతున్నట్టుంది. నేను పోతున్న ప్రదేశమంతా సముద్రమువలె వాగలు కనిపిస్తున్నవి. నేను ముందుకు దూసుకపోతున్నాను. నాకొక తెప్ప అడ్డం వచ్చింది. నేను దానికి పోయి కొట్టుకున్నా. చేతిలోని తాటివాసం చేయిజారిపోయింది మంచాన్ని మాత్రం వదల్లా, ఇంతలో ఒక పెద్ద వాగ వచ్చింది. నన్నెత్తి తెప్పమీదుగా గిరాటు వేసింది. మరలా నేనూ నా మంచం ప్రయాణం మొదలుపెట్టాము. ఎంతదూరం పోయామో తెలియదు. అప్పటికి చాలా ప్రొద్దుపోయింది. ఎటుచూసినా చీకటి గాడాంధకారం అప్పుడప్పుడు తీగల్లా సన్నపాటి మెరుపులు కనపడుతున్నాయ్. గాలిలో మార్పు కనిపించింది పైరు గాలిపోయి, పడమటి గాలి వీస్తోంది. ఒక్కసారి పడమట ప్రక్క పెద్ద మెరుపు మెరిసింది. అంతే! ఉన్నట్టుండి నా మంచం ఒక్కసారి సుడి తిరిగింది ఏమయినప్పటికీ నేనా మంచాన్ని వదలలేదు. మొండోణ్ణి కాబట్టి దాన్ని పట్టుకొని, నీళ్ళలో వేళ్ళాడుతున్నా మరలా మంచం ప్రయాణం సాగించింది. ఈదఫా నేను తూర్పువైపుకు పోతున్నట్టున్నా వాగకూడా వెనక్కు మళ్ళింది నేను సముద్రానికి కొట్టుకపోతున్నా ముందుకెంత వేగంగా వచ్చిందో! వెనుకకు కూడా అంతే వేగంగా పోతోంది. నా మంచం సముద్రమువైపు పోతోంది, నేనా సముద్రంలో పడి చచ్చిపోతాననుకొన్నా అయినా నాలో మాత్రం జంకనేది లేదు. ఎంతో ధైర్యంగా వున్నాను.
    
    చాలాదూరం వెనుకకు తిరిగి వచ్చాను. నా మంచం పోయి ఒక యీతచెట్టుకు పట్టింది. నేను మంచంలోనుంచి చేతుల్ని పోనిచ్చి, ఆ చెట్టును వాటేసుకొన్నాను చాలాసేపు అట్లాగే వున్నాను. చేతులు బిగుసుకొనిపోయాయి. ఈతమట్టలు కొట్టుకొని వల్లంతా పుళ్ళు పడిపోయాయి కాళ్ళు కొంకర్లు పోయి చెట్టుమీద నిలవటం చాలా కష్టంగా వుంది. కళ్ళు చూడనివ్వటం లేదు. అయినా బలవంతాన కళ్ళు తెరచి క్రిందకు చూశాను నీరు చాలా తగ్గింది, ఇంతలో ఒక మెరుపు మెరిసింది నాకు దగ్గరలో తూర్పువైపున గుబురుగా పెరిగిన తుమ్మవంగిపోయి కనిపించింది. ఒకసారి నా వెనుక నుంచి గాలి చాలా వేగంగా వీచింది. అప్రయత్నంగా నా మంచం దానిమీద పడిపోయింది. దానితోపాటు నేను కూడా పోయి ఆ మంచం మీద పడిపోయాను. నాకు స్పృహతప్పింది. తరువాత యేమి జరిగిందో తెలియదు.
    
    నాకు కొంచెం స్పృహ తెలిసింది. వంటిమీద బట్టలు లేవు. వళ్ళంతా మంటెత్తి పోతోంది. నిప్పుసెగను కూర్చున్నట్లు వేడిగా వుంది. కళ్ళెత్తిచూడాలనుకొన్నా కాని రెప్పలు లేవటం లేదు. రెండు చేతులతో రెప్పల్ని పగలతీసి చూశాను పొద్దు చాలా యెక్కింది. ఉదయం తొమ్మిదిగంటలు కావచ్చు. నేను పాతరెడ్డి పాలెం వద్ద పట్టాను. ఇక్కడికి మా వూరు ఎనిమిది కిలోమీటర్ల దూరముంటుంది. నేనెంతదూరం పోయి తిరిగి వచ్చానో తెలియదు. నా వళ్ళంతా పట్టుక పోయింది. కాళ్ళూచేతులు కొంకర్లుపోయి నా స్వాధీనంలో లేవు. బలవంతాన మంచం మీద నుంచి పైకి లేచాను. నాకు దగ్గరలో కొన్ని గడలు పట్టాయి. వాటిలో ఒకదానిని తీసుకొని, నీళ్ళలోతు చూశాను షుమారు మొలలోతు, ఒక డాబా కనపడింది. నేనక్కడికి వెళ్ళాలని బయలుదేరాను. ఇంతవరకు నన్ను కాపాడిన మంచాన్ని అక్కడ వదలటమా? లేక తీసుకొని వెళ్ళటమా సందేహములో పడింది నా పరిస్థితి. ఏమయినా తీసుకొని వెళ్ళుటకే నిశ్చయించుకొన్నాను. ఆ మంచాన్ని నెత్తిమీద పెట్టుకొని పట్టికెళ్ళే వోపిక నాకు లేదు. అందుకని మొలకు కట్టుకొన్నా నీళ్ళలో లాగుకొంటూ డాబావద్దకు జేరుకున్నాను.
    
    నాకు వంటిమీద బట్టలు లేవు. కనీసం మొలత్రాడు కూడా లేదు. ఆ యింటి ఆసామి నావంక జూచి చాలా బాధ పడ్డారు. ఒక గోగునార తడపా, ఒక గుడ్డముక్కా యిచ్చారు. నేను వాటిని కట్టుకో లేకపోయాను. చేతులు కొంకర్లు పోయి పనిచేసే పరిస్థితిలో లేవు. పాపం ఆయనే ఆ తడపను మొలకు కట్టి, గోచి పెట్టారు. నాకు విపరీతంగా దాహం వేస్తోంది. నాలుక పిడచ కట్టుకపోతోంది. కాసిని మంచినీళ్ళు పొయ్యమని అడిగాను. ఆ వూళ్ళోమంచినీళ్ళే లేవు, ఎక్కడ చూచినా ఉప్పునీరే! ఆయనమాత్రం ఏమి చేస్తారు? నావంక జాలిగా చూశారు, నేను తలవంచుకొని కోడూరువైపు ప్రయాణం మొదలు పెట్టాను.
    
    నేను నా మంచాన్ని మాత్రం వదలిపెట్టలేదు. కష్టపడి నీళ్ళలో లాక్కుపోతున్నా, కొంతదూరం పోయేటప్పటికి నాకొక చెరువు కనిపించింది. అక్కడొక శవముంది. దగ్గరకు పోయి చూశాను. ఆ శవం యెవరిదో కాదు నా అన్నది. ఆయన్ని చూచి నాకు దుఃఖం ఆగలేదు, చిన్నప్పటినుండి నన్నెంతో అల్లారుముద్దుగా పెంచిన అన్నయ్య నేనప్పుడీ శవాన్ని యేమీ చేయలేని పరిస్థితిలో వున్నాను. కళ్ళారాచూచి, కన్నీళ్ళను పెట్టుకొన్నాను. మనసులోనే దండం పెట్టుకొని తిరిగి ప్రయాణం సాగించాను.
    
    నాకు కోడూరు వెళ్ళితే బాగుండుననిపించింది. అక్కడ మా వూరు వాళ్ళురావచ్చు, విషయాలు తెలుస్తాయనిపించింది. మరల నా మంచాన్ని తీసుకొని కోడూరు జేరుకొన్నాను. మా వాళ్ళెవరూ అక్కడకు రాలేదు. అసలు వాళ్ళు బ్రతికి వుంటేగా వచ్చేందుకు. వచ్చే వాళ్ళను, పోయేవాళ్ళను అడుగుతూ మూడురోజులు గడిపాను. ఈ మూడు రోజులు నాకు అన్నం లేదు. నానిపోయిన బియ్యం జావ త్రాగి వున్నాను, నాల్గవరోజు ఆహారంతో లారీలు వచ్చాయి. ఎంతోమంది దాతలు వచ్చారు వారి సహాయ సంపత్తులందించారు. నా కక్కడ వైద్యం చేయించారు. వంటి పుళ్ళన్నీ మానాయి. కళ్ళు కూడా చూడనిస్తున్నాయ్ తరువాత కొన్నాళ్ళకు మా వూరు చేరుకొన్నాను ఊరంతా స్మశానంలాగ వుంది. ఇళ్ళన్నీ కొట్టుకపోయాయ్. మా ఊళ్ళో ఒక్క యిల్లుకూడా నిలుపలేదు. జనం కొద్దిమంది మాత్రమే మిగిలాము ప్రభుత్వము వారు డేరాలేస్తే వాటిలో వాటిలో తలదాచుకొన్నాము. పునరావాస సౌకర్యములను కలిగించారు. పాతకధల్ని మరచి, కొత్తబాటల్లో పయనిస్తున్నాము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS