Previous Page Next Page 
దివిసీమ ఉప్పెన పేజి 8

   
    కొక్కిలిగడ్డ భ్రమరాంబ,            సొర్లగొంది గ్రామము
    
    వయస్సు 40 సం||

             

 

               
    
    
    మాది నాలుగు దూలాల రాతిగోడల యిల్లు, మట్టి అడుసుతో కట్టుకున్నాము మా యింటి సింహద్వారమే వేయిరూపాయలు చేస్తుంది. గోడలు గూడ చాల గట్టిగా ఉన్నవి. మా యింటి కేమి ఫరవాలేదనుకున్నాము. మా యింట్లో నేను నా భర్త, పిల్లలు, మొత్తం పండ్రెండు మందిమి వున్నాము వంట చేసుకున్నాము. తినటానికి వీలుపడటం లేదు. యింటి పై కప్పంతా పోయింది. గాలికి గోడలు ఊగుతున్నాయి. వెలిసి కప్పంతాపోయింది. వానంతా యింట్లోనే పడుచున్నది. భయమేసి పిల్లలంతా యేడుస్తున్నారు. మాయిల్లు పడిపోయేటట్టుంది. మాకు దగ్గర్లో కొక్కిలిగడ్డ గోవిందు గారి యిల్లు ఉంది. దానిలోకి మా వాళ్ళనందర్నీ పంపించాను. నేను గొడ్లను చూచుకొంటూ యింటి వద్దనే ఉన్నాను.
    
    శనివారం ఉదయం 11 గంటలయ్యేటప్పటికి మా యింటి గోడలు పడిపోవటం మొదలు పెట్టాయి. ఒక ప్రక్క యిల్లు పోయిందనే దిగులు. మరోప్రక్క పైనపడే వానకు విపరీతమైన చలి, నిలువెల్ల వణికిపోతున్నాను. ఏమి చేయటానికి తోచలేదు. ఇంటిపై ఆశ వదులుకొని, నేను కూడ మా వాళ్ళున్న ఇంటికి జేరుకొన్నాను. పిల్లలు నన్ను కావిటించుకొని యేడ్వటం మొదలు పెట్టారు. నిలువ లేక క్రింద చతికిల పడ్డాను. తలెత్తి ఇమ్త్య్వంక చూశాను. బ్రహ్మాండ మైన నిట్టాడి. పైకప్పు రవ్వంతైనా చెడలేదు ఇంటి పైన పెద్ద బాపువలలు, గిడసలవలలు కప్పారు. వలలు మొత్తం 40 వేల రూపాయల ఖరీదు చేస్తాయి. క్రింద యొక్కులు దిగేసిమోకులు బిగించి కట్టారు. ఇల్లు పరవాలేదనుకున్నాను. అప్పటికి మేమున్న యింట్లో 150 మంది వరకు వున్నారు. మగ వాళ్ళంతా ఇల్లు ఎగిరిపోకుండా గట్టి ప్రయత్నాలు చేశారు. జనం చాలా అమంది వుండుట వల్ల కొంత ధైర్యంగావుంది అందుకని అక్కడేవున్నాము. సాయంత్రము నాలుగు గంటలు కావచ్చింది నేను కూర్చోనే వున్నాను. పసిపిల్లను మాత్రం భుజాన వేసుకొన్నాను పెద్దపిల్ల నా ప్రక్కనే కూర్చుంది. రెండవ పిల్ల కాళ్ళమీద పడుకొంది నేను మాత్రము ఇంటి వంకే చూస్తున్నా, మగ వాళ్ళు పలుగులతో తలుపుల్ని అదిమి పట్టుకున్నారు; ఒక్కసారి తళుక్కుమని మెరిసింది. లోపలున్న వాళ్ళమంత తుఫాను తగ్గిపోవచ్చుననుకున్నాము. ఇంతలో ఇల్లంతా గలగలమని మ్రోగింది. ఫెడేలుమని నిట్టాడి విరిగి పడిపోయింది దానిక్రింద చాలా మంది పడిపోయారు. ఒకరి మీద ఒకరు దొంతర్లుగా పడిపోయారు. నేను పైవరసలో ఉన్నాను. ఇంతలో నీరు బాగా వచ్చింది. నీళ్ళు పుక్కిలింతలగుతున్నాయి. నాభుజాన పిల్ల కొట్టుకుపోయింది. కాళ్ళ మీద పిల్ల యేమయిందో తెలియదు. పెద్ద పిల్ల మాత్రము నీళ్ళల్లో కొట్టుకొంటూ యేడుస్తోంది. నేను పిల్లను రెక్కల క్రింద చేయివేసి పైకి యెత్తాను. పిల్ల యింటి గడల్ని పట్టుకొంది. అమ్మా నేను చచ్చిపోతున్నా! అని కేకలు వేస్తుంది. నాకడుపు తరుక్కుపోతుంది. నేను నీళ్ళల్లో నిలబడలేకపోతున్నా. అమ్మా నీవు వదిలిపెట్టవద్దని నేను కేకవేశా. నాబిడ్డ మరల కేక వేసింది. అమ్మా నేను చచ్చిపోతున్నా! నాన్నానేను చచ్చిపోతున్నా! నన్ను పట్టుకోండి! నన్ను పట్టుకోండి! చచ్చిపోతున్నా అని కేకలు వేస్తోంది. నాకడుపు తరుక్కుపోయింది. యేమిచేయను నీటివాగా నెట్టివేస్తోంది, గుండెలు బాదుకొని అమ్మా అమ్మా అని అరచాను ఇంతలో నీరు ఎక్కువయింది. ఇల్లు ఒక్కసారిగా సుడి తిరిగింది యిల్లు ఒక్కసారి పైకి లేచిపోయింది ఎక్కడి వాళ్ళక్కడ కొట్టుకుపోయారు. నిట్టాడి క్రిందపడ్డ వాళ్ళంతా అక్కడే చచ్చిపోయారు. నన్నొక వాగయెత్తి యింటికేసి కొట్టింది. నాతల యింటి గడల మయాన యిరుక్కుపోయింది. చేతులతో గడలు పట్టుకున్నా తలపైకి చూస్తున్నా, నాకేమీ కనపడటంలేదు. వాగలు నామీదుగా పోతున్నవి, వాగకు, వాగకు మయాన కొంచెం గాలి పీల్చుకొనుచున్నా! గొంతు బిగుసుకొని చచ్చిపోతాననిపించింది. కాని ఆ అదృష్టం నాకు కలుగలేదు.

 

      
    
    ఎటుకొట్టుకపోతున్నామో తెలియదు. తల మాత్రమే పైన వుంది. మిగిలిన మనిషినంతా నీళ్ళలో వేళ్ళాడుతున్నా కొంతదూరం పోయేటప్పటికి, ఎవరిదో కాలు నానెత్తి మీద పడింది. అమ్మో! యెవరో మనిషి యిక్కడ వేళ్ళాడుతోంది. అని అతను నాజుట్టు పట్టుకొన్నాడు. అతని చేతికి నాజుట్టంతా మెలివేసుకొని, బలంగా పైకి లాగాడు. గెడల కట్టుల్లో యిరుక్కుపోయిన నేను, పైకి వెళ్ళలేకపోయాను. ఇంతలో అతను అరచాడు ఎవరో మరోకతను వచ్చాడు. బలవంతాన కత్తులు తప్పించి, నన్ను పైకి లాగారు. ఇంటి పైన పారేశారు. కొంచెం తేరుకున్నాను. వంటి బట్టలన్నీ కొట్టుకపోయాయి వళ్ళంతా గెడలు, మేకులు చీల్చుకపోయాయి ఉప్పునీరేమో మంటెత్తిపోతోంది బాధతో మూలుగుతూ కళ్ళెత్తి చూశాను. మేమంతా సముద్రానికి కొట్టుకపోతున్నాము, మేమున్న తెప్పమీద 20 మంది వున్నాము. అందరూ గోలజేసి యేడుస్తున్నాము, మేమంతా కరకట్టదాటి అడవి మీదుగా పోతున్నాము. ఆ అడవిలో మాకు ఒక చెట్టు కూడా కనిపించలేదు. మేమంతా సముద్రానికి పోతున్నాము. చచ్చిపోతామనుకొన్నాము. మరుగాలి వచ్చింది మారు వాగ లేచింది దక్షిణముగా పోయేమేము వుత్తరంగా పోతున్నాము ఫరవాలేదు ఏదో ఒక వూరు చేరుకోవచ్చు ననుకొన్నాము వాగల వేగానికి యిల్లు యెంతో యెత్తులేచి క్రింద పడుతోంది. ఒక్కొక్కసారి కవ్వంతో మజ్జిగజేసినట్టు గిరగిరా తిరుగుతుంది. మేమంతా గెడలను పట్టుకొని, మునగడలా క్కొని, దాని మీదనే కూర్చున్నాము, నేను చలివేసి వణికిపోతున్నాను. నా బాధ చూచి కొక్కిలిగడ్డ పోతురాజు తన పంచెలో సగంచించియిచ్చాడు. నేను దానిని మొలకు చుట్టుకొన్నాను. ఆ పోతురాజే నన్ను తెప్ప మీదకులాగేశాడు, ఇప్పుడీగుడ్డ నిచ్చి కాపాడాడు. ఇతనే నాపాలిట దేవుడనిపించింది. మనసులోనే దండం పెట్టుకొన్నాను.
    
    తెప్ప మహావేగంగా పోతోంది. మూలపాలెం మీదుగా పోతున్నాము. కొంతదూరం పోయేటప్పటికి యేదో ఒక చెట్టు అడ్డం వచ్చింది. వాగలు మా యింటిని ఆ చెట్టుకేసి అదే పనిగా బాదేస్తున్నవి. మేమంతా తల క్రిందులయి పోతున్నాము, అందరూ గావురు గావురుమని యేడుస్తున్నారు మా తెప్ప రెండుగా చీలిపోయింది. చీలిపోయే గెడలమయాన ఒక పిల్ల పడింది. షుమారు 9 సం||రాలు వుండవచ్చు. ఆ పిల్ల గిలగిలా తన్నుకొంటూ యేడుస్తోంది. నాయ్డు చినశేషయ్య ఆమెను పైకి లాగాడు ఇంతలో తెప్ప విడిపోయింది వాళ్ళ నాన్నకు ఆ పిల్లను అందియ్యపోయాడు. పిల్ల జారి నీళ్ళలో పడిపోయింది. వాగల్లో కొట్టుకపోయింది వాళ్ళ తండ్రి కూడా జారిపోయాడు. దాని మీద నుంచి ఒకామె నేనుపడి పోతున్నా! చచ్చిపోతున్నా! ఇదిగో యీ సంచి తీసుకోండి దీనిలో 4 చామంతి బిళ్ళలు, నానుతాడు డబ్బువుంది, అని మా తెప్పమీద నున్న తన భర్తకు గిరాటు వేసింది. ఆ మూటకాస్తా నీళ్ళలోనే పడిపోయింది. ఆమె వాగల్లో కొట్టుకపోయింది నీవులేక నేనెందుకు బ్రతకాలని, ఆమె భర్తకూడా నీళ్ళలో పడిపోయాడు. వాళ్ళేమయి పోయారో తెలియదు. చీలిపోయిన మా తెప్ప కొట్టుకపోతూనే వుంది చీకటిపడింది.
    
    నేనున్న తెప్పమీద యెంతమంది మిగిలారో సరిగా తెలియదు. మా తెప్పపోయి ఒక పెద్దతుమ్మ చెట్టుకు పట్టుకొంది. మేమంతా తలా ఒక మండ పట్టుకొని చెట్టు యెక్కాము. తెప్ప కొట్టుకపోయింది. మేమాచెట్టుమీదనే వున్నాము. బాగా ప్రొద్దుపోయింది. నేను చెట్టు క్రిందభాగంలో వున్నాను. నా పిల్లల్ని తలచుకొని యేడుస్తున్నా. నా వాళ్ళంతా పోయిన తరువాత నేనెందుకు బ్రతకటం? ఈ వాగల్లో కొట్టుకపోవాలనిపిస్తుంది. నా యేడుపు విని చెట్టు పైనుంచి నా కొడుకు అమ్మా! అని కేకవేశాడు అయ్యా! నీవు బ్రతికేవున్నావా! కొడుకా? అని అరచాను, అమ్మా అని కొడుకు అయ్యా! అని నేను ఒకళ్ళని ఒకళ్ళుకేకలు వేసుకొన్నాము, నా కొడుకు యెప్పుడు వచ్చి యీ చెట్టుని పట్టుకొన్నాడో తెలియదు. నాకు యెనిమిది మంది సంతానానికి యీ బిడ్డ ఒక్కడున్నాడు. ఈ బిడ్డ కొరకైనా నేను బ్రతకాలి. నాయనా! నావద్దకు రమ్మని పిలిచాను. పిల్లవాడురా లేకపోతున్నాడు. మండల్లో చిక్కుకపోయాడు. నన్ను కాపాడిన పోతురాజు మా వద్దనే వున్నాడు. అతను నా పిల్లవాణ్ణి నా వద్దకు జేర్చాడు. ఒకళ్ళని ఒకళ్ళు కావటించుకొని అక్కడే వున్నాము.
    
    వాగలు రావటం తగ్గుముఖం పట్టాయి. చెట్టు క్రింద నీరంతా తగ్గింది. ఒకతను క్రిందకుదిగాడు. అన్నీముళ్ళే! మేము కూడా క్రిందకుదిగాము. కాళ్ళనిండా ముళ్ళు విరిగిపోయాయి. అక్కడ నుంచి కొంత దూరం పోయాము. ఒకదిబ్బ కనిపించింది దాని నిండా తాళ్ళు ఆ తాళ్ళతోపులో మేమంతా జేరాము ఎవరికి బట్టలు లేవు. చలికి వణికిపోతున్నాము. ఒకళ్ళని ఒకళ్ళు కావిటించుకొని అక్కడేవున్నాము. అందరమూ స్పృహతప్పి పడిపోయాము.
    
    తెల్లవారింది. మామూలులోకంలో పడ్డాము. తుఫాను పోయింది బట్టలులేవు. ఎలాతిరిగేది? ఎవరికీ వాళ్ళం మునగడ తీసి కొని కూర్చున్నాం, మగపిల్లలు అక్కడక్కడా వెతికి చెట్లను పట్టుకొన్న గుడ్డపీలికలు తెచ్చియిచ్చారు మేము వాటిని మొలచుట్టూ చుట్టుకొన్నాము. కొంచెం పొద్దు యెక్కింది. మేము గమళ్ళపాలెం దగ్గరలో పట్టాము. ఇక్కడికి మావూరు 5 కిలో మీటర్లు వుంటుంది. గమళ్ళపాలెం నుంచి ఒకాయన వచ్చాడు. మమ్ములను జూచి, చాలా బాధ పడ్డాడు. ఊళ్ళోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి దగ్గరలోనే నాభర్త పట్టాడని యెవరో చెప్పారు. లేని ఓపిక తెచ్చుకొని అక్కడకు వెళ్ళాను నాభర్త బట్టలులేకుండా శవంలా పడివున్నాడు. కాని ప్రాణముంది. ఆయన్ని కావిటించుకొని యేడుస్తున్నా. ఇంతలో మావూరు నుంచి కొందరు వచ్చారు. ఆ వూళ్ళోనే ఒక మంచంతోసికొని మా వారిని దాని మీద వేసుకొని నాగాయలంకకు జేర్చాము. అయన బ్రతికాడు మా యింటి మొత్తానికి మేము ముగ్గురము మాత్రమే బ్రతికాము. మా వూళ్ళో ఒక యిల్లుకూడా లేకుండా! మొత్తం కొట్టుకపోయాము, మా యింటి పట్టు ఒక రాయికూడా మిగలలేదట మా ఊరు మొత్తానికి, మూడు బిల్డింగులు మాత్రమే మిగిలాయి. స్మశానంలాంటి మా వూళ్ళో వుండలేక మేమంతా కొన్ని రోజులు నాగాయలంకలో వున్నాము. ప్రపంచమే కదలి వచ్చినట్లు యెంతో మంది దాతలు వచ్చారు. వారి అమృత మాకు అందించారు. పదిహేను రోజుల తర్వాత మేము మా వూరు జేరుకొన్నాము పునరావాస సౌకర్యాలు కలిగించారు. ఇప్పుడిప్పుడే మనుషుల్లా మాబాబు లోకంలో పడుతున్నాము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS