Previous Page Next Page 
ముద్ద మందార పేజి 8

 

    సింహాచలానికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అనక ఆయనతో మరి కాస్సేపు తప్పనిసరి కబుర్లు చెప్పి, బయటపడ్డాను. ఆయనకీరకం పురాణం అంటే ఆసక్తి. ఏదైనా చిన్నగా ఉంటె దాన్ని కొండంత చేసి చెప్పాడు. ఏది ఏమైనా సింహాచలం నా పేరు బయట పెట్టలేదు. ఇంటికి చేరేసరికి రామనాధం గారూ, వాళ్ళావిడ నా ఉనికి ప్రశ్న లడిగి, తమ ఇల్లు ఖాళీ అయిపోతోందని బాధపడ్డారు. ఆపూట వాళ్ళింట్లోనే భోజనం చేశాను.
    రామనాధం గారి భార్య నా బదిలీకి చాలా బాధపడి "ఘడియ ఘడియ కి యిలా వూళ్ళు మారుస్తుంటే పెళ్ళయి పెళ్ళాం బిడ్డ ఉన్నవాళ్ళెం చేస్తారండీ యీ మాయదారి ఉద్యోగాలూ" అంది. రామనాధం గారు సమాధానంగా వో పావుగంట ప్రభుత్వపు ఉద్యోగాల మీదా ఉపన్యాసం ఇచ్చారు.
    సాయంత్రం నాలుగింటి కల్లా బీచికి చేరాను. నాగరికం పేర సిగ్గును మరచి ఆడుకుంటున్న జంటలను, వంటరులను చూసుకుంటూ ఎవరి రద్దీ లేని చోటు చూసుకుని ఇసకలో వెల్లకిలా పడుకున్నాను. సింహాచలాన్ని ఎలా కలుసుకోవాలా అని ఆలోచిస్తూ చిన్న కునుకు తీశాను. లేచేసరికి బాగా చీకటి పడింది. బీచ్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. లేచి నిలబడి తలకు, బట్టలకు అంటిన ఇసుక దులుపుకున్నాను. నా దృష్టి దూరంగా నిలబడ్డ ఒక వ్యక్తీ మీద పడింది. ఆమె సింహాచలం.
    వడివడిగా నడుస్తూ నా దగ్గరకు వచ్చింది. వస్తూనే "కులాసాగా ఉన్నారా....' అంది. నాకు నోరాడలేదు. సింహాచలం చేతిలో ఏదో యిట్టుంది. ఏవిటది" అనడిగాను. సింహాచలం తన చేతిలో బుట్ట కేసి చూసుకుంటూ, "ఇదా! ఉండలు....పట్నంలో అమ్ముతారట కదూ యిలాటివి. బీచిలో నేనూ అమ్ముతున్నాను కొంటారా" అంది.
    "ఏ లెక్క నిస్తావు" అన్నాను.
    "ఇదిగో యీ గొట్టం ఒకణా" అంది వో గొట్టం నిండా శుండలు నింపుతూ. నేను వో చేతిని జాపి శుండలు పోయించుకుని పది రూపాయలిచ్చాను. "చిల్లర్లేదు బాబూ" అంది -- సింహాచలం  నాకేసి కొంటెగా చూస్తూ. నేను కొన్ని శుండలు నోట్లో పోసుకుని, "చిల్లర్లెపొతే పోన్లే " అన్నాను. సింహాచలం చంకలో బుట్ట సర్దుకుని "మాకు ఎందుకు బాబూ అంత డబ్బు' అంది. నేను నోటు చేతిలో పెడుతూ, నేను పరాయివాడనా....ఏం? తీసుకోకూడదా" అన్నాను. సింహాచలం పది రూపాయల కాగితం తీసుకుని మొల్లో దోపుకుని, మొల్లోంచి తీసిన వో రూపాయి నా చేతిలో పెడుతూ "ఇది ఖర్చు చైకుండా ఉంచుకోండి. కనీసం దాన్ని చూసినప్పుడయినా నేను గ్యాపకం వస్తాను" అంది. నాకామాట శూలంతో గుచ్చినట్లు తగిలింది. "సింహాచలం.... నిన్ను మర్చి పోతానా ....నా ప్రాణం పోయినా మర్చిపోను" అన్నాను.
    ఇద్దరం కూర్చున్నాం.
    'అయితే మరి మీ పెళ్ళి సంగతేం చేశారు" అంది. సింహాచలం మంచితనం నన్ను మరింత బాధపెట్టింది. "పెళ్ళి నిశ్చయమయ్యింది. అమ్మాయి పేరు రాధ. పై నెల పెళ్ళి .... పెళ్ళికి నువ్వు కూడా రాకూడదూ" అన్నాను. సింహాచలం తలడ్డముగా వూపి , "నా వుసురీ గడ్డ మీదే పోవాలి బాబూ. మీరు మాత్రం ఏడాది పోయాక తప్పకుండా రావాలి." అంది లేచి నిలబడుతూ. నేను లేచి నించుని, ఆవేశంతో సింహాచలాన్ని కౌగలించుకున్నాను. తనిని తీరా నా హృదయానికి హత్తుకున్నాను. సింహాచలం నెమ్మదిగా నా చేతుల్లోంచి విడిపించుకుని "చుట్టూ ఎవరైనా చూసుంటే " అంది.
    "నన్ను చంపెయ్యకూడదూ" అన్నాను.
    "అంత మాటనకండి" అంది.
    కాస్సేపు మవునంగా నిలబడ్డాము. తిరిగి సింహాచలమే అంది. "పొద్దున్న సామాను సర్దడానికి వస్తాము. అట్టే సేపు మనం కలిసి వుంటే ఎవరన్నా అనుమానిస్తారు' అంది.
    "ఏడిశారు " అన్నాను నేను దాదాపు అరిచి నట్టు. సింహాచలం నా అమాయకత్వానికి నవ్వి, "సరే, యిహ నేను వెళ్తాను. రేపు వస్తాం" అంది. నేను ఆవేశంతో సింహాచలాన్ని నా గుండెకు హత్తుకున్నాను. సింహాచలం నన్ను పెన వేసుకు పోయింది.

                             *    *    *    *
    రైలు పెట్టెలోంచి కనుమరు గయ్యేవరకూ తల బైట పెట్టి చూశాను. కళ్ళలో నిలిచిన నీరును పైట చెంగుతో వత్తుకుని వెళ్లి పోతూండడం లీలగా కనుపించింది-- నాకు. భారంగా నిట్టూర్చి బెజవాడ చేరాను.
    గోపాలపురం నుంచి వచ్చిన మూడో వాడు నా మద్రాసు ప్రయాణం ఖాయమయ్యింది. వివాహం పై నెలలో ఖాయమయ్యింది. పరంధామయ్యగారితో, రాధతో , నాన్నగారితోనూ చెప్పి మద్రాసు చేరి, కాలేజీ లో చదివే రోజుల్లో నా రూము మేటు భాస్కరం అక్కడుండడం వల్ల తిన్నగా అతనింటికి వెళ్లాను. భాస్కరం నన్ను చూసి పరమానంద పడ్డాడు. "ఎరా! పెళ్ళి చేసుకోవా" అని బ్రహ్మచారి మార్కు ప్రశ్న వేశాడు. నా పెళ్ళి ముహూర్తవివరం చెప్పి, "మరి నీకీ వంటరి తనం ఏవిటి?" అన్నాను. భాస్కరం ఘొల్లున నవ్వి, "మా ఆవిడ పై నెల వస్తుంది. పై నెలంటే పై నెల కాదనుకో? రెండు మూడు నెల లవుతుంది. పుట్టింటి కెళ్ళింది." అన్నాడు.
    "పిల్ల లెంత మంది?" అన్నాను.
    "పిల్లలా! ఇంతవరకూ లేర్రా! అందుకే వెళ్ళింది. ఇవాళో రేపో శుభవార్త రావాలి అన్నాడు. అన్నాక "మనిద్దరం కలిసి మంచి పెద్దిల్లు తీసుకుందాం. మా ఆవిడ వచ్చేలోగా యిల్లు మారాలని చెప్పి మరీ వెళ్ళింది.
    ఇద్దరం కలిసి టీ నగరంతా తిరిగి ఒక యిల్లు సంపాదించాము. చెరి మూడు గదులూ వచ్చాయి. ఆ ఇంట్లో చేరిన మర్నాడే భాస్కరం తనకి వచ్చిన టెలిగ్రాం విప్పి చదువుకుని "మగపిల్లాడు" అని యెగిరి గంతేశాడు.
    మగపిల్లాడు.
    నా శరీరంజివ్వుమంది.
    భాస్కరం హోటలుకు తీసుకు పోయి వో పెద్ద పార్టీ యిచ్చి,ఆనాడే అత్తారురు వెళ్ళిపోయాడు. భాస్కరం ఎక్కిన రైలు కదిలాక, నేను తిన్నగా బీచ్ కి వెళ్లాను.గుండె పిచ కట్టి పోయింది. ఆలోచించలేక ఇంటికి వచ్చి పక్క మీద చేరాను. లోపల ఏదో ఆరాటం బయలుదేరింది. సింహాచలం ఫోటో ని ఆల్బం లోంచి తీసి చూస్తూ నిద్రలోకి జారిపోయాను.

                           *    *    *    *

    నాలుగోనాటికల్లా భాస్కరం వచ్చాడు. తన కొడుకుని గురించి, వాడి అందాన్ని గురించీ,తెలివిని గురించి వూకదంపుగా చెప్పి వూదరకొట్టేశాడు. పురిటి గుడ్డు తనకేసి చూసి నవ్వాడని చెప్పాడు. పురిటి గుడ్డు మనకేసి నవ్వడం ఏవిట్రా నీ చాదస్తం అంటే, కాదు పొమ్మన్నాడు. పుత్రోత్సహాన్ని ఆపడం మంచిది కాదని వూర్కున్నాను.
    నా పెళ్లి దగ్గర పడింది.
    అయిపొయింది.
    పెళ్ళికి భాస్కరమే గాక, ప్రేమ, మోహన్, లత అంతా వచ్చారు. తతంగం అంతా అయ్యింది. ఆ నెల మంచిది కాదని పై నెల రాధను తీసుకు వెళ్ళొచ్చని చెప్పారు. ఉస్సురుమంటూ మద్రాసు చేరాను. రివాజుగా ఆఫీసులో నా ప్రాణం తీసి వో పార్టీ తీసుకుని, పిసినారి అనే బిరుదిచ్చారు . థాంక్యూ అనుకున్నాను.
    నెల గడిచింది.
    రాధ రాలేదు. యేవో కారణాలోచ్చాయి. పై నెల వచ్చేలోగా భాస్కరం భార్య, కొడుకు తో వచ్చింది. వారం తిరిగేసరికి భాస్కరం భార్య సుమతి నాకు అప్తురాలయ్యింది. వో నాడు వాళ్ళింట్లో భోజనాలు చేస్తుంటే, "మా తమ్ముడు ఒక డుండెవాడు. వాడచ్చు నీపోలికే..... నాలుగేళ్ల క్రితం నాగార్జునసాగర్ వద్ద కృష్ణలో పడి కొట్టుకు పోయాడు.... నిన్ను చూస్తె మా తమ్ముణ్ణి చూసినట్టే ఉంది." అంది. ఆమె కళ్ళ వెంట నీరు జలజల రాలింది.
    ఆ రోజు నుంచి సుమతికి నేను తమ్ముడి నయ్యాను. వాళ్ళ జంటను చూస్తుంటే వాళ్ళ లాగే నేనూ నా జీవితాన్ని రూపొందించుకోవాలనిపించేది.

                              *    *    *    *
    ఉన్నట్టుండి వోనాడు రావాల్సిన టెలిగ్రాము వచ్చింది. తెల్లవారు జామున అలారము పెట్టుకుని లేచి వీలైనంత అందంగా ముస్తాబయి , స్టేషను కు పరుగెత్తాను. అప్పుడే వస్తున్న రైలుకు ఎదురు పరిగెత్తాను. వరుస పెట్టేలన్నీ యింజన్నుంచి చివర వరకూ వెతికేశాను. రాధ కనబడలేదు. మళ్ళీ వెనక్కు వెతుక్కు వస్తుంటే రాధ ప్లాట్ ఫారం మీద నిలబడి, "పిలుస్తే పలక్కుండా అటు పరుగెత్తుతారేమిటీందాక" అంది. పిల్చావా! నేను నీకోసమే పరిగెత్తుతున్నా" అన్నాను. నా కళ్ళకు రాధ వెనక నిలబడున్న వాళ్ళమ్మ కాస్త ఆలస్యంగా కనుపించింది. నా ముఖంలో మార్పు చూసి రాధ కళ్ళతో నన్ను వెక్కిరించింది. తప్పనిసరిగా ముఖానికి ఆనందం పులుముకుని, ఆవిణ్ణి కూడా కుశల ప్రశ్నలు వేశాను. సామాను పట్టించుకుని, టాక్సీలో పడి యింటికి చేరాము. భాస్కరం, సుమతి బయట నిలబడి ఉన్నారు. టాక్సీ దిగుతూనే వాళ్లకు రాధ వాళ్ళమ్మను పరిచయం చేశాను. ఇంట్లోకి వెళ్లేసరికి సుమతి ప్లేట్లలో టిఫిను పెట్టి మా యింట్లోకి తెచ్చింది.
    "అయ్యో! మీ కెందుకక్కయ్యా యీ శ్రమ! నాతొ పాటే లేచి యివన్నీ చేశావా! హోటలు నుంచి తెచ్చుకుందుము కదా" అన్నాను.
    "ఫరవాలేదు లేవోయ్" అంది సుమతి.    
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS