వైదేహి మరో ఇద్దరు ఆమె స్నేహితులూ అక్కడికే వచ్చి కూర్చున్నారు.
"ఈమె రమాదేవి....ఈమె రాధిక" అంటూ వాసుకి పరిచయం చేసి ఈయన నాఫ్రండ్ మిష్టర్ వాసుదేవరావ్" అంటూ పరిచయం చేసింది.
సర్వర్ని పిలిచి
టొమాటో సూప్. బ్రెడ్.....అయిస్ క్రీమ్....అంటూ ఓ పది రకాలు ఆర్డరిచ్చింది.
పెళ్ళిచూపుల కంటూ వెళ్ళి వచ్చేసిం తర్వాత మరెప్పుడూ కన్పించలేదు వైదేహి. సరిగ్గా ఇప్పుడు....ఇలాంటి స్థితిలోనే దాపురించాలీ...ఈరోజు లేచి యెవరి మొఖం చూశానో......అనుకుంటూ ఎలా బయటపడటం అని ఆలోచిస్తూనే
యేమైనా సరే ఈరోజు ఈ వైదేహి నీవేదిక్కు అనుకొని మనస్సులో తెచ్చి పెట్టుకున్న హుషారుతో వాళ్ళతో బాతాఖానీ ప్రారంభించాడు.
వైదేహి ఆనందం వర్ణనాతీతం. మరో నాలుగు రకాల "స్వీట్లుకి ఆర్దరిచ్చేసింది.
"ఎంతమంచి మనస్సు అనుకున్నాడు వాసు
"రండి నా కారులో" డ్రాప్ చేస్తాను. అంటూంటే బ్రతుకు జీవుడా అనుకుంటూ బయట పడ్డాడు వాసు.
* * *
రాత్రి తొమ్మిదిదాటి వుంటుంది.
శ్రీలక్ష్మి వాసుకోసం యెదురు చూస్తూంటే రాఘవరావు వాసుని కేకలేస్తున్నాడు. విచిత్రం మేమిటంటే వాసురాగానే ఒక్కమాట మాట్లాడడు. ఇద్దరన్నదమ్ములూ తన దగ్గరే చూపిస్తారు. ప్రతాపాలు అని విసుక్కుంటుంది.
వదినగార్ని అంత దూరం నించి చూడగానే నడక వేగం హెచ్చించాడు వాసు.
"ప్రతిరోజూ ఇలా ఆలస్యం చేస్తే నీకోసం యెవరు ఎదురు చూస్తూ కూర్చుంటారు."
ఎప్పుడూ అలా అనని వదిన అలా ఇంట్లో అడుగుపెట్టకముందే కోపం చేస్తూ వుంటే చాలా బాధ అన్పించింది వాసుకి.
తల వంచుకుని మారు పలక్కుండా రెండు ముద్దలు మింగి చెయ్యి కడిగేసుకుని తన గది లోకి వెళ్ళిపోయాడు.
శ్రీలక్ష్మి మనస్సు బాధతో గిల గిలలాడింది.
"వాసూ ఈ మధ్య యేమిటో గా మారిపోతున్నా వేమిటయ్యా. ఏం చేస్తున్నావ్... ఎక్కడ తిరుగుతున్నావ్, వేళకి తిండీ తిప్పలూ కూడా లేకుండా! ఆ ముఖం అద్దంలో ఒక్కసారి చూసుకో నల్లగా ఎలా మాడిపోయింది.
"...................."
"సాయంకాలం ఆ భువనేశ్వర్రావుగారు కూర్చునీ కూర్చునీ వెళ్ళారు. పెళ్ళికూతుర్ని చూడాలట. రేపు సాయంత్రం అయిదింటికి నువ్వు ఇంట్లో వుండాలి. పిల్ల చాలా బాగుంటుందిట. యెనిమిది వేలు కట్నం ఇస్తాం. అల్లుడికి స్కూటర్ ఇస్తాం అలక పాన్పు మీద" అంటూ వేధిస్తున్నారు. అన్నయ్య గట్టిగా నిశ్చయం చేసుకున్నారు. ఈ సంబంధం ఖాయం చేసేసు కోవాలని"
...................................
"మాట్లాడవేమిటీ ఇందాకటినుంచీ ఒకే వరసన నేను వాగుతూంటే" శ్రీలక్ష్మి నిష్టూరంగా అంది.
"నేనింక చెప్పేది యేం వుంది. అన్నయ్య నిశ్చయించేసేసుకున్న తర్వాత. మీరిద్దరూ చూడండి నేనురాను ఇంతకీ కట్నం ఎంత ఇస్తారుట.
"యెనిమిది వేలు."
"ఇంతేనా! అయితే నే వప్పుకోనని చెప్పు. కనీసం నలభై వేలు ఇస్తే చూస్తాను. ఇలా అన్నానని అన్నయ్యకి చెప్పెయ్యి." ఇలా అంటే వదినకి ఎంత కోపంవస్తుందో ఎన్ని గంటలు వాదులాడుతుందో వాసుకి తెలుసు.
ఏమిటీ నీకు.... నలభై వేలు కావాలా? అన్నకి తగ్గ తమ్ముడివి, నాకు తెలియక అడుగుతా నీకు నలభై వేలు యేం చూసి ఇస్తారూ?
శ్రీలక్ష్మికి ఆ రోజుల్లోనే ఆరువేలు కట్నం ఇచ్చి పెళ్ళి చేశారు. తీరా కాపురానికి వస్తే ఇంటికి వాడుకునేందుకు పాత్ర సామానైనా లేదు" అంటూ ఇప్పటికీ సాధిస్తుంది.
"అన్నయ్య యెక్కడా?"
"సెకండ్ షోకి సినిమాకి వెళ్ళారు.
నేను మగ మహారాజుని కానుగా? అదీకాక నా ప్రాణానికి ఈ గ్రహాలు రెండు. నా స్నేహితులకి కార్లు లేవయ్యె. వెంటేసుకుని తిప్పేందుకు."
తన ధోరణిలో మాట్లాడేస్తోంది శ్రీలక్ష్మి.
వదినగారి ప్రకృతి ఒకప్పుడు వచ్చినా మరోసారి విసుగు కల్గింది వాసుకి ఇంక ఆ సంభాషణ మారుస్తూ అన్నాడు.
"వదినా! మనదేశంలో తిండికీ గుడ్డకీ కూడా కరువైనవాళ్ళు యెందరో వున్నారు కదూ!"
ఏమిటీ విచిత్రం. ఈ రోజు శ్రీ వాసుదేవ రావుగారి దృష్టి దీనజనులవైపుగా మళ్ళింది. ఏ రాజకీయనాయకుడివైనా అవాలనివుందా!
వాసుకి నవ్వు వచ్చింది.
"కాదమ్మా నేనీ రోజు ఓ కొత్త ప్రపంచం చూసి వచ్చాను," అంటూ మాల విషయం మినహాయించి మిగతా అన్ని సంగతులూ చెప్పాడు. అసలు వీళ్ళంతా ఎందుకింత బాధపడాలీ.... ధన వంతులంతా ఇలాంటి నిర్భాగ్యులకి తమ'ధనం' సంచి ఇస్తే కొందరన్నా బాగుపడగల రేమో!"
"మంచివాడివే.....వీళ్ళ సంగతి నీకేం తెల్సు వుడుకు రక్తం నీది. జాలితప్ప యధార్ధం గ్రహించే అనుభవం నీకెక్కడుంది" వదిన తనని ఇంకా చిన్నవాడి క్రిందే జమకట్టటం వాసుకి నచ్చదు.
అయినా ఆమె చెప్పేది వింటూ కూర్చున్నాడు.
"అసలు పరిశీలిస్తే ఓ యన్. జీ. వో. కన్నా ఓ రిక్షావాడు యెక్కువ సంపాదిస్తాడు. ముష్టి వాళ్ళూ తక్కువ సంపాదించటం లేదు. వీళ్ళ దరిద్రానికి కారణం ఆహారపు కొరతా కాదు. డబ్బు సంపాదన తక్కువా కాదు.
"మరి?" వదిన ముఖంలోకే చూస్తూ వత్తిగిలి పడుకున్నాడు.
ధనవంతులంతా మోసకారులనీ పేదవారంతా మంచివాళ్ళనీ ఏ సినిమా చూసినా ఏ పుస్తకం తెరిచినా కన్పిస్తూ వుంటుంది. ఇది నిజంగా వాస్తవమేనా కాదన్పిస్తుంది నాకు. ధనవంతులందరూ మోసం చేసే బాగుపడ్డారంటావా? జీవితంలో ముందుకు వెళ్ళి ఎలా నాలుగురాళ్ళు పోగుచేద్దామా అనే తపన ప్రతి ఒక్కరిలోనూ వుంటుంది. అదృష్టం అవకాశం కలిసివచ్చినవాళ్ళు శ్రీమంతులవుతారు లేనివాళ్ళు ఇంకా ఇంకా దిగజారిపోతారు. దీనికి యెవరినో నిందించి ప్రయోజనం!"
వాసు లేచి కూర్చుని ఆసక్తి గా వింటున్నాడు.
"పేదవాళ్ళలో మాత్రం మోసం లేదూ? ద్వేషం లేదూ! కనికరించి అన్నం పెట్టిన యింట్లోనే దొంగతనం చేసేవాళ్ళు లేరూ? బస్ స్టాండుల్లో రైల్వే స్టేషనుల్లో కన్పించే ప్రతి ఒక్కరినీ ఆలోచిస్తూ వుంటాను, వీళ్ళంతా నిజంగా దరిద్రులేనా అని. ప్రతివాడూ కాస్తో కూస్తో దానం చేస్తూనే వున్నారు గదా! మరి ఏళ్ళు బాగుపడ్డట్లు కన్పించరేం?
ఓసారి యేమయిందంటే నేనూ అన్నయ్యా రైలు ప్రయాణంచేస్తూ ఒక అభాగ్యురాలయిన స్త్రీని చూస్తూనే నా మనస్సు ద్రవించిపోయింది. శరీరాన్ని దాచుకునేందుకుకూడా చాలని చింకి పేలికలను చూసి భరించలేక పెట్టెతెరచి ఓ నేత చీరా రెవికా అయిదు రూపాయలూ ఇచ్చాను. మీ అన్నయ్య పేపర్ చదువుకుంటూ ఇది గమనిస్తూనే మరేం మాట్లాడలేదు. నన్ను ఆశీర్వదిస్తూ ముష్టిది దిగిపోయింది.
మరో రెండు రోజులకే తిరిగి అదే రైలులో ఇంటికి వచ్చేస్తున్నాం ఆ ముష్టిదాన్ని అదె స్థితిలో చూశాను. నేనిచ్చిన చీరె విడవ కుండా కట్టుకున్నా ఆరునెలలు జరిగిపోతుంది. నేను బాధపడుతుంటే మా ప్రక్క ప్రయాణీకులు అన్నారు.
"ఈ ముష్టిది సామాన్యురాలు కాదమ్మా. మనం చూస్తూంటే ఆడుక్కోటానికి వచ్చినట్లు నటిస్తుంది, లేకుంటే అందినది యెత్తుకు చక్కా పోతుంది. ఎన్నిసార్లు దీన్ని పట్టుకుని పోలీసులకి అప్పగించినా రెండు రోజుల్లోనే తిరిగి ఈ రైల్లో తయారు అవుతుంది. మీరిచ్చిన చీరె ఆరోజే అమ్మేసి వుంటుంది. వీళ్ళు చాలా మంది వున్నారు. పెద్దముఠా రాత్రి సమయాల్లో ప్రయాణీకుల సామాన్లు యెన్నో కాజేస్తూ వుంటారు వీళ్ళు. వీళ్ళని యెవ్వరూ ఏమీ చెయ్యలేకుండా వున్నారు" అంటూ వాళ్ళు చెప్తుంటే నిజంగా ఇంతమోసం వుంటుందా! అన్పించింది. దరిద్రం వుంది కాని ఈ కన్పించేదంతా సగం మోసం. ఆదరిద్రాన్ని యెరగా పెట్టుకుని డబ్బు సంపాదించే వ్యాపారం నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ళ వల్ల నిజంగా బాధపడేవాళ్ళు మనని అర్ధించినా అర్ధం చేసుకోలేకుండా వున్నాం. ఈ మోసాలతో మన మనస్సులు పాషాణాలయిపోతున్నాయి,
శ్రీలక్ష్మి చెప్పటం ఆపింది.
వాసు ఆలోచిస్తూ వుండిపోయాడు.
మాల వుద్యోగం పోయింది. అలాంటి పొరుగులో ఎలా వుండ గలుగు తున్నదో? తల్చుకుంటేనే డోకువస్తోంది. ఆ ముసలాయన అలా చూశాడేమిటి? అని గుర్తుకొస్తే వెన్నులో నించి సన్నగా వణుకు వచ్చింది.
అదేం చూపు!
"మాలమీద యేం విసిరాడో వెక్కివెక్కి యేడుస్తోంది. విని వెనక్కి వెళ్ళలేక పోయి నందుకు బాధగానే వుంది. తండ్రి మంచివాడు కాదేమో! అందుకే "మా ఇంటికి రావద్దు" అని చెప్పిందేమో! ఆయన్ని చూస్తుంటే యేదో అజ్ఞాతంగా బ్రతుకుని వెళ్ళ దీస్తున్న వాడిలాగా వున్నాడు. మాల మంచి కుటుంబంలోని పిల్లే అయివుండాలి." శ్రీలక్ష్మి అతని ఆలోచనలను చెల్లా చెదురు చేసింది. "నువ్వు రేపు ఇంట్లోనే వుండు. అసలే మీ అన్నయ్య చాలా కోపంగా వున్నారు. మరిచిపోయాను...... నువ్వేదో పుస్తకాలషాపు దగ్గర టైపు చేస్తున్నావుట నిజమేనా?...
వులిక్కి పడ్డాడు వాసు.
"అయిందీ....అన్నయ్య నోటీస్ లోకి వచ్చేసింది.
ఏం చెప్పాలో ఆలోచిస్తూ జవాబివ్వలేదువాసు నీకు డబ్బు కావాలంటే ఇలాంటి పనులూ చేసేది అసలు నీకేం తక్కువ చేశాం.... అందరూ యేమనుకుంటారు, నన్ను అడగవచ్చుగా.
ఈ విషయం తెలుస్తూనే యెంత బాధ పడ్డారో తెలుసా? నీ మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం.....నీ విలాంటి పనులు చేస్తే మేం తల యెత్తుకుని తిరిగేది యెలా ఓ వైపు పెద్ద పెద్ద వాళ్ళు పిల్ల నిస్తామని వస్తూంటే నేడో రేపో కలెక్టర్ ని కాబోతున్న వాడివి.
శ్రీలక్ష్మి గొంతు ఆవేదనతో పూడుకు పోయింది.
"యెవరో ఆడపిల్లతో తిరుగుతున్నట్లుకూడా వార్తలు అందుతున్నాయి. ఇది నిజమా అబద్ధమా, అని నిన్ను నిలదీయటం నా అభిమతం కాదు. కాని ఒక్కటి గుర్తువుంచుకో." యేదో చెప్పబోయి ఆగిపోయి వదిన ఏం అడగబోయి మానేసిందో వాసుకి తెలుసు.
అరచేతిలో గీతాలు చూసుకుంటూ అన్నాడు వాసు.
"నువ్వు నాకు వదినవికావు.......తల్లి అంటే యేమో తెలియని నాకు తల్లి వయినావు. నీవు ఆడుక్కున్నా చెప్పవలసిన బాధ్యత నాకు వుంది వదినా. అనవసరంగా నువ్వూ అన్నయ్యా గాభరా పడకండి. ఏ ఆడపిల్లతో తిరిగినట్లు మీకు తెలిసినా నేను పొరపాటుపని యేమీ చెయ్యటం లేదు. అన్నయ్య గౌరవానికి భంగం కల్గేపని యెప్పుడూ చెయ్యను. ఇంతకుమించి ఇప్పుడు మరేం చెప్పలేను."
శ్రీలక్ష్మి ఓ క్షణం అలాగే నిలబడి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వీణకి బాబ్జీకి దుప్పటి సరిగా కప్పి తన పక్కమీద పడుకుని కళ్ళు మూసింది.
వాసు లైటు తీసేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు.
నిద్ర రావటం లేదు. ఆకాశంలో నక్షత్రాలు మిలమిల్లాడుతున్నాయి, పూర్ణ చంద్రుడు మబ్బుల చాటున దాగుడుమూతలు ఆడుతున్నాయి. సర్వ ప్రకృతీ ప్రశాంతంగా నిద్రపోతోందా అన్పిస్తోంది.
కిటికీ చువ్వలు గట్టిగా పట్టుకుని ఆలోచిస్తున్నాడు.
మాలకి దెబ్బ యెంత బలంగా తగిలిందో!
ఒంటరిగా అంత బాధని యెలా భరిస్తోందో?
నిండా ఇరవై సంవత్సరాలు నిండని ఆ అమ్మాయికి యెన్ని బాధలు!
అదృష్టం బాగుంటే తల్లిదండ్రుల చాటున అన్నదమ్ముల ఆప్యాయతలో అల్లారు ముద్దుగా పెరగవలసిన పిల్ల. ఎంత దురదృష్టవంతురాలు!
ఈ నాటి సమాజంలో సవ్యమైన మార్గాల్లో డబ్బు సంపాదించటం యెంత కష్టమో వాసు ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నాడు.
వేళ్ళు మొద్దుబారేటట్లు టైపు చేస్తే మొత్తం ఏడు రూపాయల డెబ్బై పైసలు అయింది. వర్కు యిచ్చిన పెద్ద మనిషి అంతవరకూ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి అయిదు రూపాయల కాగితం గుప్పెట్లో కుక్కి తన కాగితాలు తీసుకుని జారుకున్నాడు. ఏమని అడగాలి, అడిగితే మాత్రం ఇచ్చే వ్యవహారమా అది?
ఇలా వుంది ప్రపంచపు పోకడ.
ఇంక ఆడపిల్ల వంటరిగా ఏ శక్తీ లేకుండా డబ్బు ఎలా సంపాదించగలదు?
నిట్టూరుస్తూ వచ్చి తన పక్కమీద వాలి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు వాసు.
* * *
