నన్ను పెళ్ళికొడుకుని చేసి పంపిస్తానంటే మా అమ్మమ్మగారింటికి పంపారు. ఆ రోజే మా అమ్మమ్మ నన్ను విశాఖపట్నానికి దూరంగా వున్న బారువా గ్రామానికి మా పెద్ద బావని (ఆరుద్ర తండ్రి)తోడిచ్చి పంపించేసింది. అంటే_అక్కడ నన్ను దాచేశారన్నమాట.
నన్ను అక్కడ దింపేసి మళ్ళీ మా బావ విశాఖపట్నం వెళ్ళిపోయాడు. నేను ఒకరోజు బారువాలో వుండి అన్నం వండుకొని తిన్నాను. ఆ మరునాడు నా పెళ్ళి ఆగిపోయింది. విశాఖపట్నం అంతా గగ్గోలెత్తించేసి ఆత్మహత్య చేసుకుంటానని మా నాన్న అన్నాడట. పెళ్ళిటైము దాటిపోయిన తర్వాత సాయంకాలానికల్లా విశాఖపట్నం చేరుకున్నాను. పెళ్ళికూతురు నన్ను తప్ప మరెవ్వరినీ చేసుకోనంది. పెళ్ళికూతురి పూర్తిపేరు మూలా వెంకటరవణమ్మ.
ఆ మర్నాడు_రాత్రికి రాత్రి విజయనగరం సమీపంలోవున్న రామతీర్ధాల కొండమీద మా పెళ్ళి జరిగిపోయింది.
నాకు పెళ్ళి అవడం, మా దరిద్రం ప్రారంభం కావడం రెండూ ఇంచుమించు ఒకేమారు జరిగాయి. అందుకే ముసిల్ది (రవణమ్మగారు)దురదృష్ట జాతకురాలిని, ఇనుప పాదాలని, అది కాలు పెట్టడంతోనే మాకు కష్టాలు ప్రారంభమయ్యాయని మా బంధువులంతా అనేవారు" అని చెప్పారు.
"అప్పుడు మీరేమన్నారు?" అని అడిగాను.
"ఏమనడం ఏమిటి సరోజా! ఇంతకంటే అసందర్భం అయిన ఆరోపణ మరొకటుండదు. ఇద్దరం చిన్నవాళ్ళం. పదేళ్ళ అమ్మాయి. తను దరిద్రాన్నంతా మోసుకొచ్చి మా ఇంట్లో కుమ్మరించిందంటే నేనెంత మాత్రం ఒప్పుకోను. నేను ముందే చెప్పానుగా_నాకలాంటి సెంటిమెంట్లూ, ఛాదస్తాలూ లేవని.
ఎలాగైతేనేం_నాతోపాటూ, అష్టకష్టాలు పడింది. టీమ్ బన్నుతో కాలక్షేపం చేసిన రోజుకూడా లేకపోలేదు. అప్పుడెవరైనా వచ్చి మిమ్మల్ని ఆదుకున్నారా? అది కూడా ఖచ్చితమైన మనిషి. అంత కష్టంలోనూ ఒకరికొకరం తోడుగా వుండి కష్టాల్ని ఎదిరించామేకానీ ఎవర్నీ దేహీ అని అడుక్కోలేదు. దరిద్రాన్ని మేం కొరుక్కుతింటున్నామా లేక అది మమ్మల్ని కొరుక్కుతింటోందా అనిపించే రోజులు గడిపాం.
ఈ బాధ మా నాన్న గార్ని చాలా బాధ పెట్టింది. ఎప్పుడూ కళకళలాడే మా నాన్నముఖం దరిద్రపు బాధతో ఎంత పీక్కుపోయిందో నాకు స్పష్టంగా కనిపించేది. జీవితంలో అఖండమైన ఐశ్వర్యం అనుభవించి విశాఖపట్నంలో ఒక ఏలుబడి ఏలిన మా నాన్న క్రమంగా దరిద్రంలో క్షీణించిపోతూంటే మా బంధువులు కానీ మిత్రులు కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు.
అప్పుడే అనుకుంటాను. నేను భయంకరమైన టైఫాయిడ్ తో వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంటూండగా మా ఇల్లు వేలంలో అమ్మిపారేశారు. ఆ పని మా నాన్నే చేసివుంటే_మా అప్పులు తీరిపోవడంతోపాటు మాకంత ఇబ్బంది కూడా వుండేదికాదు.
ఆ ఇంటి పునాదులు స్వయంగా మా అమ్మ తవ్విందిట. రాళ్ళూ రప్పలూ ఇసకా మోసిందిట. ఈ సెంటిమెంట్ తో మా నాన్న చెయ్యనన్న పని అప్పులవాళ్ళు చేసేశారు.
మా నాన్న ఎందరికో ఎన్నో ఉపకారాలు చేశాడు. హెడ్ మాస్టర్ గా ఎందరికో చదువులు చెప్పించి ఎందరినో పాస్ చేయించాడు. చివరికి ఏమయింది?
ఈ ఉపకారాలు పొందినవాళ్ళంతా తనను ఉద్దరిస్తారనో, లేక చేదోడువాదోడుగా ఉంటారనుకునో ఆయన చెయ్యలేదు. ఆయన స్వభావం అటువంటిది.
మాకు డబ్బులు ఇవ్వాల్సిన అప్పులవాళ్ళంతా ఏదోమిషమీద ఎగవేశారు. మా నాన్న ఎవరికీ అప్పులు మిగల్చలేదు. నాకు ఆస్తీ మిగల్చలేదు.
మనలో వుండే మంచితనాన్ని అనువుగా తీసుకొని అందరూ మనల్నే చులకనగా చూస్తారు. అందుకే కోపంలేని నాకు ఈ సమాజం పేరెత్తితేనే అరికాలిమంట నెత్తికెక్కుతుంది" అన్నారు.
"ఏమిటేమిటి? మీకు కోపంలేదా?" అన్నాను.
"అబ్బ_వుండు సరోజా! ఆ తరువాత మా ఇంట్లో సామాన్లకి కాళ్ళూ చేతులూ వచ్చాయి.
మా సుభద్రమ్మ పోవడంతోనే మాకు దరిద్రం ప్రారంభమైందనుకుంటాను. ఒక చిన్న అద్దెఇంట్లో వుండేవాళ్ళం. ముసిల్ది కొత్తగా కాపరానికి వచ్చిన రోజులవి. చాలామంది మనసుకి తగిలే గాయాల్ని మరచిపోతారు. ఒంటిమీద చిన్నదెబ్బపడితే తల్లడిల్లిపోతారు. ఆ విధంగా నన్నెవరూ నొప్పించకున్నా అంతకు మించిన చిత్రహింసల్ని అనేక విధాలుగా జీవితం నాకు ప్రసాదించింది.
నాకు ముసిల్దంటే ఎందుకిష్టమో చెప్పనా_నా కోసం ఏం చెయ్యమన్నా చేస్తుంది.
ఇంత అల్లరిపెట్టి మనిద్దర్నీ గుగ్గిళ్ళు వేసినట్టు వేసేసిందా_చివరికి మన పెళ్ళికి అంగీకరించిందా లేదా?" అన్నారు.
"అది సరేనండి. మనం బెంగుళూరు వెళుతున్నట్టు ఆవిడతో చెప్పారా?" అని అడిగాను.
"నేను మాత్రం వెళుతున్నానని చెప్పాను. అది నమ్మితేగా? 'ఇంకా ఎందుకండీ దాస్తారు? అది లేకుండా మీరు వెళతారంటే నేను నమ్ముతానా? మీరు వదిలినా అది వదులుతుందా? ఇద్దరూ వెళ్ళండి. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక కండిషన్_అంది. 'ఏమిటది' అని అడిగాను.
"దాన్ని మీరు బెంగుళూరు తీసుకువెళితే నన్ను, అమ్మాజీని రష్యా తీసుకెళ్ళా"లని అంది. నేను సరేనన్నాను" అని చెప్పారు.
"అంటే మీరు రష్యా వెళతారా ?" అని అడిగాను.
"వెళ్ళినప్పుడు మాటే సరోజా! ఇంకో మాట చెపుతున్నాను విను. ఏదైనా మాటలమీద దాని గురించి వస్తే నేనే చెప్తాను. కానీ నువ్వుమాత్రం ఏమీ అడగకూడదు. ఆ ప్రిన్సిపుల్ పెట్టుకో. లేకుంటే జీవితం నరకమవుతుంది" అన్నారు.
"నేను అంత పిచ్చిగా నా జీవితాన్ని నరకం చేసుకోను. మీరేం భయపడకండి. కానీ మీ రష్యా ప్రయాణంలో చిన్న మార్పు" అన్నాను. "ఏమిటది?" అన్నారు.
"మీరూ ,మీ ఆవిడా, అమ్మాయి తప్పకుండా రష్యా వెళ్ళండి. నాకేమీ అభ్యంతరం లేదు. పోతే చేతినిండా మీ ముగ్గిరికి సరిపడేటట్టు అన్ని ఖర్చులతో డబ్బుంటేనే వెళ్ళాలి. రష్యా ప్రయాణం కోసం ఇల్లూ, వాకిళ్ళూ, కార్లూ తాకట్టు పెట్టి వెళతానంటే మాత్రం నేను ఒప్పుకోను."
"అలాగే. అయినా వెళ్ళినప్పుడు మాటకదా....దాని కిప్పట్నుంచి డిస్కషన్ ఎందుకు?" అన్నారు.
"ఏవండీ_ఇంకో సందేహం. చాలా రోజులుగా అడగాలనుకుంటూ మరచిపోతున్నాను. మీ ఎడం మోచేతిమీద అంత పెద్ద మచ్చ వుందే_అదేమిటండీ" అని అడిగాను.
"అదా_మా తమ్ముడు కొండబాబు చనిపోయాడని చెప్పానుగా? వాడు చనిపోయిన పదోరోజు యలమంచిలి వెళ్ళాను. యలమంచిలో ఓ గుండంలో స్నానంచేశాను. అప్పుడే పెద్ద గండం తప్పింది నాకు. స్నానం చేస్తూ ఓ రాయిమీద కాలు జారి నీట్లో పడిపోయాను. అందరూ దగ్గరలో వున్నారు కాబట్టి బతికిపోయాను. అయితే ఈ మోచేతికే పెద్ద దెబ్బ తగిలి రక్తం బాగా పోయింది. ఆ మచ్చేఇది" అన్నారు.
"మీ నాన్నగారిచేత మీరు ఎప్పుడయినా దెబ్బలు తిన్నారా?" అని అడిగాను.
"మా నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదు. అయినా ఓసారి తినాల్సి వచ్చింది. మా నాన్న చాలా శాంతం. అయినా హెడ్మాస్టరవడంవల్ల ఆయనంటే అందరికీ హడల్.
మా స్కూల్లో కుర్రాళ్ళమందరం ఓసారి సమ్మె చేశాం. అప్పుడు నా వయసు పదకొండో. పన్నెండో. వాళ్ళందరికీ నేనే నాయకత్వం వహించాను. మర్నాడు హెడ్మాస్టర్ గా మా నాన్న కుర్రాళ్ళందరికీ ఒక్కొక్క బెత్తపు దెబ్బ వేశాడు. ఆఖరికి నన్ను కూడా పిలిచి దెబ్బ వేసి 'నువ్వేనా వీళ్ళందరిచేతా సమ్మె చేయించావు?' అని అడిగాడు. 'అవును' అన్నాను. 'అయితే రెండో చెయ్యి పట్టు' అన్నాడు. పట్టాను. చుర్రుమని ఎంతో దెబ్బ పడింది. నా రెండు అరచేతులూ కందిపోయాయి.
స్కూల్లో నన్ను కొట్టిన మా నాన్న రాత్రి ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. నన్ను దగ్గిరకి పిలిచి రెండు చేతులూ చూశాడు. అప్పుడు చేతులు మామూలుగానే వున్నాయి. నన్ను ముద్దుపెట్టుకొని, నా చేతిలో రూపాయుంచాడు. నన్ను తొడమీద కూర్చోపెట్టుకొని_"ఇంకెప్పుడూ కొట్టను కానీ, ఏం బాబాయ్ నా మీద నీకు కోపమా" అని అడిగాడు. 'లేద'ని తలూపాను. కళ్ళు తుడుచుకుంటూ మా నాన్న నవ్వేశాడు.
* * *
