Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 71


    "ఆ అలవాటు నిన్నా_ఇవాళా  వచ్చింది కాదు సరోజా! నేను చదువుతున్న రోజుల నుండి  అంటే 1929నుండి నాకు డైరీలురాసే అలవాటుంది. 'అవి ఇప్పుడు ఏవి' అని మాత్రం  అడగకు వున్నాయనుకోను" అన్నారు.
    "ఏవండీ అసలు మీరు డబ్బింగ్ కంటూ రాసిన  మొట్టమొదటి  చిత్రం ఏదండి?" అని అడిగాను.
    "నీరా ఔర్ నందా_అనే హిందీపిక్చర్. అయినప్పటికీ  అంతకు ముందు వచ్చిన 'కాలచక్రం' అనే పిక్చర్లో నా 'మరో ప్రపంచం' అనే గేయం వచ్చింది. గేయమైతే ఎక్కిందిగానీ డబ్బు ఇప్పటికీ నాకు అందలేదు. అది వేరేసంగతి అనుకో" అన్నారు. (ఆ చిత్రం 1950లో  అని వారు నాతో చెప్పినట్టు  జ్ఞాపకం. సంవత్సరం పొరపాటు అయితే  అది నాతప్పు కావచ్చు)
    "ఇక ఇంటికి వెళదామా".
    "మీ ఇష్టం" అన్నాను. ఇద్దరం బయల్దేరాం. శ్రీశ్రీగారు నన్ను దింపేసి వెళ్ళిపోయారు. ఇంట్లో అడుగుపెడుతూనే
    "ఏమయిందేమిటి?" అనడిగాను.
    అందరూ నాకోసమే అన్నట్టు కాచుక్కూర్చున్నారు.
    "అక్కియా మనింటికి  శ్రీశ్రీగారి  పెళ్ళాం  వచ్చివెళ్ళిందే" అని మా ఆఖరి చెల్లి అమ్మలు (చాలా చిన్న పిల్ల) పరిగెత్తుకొని  వచ్చి చెప్పేసింది.
    నేను నిజంగానే  ఆశ్చర్యపోయాను. ఫైల్సన్నీ  అలమారులో పెట్టి "ఏమిటి జరిగింద"ని  అడిగాను.
    "నిన్ను శ్రీశ్రీగారికిచ్చి  పెళ్ళి చెయ్యమని ఇంతసేపూ ఆవిడ  గొడవచేసి వెళ్ళారమ్మా" అని మా నాన్నగారు చెప్పారు.
    "నిజంగానా?" అని అడిగాను.
    "అవునమ్మా! నేనొప్పుకుంటున్నాను నాకేమీ  అభ్యంతరం లేదంటూ  అరగంట మాట్లాడార"ని చెప్పారు.
    ఈ హఠాత్పరిణామానికి  ఆశ్చర్యం  వేసింది.
    శ్రీశ్రీగారితో  మర్నాడు  ఆఫీసులో కూర్చున్నాను. వాళ్ళావిడ  వచ్చిన సంగతి  మావాళ్ళతో  మాట్లాడిన విషయాలు చెబుతూ_
    "ఆవిడెందుకింత త్వరగా  మారిపోయార"ని  అడిగాను.
    "నేనూ ఇంటికి వెళ్ళగానే  అన్ని విషయాలు చెప్పింది సరోజా! 'ఈ నిర్ణయాని కెందుకొచ్చావ'ని అడిగాను. 'దానిసంగతి  నాకు బాగా తెలుసు. మిమ్మల్ని  కాదని పోయేదైతే  ఎప్పుడో పోయివుండేది. నేను మిమ్మల్ని వదిలినా అదిమాత్రం  వదిలేఘటం  కాదన్న సంగతి నాకు బాగా తెలుసు. పైగా  నాతో పందెంకూడా కట్టింది' అని చెప్పి నవ్వింది" అన్నారు.
    ఆవిడమీద కృతజ్ఞతతో  కళ్ళలో నీళ్ళుతిరిగాయి. జీవితంలో ఏ స్త్రీ  చేయని పని ఆవిడచేస్తోంది. ఆవిడకి చాలా  రుణపడతాను.
    భవిష్యత్తులో  మేమిద్దరం కలిసే యోగం  అంటూవుంటే మాత్రం  ఆవిడ మాటకు ఎదురుచెప్పి  ఆవిడ మనసు నొప్పించేలా  ప్రవర్తించకూడదని  గట్టిగా  నిశ్చయించుకున్నాను.
    "ఏమిటాలోచిస్తున్నావ"ని  అడిగారు.
    "మీ ఆవిడ  గురించే" అన్నాను.
    "దానిసంగతి  నాకుతెలుసు  సరోజా! మీ ఇద్దరు నాకోసం  పడిచస్తారు. పోతే అది నేనేంచెప్పినా  నామాట వింటుంది. నువ్వు వినవు. నేనుగంగలో  దూకమన్నా  అది దూకుతుంది" అన్నారు.
    "గంగలో అయితే నేనూ  దూకుతాను  అది వేరేసంగతి. కానీ ఆవిడకి నేను జోహాలు చేస్తాను" అన్నాను.
    "నువ్వే దాని పొజిషన్ లో వుంటే  నేనింకో  పెళ్ళి చేసుకోడానికి  ఒప్పుకుంటావూ?" అని అడిగారు.
    "నెవర్_నాకంఠంలో ప్రాణంవుండగా  ఒప్పుకోను. మీ విషయంలోనేను  వినని మాట అదొక్కటే. అందుకే ఆవిడకి సరండరై  పోయానని అంటున్నానుగా" అని అన్నాను. (నా నోటంట  ఆ మాట అనిపించి  ఎంత మురిసిపోయేవారో చెప్పలేను)
    "అంతేకానీ నాకిష్టమైన పనిమాత్రం చెయ్యవు అంతేగా?" అన్నారు.
    "ఇప్పుడవన్నీ  ఎందుకుగానీ ఈపూట  అయినా కంపెనీ పని చేద్దామా?" అని అడిగాను.
    "నేను  రాసేమూడ్ లో లేను సరోజా! సర్ ప్రయిజ్_మా ముసిల్ది (రవణమ్మగారిని ఆయన అప్పుడప్పుడూ  అలా అనేవారు) ఇంత ఈజీగా  ఒప్పుకుంటుందనుకోలేదు. అయామ్ వెరీ హేపీ. ఏదైనా  సినిమాకి వెళదామా?" అన్నారు.
    "పెళ్ళి కాకుండానా? నథింగ్ డూయింగ్. మావాళ్ళు  చీల్చేస్తారు" అన్నాను.


                        *    *    *  


    1958 నవంబర్ నెలలో రవణమ్మగారి అనుమతితో  శ్రీశ్రీగారూ నేనూ మామూలుగా పెళ్ళిచేసుకున్నాం. అంటే_వారికి గుళ్ళూ  గోపురాలూ  ఇష్టంలేదు కదా? ఆడంబరం  లేకుండా  స్నేహితుల్ని, కావలసిన ముఖ్య బంధువుల్ని  మాత్రం  పిలిచి నా మెడలో తాళికట్టారు. ఆ రోజు తేదీ 15_11_1958.
    "నాకే పిల్లలు పుట్టలేదు. నీకేం పుడతారులే" అన్నారు రవణమ్మగారు. శ్రీశ్రీగారు కూడా  "శ్రీశ్రీ పిండాన్ని మోసేటంత శక్తి  ఏ ఆడదానికీ  లేదు" అన్నారు.
    "నేను కంటే" అన్నాను.
    మాటా మాటా అనుకున్నాం అలా పందాలులోకి దిగాం. నేను బెట్ కట్టాను.

 

                         *    *    *   


                                   రవణమ్మగారి మంచితనం


    పెళ్ళయిన  రోజే ఇద్దరం మూడు రోజులు  బెంగుళూరులో వుండేటట్టు రిటన్ ప్లయిట్ టిక్కెట్లు  కొనేసుకొని బెంగుళూరు వెళ్ళిపోయాం. మూడురోజులు బెంగుళూరు ఉడ్ లాండ్స్  హోటల్లో  వుండాలనుకున్నాం.
    నాకు మనసు మనసులో లేదు. ఏదో బెంగ_గుండెలో  దడ_భయం! ఎయిర్లో దిగేసరికి  ముఖం నీరసంగా  తయారయ్యింది.
    శ్రీశ్రీగారు నన్ను చూసి  ఆశ్చర్యపోయారు.
    "ఏమైంది సరోజా! ఎందుకలా  వున్నావు? పోనీ వెనక్కి  వెళ్ళిపోదామా" అని అడిగారు.
    "వద్దండి" అన్నాను.
    హోటల్ కి వెళ్ళడానికి కారు ఎక్కాం.
    "ఏవండి" అని పిలిచాను.
    "ఏమిటి?" అన్నారు.
    "దార్లో మాత్రం బాటిల్ కొనకండి" అన్నాను.
    "అలాగేలే" అన్నారు.
    హోటల్ లో డబుల్ బెడ్ రూమ్ లో దిగాం.
    ఆ రోజుల్లోనే  మాకిచ్చిన  రూము  ఎంతో బాగుందనిపించింది.
    బోయ్ వచ్చి మంచినీళ్ళు  పెట్టాడు.
    "ఇప్పుడు  విస్కీ తెప్పించుకోనా?" అని అడిగారు.
    "తెప్పించుకోండి" అన్నాను.
    వేడినీళ్ళతో స్నానాలు  చేశాం.
    ఎవ్వరూ  తోడులేకుండా  శ్రీశ్రీగారితో ఊరువిడిచి  మరో ఊరు ప్రయాణం చేయడం అదే మొదటిసారి.
    అప్పటి మైసూరు ప్రయాణం....వగయిరా  గత చరిత్ర కళ్ళముందు ఓసారి అలా మెదిలి మాయమైంది. నాలో నేనే నవ్వుకున్నాను.
    శ్రీశ్రీగారు తాగినా  భయంలేదు. తొంభైతొమ్మిదిన్నరపాళ్ళు  ఒళ్ళు  తెలీకపోవడం, పిచ్చివాగుడు....లాంటిది ఉండవు సరికదా  ఇంకా  హుషారుగా తెలివిగా  వుంటారు.
    ఒక పెగ్ వేసుకున్నారు.
     "బీరు తెప్పిస్తాను. నువ్వుకూడా  తాగరాదూ" అన్నారు.
    "అమ్మ బాబోయ్_తాగడమే" అన్నాను.
    "ఏం? ఇదేమైనా ఘోర అపరాధమా? ఎవ్వరూ  చూడరులే. నీ దేవుళ్ళు వచ్చి శిక్షిస్తారన్న  భయం అక్కర్లేదు" అన్నారు.
    "తాగడం  మహాపాపమండీ" అన్నాను.
    "నీ ముఖం" అన్నారు.
    ఇలా ఓ అరగంట  వాదన గడిచింది.
    "మీ పెళ్ళి చాలాగమ్మత్తుగా  జరిగిందని_తర్వాతే చెప్తాలే అని అన్నారే_ఇప్పుడు చెబుదురూ" అన్నాను.
    "ఏదో ఒకటి మాట్లాడాలిగా? ఇంకా గంటయినా కాలేదు. మూడు రోజులుండాలి. ఇది మంచి అవకాశం. చెప్పండి ప్లీజ్!" అన్నాను.
    "పెళ్ళికి ఏ దేవుడి సాక్ష్యమూ  అక్కరలేదు. ఈ రోజు మన పెళ్ళికి కూడా అందర్నీ పిలిచాం. వాళ్ళందరూ అనవసరం.
    1925 లో  నేను పదిహేనేళ్ళ వాడిని. నాకిస్తానన్న  అమ్మాయి వయస్సు తొమ్మిది, పది సంవత్సరాలు.
    మా నాన్న 'ఆ పిల్లను చేసుకుంటావా?' అని అడిగితే 'సరే' అన్నాను. మా అమ్మమ్మ వద్దంటే 'అలాగే' అన్నాను. 'తెల్లవారితే  పెళ్ళ'న్నారు. మా కుటుంబంలో  కొందరికి  నేనా అమ్మాయిని చేసుకోవడం ఇష్టంలేదు. మా నాన్న ఉత్త అమాయకుడు. వెర్రిబాగులవాడంటే  ఇంకా బాగుంటుంది. పెళ్ళివారింటికీ మా ఇంటికీ  అట్టే దూరంలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS