Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 7

                           కన్యాత్వం కాపాడడానికి తోలుకట్లు ఉంటే
                  భార్యాత్వం రక్షించడానికి ఇనపకట్లు
    ఇది నాది అని అనుకోవడంలో ఒక రుచి ఉందని మొదటనే మనవి చేశాను. నాకే వుండాలి మరొకడికి దీని వల్ల లాభం వుండకూడదు అన్న ఉద్దేశం, దాని అంతట అదే కలుగుతుంది. అదే స్వార్ధం. ఈ స్వార్ధం వల్ల మనిషి పశువును కూడా మించిపోతాడు. ఎటువంటి నీచమైన పనినైనా చేస్తాడు. ఎంత నికృష్టానికైనా దిగుతాడు.
    ఈ స్వార్ధం ఆకలిలోనూ, నిద్రలోనూ ఎలా విజృంభించిదో తెలిసిన విషయమే. ఈ యుద్ధాలూ, ఈ మారణకార్యాలూ అన్నీ ఆకలి కోసమే. ఇక కామం విషయంలో దీని సంగతి చెప్పవలిసిందేముంది. హెలెన్ అన్న ఆడదాని కోసం ఘోరమైన ట్రోజన్ యుద్ధం జరిగింది. సీతయందు అబిలాష వల్ల రామరావణయుద్ధం చరిత్రలకెక్కింది. ఈ కామం కోసమే భీష్ముడు గురువుతో గుటగుటలు నెరవలసి వచ్చింది; ఒకడి కామం వల్ల కలిగిన ఫలితమే భీష్ముడి బ్రహ్మచర్యం. అంత అమోఘమైనది ఈ కామం.
    అంతా కావాలి, కొంతయినా ఇతరులకు ఉండకూడదు. స్త్రీ పురుషుడినీ, పురుషుడు స్త్రీని ఇలా కట్టి పడవేసేవారు; పడవేస్తున్నారు. ఇంతకు ముందు నేను చెప్పినట్లు పురుషాంగాలకు స్త్రీలు ఇనుపరింగులు కుట్టించేవారు; తాళాలు వేసేవారు. అలాగనే స్త్రీలకు పురుషులు కూడా ఇలాంటి బందోబస్తు చేసేవారు. ఈ ఆచారం పెండ్లో పెడాకులో అయిన తరువాతనే ఉండేది మొదట. పెళ్ళికి ముందు పిల్లలు ఏమిచేసినా తప్పులేదన్న రోజులవి.
    రానురాను అభిప్రాయాలు మారిపోయాయి. కన్యాత్వం చెడకుండా వుంటే మరీ మంచిదని అనుకున్నారు. ఆ ప్రకారమే శాసనం చేశారు.
    "అక్షతయోని" అన్నమాట ఒక గౌరవం అయింది. దానితో కూతురి కన్యాత్వం పోషించడం తల్లిదండ్రుల బాధ్యత అయింది. పెండ్లి అయినప్పుడు పెళ్ళికూతురు "అక్షతయోని" అని రుజువు చేయవలసి గూడా వచ్చేది. అలా రుజువు చెయ్యకపోతే గౌరవం తక్కువ. కులమర్యాదలకు లోపం.
    ఇలా రుజువు చేయడం ఎంత కష్టమో ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ రోజులలోనూ గూడా, ఇంత మెడికల్ జ్ఞానం ఎక్కువయినప్పుడు గూడా, ఇది రుజువు చేయలేకపోతున్నారు. ఎన్నో కోర్టులలో ఎన్నో కేసులు విచారణలకు వస్తున్నాయి. ఇక ఆ రోజుల సంగతి వేరే చెప్పాలా? చాలా కష్టపడేవారు. పెద్దలంతా ఆలోచనలు చేసేవారు. మలమూత్ర విసర్జనను సందుండేటట్లు, కటి ప్రదేశం అంతా కట్టు కడితే బాగుంటుందనుకున్నారు. గుడ్డతోనో, తోలుతోనో, కట్టి కుట్టివేసేవారు. ఆ కట్టూ ఆ కెట్టూ మార్చడానికి వీలులేకుండా ఉండేది. పెండ్లి పక్కమీద భర్త ఒక కత్తితోనో, కత్తెరతోనో ఈ కట్లు నరికేవాడు. అలా నరకడంలో కొన్ని సమయాలలో రక్త దర్శనం గూడా వుండేదని చరిత్రలు ఘోషిస్తున్నాయి.
    మరికొన్ని దేశాలలో ముసలి అమ్మలక్కలు ఒక పసరును కనిపెట్టారు. ఆ పసరు కటి ప్రదేశానికి పూతపూసేవారు. ఆ పూత సాధారణమైన పూత. అలాంటి ఇలాంటి దేహశ్రమకు ఆ పూత చెక్కు చెదరదు. కామకార్యానికే అది చెదురుతుందట. శోభనం నాడు ఆ పూత సరిగా వుందా లేదా అని చూసుకొని, భర్త తన భార్య కన్యాత్వాన్ని నిర్ధారణ చేసుకుంటాడు. ఈ పసరు ఏమిటో, అది పూసే విధానం ఏమిటో రీసెర్చి పరిశోధకులు చెప్పుతే ఇంకేముంది? ఈనాడు గూడా దానిని ఉపయోగించాలని ఎందరో ప్రభువులు బయలుదేరతారు. సందేహం లేదు. కాబట్టి ఆ అనాగరికులను తిట్టకండి. అదంతా మానవస్వభావం.
    కన్యాత్వం కోసం ఇన్ని అగచాట్లు పడ్డవాడు, భార్యాత్వానికి భంగం రానిస్తాడా? నమ్మరాని మాట. చిన్నతనంలో గుడ్డకట్లూ, తోలుకట్లూ కడితే, పెళ్ళయిన తరువాత ఇనపకట్లు కడతాడు గానీ ఊరుకుంటాడా? కన్యాత్వం చెడకుండా వుండడం తన మంచికోసమయితే, భార్యాత్వం తన కుటుంబానికంతటికీ మంచిది. తన వంశానికంతటికీ మంచిది. దాన్ని కాపాడుకోడమే పరమ ధర్మం అని నీతులు చెప్పారు. ఆడదానికీ మగవాడికీ ఆ అభిప్రాయాలే కలిగించారు. పురుషుల అధికారం వున్న దేశాలలో స్త్రీలకు ఇనుపకచ్చడాల్ కట్టించారు. స్త్రీలకు అధికారం వున్న దేశాలలో మగవారికే ఇవి తొడిగించారు.
    ఉభయులూ ఒక్కచోటే ఉన్నప్పుడు అంత బాధ ఉండదు. భార్యాత్వంమీద అందరి కళ్ళూ ఉంటాయి, అంతేకాదు. కామదృష్టిని చూసే అవసరము అంతగా ఉండదు. కాని మగవాడు దూరప్రయాణానికి పోయినప్పుడో! ఏ ప్రమాదం కలుగుతుందో ఎవడు చెప్పగలడు? ఎటువంటి అనుమానాలు కలుగుతాయో ఎవతె ఊహించగలదు? కాబట్టి అలాంటప్పుడు తప్పకుండా, ఈ ఇనుప కచ్చలు ఉపయోగించవలసిందే. ఈ ఇనుపకచ్చను-మలమూత్ర విసర్జనకు అనుకూలంగా-ఉంచి, నడుముచుట్టూ పట్కాలాగా చుట్టి, దానికి ఒక తాళం వేసి, ఆ తాళం చెవి తనతో తీసుకుపోతాడు. తాళంచెవి తన దగ్గరున్నంతకాలమూ, తన పెళ్ళాం భార్యత్వం సురక్షితంగా ఉందని అనుకుంటాడు.
    ఈ ఆచారం శాసనాలలోని కెక్కడంతో ఊరుకోలేదు. శిలాప్రతిమలుగా గూడా వెలిసింది. ఒక మార్బిల్ స్టాట్యూ పెద్ద ప్రతిమ ఉంది. భర్త వ్యాపారానికి దూరదేశం బయలు వెళతాడు. భార్య చక్కగా, ఒక ఇనుపకచ్చడం బిగించుకుంటుంది. నడుము చుట్టూ ఆ ఇనపబెల్టు చుట్టింది. తాళం అమర్చింది. భర్తకు తాళం చెవిని అందిస్తూ ఉంది. చలువరాతి విగ్రహంలో మాటలు వినపడవుగాని, ఆ భార్య "ఇదిగోనండి, పాతివ్రత్య సంరక్షక బంధం. దీనికి బీగం బిగించి, ఆ తాళంచెవి మీతో తీసుకుపోండి. వంశగౌరవాన్నీ మీ మర్యాదనూ అసూర్యంపశ్యనై అన్యపురుషుడిని చూడకుండా వుంటాను. మీరు నిశ్చింతగా పోయిరండి" అని చెప్పే వుంటుంది. అభాగ్యులం కాబట్టి ఆ మాటలు వినబడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS