Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 6

   ఈ నియమం అంతా పెళ్ళి జరిగిన తరువాతనుంచే. పెళ్ళి అయిన తరువాత పరపురుష సాంగత్యం చెయ్యరాదు. అనగా పతివ్రతా ధర్మం పాటించాలి. వివాహానంతరం ఉన్న పట్టుదల వివాహానికి పూర్వం లేదు. ఆ రోజులలో స్వైర విహారం చేస్తూ ఉండడం బాగా కళ్ళారా చూచిన వాడు గూడా, పెళ్ళి అన్న రెండక్షరాలూ జరగగానే కొర్రెక్కి కూర్చుంటాడు. నేనే తప్ప మరెవ్వడూ లేడు అంటాడు మగాడు. ఆడవారి అధికారం ఉన్న దేశాలలో మగవాడిని గూడా ఇలాగనే ఏకపత్నీవ్రతానికి సంకెళ్ళు వేస్తారు. అక్కడి పాతివ్రత్యమూ, ఇక్కడి పాత్నీవ్రత్యమూ చాల గొప్ప గుణాలని "తాటాకులలో" వ్రాస్తారు. ధర్మశాస్త్రాలకు ఎక్కిస్తారు. అక్కడ పురుషులు ఎంత అధర్మంగా ప్రవర్తించినా తప్పు లేదు. ఇక్కడ స్త్రీలు ఎంత బాహాటంగా తిరిగినా దోషం ఉండదు.
    పెళ్ళి ముందు అలా ఊరుకోవడం ఎందుకు? పెళ్ళయ్యేసరికి ఇంత బిర్రు బిగుసుకుపోవటం ఎందుకు? కేవలం తెలివి తక్కువా? కాక, ఏదయినా రహస్యం ఉందా అని ఆలోచిస్తే; కొంత బలమైన కారణం ఉన్నట్లే కనబడుతుంది. మానవస్వభావంలో ఉన్న వినోదాభిలాష ఉండనే ఉంది. చక్కగ సంతోష పెట్టిన ఆడది దొరికింది. ఇంకా దానితోనే ఉండాలి. ఇలా చాలా కాలం ఉండాలి అన్న ఆశ కలుగుతే ఏం చేస్తాడు? ఎలాగో ఒకలాగ ఇది నాది అనిపించుకుంటాడు. అలా అనిపించుకున్న తరువాత మరెవ్వరికీ కాదు అని శాసిస్తాడు.
    అంతేకాదు. వంశమర్యాద అంటూ ఒకటి ఉందికదా. తన వంశం, తన వంశగుణాలు, తన వంశగౌరవం ఇలాంటివి అనాగరిక దినాలలో చాల ఎక్కువగా వుండేవి. ఆ వంశం పవిత్రంగా-వాళ్ళ సిద్ధాంతాల ప్రకారమే అవి-ఉండేటట్టు చూడాలి. కాబట్టి, ఇతర బీజం తమ క్షేత్రాలలో పడనీయకుండా చూస్తారు. అలా చెయ్యడానికి ఎలాంటి విధానాన్నయినా అవలంబిస్తారు.
    పాతివ్రత్యం అంటూ ఇంత ప్రాకులాడేవారా! ఇందులో ఒక చిత్రం - అతిధి ఎవడయినా ఇంటికి వచ్చాడంటే ఈ కట్టడి అంతా ఎగిరిపోయేది. ఇనుపకచ్చలలో ఉంచిన ఈ ఇల్లాలిని కూడా ఆ అతిధికి అప్పగించేవారు. అలా చెయ్యకుండా తన ఆవిడ పాతివ్రత్యం కాపాడుకొనేవాడిని పరమ పాపాత్ముడుగా చూసేవారు. అతిధిపూజ ఆ రోజులలో పాతివ్రత్యానికి భంగం కలిగించేది కాదు. అతిధి సేవకు వెళ్ళివచ్చిన ఆ ఆడదానికీ, ఆ సేవకు పంపించిన ఆ మగవాడికీ ఇద్దరికీ ఉభయతారకమే.
   ఇంత అవస్థ పడ్డాడు: పెళ్ళి అంటూ చేసుకున్నాడు; దానికి పాతివ్రత్యం నేర్పాడు: ఇనపసంకెళ్ళు వేసాడు; ఎందుకు? వంశం పవిత్రతను నిలపడానికి అన్నాడు. బాగానే ఉంది. వీడికి పిల్లలు కలగకపోతే ఏంగతి? వంశం అంతరించి పోవలసిందేనా? లేదు. ధర్మశాస్త్రం తలకాస్తుంది. ఇలాంటి అవస్థ వచ్చినప్పుడు ఈ మగవాడు తన పతివ్రతను ఇంకొకని దగ్గరకు పంపవచ్చును-భోగాల కోసం కాదు, వినోదాల కోసం కాదు-గర్భవతి అయి వచ్చి, తన మగనికి ఒక పుత్రుణ్ణి ఇవ్వడానికి: ఆ రూపంగా వంశం నిలబెట్టడానికి. అలా భార్యను పంపిన వాడు వంశం నిలబెట్టటానికి ఇంత ప్రయత్నం చేశాడు కదా అని పితృదేవతలు - అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాల వరకు-ధన్యవాదాలూ, పుష్పవర్షాలూ కురిపిస్తారు. ఆ ఆడదానిని మహా పతివ్రతల లిష్టులోనికి ఎక్కించి కథలూ, పాటలూ, కావ్యాలూ అల్లుతారు.
    అంతేకాదు. ఒక వంశం వాడుంటాడు. పెళ్ళీ దాని పీకులాటా అక్కరలేదు వాడికి. "ఏక్ నిరంజన్" అన్నట్టు ఉండాలని వాడికి అభిలాష. అలాగనే ఉంటాడు. ఇంతలో అయ్యా! నా వంశమే అన్న ఊహ ఒక్కనాడు హఠాత్తుగా కలుగుతుంది. ఒక కొడుకు పుడితే చాలును అని తోస్తుంది గబగబా పొరుగు గృహస్థు ఇంటికివెళ్ళి "నీ భార్యను నాకు ఎరువు ఇస్తావా రెండు సంవత్సరాలు? ఒక కొడుకును కన్న తరువాత నీ దగ్గరికి పంపించి వేస్తాను" అని అంటాడు. ఒక వంశాన్ని నిలబెట్టే పుణ్యం కలుగుతుంది కదా అని ఆ గృహస్థూ పంపుతాడు; ఆ ఇల్లాలూ అంగీకరించి ఎరవు కాపురానికి పోతుంది, కీర్తి పొందుతుంది.
    ఇలాంటి చోటులలో ఇనపకచ్చడాలు వొదులు చేస్తారు. హక్కూ, అధికారాలూ అణచుకుంటారు.

                    ఇనుపకచ్చడాల్ మరి రెండు

     ఇనుపకచ్చడాలంటే ఏమో అనుకుంటాము. మానవబుద్ధికి అడ్డన్నది లేదు. ఎలాంతి కుతంత్రానికయినా ఒడిగడుతుంది. తన ప్రియుడినో, ప్రేయసినో; ఇంకొకరు ఉపయోగించరాదు. దీనికోసం తాళాలు వేశాము, పట్కాలతో ఇనపకవచాలు తయారు చేశాము. గోప్యాంగాలను భద్రపరిచాము; ఇతరులకు దుర్బేద్యంగా ఉండే కోటల్లాగా కాపాడాము. స్వప్రయోజన బుద్ధికి సింహాసనం కట్టాము.
    ఇవి మరి రెండు ఇనపకచ్చడాలు. కల్పితాలు కావు నిజాలు. ప్రపంచంలో అక్కడక్కడ వస్తు ప్రదర్శన శాలలలోనూ, మ్యూజియములలోనూ ఇప్పటికీ ఉన్నాయి. తూర్పు దేశాలలోనే కాదు; పాశ్చాత్య దేశాలలోనూ ఉన్నాయి. మనుష్యుల బుద్ధి సూక్ష్మతను - కొంటెతనాన్ని అందామా?- వేయినోళ్ళతో చాటుతూ ఉన్నాయి. వీటి పుట్టుపూర్వోత్తరాలను గురించి వ్రాయడంగాని, చదవడంగాని చెడ్డపనికాదు. మానవ జీవితయాత్రలో ఇవి ఒక మజిలీవంటివి. నేటి నాగరికతకు మొదలు ఎలా ఉండేదో తెలుస్తుంది; రేపు ఎలాగా పరిణామం పొందవచ్చునో బోధపడుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS