Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 7


    నాలుగు సెకండ్లయినా జీప్ స్టార్టయిన శబ్దం రాకపోయేసరికి  ఖాన్ ఏంటన్నట్లు చూశాడు బిర్క్ వేపు.
    బిర్క్ సమాధానం ఇవ్వకుండానే రెండు చేతుల్ని ముందుకుచాపి చీకట్లోనే తడుముతున్నాడు.
    "కీ.....దొరకలేదా.....? అసహనంగా అడిగాడు దీపక్ రాజ్.
    బిర్క్ అవునన్నట్లు తలూపుతుండగానే ఖాన్ వెనక్కి తిరిగి చూసి ఉలిక్కిపడ్డాడు.
    దూరంగా ఏదో వాహనం వస్తూన్నట్లుగా ఆ చిమ్మ చీకటిలోకాంతి కనిపించింది.
    ఖాన్ ఉలిక్కిపడి చెంగున  జీప్ లోంచి దూకాడు. వడివడిగా  అంతకుముందు  బిర్క్  కూర్చున్న స్థలానికి వెళ్ళి టార్చ్ వేసాడు. అక్కడేమన్నా కీ  కనిపిస్తుందేమోనని.
    ఖాన్ లో  హడావుడి పెరిగిందేగాని కీ కనిపించలేదు.
    మరోసారి ఖాన్  తలెత్తి చూసాడు. ఏదో వెహికల్ హెడ్ లైట్స్  కాంతి అని నిర్ధారణ అయిపోయింది.
    బిర్క్  జీవ్ లోనే  కదలకుండా కూర్చున్నాడు. దీపక్  రాజ్ కి దూరంగా, చీకట్లో కనిపించిన కాంతి కాస్తంత కంగారు పుట్టించింది.
    "కీస్ ఎక్కడ  పారేశావ్.....? బుద్ధిలేదు నీకు. త్వరగా వెతుకు ఏదో వెహికల్ ఇటే వస్తున్నట్లుంది" అన్నాడు బిర్క్ ని కోపగించుకుంటూ.
    బిర్క్ ఓసారి నిర్లక్ష్యంగా దీపక్ రాజ్ వేపు చూసి డ్రైవింగ్ సీటు ముందు వెతకటం ప్రారంభంచాడు.
    అప్పటికే కీ  కనిపించక విసుగు చెందిన ఖాన్ జీప్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
    "ఆ వచ్చేది పోలీస్ కార్ లా  వుంది. రెండు హెడ్ లైట్స్ కి మధ్యగా కాస్తపైన ఓ రెడ్ బల్బ్ కాంతి కనిపిస్తోంది...." ఖాన్ గొంతులో ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది.
    "ఏ వెధవ్వేషాలు వేయకుండా వెళ్ళుంటే ఈ ప్రాబ్లమ్ రాదుగా?" బిర్క్ మాటలు పూర్తయ్యేలోపే దీపక్ రాజ్ వెనుకనుంచి బిర్క్ జుత్తు పట్టుకుని విసురుగా గుంజాడు.
    "మనం వెధవలం. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే వెధవలం. మనకి మంచి పనులు చేయటం  తెలియదు. అయితే మాత్రం  కీస్ పారేస్తావా మూర్ఖపు వెధవా.......?" దీపక్ రాజ్ మండిపడ్డాడు బిర్క్ పై.
    క్షణక్షణానికీ దీపక్ రాజ్  బిర్క్ ళ ఘర్షణ ఉధృతమైపోతోంది.
    ఖాన్ కి, సరస్వతికి ఆందోళనగా వుంది.
    ఏదో వెహికల్ వస్తున్న శబ్దం స్పష్టంగా వినిపించింది.
    బిర్క్ ఓసారి వెనక్కు చూశాడు. హెడ్ లైడ్స్ కాంతి మరింత దగ్గరయింది.
    ఓసారి బిర్క్ కిందకు వంగాడు. వెంటనే కీన్ తో పైకి  లేచాడు.
    ఖాన్ కి పరిస్థితి అర్ధమయిపోయింది. అది కావాలనే బిర్క్ చేసినట్లుగా తోచింది.
    వెహికల్ మరింత దగ్గరగా వచ్చిన శబ్దం....
    పోలీస్ కార్ ముందు సీట్లో కూర్చున్న సదాశివ్ దృష్టి ఆపి ఉన్న బిర్క్ జీప్ పై పడింది. అనుమానంతో అతనికళ్ళు పెద్దవయ్యాయి. నొసలు పైకి లేచాయి. అంతలోనే ముందున్న  జీవ స్టార్ట్ అయినట్లుగా లైట్స్ వెలిగాయి. సదాశివ్ డ్రైవర్ కేసి చూసాడు జీప్  వేగం పెంచమని.
    పోలీస్ కార్ వేగం అందుకునేసరికి, ముందు జీవ్ స్టార్ట్ అవటం, ముందుకు దూకటం అంతా క్షణాల్లో జరిగింది.
    సదాశివ్ లో అనుమానం మరింత బలపడింది. డ్రైవర్ ని పక్కకు తప్పుకో మన్నాడు. అప్పటికే ముందు జీప్ చాలా దూరం వెళ్ళిపోయింది.
    సదాశివ్ డ్రైవింగ్ సీటులోకి చెంగున దూకాడు. అలా దూకుతూనే సెర్చ్ లైట్ బయటకు తీయమని ఆజ్ఞాపించాడు.
    సదాశివ్ చేతిలో కార్ అంతకంతకు వేగం అందుకుంటోంది. పోలీస్ సెర్చ్ లైట్ పైకితీసి పట్టుకున్నాడు.
            
                                    4

    అప్పటి వరకూ దీపక్ రాజ్ ని టెన్షన్ లో పెట్టాలనుకున్న బిర్క్ ఇప్పుడు తను టెన్షన్ లో పడ్డాడు.
    నిజానికి తాము నలుగురు  పోలీసుల దృష్టిలో పడ్డా, ఆ తదుపరి ఏదన్నా ప్రమాదం ముంచుకొచ్చినా రక్షించేందుకు సత్యరాజ్ పలుకుబడి ఉండనే ఉంది.
    కాని ఈ మధ్యనే ఓ మెరికలాంటి ఐ పి యస్ ఆఫీసర్ కార్మిక పురం ప్రాంతంలో బందిపోటు దొంగల  బెడదను  నివారించేందుకు బదిలి అయినట్లు  తెలవటమే  కాక,  అతను అంతకు ముందు వర్క్ చేసిన తీరు కూడా తెలియటంతో  ఆ టెన్షన్  కాస్తంత ఆందోళనగా మారింది.
    బిర్క్ చేతిలో జీప్ గేర్ మారింది. అంతకంతకు జీప్  వేగం అందుకుంటోంది.
    హసీంఖాన్, దీపక్ రాజ్, సరస్వతి తలలు తిప్పి పోలీసు కారు ఎంత దూరంలో ఉందో అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు బిర్క్ కి వివరిస్తున్నారు.
    సదాశివ్ చేతిలో కారు మెరుపు వేగం అందుకుంది.
    బిర్క్  కాలు ఏక్సిలేటర్ పై బలంగా అనింది.
    నిర్మానుష్యంగా ఉన్న ఆ చీకటి రోడ్ పై బిర్క్  జీప్, సదాశివ కారు సర్రున  దూసుకుపోతున్నాయ్.
    చూస్తుడగానే పోలీసు కారు మరింత  దగ్గరయింది.
    బిర్క్ స్పీడో మీటర్ వేపు చూశాడు. అసహనంగా నీడిల్ ఊగిస లాడుతూందే తప్ప వేగంలో ఫలితం కనిపించటం లేదు.
    ఇంజన్ ఆఫ్ చేసి సదాశివ కారు దిగి బిర్క్  జీప్ వద్దకు వచ్చాడు.
    అప్పటికి నలుగురు ఓ నిర్ణయానికొచ్చినట్లు స్థిరంగా కూర్చున్నారు.
    "ఎక్కడి నుండి వస్తున్నారు?" సదాశివ సూటిగా ప్రశ్నించాడు నలుగుర్ని ఓసారి కలియజూస్తూ.
    "యూనియన్ లీడర్ సత్యరాజ్ సాబ్ ఇంటి దగ్గర్నుంచి" తుడుము కోకుండా సమాధానం చెప్పాడు హసీంఖాన్.
    నలుగురి మొఖల్నీ అప్పటి కప్పుడే తన ఫోటోగ్రాఫిక్ మెమొరీలో నిక్షిప్తం చేసుకున్నాడు. యిరవై ఆరేండ్ల ఐ పి ఎస్.  ఆఫీసర్ సదాశివ్.
    వార్ని ఇంటరాగేట్ చేసేందుకుగాని, మరింతగా ఆరా తీసేందుకు గాని పెద్దగా కారణం కనిపించలేదు సదాశివ్ కి.
    పైగా సత్యరాజ్ మనుష్యులని తెల్సిపోయింది......ఓ సారి తలపంకించి "పోలీసు వాహనానికి ముందు వెళ్ళే ఏ వాహనమైనా అర్థాంతరంగా స్పీడ్ పెంచితే అంతకంటే అనుమానించడానికి మరో కారణం అవసరంలేదు."
    "సారీ సార్___మీ కారు పోలీసు వెహికల్ అని మేం గమనించలేదు" అన్నాడు దీపక్ రాజ్ కాస్త ముందుకు వంగి.
    అక్కడే దొరికిపోయారు సదాశివ్ కి ఆ నలుగురు.
    "సరె___మీరెళ్ళొచ్చు" అంటూ కారువేపు కదిలాడు సదాశివ్ సాలోచనగా.

                                                                *    *    *

    అర్థరాత్రి 1-10కి కార్మికపురం స్మశానం ప్రక్కగావున్న సత్తెయ్య ఇంటిముందాగింది జీప్.
    దీపక్ రాజ్  జీప్ దిగి ఓ సారి  నలువేపులా చూశాడు పరిశీలనగా.
    కార్మికపురం నిద్రపోతోంది.
    ఓసారి స్మశానం వేపు దృష్టి సారించాడు దీపక్ రాజ్.
    భూతాల్లా కనిపిస్తున్న ఎత్తైన చెట్ల నీడల్లో బూడిద గుట్టలు మనిషి బతుకును పరిహసిస్తున్నట్లుగా వున్నాయి.
    అర్థరాత్రి సుషుప్తిలో కార్మికపురానికి, కాలభైరావుడు నివశించే స్మశానానికి తేడా లేనట్లుగా వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS