ఉద్విగ్నంగా పైకి లేచింది. ఇలా మాట్లాడుతున్నాడేం. డబ్బే అవసరమని తెలిసే తనను కలుసుకొమ్మన్నాడుగా. అవసరాన్ని అద్భుతంగా క్యాష్ చేసుకోగల ఇండస్ట్రీలో యిలాంటి సూరిల పాత్ర ఏమిటో ఆమెకు తెలీదు.
"ఆగండి సుకృతీ! ఓ పదివేలదాకా అడ్వాన్స్ యిప్పిస్తాను" బేరం మొదలుపెట్టాడు.
"నాక్కావాల్సింది పాతిక వేలు.....ఎప్పుడో కాదు......వెంటనే" మొండిగా అంది.
"అంత డబ్బు ఒకేసారి మీరు రాబట్టాలీ అంటే ముందు నటించాల్సింది సినిమాల్లో కాదు."
అర్ధంకానట్టు చూసింది.
"బ్లూ ఫిల్మ్స్ లో...అలా కోపంగా చూడకండి.
నేను జోక్ చేయడంలేదు. సీరియస్ గానే అంటున్నాను. ఒక్క రాత్రి మీరు మీది కాదనుకుంటే తెల్లవారేసరికి మీరనుకున్న డబ్బుతో మీరు వెళ్ళొచ్చు."
షర్టు కాలరు పట్టుకుని చెంపలు వాయగొట్టేదే. నిభాయించుకుంది. కన్నతండ్రి నీ వయసుని ఖర్చు చేసి డబ్బు సంపాదించు అన్నప్పుడు యిక్కడో సూరి అలా మాట్లాడ్నందుకు ఆవేశపడటంలో అర్ధం లేదు.
"ఏమంటారు?"
నవ్వింది నిస్త్రాణగా, "నిన్నటి నా స్థాయి యీ రోజు నాకు వుంటే నువ్విలా మాట్లాడగలిగేవాడివి కాదు మిస్టర్ సూరీ. కానీ నేనిప్పుడు ఓడిన తల్లికి కూతుర్ని. బహుశా అదే నిన్ను బలవంతుడ్ని చేసి వుండొచ్చు. అయితే నేను మానసికంగా అంత బలహీనురాలిని కాలేకపోతున్నాను సూరీ. ఎందుకంటే అమ్మని బ్రతికించుకోటానికి అవసరమయ్యే డబ్బుకన్నా మా యిద్దరి అభిమానాలు బ్రతికించుకుంటూ చావటానికి అవసరమయ్యే విషం ఖర్చు చాలా స్వల్పం కాబట్టి. ఓ.కె."
సుకృతి రెస్టారెంట్ లోంచి బయటికి నడిచింది. విడిచిపెట్టలేదు సూరి. ఆమె వెంటపడ్డాడు. "మీరలా తొందరపడి వెళ్ళడం కాదు. మరో ప్రపోజల్. నిన్న రాత్రే నేను తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టరు అయిన సుదర్శనరావుగారితో మాట్లాడాను. ఈ మధ్య ఓ లౌస్టోరీకి అవసరమైన కొత్త హీరోయిన్ కోసం ఆయన వెదుకుతున్నారు మీ అమ్మగారు కూడా ఒకప్పుడు ఆయన సినిమాల్లో నటించిన విషయం మీకు తెలిసే వుంటుంది."
తెలీదు సుకృతికి. అసలు యిండస్ట్రీలో వున్న మహానటికి కూతురాయినా యిక్కడి మనుషుల అభిమానుల గురించి, వ్యక్తిత్వాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటిదాకా రాలేదు.
"ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఒకవేళ నచ్చితే పాతికవేలేమిటి లక్షయినా మీకు అర్జెంటుగా యివ్వగలరు. ఆశ్చర్యపోకండి. ఒక్కో సినిమాకి ఇరవై నుంచి పాతిక లక్షలదాకా తీసుకోగల పెద్ద డైరెక్టరాయన."
బస్టాపుదాకా నడుస్తూ అంది సుకృతి.
"ఒకవేళ ఆయన్ని వెంటనే కలుసుకోవాలీ అంటే యీ అడ్రస్ కి కాంటాక్ట్ చేయండి. రాత్రి ఎనిమిది గంటలనుంచి ఆయన వుండేది కొడంబాకంలోని ఆయన గెస్టుహౌస్ లో..." ఓ కార్డు అందించాడు ఈసారి కూడా.
జవాబు చెప్పకుండా బస్సెక్కింది సుకృతి. మొన్నటిదాకా బస్సు ప్రయాణం తెలీని సుకృతి తను పెరిగిన ప్రపంచం నుంచి ఎంత దారుణంగా విసిరేయబడిందీ తెలియచెప్పే ఉదాహరణ అది. అలవాటులేని రద్దీలో నిలబడ్డ సుకృతి యిప్పుడు ఆలోచిస్తున్నది ఊపిరితిరగని యీ స్థితి గురించి కాదు. సూరి ప్రపోజల్ గురించి ఎలా ప్రపంచంలో బ్రతకడమో సఫకోషన్ కి గురికావడంలా అనిపిస్తుంటే కనుకొలకుల్లో నిలిచిన ఓ నీటిబొట్టుని జుగుప్సగా తుడుచుకుంది.
ఆకాశంలో పుట్టిన గంగ శంభుని శిరస్సునుంచి సముద్రందాకా జారిపడింది.
ఇక అడుగు పెట్టాల్సింది నీచమయిన రసాంతంలోకి అంతే.....అదే సుకృతికి మిగిలిందిప్పుడు.
* * * *
బస్సు దిగి యిరుకుగా వున్న వీధిలో అడుగు పెట్టగానే సుకృతి చూసింది. అలివేలు యింటిముందు జనం పోగై వున్నారు.
ముందు తొట్రుపడింది. వెంటనే ఆఘమేఘాలపై గదిలోకి దూసుకుపోయిన సుకృతి అక్కడ తల్లి పరిస్థితి విషమించినట్టు అర్ధం చేసుకుంటూనే అచేతనురాలై పోయింది.
కట్టెపుల్లలా వున్న రాజ్యం వెక్కిళ్ళతో ఎగిరిపడుతూంది. స్పృహలో లేదు అయినా అస్థిపంజరంలావున్న ఆమె శరీరం ఏ క్షణంలో అయినా పగిలే నీటిబుడగలాగా సంకోచ వ్యాకోచాల మధ్య అలజడిగా కదులుతూంది.
అలివేలు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ రాజ్యాన్ని ఒడిలోకి తీసుకుని ఏం చేయాలో కేన్సర్ హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే ప్రమాదం. డాక్టర్ రాజేష్ అన్నాడో గొణుగుతున్నాడో బాధపడకపోయినా ముందు రియాక్టయింది సుకృతే. చావుకన్నా యింత హేయమైన మరణానికి అమ్మ గురికావడం ఆమెకు నచ్చడం లేదు. కళ్ళనీళ్ళు ఉబుకుతుంటే ఎవరినో అర్ధించింది ఆటోకోసమని.
ఈ స్థితిలో అమ్మ బ్రతికేకన్నా చచ్చిపోతే ఎంత బాగుండు అనుకున్నా యింకా చావని ఆశతో మరో పదిహేను నిమిషాలలో హస్పిటల్ కి తీసుకువచ్చింది.