సినిమా రంగాన్ని నమ్ముకుని పతనమైన ఓ ఆడదాని కథ ఎలా వుంటుందో బోధపడింది.
రెండు నిమిషాల నిశ్శబ్దం.
"తినడానికి అసహ్యంగా వుందా?" అడిగింది అలివేలు.
జవాబు చెప్పలేదు సుకృతి. ఇప్పుడు తనూ వధ్యశిలపై అడుగుపెట్టిన మరో బలిపశువులా బిరియానీని చెరిసగం చేసి అలివేలుకీ అందించింది.
ఈ చర్యకి అర్ధం అలివేలుకి అప్పటికి బోధపడలేదు.
ఖరీదయిన కార్లలో ఏ.సి. గదులలో తప్ప బ్రతకడం తెలీని సుకృతి గమనించలేదుగాని ఆమె కళ్ళనుంచి జారిన రెండు నీటిబొట్లు ఆబగా తింటున్న బిరియానీ కలిసిపోయాయి.
* * * *
"ఎలా వుంది డాక్టర్ గారూ?"
రాజ్యాన్ని పరీక్షిస్తున్న డాక్టర్ రాజేష్ ని అడిగింది సుకృతి ఆదుర్దాగా.
అప్పటికే నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ సుకృతిని చూశాడు డాక్టర్ రాజేష్. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసే డాక్టర్ రాజేష్ స్వతహాగా హోమియోపతి డాక్టరు.... అంతకు మించి రాజ్యానికి మొదటినుంచీ అభిమాని కూడా.....పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెప్పాక ఇంగ్లీషు మందులు వాడటానికి తిరస్కరించిన రాజ్యాన్ని ఒప్పించింది రాజేష్. ప్రత్యామ్నాయంగా పిల్సు వాడటం బెటరన్నాడు. అసలు మందులే వాడకపోవడంకన్నా ట్రీట్ మెంటుని ఏదోలా కొనసాగించడం మంచిదన్నాడు. కానీ నిన్న మొన్నటి నుంచీ కోమాలోకి వెళ్ళిన రాజ్యం పిల్సు వేసుకునే అవకాశం చేజారిపోయింది.
"పరిస్థితి చేజారిపోయిందమ్మా" అసహనంగా తల పంకించాడు రాజేష్.
"శరీరానికి మందులే కాక ఆహారం సైతం తీసుకునే అవకాశం లేకపోవడంతో ఏ క్షణంలో అయినా మెదడు స్తంభించే ఛాన్సుంది. సాధ్యమైనంత త్వరలో కేన్సర్ హాస్పిటల్లో చేర్పిస్తే బ్రతుకు బ్రతుకు గురించి హామీ ఇవ్వలేకపోయినా కనీసం చావైనా పోస్ట్ ఫోన్ చేయొచ్చనుకుంటాను."
నిర్వికల్పి సమాధిలో వున్న అమ్మని చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి.... ఇక్కడ సమస్య చావు బ్రతుకులు కావు....అది నిర్దారించేది కాలం. కానీ కనీసం ట్రీట్ మెంటైనా ఇప్పించలేని ఆ స్థితిలో సుకృతి అలోచిస్తున్నది డబ్బు గురించి మాత్రమే. తన దగ్గరున్న నగలు అమ్మినా పదిహేను వేలకి మించిరాదు. అసలు అమ్మ చాలాసార్లు ఫోర్స్ చేసినా తానెప్పుడూ నగల మీద ఆసక్తి చూపించలేదు. చూపించే వుంటే ఇప్పుడు కొంతైనా పెట్టుబడి కాగలిగేది. డబ్బుకోసం ఇలా ఆలోచించాల్సిన అవసరమూ ఒకటుంటుందని తెలీని సుకృతి వెళ్ళిపోతున్న డాక్టరుని చూస్తూ వుండిపోయింది చాలాసేపటిదాకా.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అడిగింది అలివేలు.
"అమ్మ బ్రతుకుతుందా లేదా అని కాదాంటీ.....అసలు ట్రీట్ మెంట్ ఇప్పించలేని స్థితిలో అమ్మ చనిపోతే నేను బ్రతికినంతకాలం తట్టుకోలేను" దుఃఖోద్విగ్నంగా అంది సుకృతి. "అందుకే ఆలోచిస్తున్నాను."
"ఏమిటి?"
"నేను....." సంకోచంగా క్షణం ఆగి అంది సుకృతి.
"నేను కూడా సినిమాల్లో నటించాలనుకుంటున్నాను."
విభ్రమంగా చూసింది అలివేలు కాదు ఉద్రేకంగా సుకృతిని సమీపించింది. "నీకు పిచ్చిపట్టిందా.....వద్దమ్మా వద్దు..... ఈ మాయా ప్రపంచంలో నువ్వు యిమడలేవు. ఇమిడినా తర్వాత నెగ్గుకురాలేవు. నా మాట విని ఏ పెళ్ళో చేసుకుని సుఖంగా బ్రతికెయ్. అంతవరకూ నేను నాశనమౌతూనైనా నీకింత తిండి పెడతాను."
"నేను ఆలోచిస్తున్నది నాకోసం కాదాంటీ..... అమ్మ గురించి.....అమ్మను రక్షించుకోవటానికి అవసరమైన డబ్బు గురించి."
"అమ్మా సుకృతీ" నచ్చ చెప్పాలని ముందుకు రాబోయిన అలివేలుని అర్దోక్తిగా వారించింది సుకృతి.
"ఆంటీ! నా గురించి అమ్మ ఎంత తపించిందీ నాకు బాగా గుర్తు......అమ్మ రక్తంతో రూపుదిద్దుకున్న నేను ముందు ఉపయోగపడాల్సింది అమ్మకి మాత్రమే. దానికోసం నాకు నేనుగా ఆహుతైపోతేనేం..... అసలు ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది రేపు గురించి కాదాంటీ....ఈ రోజు అమ్మ గురించి.....అంతే. అయినా నేనూ పతనమైపోయిన చాలామంది అమ్మాయిల్లో ఒకత్తిని అవుతానని ఎందుకనుకుంటున్నావ్...." అన్ని మార్గాలూ మూసుకుపోయిన ఆ క్షణంలో సుకృతి అంతకుమించి ఆలోచించలేక పోయింది. ఎలా ఆలోచించగలదని....అలాంటి అవసరం లేకుండా ఇంత కాలమూ పెరిగిన అమ్మాయి మరి.
ఆ సాయంకాలమే సూరికి ఫోన్ చేసింది సుకృతి.
ఇరవై నాలుగు గంటలు పూర్తికాక ముందే సుకృతి ఇలా ఫోన్ చేయడంతో ఉత్సాహంగా వచ్చాడు సూరి.
ఇద్దరూ మేనకా రెస్టారెంటులో కూర్చున్నారు. అక్కడ సందడిని గమనించే స్థితిలో లేదామె. "నేను మీ ఆఫర్ ని అంగీకరిస్తున్నాను సూరి గారూ.....అయితే మీకు స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఒకటుంది. నేను నటిని కావటానికి ఒప్పుకుంటున్నది నా కోసం కాదు. అమ్మకి అవసరమైన డబ్బు కోసం. ముందు ఓ పాతిక వేలు నాకు యిస్తే...."
విస్మయంగా చూశాడు. "ముందుగా పాతికవేలు కావాలా? బహుశా డబ్బులో పెరిగిన మీకు డబ్బు విలువ తెలీదనుకుంటాను. అసలు అవకాశం దక్కడమే ఓ అదృష్టమనిపించే ఈ ఫీల్డులో మీరు కావాలీ అంటే అందాకా ఓ అయిదారు వేలు అడ్వాన్స్ గా యిప్పించగలను."