Previous Page Next Page 
డాళింగ్ పేజి 7

 

    ఆ మాతకైనా తల వెనక్కి తిప్పి, తనకు విమల్ జవాబు చెప్తాడేమోనని ఆశించింది మాధురి.
    విమల్ సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నాడే తప్ప సమాధానం ఇవ్వలేదు.
    ఏమిటీ నిర్లక్ష్యం?
    కోపంతో ఆమె బుగ్గలు ఎరుపెక్కిపోయాయి. అసలే మేకప్ తో ఎర్రగా ఉన్న ఆమె బుగ్గలు , ఇంకా ఎర్రగా తయారయాయి.
    "మిస్టర్ విమల్, స్టాప్ ది కార్......." గట్టిగా అరిచింది.
    ఆ మాటకు సడెన్ గా కారు బ్రేక్ వేసాడు విమల్. తల వెనక్కి తిప్పాడు.
    "ఎందుకా అరుపులు......ఎయిర్ పోర్టు కు వెళుతున్నామని చెప్పానుగా......"
    "ఎయిర్ పోర్టుకి ఎందుకని అడుగుతున్నాను."
    విసురుగా అడిగింది మాధురి.
    "ఎయిర్ పోర్టుకి ఎవరూ సరదాగా వెళ్ళరు" గేరు మారుస్తూ అన్నాడు విమల్.
    కోపం.....టెన్షన్
    ఏం చేయాలో పాలుపోక, వెనక సీటుకి చేరబడిపోయింది మాధురి.
    అక్కడికి కోయంబత్తూర్ ఎయిర్ పోర్టు అయిదు కిలోమీటర్లు దూరంలో ఉంది.


                                              *    *    *    *

    ఎయిర్ పోర్టు పార్కింగ్ ప్లేస్ లో కారాపాడు.
    లోనికి నడిచాడు.
    రెగ్యులర్ గా షూటింగ్ లకు ఊటీ, రావడం వల్ల , ఎయిర్ పోర్టులో కొంతమంది అఫేషియల్స్ తో పరిచయం ఏర్పడింది విమల్ కి.
    దానికి తోడూ ---
    సినిమా హీరో గ్లామర్ ఉండనే వుంది.
    లక్కీగా మద్రాస్ ప్లయిట్ వెళ్ళడానికి ఇంకో ఇరవై నిమిషాలే టైముంది.
    టిక్కెట్ మానేజ్ చేసి తీసికొచ్చి, మాధురి చేతిలో పెట్టాడు.
    "ఎందుకీ టిక్కెట్ .....సడన్ గా నేనెందుకు మద్రాస్ వెళ్ళాలి..." మాధురి గొంతు, ఆమెలో రగులుతున్న కోపానికి నిదర్శనంగా వుంది.
    "మీ డాడీకి సీరియస్ గా వుంది. ఇంటెన్సివ్ యూనిట్లో వున్నారు. మీకు ట్రంక్ కాల్ వచ్చినా , టెలిగ్రాం వచ్చినా షూటింగ్ ఆగిపోతుందన్న ఉద్దేశ్యంతో మీకా విషయం చెప్పలేదు. ప్రొడక్షన్ వాళ్ళు నాకా విషయం చెప్పిన మరుక్షణం ......మీ దగ్గర కొచ్చాను" అన్నాడు విమల్ ఒకింత అసహనంతో.
    ముందేం విన్నది మాధురికి అర్ధం కాలేదు. అర్ధం కాగానే షాక్ తిన్నది.
    "డాడీకి సీరియస్ గా వుందా, ఫోన్ మెసేజ్ వచ్చినా నాకెవరూ చెప్పలేదా.....ఎందుకు చెప్పలేదు" అకస్మాత్తుగా ఆమె గొంతుబొంగురు పోయింది.
    కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి.
    అప్పటికే స్పీకర్ లో రెండో ఎనౌన్స్ మెంట్ విన్పిస్తోంది.
    "గో క్విక్ ......ఏమైనా అర్జంటుగా అవసరం వుంటే నాకు ఫోన్ చేయండి..డోంట్ ఫీర్. ఎవ్విరి థింగ్ విల్ బి అల్ రైట్......."
    అప్పటికే మాధురి మనసంతా దుఖంతో ముద్దలా అయిపొయింది . గబుక్కున సెక్యురిటీ చెకింగ్ వేపు పరుగెత్తింది.
    అక్కడ నుంచి మరో రెండు నిమిషాల తర్వాత రన్ వె మీదకు పరుగున వెళ్ళడం లాంజ్ లో నిలబడ్డ విమల్ కు కన్పిస్తూనే వుంది.
    కాసేపటికి విమానం గాల్లోకి లేచింది.
    లాంజ్ లో నుంచి బయటకొచ్చి , కారు దగ్గర నిలబడి , మేఘాల మాటున మచ్చలా కన్పిస్తున్న విమానం వేపు చూసి సంతృప్తిగా -
    కార్ డోర్ తెరిచాడు.
    డ్రైవింగ్ సీట్లో కుర్చోబోతున్న విమల్ అ ప్రయత్నంగా వెనక్కి చూసాడు.
    బేక్ సీట్లో ఓ మూల మాధురి తల్లోంచి రాలిపడ్డ సన్నజాజి మాల.
    చేతుల్లోకి తీసుకుని వాసన చూసాడు.
    గుప్పుమన్న మధురమైన వాసన.
    అతని మనసెందుకో ప్రశాంతంగా హాయిగా వుంది.


                                                *    *    *    *

    పది నిమిషాలు గడిచాయి.
    ప్లయిట్ లో , తన సీట్లో కూర్చున్న మాధురి ఆలోచనలు ఒక్కసారిగా తండ్రివేపు మళ్ళాయి.
    డాడీ!
    తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అప్పటినుంచీ అన్నీ తనే అయి పెంచాడు.
    తనలో తన తల్లిని చూసుకుంటూ - మురిసిపోయే తండ్రి, ఇప్పటికి ఆమె జ్ఞాపకాల్లోనే బతుకుతున్నాడు.
    ఇవ్వాళ -
    ఇండియాలో ఓ పెద్ద ఫ్యాన్ల కంపెనీకి, అధిపతిగా సంఘంలో పేరూ పరపతి పొందినా,
    లక్షల ప్రాపర్టీ సంపాదించినా ,
    చిత్తు కాగితాలను భుజాల మీద మోసుకుంటూ , గల్లీ, గల్లీ తిరిగిన రోజుల్ని అతను మరిచిపోలేదు.
    వచ్చే సంపాదన చాలక, అర్ధాకలి తీరక రోడ్డు పక్క కుళాయి దగ్గర నీళ్ళు తాగిన రోజుల్ని అతను మర్చిపోలేదు.
    కూతురంటే అతనికి ప్రాణం.
    కూతురు మాధురి ఇష్టాయిష్టాల్ని ఎప్పుడూ కాదనలేదు.
    అతనికి కూతురే ప్రాణం.
    కూతురికి తండ్రే జీవం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS