హీరో విమల్ ని ముందు చూసి నవాడు ప్రొడ్యుసర్. గంట ముందు షూటింగ్ స్పాట్ కి వచ్చేసిన హీరోని చూడగానే ప్రొడ్యుసర్ ముఖం వెలిగిపోయింది.
కంగారుగా నవ్వుతూ "రండ్రండి" అన్నాడు. కానీ ఆ మాటల్ని వినిపించుకోలేదు విమల్.
నేరుగా అతని చూపులు మాధురి మీద ఉన్నాయి.
విసురుగా , సెట్లో ఉన్న మాధురి వేపు నడిచాడు ----రెక్క పుచ్చుకుని,
"మాధురి డోంట్ అస్క్ ఎనీ క్వశ్చన్స్ ......కమాన్ క్విక్........" చెయ్యి పట్టుకుని కిందకు తీసికెళ్ళి పోతున్న హీరో విమల్ వేపు , మాధురి వేపు.........
బొమ్మల్లా చూస్తున్నారు యూనిట్ లోని వ్యక్తులు.
మాధురి క్కూడా ఏం అర్ధం కాలేదు.
వాట్ సర్......ఏం జరిగింది ........ముందు చెప్పండి........." అతని చేతిలో నున్న తన చేతిని విదిపించుకోడానికి ప్రయత్నిస్తూ అంది మాధురి.
విమల్ బలమైన చేతులు మాధురిని వదల్లేదు.
ఇద్దరూ కిందకు దిగారు.
కారు బ్యాక్ డోర్ తీసి, మాధురిని నెట్టేసి, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
మరొక్క సెకండ్ లో ఆ కారక్కడ లేదు.
డైరెక్టర్, ప్రొడ్యుసర్, బాల్కనిలో ఆ సీన్ ని స్పష్టంగా చూసారు.
డైరక్టర్ వేపు ప్రొడ్యుసర్ అర్ధం కాని చూపుల్తో చూసాడు.
"ఏవయ్యా డైరెక్టరూ........మన సినిమా రావణాసురుడి బర్త్ డే నాడు స్టార్ట్ చేసావేమిటయ్యా......నవ్వూ, ఏడుపు కాని గొంతుతో అడిగేడు ప్రొడ్యుసర్.
"చూస్తుంటే అలాగే ఉంది. మంచాడు, మంచోడని నెత్తి కెక్కి కూర్చున్నాడట ఒకడు.........అలాగే ఉంది హీరో వ్యవహారం. " డైరెక్టర్ అన్నాడు ఒకింత అసహనంగా.
"హీరో గారు ప్రేమలో పడ్దాడేమో........." ప్రొడ్యుసర్ తాలూకూ మనిషి అన్నాడు.
"మన హీరోనా........ప్రేమలో పడ్డాడా......అది కాదులే .......ఇంకేదో అయుంటుంది........" డైరెక్టర్ అన్నాడు ఏదేదో ఊహించుకుంటూ.
"విమల్ అంటే మొదట్నుంచి మీకు సింపతీ ఉంది......ఎందుకో ఏమిటో......నాకేం అర్ధం కాదు" ప్రొడ్యుసర్ అన్నాడు.
"నా డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న హీరో అంటే నాకు సింపతి ఉండదా........ప్రోడ్యుసర్స్ కి అలాంటి ఫీలింగ్స్ ఉండవేమో గానీ డైరెక్టర్స్ కి ఉంటాయి లెండి.........
కుర్చీలో కూలబడుతూ అన్నాడు డైరెక్టర్.
ప్రొడ్యుసర్ తల పట్టుకుని కూర్చున్నాడు.
* * * *
కారు ఉటీ నుంచి కోయంబత్తూర్ వెళ్ళేదారిలో పరుగులు పెడుతోంది.
కారు డ్రైవ్ చేస్తున్న విమల్ వేపు చూసింది మాధురి.
ఎందుకు? ఎక్కడికి? ఏమిటి?
ఈ మూడు ప్రశ్నలకు ఆమెకు జవాబులు కావాలి.
తను యాక్టు చేసిన హీరోల్లో విమల్ అంటేనే ఆమెకు ప్రత్యెక గౌరవం ఉంది --- డిగ్నిఫిడ్ గా ఉంటాడని. క్రితం రోజు నుంచి అకస్మాత్తుగా విమల్ లో కలిగిన మార్పుకి కారణం ఏమిటి?
అతని వ్యక్తిగత జీవితంలో ఏవో గొడవలున్నాయని చూచాయగా వినడం తప్పించి, స్పష్టంగా తెలియవు.
ప్రస్తుతం అతని మానసిక స్థితికి, ఆ గొడవలేమైన కారణమా?
ప్రస్తుతం తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు విమల్?
"విమల్ .......ఎక్కడికి వెళ్తున్నాం మనం."
చలిగాలిని జివ్వున కోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గాలి శబ్దానికి మాధురి అడిగిన ప్రశ్న, విమలకు వినబడలేదు.
ఏమిటి, మనిషి ఇలా తయారయ్యాడు----తనలో తాను అనుకోని భుజాల నిండుగా పైట కప్పుకొని, విండో మిర్రర్ లోంచి సర్రున వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్న ప్రకృతిని చూస్తూ కూర్చుంది.
బొటనికల్ గార్డెన్స్ రోగ్ హౌస్, రేస్ కోర్స్ అటూ ఇటూ పచ్చగా పరచకున్న టీ ఎస్టేట్స్ మధ్యలోంచి కారు వెళ్తోంది.
"హలో......ఎక్కడకు వెళ్తున్నామో తెల్సుకోవచ్చా......." ముందు సీట్లో కి వంగి గట్టిగా అడిగింది మళ్ళీ మాధురి.
"ఏదో ప్రమాదం జరిగిపోతున్నట్లు అలా అరవక్కర్లేదు . ఎయిర్ పోర్టు కేళ్తున్నాం....."తల తిప్పకుండానే జవాబిచ్చాడు విమల్.
"ఎయిర్ పోర్టుగా.....ఎందుకు......?"
సమాధానం చెప్పలేదు విమల్.
మాధురి మనసులో ఎన్నెన్నో జవాబులేని ప్రశ్నలు.
షూటింగ్ కేన్సిల్ చేయించి, అకస్మాత్తుగా ఎయిర్ పోర్టు కెందుకు తీసికేళుతున్నాడు?
విమల్ కి ఏమౌతోంది?
"ఎయిర్ పోర్టు కెందుకు?"
ఆ ప్రశ్న వేసిన మధురి వేపు తలతిప్పి చూసాడు. అంతే .......జవాబేం చెప్పలేదు.
మాధురికి కోపం వచ్చింది.
"నిన్న సడన్ గా అవుటాఫ్ మూడ్ లో కెళ్ళిపోయి షూటింగ్ కాన్సిల్ చేయించారు. జరిగిందేదీ తెలియకుండా మీ ధ్యాసలో ,మీరున్నా, ప్రొడ్యుసర్ ఎంత బాధపడ్డారో మీకు తెలీదు. ఇవాళ మీ వల్లే మళ్ళీ షూటింగ్ కాన్సిల్ అయింది. మీ కెరీర్ గురించి మీరే మాలోచిస్తున్నారో నాకు తెలీదు. కానీ మీవల్ల నా కెరీర్ ని పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. అర్ధమైందా...సీరియస్ గా గట్టిగా అంది మాధురి.
