ఫక్కున నవ్వింది. పద్మ. అతన్ని వక్షానికి అదుముకొని "ఛ అలాగ అనవొచ్చునా, మిమ్మల్ని బట్టి కదా నాకున్న విలువా, పలుకుబడీ, ఉదయం నుండి రాత్రి వరకు ఇన్ని పనులు చూచుకోగలుగుతున్నానంటే అదంతా మీరిచ్చిన బలమే కదా?" అంది.
ఆమె కళ్లల్లో మెత్తని వెలుతురు తడి తడి నేలమీద నీరెండలా మెరిసింది. కాని సీతాపతి అదేమీ గమనించలేదు. ఆ మాటలోని అర్ధమూ, వాటిలో వ్యక్తమైన అపార ప్రేమా అతను తెలుసుకొనే స్థితిలో లేడు. విద్రోహ బుద్దితో నిండిపోయింది సీతాపతి మనస్సు. అరబ్ దేశాలలో అర్ధరాత్రికి అర్ధరాత్రి coup (కూప్) జరిపే సేనానాయకుల ప్రవృత్తి అతనిలో భీకరంగా ప్రబలిపోయింది.
అతను కోరినవి తినేందుకు వీల్లేదు. డాక్టర్ నిషేదం వుంది. అతని దినచర్య అతని వశంలో లేదు. డాక్టర్ అంతా యేర్పరచివుంచాడు. దాన్ని తూ.చా తప్పకుండా పద్మ అమలు జరుపుతుంది. అతనికి తనకేమీ రోగం లేదని గట్టినమ్మకం. కాని పద్మకి నమ్మకం లేదు. అజీర్ణంకాని అస్వస్తతకాని ఏమైనా వుంటే నిర్వ్యాపారత్వం వల్ల కలిగిన ఫలితం అని అతని ఉద్దేశ్యం. దేశంలో ఖండాతరాలలో వ్యాపించే రోగాలన్నీ కూడబలుక్కుని అమాయకుడైన అందగాడైన తన భర్త దేహంలోకి ప్రవేసిస్తాయేమో అని ఆమె కాపలా కాస్తూంటుంది.
ఓసారి అతని క్లబ్బు మిత్రులతో కలకత్తా షికారు వెళ్ళిరావాలని అనుకున్నాడు. ఎంతో ఉత్సాహంతో పద్మతో చెప్పాడు. పద్మ మొహం వెలవెలబోయింది. డాక్టరుని పిలిపించింది.
"మీ ఆయనకి విశ్రాంతి అవసరం - ఇలాగ ఎండలో ప్రయాణం చేయడం మంచిదికాదు" అన్నాడు డాక్టరు.
సీతాపతి వొళ్ళు మండిపోయింది. తనకి వున్నదే విశ్రాంతి. ఆ విశ్రాంతి బరువుకింద అతను నలిగిపోతున్నాడు. వ్యంగ్యంగా మంటగా యిలా అన్నాడు.
"డాక్టర్, చేతనత్వం లేకుండా వుంటే విశ్రాంతి బాగా లభిస్తుంది. అలా మార్చివేయండి గట్టిమందిచ్చి. మీకూ పద్మకీ కూడా విశ్రాంతి వస్తుంది."
డాక్టరు చనువుగా తెలివిగా నవ్వాడు. " అమ్మాయ్, చూశావా చిరాకు, Nerves! n\Nerves!- నాకు నీ మీద కక్ష ఏముందోయ్ సీతాపతి. అంతగా వెళ్ళాలని వుంటే అమ్మాయిని కూడా తోడు తీసుకువెళ్ళు. ఇవీ అవీ తింటూంటే ప్రయాణంలో చటుక్కున ఏ డయాబిటిస్ లోకో., గాస్ట్రిక్ ట్రబుల్ లోకో దింపుతుంది. మన జాగ్రత్త లో మనం వుండాలి. దేశానికీ దేహానికీ ఎప్పుడూ గట్టి డిఫెన్సు ఉండాలి" అన్నాడాయన. పద్మకి పదేళ్ళ నుండి ఫామిలీ డాక్టరాయన. వయస్సు అరవై దాటడం వలన ఆయన అనుభవజ్ఞుడనీ ఆయన చెప్పిన మాటలకి ప్రత్యేక విలువ ఉందనీ పద్మ నమ్మకం.
తాను మిత్రులతో కూడా కలకత్తా సరదాగా వెళ్ళిరావాలని అనుకుంటూవుంటే భార్య నికూడా తోడు తీసుకువెళ్ళమన్న డాక్టరు సలహాలోని అవమానమూ, అవహేళనా సూదులు గుచ్చినట్లు బాధించింది సీతాపతిని. అసలు ఈ డాక్టరూ, పద్మ కలిసి ఏదో కుట్ర చేసి ముందుగానే -పెళ్ళికాకముందే -నిషేధాల పట్టీ తయారుచేసి తన మీద ప్రయోగించి తనని అస్వతంత్రుడినీ, అసహాయుడినీ చేస్తున్నారని గట్టిశంక కలిగింది సీతాపతికి. ఈడాక్టర్ని - వద్ధ జంబుకాన్ని కడతేరిస్తే గాని తన వొళ్ళూ తన మనసూ తనది కాదని నిశ్చయం చేసుకున్నాడు.
2
కమ్యూనిజం యొక్క సిద్దాంతాలు తెలిసినవాళ్ళకి తెలుస్తున్నవి Expoitation- అంటే పరపీడన -అంటే ఏమిటో, చావకుండా బ్రతకకుండా మార్క్సిజం క్షుణ్ణంగా చదవి దాని నిజానిజాలు తనమీద ప్రయోగాత్మకంగా ఋజువు చేసుకొంటోందా అని సందేహించాడు. అయితే అతనూ నాలుగూ చదువుకున్నవాడూ, నేర్చుకున్నవాడూను. ధనికవాదుల్నీ, సామ్రాజ్యవాదుల్నీ మంచితనంద్వారా మనసు మార్చలేమని మార్క్ తెగేసి చెప్పాడు. దీనికి విప్లవమూ, హింసాయుతమైన తిరుగుబాటు ఒకటే మార్గం.
అందుకే సాహసుడైన సీతాపతి అయిదు హత్యల్ని చేయాలని సంకల్పించాడు. కాని ఏ ఒక్కటీ కూడా చేయలేకపోయాడు. ఇందుకు పిరికితనం మాత్రం కారణం కాదు. రేగిన ముంగురులతో, సోగకళ్ళతో ఎర్రని రెండు చిన్న పెదవులతో "ఏమండీ" అని ఎంతో ముద్దుగా పిలిచే లాలించే భార్యని మీదకురికి. మెడవాటేసుకుని పీక గబుక్కన నొక్కి ఠపీమని చంపివెయ్యడం మరీ ఘోరంగానూ భారతీయ సంప్రదాయానికి సంపూర్ణ విరుద్ధంగానూ అనిపించింది అందులో పద్మవంటి పద్మాన్ని ఏ కఠోర హస్తం అయినా నలిపి రేకుల్ని తెంచీ పారవెయ్యగలదా?
ఈ సమస్య పరిష్కారం మార్క్సిజంలో లేదని గ్రహించాడు సీతాపతి. ఒక్క గాందీజం ఒక్కటే అటువంటి క్లిష్ట పరిస్థితిలో దారిని చూపించగలదు! భారతదేశం ధర్మాన్ని విడిచిపెట్టితే తాను భారతదేశాన్నే విడిచి పెట్టి వెళ్ళిపోతానన్నాడు గాంధీజీ. అదేమార్గం ఇప్పుడనుసరణీయం తోచింది సీతాపతికి. పద్మనీ, పద్మయిచ్చే సౌఖ్యాన్నీ, భోగాల్నీ, భద్రతనీ, విడిచి తన వ్యక్తి స్వాతంత్ర్యం రక్షణార్ధమై వెళ్ళిపోవాలనుకున్నాడు.
ఆషాడ శుద్ధ ఏకాదశీ సోమవారంనాటి సాయంత్రం పద్మతో క్లబ్బుకి వెళుతున్నానని చెప్పి తిన్నగా రైలుస్టేషనుకి వెళ్ళిపోయాడు సీతాపతి. అంతకు ముందురోజున భార్య తన జేబులో పెట్టిన పదిరూపాయల నోటు ఒక్కటే వుంది సీతాపతి దగ్గర ఏవూరు వెళ్లాలో ముందే ఆలోచించుకున్నాడు. పెళ్ళి కాకముందు విద్యానంతరం తన సహాధ్యయుడైన రామకోటితో కలిసి అతని వూరు వెళ్ళాడుట. ఎంతో అందమైన వూరది! పెద్ద చెరువూ, కొబ్బరితోటలూ, అరటితోటలూ, స్వచ్చమైన పుష్కలమైన గాలీ, ఆ గాలిలాంటి సుఖమైన మనుష్యులూ, పెద్ద కోవెలా, కోవెల నానుకొని వున్న సత్రమూ -ఆవూళ్ళో ప్రశాంతంగా తన శేష జీవితం గడపాలనుకున్నాడు. రామకోటి ఆనాడన్నాడు యిలాగ. "ఒరేయ్ సీతాపతి ఏదేనా ఉద్యోగం దొరికేవరకూ ఈ వూళ్ళోవుండి ట్యూషన్లు చెప్పుకోరాదూ. దగ్గర్లో హైస్కూలు, కాలేజీ లేవు. ఎందరో ధనికులు బిడ్డలు మెట్రిక్ కీ, బెనారస్ పరీక్షలకీ ప్రైవేటుగా కట్టాలని వుబలాటపడుతున్నారు. నెలకి రెండు వందలు దొరుకుతాయి నీకు శ్రద్ధ వుంటే"
