Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 64

   
    "ఆ బొమ్మంటే మీ కిష్టంలేదని తెలిసికూడా కొనడం నాదే పొరపాటు. పోనీ బొమ్మ బద్దలైనంత మాత్రాన వచ్చిన నష్టం ఏవిటీ. ఈసారి మీకు నచ్చిందే కొంటాను "అంది.

    సీతాపతి గదిలోకి వెళ్ళిపోయాడు. జుట్టు పీక్కున్నాడు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అనుకుంటూనే నిద్రపోయాడు. ఆమె వచ్చి కాశ్మీర శాలువ కప్పడమూ, కాళ్ళు వొత్తడమూ అతను నిద్రలో కూడా అలవోకగా గుర్తించాడు.

    మధ్యాహ్నం భోజనం చేసి, తను మంచంమీద వాలగానే వస్తాడు పక్కింటి వాళ్ళ అబ్బాయి వాడి పేరు రవి. గుర్రపు జూలులాంటి జుట్టు కళ్ళమీద పడుతుంది. సన్నని పెదాలు హేళన చేస్తున్నట్లుగా వుంటాయి. చిన్న లోతైన కళ్ళు తుపాకీ గుళ్ళులా వొంట్లోకి గుచ్చుకుంటాయి. తీరికగా, బద్ధకంగా, రాజకుమారుడిలా వస్తాడు. ఇటూ అటూ చూస్తూ నవ్వుతాడు. నవ్వి "మా అమ్మ నన్ను తిట్టింది" అంటాడు.

     "ఏం?" అడిగాడు సీతాపతి

    "ఏవనీ?"

    "పనీ, పాటలేకుండా పద్మమ్మ మొగుడిలా తయారవుతున్నావు వెధవా అంది" అన్నాడు నీచోపమకి బాధపడుతున్నట్టుగా. సీతాపతి కోపంతో "నిద్రవస్తోంది వెళ్ళు" అన్నాడు.

    "పద్మత్త మీరు నిద్రపోకుండా చూస్తూండమని చెప్పింది. డైజషన్ బాగాలేదట కదూ"

    వొళ్ళుమండి మరోవైపు తిరిగి పడుకున్నాడు సీతాపతి. రవి లేచి యిటూ అటూ తిరిగి "రోజూ నడవకూడదూ మీరు! అన్నమరుగుతుంది. మా సైన్సు వాచకంలో వాకింగ్ చాలా మంచిదని రాశారు" అన్నాడు.

    సీతాపతి జవాబివ్వలేదు. ఈ కుర్ర వెధవకి తనింత లోకువ ఎందుకైపోయానా అనుకున్నాడు.

    "మీకి ఉద్యోగం ఎవరూ యివ్వరాండీ మీకు చేతకాదా?"

    "విసిగించకు ఫో" అని గట్టిగా అన్నాడు సీతాపతి. మామూలుగా అడిగితే అంత బాధ లేకపోను. కాని వీడు అడగడంలో, ఆగొంతులో, ఆ మాటల్ని మెల్లగా వెడల్పుగా ఉచ్చరించడంలో ఒక అవహేళన, భరించరాని అసహ్యం ఉన్నాయి.

    "మేం రోజూ చెడుగుడు ఆడుకుంటాం. మీరుకూడా వచ్చి ఆడకూడదూ."

    సీతాపతి కోపంగా చూసి "హూ" అన్నాడు.

    మళ్ళీ బల్లి నవ్వినట్లు నవ్వి "అదీ రాదా, షేమ్ షేమ్" అన్నాడు రవి.

    సీతాపతి కోపం పట్టలేక మంచంమీదనుంచి దూకడమూ, రవి పారిపోవడమూ ఒకేసారి జరిగాయి.

    రవి వచ్చినప్పుడల్లా ఈ మాటలే యీ సంఘటనలే పాఠాంతరాలు పొంది ప్రదర్శిత మవుతుంటాయి. మెట్లమీద వాడి అడుగులు చప్పుడు వినపడగానే సీతాపతి వొళ్ళుభయంతో, అసహ్యంతో ముడుచుకుపోయింది. వాడు తన మేడ పిట్టగోడ నానుకుని నుంచున్నప్పుడు వెనకాలే వెళ్ళి అమాంతంగా వాడి రెండు కాళ్ళూ ఎత్తి కిందికి పడవెయ్యాలన్న ఉబలాటాన్ని ఎంతో కష్టంమీద అణుచుకొన్నాడు సీతాపతి.

    మధ్యాహ్నం కునుకుతీసి లేవగానే పోస్టుమాన్ కేక వినపడుతుంది. సీతాపతి గబగబా మెట్లు దిగుతాడు. అప్పటికే పద్మ కూడా గుమ్మం దగ్గరకు వచ్చి నిలుచుంటుంది.

    పోస్ట్ మాన్ సీతాపతి చూచినవ్వి "మీకేమీ లేవండి సార్. అన్నీ అమ్మగారికే" అంటూ ఓ దొంతర ఆమెకిస్తాడు.

    పద్మ వాలిపోయిన సీతాపతి మొహాన్ని చూసి "అదేమిటోయ్. ఆయన్ని బట్టిగదా నాకీ ఉత్తరాలు వచ్చేది? నే నాయన సెక్రట్రీని" అంటుంది.

    "ఆయనకేం మహారాజు. హాయిగా తిని పడుకుంటే దొరలా వెళ్ళి పోతుంది మా దొడ్డజాతకంలెండి అయ్యగారిది" అని పోస్టుమాన్ చిరునవ్వుతో వెళ్ళిపోతాడు.

    అతనెంత మంచి మనస్సుతో అన్నా ఆ మాటలన్నీ ఈటెలై సీతాపతి అభిమానపు గుండెలో గుచ్చుకుంటాయి. గబగబ లోపలికి వెళ్ళో సోఫాలో దిగులుగా కూర్చుంటాడు. పద్మ బెదురుగా మెల్లిగా లోపలికి వచ్చి "ఏవండీ, వీటికి జవాబులు రాసిపెట్టకూడదూ" అంటుంది అతన్ని సంతోషపరుద్దామని.

    "నేను రాయను. రాయాల్సిన అవసరం నాకేమీ లేదు. అసలు ఆ ఉత్తరాలెందుకో, సంగతీ సందర్భాలేమిటో నాకేం తెలుస్తుంది?" అంటాడు పెడసరంగా సీతాపతి.

    అతనికెవరూ ఎందుకు ఉత్తరాలు వ్రాయరో అతనికి అంతుపట్టదు. తాను వ్రాసిన ఉత్తరాలకి కూడా భార్య పేర జవాబు వస్తుంది. కర్మ! "మీ ఆయన కోరిన పుస్తకం ఈ వూళ్లో లైబ్రరీలో కాని, బుక్ స్టాలులోకానీ లేదు. అని చెప్పవలసింది" ఇలా వుంటాయి జవాబులు. ఏడాది పొడుగునా అతనెంతమందికి ఎన్ని ఉత్తరాలు వ్రాసినా, ఒక్క యిన్సూరెన్సు కంపెనీ వాళ్ళు మినహా అతని పేరు వ్రాయరు.

    ఓసారి పద్మ వచ్చే ఎన్నికలని తలచుకొని "ఏవండీ మీరు ఓటెవరికి వేస్తారు?" అంది.

    "నాకు ఓటు వుండదు" అన్నాడు మూతి బిగించి సీతాపతి.

    "ఏం?"

    "నేను మైనరుని. కేరాఫ్ పద్మ దేవిగాడిని."
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS