"అతను దేన్నో మరిగాడు. నాకు శానా కోపం వచ్చింది. నీకింటి దగ్గర దెబ్బలు తిని శాకిరి సెయ్యడానికి నేనేం యెదవని కానని చెప్పి నా నగలూ డబ్బు తెచ్చుకుని వేరే వెళ్ళిపోయాను."
"ఇప్పుడు కలుసుకున్నారా మళ్ళీ -"
"ఆడిని ఒగ్గేశాను."
నేను తెల్లబోయి చూస్తున్నాను.
"అదేంటలా చూస్తావ్! యిష్టంలేని వాడితో కాపురంచేసి ఏడుస్తూ ఛావనా? నాదగ్గర అటువంటిది లేదయ్యోయ్. బతికినన్నోళ్ళు కులాసాగా బతుకుతా, నా కన్నాయం ఒహరుచేస్తే ఊరుకునేది లేదు."
"మరి యిప్పుడొక్కర్తివే వున్నావా?"
"నువ్వున్నావు కాదయ్యా., నీకోసమే వచ్చినాను. అబ్బ, నువంటే నేటికీ మనసే నాకు, పాడు మనసు....." గమ్మత్తుగా చూస్తూ పవిట కొంగు నోటికి అడ్డం పెట్టుకు నవ్వుతోంది.
"బాగుంది నీ హాస్యం" అన్నాను నేను సిగ్గుపడుతూ.
"బెజవాడ రైల్వేలో పనిచేస్తున్నాడు రాఘవులు. అతనితో వుంటున్నా" అంది మళ్ళీ.
"మనువా?"
"మనువూ లేదు శ్రాద్దంలేదు. నాకంటె సిన్నోడు. అయినా మా అందగాడు . స్టోర్సులో పనిచేస్తున్నాడు. నేనంటే వల్లమాలిన ఆపేక్ష రాఘవులికి. నొక్కులజుట్టుతో చిన్న పెదాలతో బలే అందంగా వుంటాడు" అంది ఆప్యాయత కళ్ళలో కనబడేటట్టు నేను లేచాను. కోర్టు పని వుంది ఇవాళ ఎన్నో కాగితాలు చూసుకోవాలి.
"ఇంకా ఉంటావా సుబ్బులూ"
"మాబాబుని చూసిపోదామని వచ్చాను. రేపో ఎల్లుండో వెళ్ళిపోతాను"
"ఓసారి మా ఇంటికిరా. మా ఆవిడకు కనిపించు" అంటూ అరుగు దిగాను.
"నే నెందుకొచ్చి చూస్తానూ నా సయితినీ! సర్లే ఒక్కసారైనా నా కోరిక తీర్చలేదు. అందమైన వాడినని నీకు గర్వం లేవయ్యా." నవ్వుతూ చేతులూపుతూ అంది.
వానలో తిరిగి యింటికి బయలుదేరాను. ఆమెలో ఆనందానికీ, ఆరోగ్యానికీ, నవ నవోన్మేషతకీ కారణం ఏఁవిటా అని ఆలోచిస్తున్నాను. జీవితాన్ని తేలిగ్గా సహజంగా తీసుకోవడమా! కృత్రిమమైన నీతులూ భయాలూ పెద్దరికాలూ అడ్డురాకపోవడమా? ఇఁత చదువూ డబ్బూ వుండి నాలో ఈ అసంతృప్తీ దిగులూ ఏఁవిటి! ఏదో చెయ్యలేకపోయానన్న వేదన, కలలు కాగితపు పేలికల్లా రాలిపోయిన క్షోభా, చెంపల దగ్గర నెరసిన జుట్టు క్రమంగా అంతటా తెల్లబడి ముసలివాణ్ణీ, మృత్యు పథాభిముఖుణ్ణీ అయిపోతున్నానన్న బెదురూ ఏమిటి యిదంతా? ఎక్కడ నేను జీవిత రహస్యాన్ని మరిచిపోయాను? ఏ సమయంలో జీవించడంలోని కీలకం జారిపోయింది. ఈమె - చదువూ, సంస్కారమూ లేని సుబ్బులు ముందు నేను చాతకానివాడిలా ఎందుకయిపోయాను?
బరువుగా బాధగా అడుగులు వేసుకుంటూ కర్రవంతెన దాటాను. కాలవవారనే జనం బాగా తిరుగుతున్నారు. వర్షానికి కాకులు తడుస్తూ చెట్ల కొమ్మల మీద వణుకుతూ కూర్చున్నాయి. మనసులో ఆలోచన హెచ్చినకొలదీ అడుగులు వేగంగా వేస్తున్నాను. జీవితపు పందెంలో ఓడిపోయినవాడిని -
(జ్యోతి, 1963)
*********
