"ప్రేమించాననీ, పెళ్ళిచేసుకుంటాననీ అన్నావు. పల్లెటూరిపిల్లననీ, ప్రతిమాటా నమ్ముతాననీ, ఏం చేసినా వూరుకుంటాననీ అనుకున్నావా!"
"......"
"ఏం మాట్లాడవేం?"
"అదికాదు బాలా, ఇలా జరుగుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో దేవుడికి తెలుసును."
"మరి -?"
"మావాళ్ళెవరికీ ఇష్టంలేదు. మీ కుటుంబానికీ మాకూ శత్రుత్వముందిట. మీ చిన్నాన్న మా నాన్నని చంపడానికొచ్చాడుట."
"ఇదివరకు నీకు తెలియదా?"
"తెలియదు"
"అది జరిగి ఇరవై ఏళ్ళయింది. ఇప్పుడు దెబ్బలాటలు లేవుగా. ఒక రిళ్ళకొకరు వస్తున్నారు. మాట్లాడుకుంటున్నారు...."
"అయినా మావాళ్ళెవరికీ ఇష్టంలేదు."
"మీవాళ్ళంటే......?"
"మా నాన్న, అమ్మా, మా అక్కయ్య, అన్నయ్య, మా మేనత్త..... ఆఖరికి మా పాలేరుకి కూడా"
"అయితే ఈ పళంగా ఎక్కడికేనా పారిపోదాం. నావంటిమీద నాల్గువేల బంగారం వుంది. నిన్ను వొదిలి వుండలేను"
"ఛ -ఛ ఇప్పుడెలాగ - నలుగురూ ఏమనుకుంటారు?"
ఆమె ఏడుస్తూ కూర్చుంది. బాల చాలా అందమైనది. అదొక విలక్షణమైన ఉజ్వలమైన అందం. అటువంటి అందం అన్నిచోట్లా కనుపించదు. నాకు బాధగా వుంది. నిజమే కాని యెంతమందిని ఎదిరించి, ఎన్ని అడ్డంకుల్ని దాటి నా భవిష్యత్తుని ఏంచేసి ఈమెని నాదాన్ని చేసుకోగలను? కోపంతో మరీ ఎరుపెక్కిన జీరలుగల కళ్ళుకల నాన్న మొహం, నిరసనతో చూసే అమ్మ మొహం, పద్దెనిమిదివేల కట్నంతో జడ్జిగారి సంబంధం, రాజకీయంగా వేసుకున్న ప్లానులు..... యివన్నీ ఏమవుతాయి?
"కిందికి వెళ్ళిపో బాలా, ఎవరేనా వొస్తారు" అన్నాను.
బాల కోపంగా లేచి నుంచుంది. వెన్నెల రేకలో ఆమె పెదవి వణకడం కూడా కనపడింది. కోపమూ ఏడుపూ కలిసిన కంఠంతో "నూతిలో పడి చద్దామనుకున్నాను. కాని తప్పు నీదికాదు నువ్వు మగవాడివి కాదు. నీకన్నా ఏ వెధవైనా వెయ్యిరెట్లు నయం" అని విసవిస వెళ్ళిపోయింది. స్తంభించిపోయిన నా లోపల్లోపల ఈ సమస్య యిలా పరిష్కారమైనందుకు సంతోషించానో, ఆమె దూరమైపోతున్నందుకు బాధపడ్డానో నాకు తెలియలేదు.
నాలుగేళ్ళ అనంతరం ఆమె చాలా జబ్బుతో జనరల్ ఆస్పత్రిలో వుందని తెలిసి మనసు పెట్టలేక వెళ్ళాను. నర్సు వచ్చి "మిమ్మల్ని చూడడానికి వీల్లేదంది ఆమె. మిమ్మల్ని పంపించివెయ్యమంది" అని చెప్పింది. నర్సును బతిమిలాడాను. ఆమె నా వల్లనే నా -కోసమే ఇలా అయిపోయిందన్న బాధతో, పశ్చాత్తాపంతో కాలిపోతున్నాను. చివరికి ఆమె దగ్గరకు వెళ్ళాను. వందకేరట్ల రత్నాన్ని చెక్కివెయ్యగా చెక్కివెయ్యగా మిగిలిన అణువులా ఆమె కృశించిన శరీరమూ మొహమూ మెరుస్తున్నాయి. నన్ను చూసి ఆమె పక్కకు తిరిగి పడుకుంది.
"బాలా"
ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది.
"నన్ను క్షమించు ఒకటి చెబుతున్నాను. ఏనాడూ నా హృదయం నుండి నువ్వు తొలగిపోలేదు. నేను పిరికివాణ్ణి. కాని ఆజన్మాంతం నిన్ను మరిచిపోను. మనసార నేను నీ వాడినే."
ఆమె చెయ్యి చేతిలోకి తీసుకున్నాను. నా మాటలు ఆమె నమ్మలేదు. అవిశ్వాసంతో, ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళతో నన్ను చూసింది. నాకు కన్నీరాగలేదు.
"వస్తాను బాలా" అని డగ్గుత్తికతో గబగబా ఆమెను విడిచి వచ్చేశాను.
ఒక నెల్లాళ్ళ తర్వాత ఆమె చనిపోయినట్లు తెలిసింది.
ఈ జ్ఞాపకాలతో నా వొళ్ళంతా వేడెక్కిపోయింది. ఊపిరాడనట్టనిపించింది. గది గోడలు దగ్గరగావచ్చి నన్ను నొక్కుతూన్నట్టు అనిపించింది. లేచి, గొడుగు తీసుకుని వీధిలోకి వచ్చేశాను. వాన ఇంకా కురుస్తూనే వుంది. స్వేచ్చగా విశాలంగా తిరిగివస్తేనేకాని ప్రాణం కుదుటపడుతుందనిపించలేదు. కాలవవారనే బయలుదేరి వెళ్ళుతున్నాను. కాలవ అవతల మా పొలాలున్నాయి. తెల్లవారిపోతోంది. వాననీటికి రాత్రి వొంటిరంగు కరిగి తెల్లబడుతూన్నట్టుగా వుంది. రేగడిమట్టి కాలిజోళ్ళకి అంటుకుని బరువుగా అడుగులు వేస్తున్నాను. చల్లనిగాలి రివ్వుమని తగులుతూంటే కొంత ఉత్సాహం కలిగింది. ఆకాశం మబ్బులతో నిండివుంది. కాలవవారనున్న చెట్ల ఆకులమీదనుంచి జల్లుమని జడి పడుతోంది. కాకులు అరుస్తూ అటూ ఇటూ పోతున్నాయి. కాలవ అవతలివైపున అరటి తోటలూ, వరిచేలూ పొడుగ్గా పరుచుకొని అందంగా ఉన్నాయి.
కర్రవంతెన వచ్చింది. వంతెనకింద కాలవ సుడి తిరుగుతూంటే కొంతసేపు చిత్రంగా చూశాను. వంతెన దాటి పొలంగట్టునే వెళుతూంటే "ఏమండోయ్" అన్న పిలుపు వినిపించింది. వీరన్న మామిడితోటలోంచి ఆ పిలుపు. తోటలో పైన గడ్డికప్పిన ఇటికల ఇంటి ముందరుగుమీద ఎవరో ఆడమనిషి నిలుచుంది. నన్నేనా అనుకున్నాను. తోటలోకి రెండడుగులు వేశాను. అరుగుమీద చామనచాయగా, బొద్దుగా, పొడిపొడిగా ఉన్న జుట్టు బుగ్గలమీద పడుతూంటే నవ్వుతూ సుబ్బులు. మంచి పొంకంగా, ఆరోగ్యంగావున్న యౌవనం అసూయని కలిగించేటట్టువుంది. సుబ్బుల్ని నేను చిన్నతనంనుంచీ ఎరుగుదును. ఐదోక్లాసు వరకూ నాతో కలిసి బళ్ళో చదువుకుంది. అయినా ఆమె నాకన్నా చిన్నదిగా చాలా చిన్నదిగా వుంది. పాతికేళ్ళంటే నమ్ముతారు సుబ్బులు వయస్సు.
"ఎప్పుడొచ్చావు సుబ్బులూ....?" అన్నాను నవ్వుతూ.
"రామయ్యా లోపలికి రా. వర్షంలో తడుస్తూ ఎంత సేపుంటావ్"
నేను తటపటాయించాను.
"ఎవరూ సూడ్డంలేదు. అబ్బో, మా పెద్దమనిషివైపోయావు" కనుబొమలెగరవేసి చేతులూపుకుంటూ అంది. నేను లోనికి వెళ్ళాను. సుబ్బులు ఇంట్లోంచి ఒక కుర్చీ తీసుకువచ్చి వేసింది.
"సిన్నప్పుడు నువ్వీదారిని యెల్తావుంటే చెరుకు పానకం ఇచ్చేదాన్ని, గ్యాపకం వుందా? ఎప్పుడేనా సాటుగా ముద్దెట్టుకుంటావేమో అనుకునేదాన్ని. అయ్యో రాత ఆ సరదాయేలేదు...." ఫక్కున నవ్వుతోంది.
నాకు సిగ్గుగా బెదురుగా వుంది. ఆమె ముందు నేను ముడుచుకుపోతున్నాను.
"అలా సిగ్గుపడుతూ కూర్చో, కాఫీ తీసుకొస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది. సుబ్బులు యాసనీ, నాగరికాన్ని కలిపి మాట్లాడుతోంది. అలాగే ప్రవర్తిస్తుంది. పట్టణాల్లో చాలాకాలం వుంది.
సుబ్బులు మొహంలో విచారం తాలూకు నీడకాని, వయస్సు తాలూకు నీరసంకాని లేదు. జీవితంలోంచి ఎంతో సుఖాన్నీ, స్వేచ్ఛనీ పొందినవాళ్ళు తప్ప అంత హాయిగా నవ్వలేరు. ఆమె నా కన్న మూడేళ్ళు చిన్నదైనా పదిహేనేళ్ళ చిన్నదిలా కనబడుతోంది. వింతగా ఆలోచిస్తున్నాను ఆమెను గురించి.
ఆమె కాఫీ తెచ్చి యిచ్చింది. కాఫీ మంచి రుచిగా వుంది. నా ఎదురుగా ముక్కాలిపీటమీద కూర్చుని జుట్టు విప్పుకుంది. నల్లనిజుట్టు వొత్తువొత్తుగా తరంగాలుగా పిరుదులదాకా ప్రవహిస్తోంది. కళ్ళల్లో ఆరోగ్యపు వెలుతురు. ఆందోళనలు లేని వెలుతురు.
"ఏడెనిమిదేళ్ళయింది నిన్ను చూసి సుబ్బులూ , రంగడు కులాసాయేనా?" అన్నాను ఆమె భర్తనుద్దేశించి.
ఆమె మళ్ళీ విరగబడి నవ్వింది. "రంగడా! ఇంకా ఆడెక్కడ? బలేవాడివయ్యా తెలియనట్టు మాటాడుతావ్" అంది.
"ఏం రంగడు పోయాడా" ఆత్రుతగా అన్నాను.
"ఛఛ -దుక్కలా వున్నాడు నేనే వాడిని వొగ్గేశాను"
"ఏం?"
"నాకిష్టం లేకపోయింది. భయమా?"
"ఇన్నాళ్ళూ మరి ఏంచేస్తున్నావు"
"వీరాసామితో గుంటూరు వెళ్ళిపోయాను. అతను పెద్ద మేస్త్రీ. మాంచి డబ్బున్నవాడుకూడా."
"అతన్ని పెళ్ళి చేసుకున్నావా"
"ఆఁ - గుంటూరులో మా బలేగా వుందిలే. నగలూ బట్టలూ సినీమాలూ, దర్జాగా వుండేది. వీరాసామి కూడా బాగుండేవాడు కాని......
"అతనితోకూడా చెడిందా"
