Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 6

    మనిషి కంటే అందంగా వుందా గొంతు.

    "ఇదొక్కర్తేరా నన్ను వేధించి, బాధించి చంపుతున్నది" అన్నాడు అర్జున్.

    "ఛీ.......... నోరుముయ్యి! చదువుకున్నవాడివి. స్త్రీ సాటి మనిషే. అదీ ఇదీ అంటావా!" అన్నాడు.

    మనిషి కాబట్టే మనసుపడ్డాం.........." అన్నాడు సగర్వంగా.

    "యెవరామె?"

    "ఇక్కడ రాత్రిబడి నడుపుతుంది." గుంభనగా నవ్వాడు రాత్రి అనే పదం ఒత్తిపలుకుతూ, రాజేంద్ర

    "దేశం అభివృద్ది చెందింది అంటారు! యెక్కడ? స్త్రీ పరిస్థితిలో మార్పులేదు."

    పురుషుడి సమాజం చాలా పెద్దది.

    స్త్రీ సమాజాన్ని సంకుచితం చేశాడు. కుదించి వేశాడు. ఆమె స్వేచ్ఛను బంధించివేశాడు.

    "చూడు బాబయ్యా! మీరు చదువుకుని వుద్యోగం చేయాలని కాదు మీకు జరిగే అన్యాయం తెలుసుకుంటారని అంతకంటే ఏం లేదు"

    "గట్లనే వస్తము బాంచను........" బాలయ్య బుర్రగోకేసుకున్నాడు. 

    "బాంచను  అనొద్దన్నానా..... అన్నానా!"

    "మల్ల అనను .......అనను......" బాలయ్య తల పంకించాడు.

    ఆమె వెళ్ళిపోయింది. ఆమెతో మాట్లాడుతున్న బాలయ్య ముఖం వికసించింది అతను చిరునవ్వుతో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. సిద్దార్ధకు తన స్నేహితులని చూస్తుంటే కోపం, జాలి కలిగాయి.

    "మీరుంటారా! నేను వెళ్ళాలి. రాదికతో మాట్లాడాలి" అన్నాడు.
 
    "సరే......" అని వారు ముగ్గురు, ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు!

    సిద్దార్ధ వెనుకకు తిరిగాడు మారిన ఊరు చూస్తున్నాడు అతను ఓ ఫర్లాంగు నడవగానే, అతలి కాళ్ళను చుట్టిందో స్త్రీ.

    "బాబూ!.......... సిద్దయ్యబాబూ! నా కొడుకును - నా బాబును ఎక్కడ దాచిండో నువ్వయినా అడిగి చెప్పయ్యా" అంటూ దీనాతి దీనంగా ప్రార్ధించింది.

    ఆమెను ఆకారం చూచి గుర్తించలేక పోయాడు. గొంతు గుర్తించాడు. తమ పొలం కౌలుకుచేసే గౌపయ్య భార్య పార్వతమ్మ.

    "లే........పార్వతమ్మా.....ఏమయింది!"

    ఆమె కళ్ళు ఒత్తుకుని లేచింది.

    ఎముకల గూడుకు తలపై జనుపనార విగ్గు పెట్టినట్టు ఉంది.

    "సిద్దయ్యా! నా కొంప మునిగిందయ్యా....."

    "ఏమిటమ్మా!"

    "ఏం చెప్పనయ్యా! పాడు పుస్తకాలు, పాడు సిన్మాలు వచ్చి పిల్లలను పాడుచేస్తున్నాయి. మా శ్రీనివాసు మీ రాధికమ్మ ప్రేమించుకున్నారంట. అది నాకు తెలియదు. ఆయన పోయాడు. వీడయినా చేతికి వస్తే నా బ్రతుకు కడతేరినట్టే. అందుకే నా పనీ చేసుకుంటున్నాను." అన్నది దీనంగా.

    "రాధిక రాసిందిగాని, మీ శ్రీనివాస్ అని రాయలేదు......"

    "మీ గొప్పవారికేం పొయ్యేకాలం నాయనా. మాలాంటివారి జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు!" అన్నది.

    "అసలు ఏం జరిగిందో చెప్పు"

    "వీళ్ళు ప్రేమించుకున్నారని నాకు తెలియదు. పట్నం వెళ్ళి చదువు కుంటున్నాడు అనుకున్నాను. మీ నాన్నగారు పిలిపించి బూతులు తిట్టారు" అన్నది ఏడుస్తూ

    సిద్దార్ధ జాలిగా చూచాడు.

    "నాకేం బాధలేదు బాబూ! నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ! రాధికమ్మ మా ఇంట్లో వుండగలవా? శ్రీనును తిట్టాను. "నేను అదంతా ఆలోచించలేదమ్మా. తప్పయింది. నేను బొంబాయి వెళ్తాను. మా సార్ రమ్మన్నాడు అక్కడ పని ఇప్పిస్తానన్నాడు" అని నా బిడ్డ తన పొరపాటు అంగీకరించాడు బాబూ."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS