Previous Page Next Page 
తుపాన్ పేజి 6

    ఇంక నేను ఈ నలుగురు స్నేహితులతో సంచరించే విధానంలో ఉండే అర్ధం ఏమిటి?  త్యాగతి నటించి, తక్కిన ముగ్గురూ నాలోని ఏ ఉత్కృష్టమైన ఆడతనాన్ని చూశారో యేమో, నన్ను గాఢమైన కాంక్షతో వాంచిస్తున్నారు. త్యాగతి మాత్రం....అతని హృదయంలో ఏలాంటి కోర్కేలున్నవో యెవరికి తెలుసు ?
   
                                      10

    ఏ స్నానము చేస్తున్నప్పుడో నా యీ దేహముయొక్క అందము చూచుకొని నేనే ముచ్చటపడుతుంటాను. రెండు నిలువుటద్దాల మద్యన నిలిచి చూచుకొన్నాను నన్ను నేను. మోకాళ్ళవరకు సడలింపబడిన నా తలకట్టు ఒక మహామేఘంలా ఆవరించుకొంటుంది. గనిలోనుంచి తీసిన నీలాలలా మెరుస్తూ, చంద్రవంక నది ఎత్తిపోతలధారలా పతనాలవుతూ, క్రిష్ణవేణిలా ప్రవహిస్తూ, విరియపూచిన నీలమందార వృక్షంలా వికసిస్తూ, విడంబిస్తూ నా యీ తలకట్టు అద్భుతంగా దివ్యసంపదగా నన్ను అలంకరిస్తుంది.

    నా ఫాలం నిశ్శబ్దంగా ఉదయకాలపు చిరు ఎండలు ప్రతిఫలించే చెరువులోని బంగారపు నీరు, పూర్ణిమనాటి శారదాకాశము, బాగా వికసించిన తెల్లతామర పూవు రేకు, లేత తుని తమలపాకు. నా కనుబొమ్మల్లో చిన్న బిడ్డల నవ్వుని, రసోన్మత్తుడైన మహాకవి స్వప్నాల్ని చూస్తుంటాను. అవి నల్లని గండుకోయల పాటలు. నాసికామూలాన నాతిదూరముగా కోలగా ఉండి, విస్ఫారితమధ్యాలై, వసంత వర్ష బిందువులలాంటి పొడుగాటి కనురెప్పలచే పొదుగబడి పాతాళగంగా, నీలవర్ణ గంభీర కాష్టాయుతా లై, నన్నే సమ్మోహింపచేస్తున్నవి నా కళ్ళు.

    కారలైన్ డి ఆర్డెన్ పూవురేకులు, వేదులువారి గీతికలు, ప్రత్యూష పాటలకాంతీ, వికసిత కకుబాలు  నా కర్ణాలు. మృదులా లై, కఠినాలై, నిర్మలహరితారుణ ప్రభా పుష్పగుచ్ఛాలై, రొహిణీ వర్ణోజ్వలహాసా లై , నాత్యున్నత నవనీతగోళా లై, నవతుషారార్ద్రజఫాకోరికమూర్తులై, ప్రణయ సర్వకలాళా మూలాలంకారాలై ప్రభావించుతూ, కైళికీవృత్తి ప్రధానలాస్య సమానాలై, అప్సరోంగ నా స్వప్న పూరితాలై, నా మిసిమి నవయవ్వనపు వక్షోజాలు నన్నే సంమ్మోహింప చేస్తున్నవి. హేమ ఫణిఫణా సదృశ హస్త తలాలలో కానీ, నవరత్న కలశ జనితామృతధార లైన ఊరువులలో కానీ, సముద్రమీనమూర్తులైన  నా జంఘులలో కాని, మోహనం కాని పొంకమే లేదు.
       
                                                                11

    బి. ఏ. తెలుగు ఆనర్సు మొదటి శ్రేణిలో నెగ్గిన మదరాసు యూనేవర్సిటీ పాండిత్యము నా సౌందర్యమును  నేను మాత్రం వర్ణించుకొనిటందుకు  పనికివచ్చినది. ఆ రోజున ఇదంతా రాసుకొని చింపివేసుకొన్నాను. ఆ వెర్రితనమంతా నాకు ఈనాడు మనస్సులో జ్ఞాపకం తెచ్చినాడు తీర్ధమిత్రుడు. పాశ్చాత్య స్త్రీల మోములవలె కనబడకపోయినా, సిగ్గుతో మోమంతా యెర్రటి రక్తంతో జేవురించిపోతూ ఉండగా, అడుగడుక్కీ తూలిపోతూ, యాలక్కాయ ఒలిచి నోట్లో వేసుకొంటున్న త్యాగతి వద్దకు నడచివచ్చాను. త్యాగతి వంచిన తల ఎత్తనేలేదు.

    త్యాగతి : నిశాపతిగారు ప్రొద్దున్న బొంబాయి ఎక్స్ ప్రెస్ కు వెళ్ళే ముందర ఆయన్ను నేను కలుసుకున్నాను. ఆయనకు అక్కడి నుండి ఢిల్లీ ప్రయాణమట.

    నేను : నిశాపతి మనలను స్టేషనకు ఎందుకు రమ్మనలేదో? ( అప్పటికి నా మనస్సును కుదుటపరచుకున్నాను,)

    తీర్ధమిత్రుడింతట్లో గబగబా మా వద్దకు వచ్చి ' నిజమే ' అని అంటూ ఉండగానే త్యాగతి అతని మాటకడ్డము వచ్చి '' అతని స్నేహితులతో చాల ముఖ్యమైన పనుండి బండి కదిలేవరకూ మాట్లాడి, కదలిన తరువాత ఎక్క వలసి వచ్చినదట మిత్రరావుగారూ! మరచిపోయినారేమండీ? '' అని అన్నాడు. యింతలో కల్పమూర్తి '' రేడియోలో అతని కంఠము ఎంత మధురంగానో వినబడుతుంది'' అంటూ వచ్చాడు.

    త్యాగతి : రేడియో సెట్టు హేమ ఇంకా కొనలే దెందుకో ?

    నేను : నాకు నువ్వు ఒక మాంచి సెట్టు కొని పెట్టగూడదూ ?

                                       12

    ఒకనాటి వెన్నెలరాత్రి  త్యాగతీ నేనూ మాత్రమే అడయారు నది గట్టుమీద వాహ్యాళికి వెళ్ళినాము. ఏటిని పొదుగుకొని యేటి నీటిలో ప్రతి ఫలించే జ్యోత్స్నలు త్యాగతి కళ్ళలో తాండవిస్తున్నవి. ఆ ముహూర్తంలో త్యాగతి మధుమాసశుభ్రాంశునిలా ఉన్నాడు.

    '' హేమకుసుమదేవీ ! అర్చకుని వై లక్షణ్యాన్ననుసరించే అతని పూజా, పుజాఫలము ఉంటవిసుమా ! ఉపాస్య దేవత క్రీగంటి చూపులకైనా అర్హుడగుటే మహా ప్రసాదం '' .

    '' అవునయ్యా, అర్చనకై వచ్చిన భక్తులందరికీ ప్రసన్నత కావాలి గదా ఆ దేవీ ? ''

    '' పూజా సౌలభ్యం వర ప్రసాద మెందుకు కావాలి  ? ''

    '' వరప్రసాదానికి నలుగురూ అర్హులైతే ? ''

    '' ఒకేసారి నలుగురు అర్హులవడం ధర్మవిరుద్దం. ఏ ధర్మమూ అలా భోధించదు''.

    '' సనక సనందనాదు లందరూ ఒకేసారి ముముక్షువులు కాలేదా ?''

    '' సనక సనందనాదులు భక్తిభావం యొక్క అనేకత్త్వాన్ని మాత్రమే  తెలియచేస్తున్నారు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క భక్తుడే భగవంతునిలో లీనమయ్యాడు. నరసింహమూర్తికి ప్రహ్లాదుడు, వామనునకు బలి, రామునకు హనుమంతుడు, కృష్ఠునకు అర్జునుడు.''

    ఆయన మాటలు నన్ను దాటిపోతున్నవి. నదిలో ప్రతిఫలించే చంద్రుని నవ్వులు నిశ్శబ్దంతో దిశలను ఆవరిస్తున్నవి. మందమలయానిలుడు మాఘమాసపు లే చివుళ్ళ సౌరభాలను  పన్నీరు చల్లుతున్నాడు. శిశిరాకాశ నైర్మల్యము చేతులుచాచి తన నీలి హృదయానికి సర్వప్రకృతిని  అదుముకొంటున్నది. సర్వవర్ణాలలోని స్పష్టతా కరిగిపోయి యేకవర్ణములో కలసి పోతున్నది. త్యాగతి విశాలఫాలంలో పూర్ణకౌముది వల్ల అణగిపోయిన తారకా కాంతులన్నీ పుంజీభవించినవి. అప్పుడాతడు  లో గొంతుకతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS