చటుక్కున తీర్ధమిత్రుడు నన్ను కౌగిలించుకొనబోయినాడు. నేనాతని త్రోసివేసి ఇవతల కురికి, కొంచెం కోపంతో, కొంచం విసుగుతో, '' అబ్బా, ఉండవయ్యా ! అస్పష్టత వీడని నా హృదయం నాకు దారి చూపించడం లేదయ్యా '' అన్నాను.
అక్కడ ఉన్న ఓ వనవేదికమీద కూలబడ్డాను, అప్పుడు అమ్మయ్యో....తీర్ధమిత్రుని కళ్ళల్లో ఏవో భయంకరమయిన కాంతులు తళుక్కున మాయమయ్యాయి. అది నా భ్రాంతి అయి ఉంటుంది. దైన్యహాస కాంతులు వెదజల్లుతూ, కరుణార్ద్రాలైన అతని కన్నులు కర్క శద్యుతు లెల్లా వెదజల్లగలవు? కానీ నాకా భ్రమ మాత్రం ఎందుకు కల గాలి ? తీర్ధమిత్రుడు ఒక నిట్టూర్పు విడిచి, ణా ప్రాణమే రూపం దాల్చిన యీ తన్వంగి నా దురదృష్టం చేత నా పూజను గ్రహించడం లేదు.
'' ఈ విధిని దాటుటే
ఈ విధిని పొందు టే
నా జన్మ తపసయ్యె
నా ఉన్మనమే వృధా !
కలువ పూ బాలికను
కౌగిలింపగరాదు
త్వరపడితేనే ఫలము
దాపురించే నమాస !
తంగేటి జున్నుకై
పొంగిపోయిన నేమి ?
భంగ మొనరించేటి
భృంగాలు పొంచుండె''
'' రా, లోపలికి వెళదాం. స్నేహితులు వచ్చేవేళ అయింది'' అని తల వాల్చుకొని నడిచా. '' ఈతని పూజ గొప్పదే కానీ అతని భార్య ఉన్నదే !'' అనుకుంటూ అడుగులు తడబడుతూ లోపలికి నడిచాను.
9
అక్కడ శర్వరీ భూషణుడు తాంబూలం వేసుకుంటూ యాలుక్కాయ వొలుస్తున్నాడు. కనురెప్ప వాల్చని గంభీరదృష్టులు అతడు నా పైన ప్రసరించినాడు. ఆ చూపులు నా గుండెలకి భయమును అద్దినవి, ఎప్పుడూ పొందని సిగ్గు శాలువలా నన్ను కప్పివేసినవి. త్యాగతి ఎవరని మేము నిశ్చయించుకొనే వాళ్ళం.
తీర్ధ : అతడు అఘోర సన్యాసి అని నా ఉద్దేశ్యం!
కల్ప : అతడు మంచివాడు. మనుష్యుని వెనకాల అతన్ని వెక్కిరించడం పురుష లక్షణం కాదు.
నేను : ఆయనకూ, నాకూ పరిచయం కలిగినది ఈ ఏడాదిలోనే.అయినా ఎంత స్నేహితుడైనాడు.
కల్ప : ఈవాళే ఆ ప్రశ్న మనలో పుట్టిందేమిటి?
నిశా : ఆ ప్రశ్న నా మనసులో ఎప్పుడూ ఉండనే ఉన్నది.
తీర్ధ : అడగనా నువ్వెవరని?
నేను: అలాంటి తెలివి తక్కువ పనులు చేయకు.
కల్ప: ఆయన ఎవరో పూర్తిగా తెలపటం అనే ఇటువంటి ముఖ్యమయిన విషయంలో ఆయన ఉదాసీనత వహించగలడా? ఎవరి రహస్యాలనైనా మనం మన్నించాలి.
నిశా: ఈ ఏడాదినుంచీ రహస్యం వీడని స్నేహం అంత గొప్పదా మనం గౌరవించడానికి?
నేను : అలాంటి స్నేహాన్ని నేను మాటాడకుండా గౌరవించాను కాదా? పైగా ఏమి రహస్యాలున్నాయి ఆయన జీవితంలో! మహాశిల్పీ, చిత్రకారుడూ అతడు.
తీర్ధ : నిన్ను బట్టే మేమంతా గౌరవిస్తున్నాము; లేకపోతే....
నిశా : ఈ జిడ్డు ఆముదం ఎవరిక్కావాలి ?
తీర్ధ : తంటసాన్ని ఎవరు కోరుకుంటారు కావాలని!
కల్ప: ఈ రోజున మన కందరికి జ్ఞానోదయం అవుతున్నది.
నేను: అయితే మా తండ్రిగారి కతడంటే వున్న గౌరవం టంగు టూరి ప్రకాశంగారన్నా లేదు.
తీర్ధ : ముసలివాళ్ళు ముసలివాళ్ళని గౌరవిస్తారు.
కల్ప : ఆయనకు ముప్ఫై, ముప్ఫైఒకటి కన్న ఎక్కువ వయసు వుండదు, ఇరవై అయిదేళ్ళ యువకునిలా వుంటాడు.
నిశా : మామయ్యా గారు అరవై ఏళ్ల వారులా వుంటారా ? ముఫ్ఫై ఏళ్ల మూర్తిలా వుండరు మరీ!
నేను : ఇదంతా శుష్కవాదన. ఏ కారణం అయితే ఏమి, త్యాగతి నా స్నేహితుడు.
ఈలా ఒకనాడు త్యాగతి లేకుండా వాదన జరింగింది. అదంతా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ ఆలోచనలన్నీ త్యాగతి యాలక్కాయ నోట్లో వేసుకొనే లోపుగానే నా హృదయంలో మెరుముల్లా మెరసి మాయమైపోయినవి. తీర్ధమిత్రుడు పెదవులతో నా దేహాన్ని స్పృశించినంత మాత్రాన్నే నేను మైలపడి పోయాననుకునే చ్చాందసురాలిని కాను. ఇష్టతాయిష్టతలు యే కారణాలబట్టి యేర్పడతవో ? ఇష్టతాయిష్టతలు మానవ జీవిత చరిత్రకు యెన్ని రకాల ప్రకరణాలను సృస్టిస్తున్నవో? ఆడదాని జీవితము మగవాడి జీవితముతో కలిపి వేసుకోవడంతోనే ఆఖరా? వారి సంఖ్యను వృద్ది పొందించడమే ఆడదాని కర్తవ్యమా ? ఆమె అందమైన కళ్ళు,సుందర రేఖాసమన్వితమైన ఆకార సౌష్టవం, పూర్ణాంగాలు, సిగ్ధవక్షాలు, అసమాన లావణ్యము, అద్బుత మాయాపూరిత జఘనము, బంగారు మోహర్ పూవుల లాంటి పాదాలు -ఇవన్నీ యెందుకు ? పురుష కామాగ్నికి ఇవన్నీ ఇంధనాలు కావలసి ఉంటే. ఆడది మగవాడికన్న నాలుగువేల సంవత్సరాలు వెనకాలపడి ఉన్నదన్నమాటే! పురుష జీవితానికి మహదాశయము స్త్రీ అని పురుషుడు కల్పించే రాతలూ, పాటలూ, స్త్రీని పురుషుడు మాయమంచులు కప్పి పశువుగా ఉపయోగించుకోవడాని కేనా? అందుకు స్త్రీ అభ్యంతరం చెప్పకతయారా
