Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 6

 

    వాక్యం పూర్తీ చేసే స్థిమితమూ ఆయనకు లేదు. అది పూర్తిగా వినే వోపికా నాకు లేదు. నా కాళ్ళు తెలిపోతున్నాయి. నా కళ్ళు సోలిపోతూన్నాయి. నా నరాలు స్వాధీనం తప్పిపోతున్నాయి. విందు విస్తరంతా బరువుగానూ మేఘమాలిక అంత తేలికగానూ ఒకేసారి అయిపొయింది నా మనసు.
    మే మొచ్చిన ఇరవై రోజులకి కాబోలు పార్సిల్ లారీలో సామాను వచ్చి పడింది. నిత్య జీవితానికి అవసరమైన అన్ని సామాన్లూ ఉన్నాయి అందులో. అప్పడాలూ, వడియాలూ, వూరగాయాలూ, ఓ ఊర్నించి మరొక ఊరు పంపడం ఎక్కడేనా ఉంది. పుట్టుకతో తెచ్చుకున్న బుద్దితో పాటు సత్సంప్రదాయాలు యిచ్చే సత్పలితాలతో పాటు కాల ప్రవాహంతో కధను కలిపి మంచి విషయాల్ని ఎక్కడి కక్కడ ఏరుకుని జీవిత రధాన్ని తేలికగా, సుళువుగా మళ్ళీ అదే సమయంలో అన్ని విధాలా సార్ధకం చేసుకునేలా నడపడం చేర్చిన కొద్ది మందిలో మా వాళ్ళూ ఒకరనుకుంటాను.
    పాలూ, నెయ్యీ ఒలికి పోకుండా ఏ పిల్లికీ ఎలకకీ అందకుండా పెట్టుకోడానికి సరిపడే తలుపులు గల చిక్కుల అలమారాలూ, గిన్నెలు, గ్లాసులూ, కంచాలూ పెట్టుకోవడానికి వీలుగా ఉండే షెల్ఫులూ , వివిధ సైజుల్లో గట్టి మూతలు గల ఖాళీ డబ్బాలు, సీసాలూ ఇలాంటివి ఒకేసారి ఎవరైనా సేకరించి పెడితే గృహిణి ఎంత ఆనందిస్తుందో చూసి తీరాలి. శుభ్రమైన కోరామూ, హెచ్చుతగ్గులూ లేకుండా సరిగ్గా పూసపడే కన్నాలు గల చట్రమూ! ఇలాంటివి ఎంచి తేవడం చాలా మంది మగవాళ్ళ కి తెలీదు. తెలిసిన వాళ్ళతో కాపురం చెయ్యడం కష్టం కూడా! చిన్న రుబ్బురోలు చెప్పించి, అది బాగా పదును పడేదాకా ఏ యిసకో వేసి రుబ్బించి పోత్రానికి గంటలు కొట్టించి, అది పెట్టుకోడానికి వీలుగా గసిక దిగ్గోట్టించి వదిన పంపిందంటే ఆమె అభిమానాన్ని నేను మాటల్లో ఎలాచేప్పేది.
    'ఇవన్నియు ఇంకను చాలా ముందుగా పంపవలెననుకొంటిమి. ఇవి చేయించుటకు పనివారు వెంటనే దొరకలేదు. కొత్త కాపురము, నువ్వేమి ఇబ్బంది పడుచుంటివో, ఏది కావలసినయు వెంటనే వ్రాయుము. మరేమియు వింతలు విశేషములు లేవు గద?' అంటూ వదిన రాసింది తన మామూలు ధోరణిలో. అన్నయ్యా రాసింది మరోలా ఉంది.
    "ముఖ్యమైన వస్తువులన్నీ ప్రస్తుతానికి పంపేం. ఇవన్నీ ఎందుకో తెలుసుగా? పరిశుభ్రంగా రుచిగా త్వరగా వంట చేసుకోడానికి. ఇందులో నా దృష్టికి త్వరగా అన్న మాట ముఖ్యమైనది (ఆహారం అనేది జీవితంలో అతి ముఖ్య భాగం కావచ్చు గానీ జీవితం పూర్తిగా అందుకే కాదు.) ఇలా ఎందుకు రాశానంటే మన వాళ్ళలో చాలా మంది ఇప్పటికీ వంట చెయ్యడం ఒకటే వనితల కర్తవ్యంగా భావిస్తున్నారు. నేను ఈ వాదాన్ని ఎంత మాత్రమూ అంగీకరించలేను. అందుకని వీలయినన్ని సుళువులతో వంట చేసుకుని ఇవతల పడు. విజ్ఞానం అనేది తీరం లేని సాగరం. తీరని దాహం. కొంత వరకూ ఆర్ధిక స్వాతంత్రం సముపార్జనకూ , కొద్ది కాలంలో ఎక్కువ పుస్తకాల సారాన్ని గ్రహించేందుకు ప్రస్తుతం పరీక్షలదే ప్రధమ తాంబూలం. వెంటనే సిలబస్ తెప్పించి బియ్యే కి కట్టు. నేను చేసిన 'ఎన్నిక' అన్ని విధాల నీకు తోడ్పడ గలదనే నమ్మకం నాకుంది.'
    మాట ముందు  మర్మోక్తి తప్ప వాడని అన్నయ్య ఇంత సీరియస్ గా విషయాలు చెప్పడం ఆశ్చర్య మనిపించింది. ఆ ఉత్తరాన్ని ఏ పది పదిహేను సార్లో చదివి ఉంటాను. ఆ వాక్యాల సారం అన్నయ్య హృదయాన్ని పూర్తిగా అవగతం చేసుకున్న నా కోక్కర్తికే పూర్తిగా తెలుసునేమో! ఆ రెండుత్తరాలూ అయన కిచ్చెను.
    "నేను చేసిన ఎన్నిక" అని తప్ప నాకు వూరూ, పేరూ లేదన్న మాట." అని అయన చిన్న తుంపర పరంపరలా నవ్వు ప్రారంభించారు. అంతలో వూరు వాడ ఏకమైనంత వర్షం కురిసినట్లు నవ్వు ప్రారంభించారు.
    "ఇందులో అంత నవ్వడాని కేముందండి?'
    "దీన్ని గురించి కాదు. ఇది చదువుతుంటే నాకు మనవాళ్ళు సాధారణంగా రాసుకునే ఉత్తరాలు జ్ఞాపకానికి వచ్చాయి. 'ఇక్కడంతా క్షేమం. అక్కడ మీ క్షేమం రాయవలెను' లేకపోతె 'అంతా బాగు. వింతలూ లేవు. చిత్తగించవలెను.' ఇలా ఉంటాయి. వెనకటికి మాకు తెలిసిన ఒకాయన 'అంతా క్షేమం' అని ఒక ఉత్తరం వచ్చిందిలే. అది జ్ఞాపకానికి వస్తే నవ్వాగడం లేదు. అదో చోట రాసుకున్నాను. చెప్తానుండు."
    అయన నవ్వుతూనే వెళ్ళి ఏదో పాత పర్సు తెచ్చి అందులో మడతలు పెట్టిన, నలిగి పోయిన చిన్న కాగితాన్ని జాగ్రత్తగా విప్పి చదవడం ప్రారంభించారు.
    చిరంజీవులగు
    పంచాగ్నుల మార్తాండరావుకు--
    మీ ఉత్తరం అందినది. ఇక్కడంతా క్షేమము.
    మీ పెద్దక్కయ్య ఆయసముతో తీసుకుని తీసుకుని అంతా సుమారు నాలుగు రోజులై కాలము చేసినది. 'పోయిన వాళ్ళతో పోలేము గదా!" అనేవాడివి. పోయెడి వాండ్లు ఉండురని గ్రహించవలయును. మీ అక్కయ్య పోయినట్లు వినగానే మీ అమ్మగారు నూతిలో పడినది. తాళ్ళూ, నిచ్చెనలు తీసుకుని మొగాళ్ళు లన్నవాళ్ళు సిద్దపడేదాకా పాప మామే ప్రాణము నిలబడింది కాదు.

 

                 
    మీ బుల్లి మామయ్యగారు వేటకుక్క కరుచుటచే ప్రస్తుతము ఇంజక్షన్లు తీసుకోనుచూ యున్నారు.
    మీ మరదలు చాముండి ఈమధ్య గుమ్మము తగిలి బోర్లా పడుటచే ముణుకు పై అనుట వలన కొంచెం పెద్ద దెబ్బే తగిలినది. గవర్నమెంటు వారి ఆసుపత్రి కి తీసికెళ్ళి విచారించగా 'ఫాక్సారు ' అయినదని తెలిసినది. పిల్ల ప్రస్తుతము ట్రీటుమెంటులో యున్నది.
    మీ చిన్నన్నయ్య గారింట్లో దొంగలు పడి వెండి కంచములు ఎత్తుకు పోయిరి. రాత్రి మీ అన్న గారు కడు సాహిసికులని పేరు గాంచుటచే చేయినది లేక వారిని వెంబడించిరి. చోరులకు హృదయ ముండదు కదా! ఆ పాపాత్ములు ఇంచుకయు పాప భీతి లేక సుమారు రెండు గజముల పొడవు గల ఉద్దండపురం చేపాటి కర్ర విసిరినారట. మీ అన్న గారికి కణత దగ్గిర అరచేయ్యంత మేర ఊడి వచ్చి రెండు రోజులై నూట మూడు పైగా తీవ్ర జ్వరము కాయుచున్నది.
    మీ తిరుపతిరావు పరీక్షా ఫలితములు తెలిసినవి. పాపమూ ఒకటి రెండు మార్కులలో పోయినడట. పేపర్లు దిద్దినవాడు శత్రుకూటమికి చెందిన వారని నా తలంపు . ఇంటివద్ద గట్టిగా దెబ్బలాడుటచే పిల్లవాడు నాటి నుండియు ఇంట కనపడడట" అయినను అధైర్యము అనవసరము. పోలీసు రిపోర్టు ఇచ్చిరి గదా!
    ఈ సంగతులన్నియు ఇదివరకే తమ సన్నిధికి తెచ్చి యుందును  గాని మీ ఆస్తి తగాదాలలో కోర్టు వారు మీకు వ్యతిరేకముగా తీర్పు చెప్పిరని విని నా ధైర్యము కొంత సడలినది. కానిండు దైవము లేడా?
    అంతా క్షేమము. మీ క్షేమ సమాచారములు తిరుగు టపాలో వ్రాయగోరెదను. తప్పులున్న క్షమించవలెను... చిత్తగించవలెను.
    ఈ రీతిని సదా మీ క్షేమం తెలుసుకోరుతూ,
                                                                             భవదీయ,
                                                                  కప్పగంతుల ఆంజనేయులు వ్రాలు.
    అయన ఇదివరకు విన్నారు గనక ఆపుకోగలిగేరేమో గాని నేను ఒక పట్టాన నవ్వు అపికోలేక పోయాను. నా సౌభాగ్య కారకుడైన సర్వాంతర్యామికి నిండు మనసుతో నమస్కరించాను.
    'నవ్వుతూ బతకలేని వాళ్ళనీ, నవ్వుతుంటే చూడలేని వాళ్ళనీ ఇంతవరకూ నాకు కనబడకుండా చేశావు. ఓ నిత్యానంద స్వరూపా, నేనంటే నీకెంత కరుణ!'

                                                  *    *    *    *
    ఈ అయిదారేళ్ళూ అసలు గడిచేయాలన్నంత వేగంగా గడిచి పోయాయి. ఇప్పుడు మా లాంబ్రెట్టా మీదా నేనూ ఆయనా కాక మా నాలుగేళ్ల పాప మధురిమ కూడా ఉంది. నేను బియ్యే ఎకనామిక్స్ ధర్డ్ క్లాసులో ప్యాసయ్యాను. కాన్ఫోకేషనుకు వాల్తేరు వెడుతూ అన్నయ్య దగ్గర దిగెను.
    వదిన నా చేతిలో పాపని లాక్కుని నాలుగు ముద్దులు పెట్టుకుంది. ఆమె కప్పటికి ముగ్గురు పిల్లలు. పెద్దవాడికి ఆరేళ్ళు. ముకుందరావని మా నాన్నగారి పేరు పెట్టేరు. నెంబరు టూ నెంబరు త్రీ ఆడపిల్లలు. సీత అని పెద్ద పిల్ల పేరు వదినే పెట్టుకుంది. ఆఖరిది రేఖ. చిన్నారీ అని పిలిచేవారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS