ఈ హడావుడిలో మేముంటే సడెన్ గా నలుగురు గాళ్స్ ప్రత్యక్షమయారక్కడ- అందరిదీ ఒకటే కలర్, ఒకే మోడల్ డ్రస్!
నలుగురూ జనంలో నాలుగు మూలల కొచ్చి బ్యాగ్ లో నుంచి అప్లికేషన్ ఫామ్స్ తీసి పంచసాగారు.
"సార్! ఐసిఐసిఐ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫండ్ కొత్తగా ఓపెనయింది. సార్- ఎల్లుండి క్లోజయిపోతుంది. మీరు నెలకు వెయ్యికడితే మూడేళ్ళయ్యాక 72 వేలవుతుంది సార్- ఇంకెక్కడా ఇంత లాభం మీకు దొరకదు సార్-"
36 వేలు 72 వేలవుతుందనేసరికి జనం ఆ అమ్మాయిల చుట్టూ మూగిపోయారు. పోలీసులు ఇక లబాహం లేదని వాళ్ళందరిని బయటగ్గెంటారు. అటువాళ్ళని గెంటారో లేదో ఇటు బజ్జీలమ్మేవాళ్ళు, ఐస్ ఫ్రూట్ అమ్మేవాళ్ళు, కొంతమంది అడుక్కుతినేవాళ్ళు జనంలోకి చొరబడిపోయి బిజినెస్ స్టార్ట్ చేసేశారు. ఇదే ఛాన్స్ అని మా సొసైటీ ప్రెసిడెంట్ హమీద్ మియా తన బంగ్లాదేశ్ యుద్దంలో పాల్గొన్న విశేషాలను అందరికీ బలవంతంగా వినిపించడం ప్ర్రారంభించాడు.
కల్చురల్ సెక్రట్రీ శంకర్ మూర్తి కాలనీలోని పిల్లలందరినీ ఓ మూలకు జేర్చి వచ్చే గణపతి నవరాత్రి ఉత్సవాలకి వాళ్ళు ఏ సినిమా పాటలకు రికార్డ్ డాన్స్ చేయగలరో లేదో పరీక్షిస్తున్నాడు.
లేడీస్ వింగ్ ప్రెసిడెంట్ షైనీ తన కాల్ సెంటర్ అనుభవాలు లేడీస్ అందరికీ చెప్తోంది. తనను రాత్రి రెండింటికీ టాక్సీవాడు రేప్ చేయడానికి ప్రయత్నించటం- తను వాడిని కరాటే కిక్కులతో వాడిని చావగొట్టి- తనే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించటం-
జనరల్ సెక్రటరీ మొహిందర్ సింగ్ సర్దార్ జీ జోకులు చెప్తున్నాడు తన చుట్టూ ఉన్నవాళ్ళకి- అవధాని టీవీ ఛానెల్లో తను పనిచేసే డెయిలీ పేపర్లో స్టాఫ్ చుట్టూ ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయో విరక్తిగా చెప్తున్నాడు.
అప్పటికి స్కూటర్ హాండిల్ కింద ఉన్న వైర్లన్నీ కత్తిరించేశారు బాంబ్ స్క్వాడ్ వాళ్ళు. తీరా డిక్కీ ఓపెన్ చేయబోతుండగా హమీద్ మియా స్పెషల్ గా తయారు చేయించిన చాయ్ బిస్కెట్లు ఆ బాంబ్ స్క్వాడ్ వాళ్ళకూ, పోలీసులకూ కప్పుల్లో సప్లయ్ చేయటం మొదలుపెట్టాడు.
"మీరు మా కాలనీ కోసం పాటుబడుతున్నారు గనుక ఈ మాత్రం చెయ్యకుండా ఎలా ఉంటాం సార్" అంటున్నాడు చిరునవ్వుతో కాసేపు దూరదూరంగా జరిగి రిలాక్సవుతూ వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు సరిగ్గా అందరూ టీ తాగుతున్న సమయంలో ఓ యువకుడు హడావుడిగా వచ్చి ఆ స్కూటర్ స్టాండ్ తీసి స్టార్ట్ చేయడానికి కిక్ కొడుతూంటే అప్పుడు స్పృహలో కొచ్చి అందరూ అతనిని గట్టిగా పట్టుకున్నారు.
"ఏంట్రా! కిక్ కొడుతున్నావ్?"
"స్కూటర్ స్టార్ట్ జేస్తున్నా సార్"
"నీకేం పిచ్చిపిచ్చిగా ఉందా? ఎవర్నడిగి చేస్తున్నావ్ రా"
"అడిగేదేంటి సార్! ఇది నాదే!"
"నీదా? మరి పొద్దున్నుంచీ ఇదెవరిదో తెలీక మేం ఛస్తూంటే ఏమైపోయావురా నువ్వు?"
"ఎందుకు సార్? రాంగ్ ప్లేస్ లో పార్క్ చేశానా?"
"అరే హౌలే! స్కూటర్లో బాంబుందిరా!" అన్నాడు ఒక కానిస్టేబుల్.
"స్కూటర్లో బాంబుందా?" అదిరిపడ్డాడు వాడు.
ఇన్ స్పెక్టర్ ఆ యువకుడి కాలర్ పట్టుకుని పక్కకు లాక్కెళ్ళాడు.
"ఏదీ నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు-"
"లేద్సార్"
"పోనీ నీ అయిడెంటిటీ కార్డు ఏమైనా ఉందా?"
"లేద్సార్"
"అసలు నువ్వెవరు? నీ పేరేంటి? నువ్వెక్కడుంటావ్?"
వాడు పొంతన లేకుండా సమాధానం చెప్తూంటే సీఐ నాలుగు తగిలించాడు. దాంతో నిజం చెప్పేశాడువాడు.
"సార్! దంచకండి సార్! ఈ స్కూటర్ నాదికాదుగానీ- దీనిమీద నాకే రైట్స్ ఉన్నయ్ సార్- అంటే నేను ఈ ఏరియాని చాంద్ ఫైల్వాన్ కి లక్ష రూపాయలిచ్చి కొనుక్కున్నా సార్!"
"ఈ ఏరియా కొన్నావా?" షాకవుతూ అడిగాడు సర్కిల్.
"అవున్సార్! ఈ ఏరియాలో ఏ దొంగతనమయినా నేనేచేయాలి. ఇంకోడెవడూ నా ఏరియాకొచ్చి చెయ్యకూడదు. అందుకే లక్ష ఇవ్వటం- ఈ సొసైటీ కూడా నాదే గనుక నెలకోసారి ఇక్కడకొచ్చి స్కూటర్లు, మోటార్ సైకిల్స్ ఎత్తుకుపోతూంటాను సార్-"
ఆ మాటతో పోలీసులకు వళ్ళు మండిపోయింది.
"ఏంట్రా! చాంద్ ఫైల్వాన్ ఒక్కొక్క ఏరియాకీ ఒక్కో లక్ష వసూలు చేస్తున్నాడా?" సబిన్ స్పెక్టర్ అడిగాడు.
"అవున్సార్! మరీ బిజీ ఏరియా అయితే అయిదు లక్షలు-"
"మరి మాతో పాతికవేలే అన్జెప్పాడే! అంటే ఈ లెక్కన వాడు నెలకు యాభై లక్షలు సంపాదిస్తున్నాడు- చూశారా సార్! మనకి పదిలక్షలే మామూలు కడుతున్నాడు- ఆ చాంద్ ఫైల్వాన్ గాడు" పై అధికారికి కంప్లెయింట్ చేశాడు ఎస్.ఐ.
ఆ అధికారి ఇంకా మండిపడ్డాడు.
రేపు వాడిని ఇదే 'బాంబ్' కి కేస్ కి సంబంధించిన అనుమానితుడని చెప్పి తీసుకొచ్చి లాకప్ లో పడేయండి. పాతిక లక్షలు మనకి మమూలివ్వందే వదలద్దు సాలేగాడిని!"
ఇదంతా చూస్తున్న టీవీ చానెల్ తాలూకు గిరీశం ఆ అధికారి దగ్గరికొచ్చి గిరజాలు గోక్కుంటూ నిలబడ్డాడు.
"సార్! మీరు ఆ చాంద్ ఫైల్వాన్ గురించి మాట్లాడుకుంటున్న మాటలన్నీ లైవ్ టెలికాస్ట్ అవకుండా ఆపాను సార్" అన్నాడు రహస్యంగా.
"ఓ గాడ్" తలకొట్టుకున్నాడు ఇంకో పోలీస్ అధికారి.
"మీ చానెల్స్ వచ్చాక మాకు పెద్ద న్యూసెన్స్ అయిపోయిందయ్యా! మా సెటప్ ల ఇళ్ళకెళ్దామంటే భయం! పబ్లిగ్గా లంచాలు లాగుదామంటే భయం! ఆఖరికి మా పెళ్ళాం పక్కలో పడుకున్నా వదిలేటట్లు లేరు మీరు!" విసుక్కున్నాడతను.
"న్యూసెన్స్ అన్నమాట నిజమేగానీ మరి మీరు చేసే పాజిటివ్ థింగ్స్ అన్నీ లైవ్ గా చానెల్స్ చూపిస్తోంటే మీకెంత గ్లామర్ పెరిగిపోతుందో ఆలోచించారా? మా వీడియో కవరేజ్ ని బట్టి మొత్తం 24 మంది ఇన్ స్పెక్టర్లకు ప్రమోషన్ కూడా దొరికింది గద్సార్!"
"ఆ మాటలో కొంతవరకూ నిజం ఉందిలే" వప్పుకున్నాడు సర్కిల్.
"అయినా మాదే మూలకి సార్! మీరు చాంద్ ఫైల్వాన్ గురించి మాట్లాడిందంతా మా ఛానెల్లో చూపించకుండా ఉంటానికి- మహా అయితే మీకొచ్చే దాంట్లో టెన్ పర్సెంట్ కమిషన్ అడుగుతున్నాం! అంతేకదా!"
"సరే సరే సరే...... ఎంతో కొంత ఇస్తాన్లే! ఇప్పుడు అందరి ఎదురుగా అరవకు, బావుండదు"
"అలాగే సార్" అంటూ పక్కనున్న రాజు చెవి కొరికాడు.
"పదక్కర్లా! అయిదిచ్చినా చాలు- బోలెడు డబ్బు మనకి"
"మరిదాంట్లో మన చానెల్ ఓనర్ షేర్ అడుగుతాడుగా"
"ష్- అరవకు- మైక్ లాగేస్తుంది"
సరిగ్గా అదే హడావుడిలో అందరూ ఉండగా ఓ స్టూడెంట్ వచ్చి అదే స్కూటర్ లాక్ తీసి స్టార్ట్ చేయడానికి కిక్ కొట్టాడు.
మరుక్షణంలో జనమంతా అరచి కేకలేసేసరికి పోలీసులు అలర్ట్ అయ్యి అమాంతం వాడి మీద పడి అతని చేతులు విరిచి పక్కకు లాక్కొచ్చారు.
