Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 5


    "ఓకే వెంగమాంబా! భై"
    మాకు ఓ పక్కబాంబ్ పేలితే మా అపార్ట్ మెంట్స్ అన్నీ కూలిపోతాయేమో, మేమంతా ఛస్తామేమో అని భయంపట్టుకుంటే- ఈ చానెల్ వాళ్ళు వాళ్ళ ఛానెల్ ప్యూయర్ షిప్ పెంచుకోడానికి మా అపార్ట్ మెంట్స్ ని ఎన్నుకోవటం మాకు చిరాకు కలిగించింది.
    అప్పుడే పోలీస్ జీప్ వచ్చి ఆగింది.
    ఇన్స్ పెక్టరు, సబిన్ స్పెక్టరు, కానిస్టేబుల్స్ జీప్ లో నుంచి సినిమాల్లో లాగా ఎగిరి బయటకు దూకారు గానీ అక్కడే నిలబడి పోయారు.
    "సార్! ఆ స్కూటర్ ఇక్కడుంది" అంటూ అరిచాడు హమీద్ మియా అయినా గానీ వాళ్ళు ముందుకు రాలేదు- రాకపోగా మళ్ళీ అందరూ జీప్ ఎక్కారు- ఎక్కటంతోనే మళ్ళీ దూకారు.
    మాకు ఆశ్చర్యంగా ఉంది.
    "ఒకవేళ ఇదోరకం థ్రిల్లేమో!" అన్నాడు రెడ్డి.
    ఈలోగా వాళ్ళంతా మళ్ళీ జీప్ ఎక్కి మళ్ళీ అందరూ ఒకేసారి దూకారు. అంతవరకు కెమెరా అడ్జస్ట్ చేసుకుంటున్న కెమెరామెన్ తోపాటు రాజు కూడా పోలీస్ కి ఎదురుగ్గా వెళ్ళాడు. అప్పుడు జీప్ ఎక్కి మళ్ళీ దూకారందరూ-
    "ఇంకొక్కసారి" అన్నాడు కెమెరామెన్ గిరీశం.
    "ఎన్ని సార్లయ్యా! అందుకే మిమ్మల్ని కెమెరా పట్టుకుని రెడీగా ఉండాలని ముందే చెప్పాను. ఈ ఏజ్ లో ఇంతింత భారీ కాయలతో అన్ని సార్లు జీప్ ఎక్కి దూకాలంటే మాటలా? అసలే మా సీఐకి జాయింట్ పెయిన్స్!"
    "మీర్రావటం ఆలస్యమయిందని కెమెరా ఇప్పుడే ఆఫ్ చేశాన్సార్! త్వరగా దూకండి! ఆన్ చేశాను-"
    "ఛ! మీతో లాభంలేదు. ఇంకో న్యూస్ ఛానెల్ కొత్తగా వచ్చింది. ఇకనుంచీ వాళ్ళని పిలుస్తాం! ఆ కొత్త ఛానెల్ హెడ్ మొన్నే బతిమాలివెళ్ళాడు. ఏ క్రైమ్ జరిగినా మా ఛానెల్ నే పిలవండిసార్- మీకు ఎంతో కొంత ముట్టజెబుతాం- అన్నాడు తెలుసా?"
    ఇలా తను ప్రత్యర్ధి చానెల్ వాళ్ళు పోలీస్ కి లంచం ఇవ్వడానికి రడీ అయ్యారనేసరికి రాజూ జంకాడు.
    "చూస్తావేంటి-కెమెరా తీసుకెళ్ళి ఆ స్కూటర్ దగ్గరపెట్టి- మేము రావటం షూట్ చెయ్ అదంతా మీ ఛానెల్లో చూపించాలి-" అన్నాడు సి.ఐ. దబాయింపుగా.
    తను నకరాలు చేస్తే ఇంకో క్రైమ్ స్పాట్ కి ఆ చానెల్ వాళ్ళనే తీసుకెళ్ళినా తీసుకెళ్తారు-
    "సారీ సార్-" ఎందుకయినా మంచిదని ఒక 'సారీ' పడేశాడతను.
    కెమెరా కవరేజ్ తోపాటు స్కూటర్ చుట్టూ తిరిగి పరీక్షించారు వాళ్ళు. వెంటనే మళ్ళీ కెమెరా ఆన్ చేశాడు రాజు-
    "ఈ స్కూటర్ లో బాంబ్ ఉన్నదీ లేనిదీ నిర్దారించుకోడానికి పోలీసులు వచ్చారు వెంగమాంబా! ఇంకాసేపట్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వాళ్ళు కూడా చేరుకుంటారు. అప్పుడుగానీ మనకు కరెక్ట్ పిక్చర్ తెలీదు వెంగమాంబా!"
    "ఈ స్కూటర్ గురించి పోలీస్ అధికారులేమంటున్నారు రాజు!"
    "ఇప్పుడే ఇన్ స్పెక్టర్ గారితో మాట్లాడతాను. సార్! ఈ స్కూటర్ లో బాంబ్ ఉన్నది లేనిదీ మీరేమయినా చెప్పగలరా?"
    "ఖచ్చితంగా ఉండే ఉంటుంది! లేకుంటే స్కూటర్ ఈడొదిలి ఎందుకు పోతారు?"
    "ఈ సందర్భంగా మీరెవరిని అనుమానిస్తున్నారు?"
    "ఇది ఖచ్చితంగా మనదేశంలో ఉన్న రెండొందల అరవై ఆరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లో ఒకదాని పని అని నేను ఘంటాపథంగా చెప్పగలను!"
    "ఈ సందర్భంగా జంట నగర ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి?"
    "ఈ బాంబ్ పేలుళ్ళ గురించి మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉన్నోడుంటాడు- పోయినోడు పోతాడు! ఎంతమంది పోయినా మన దేశానికున్న వందకోట్ల జనాభా ఎప్పటికీ తరగదు- మన జనాభాని తగ్గించుకోటం మన గవర్నమెంట్ వల్లే కాలేదు. ఇంక టెర్రరిస్ట్ ల వల్లేమవుతుంది?"
    ఆ డైలాగ్ తో అక్కడున్నవారంతా దేశభక్తి పొంగిపొరలి చప్పట్లు కొట్టారు.
    "భారత్ మహాన్ హై" అన్న అరుపులు వినిపించినయ్ జనంలోనుంచి.
    అప్పటికే మా అపార్ట్ మెంట్స్ లో స్కూటర్ బాంబ్ పేలబోతోందన్న వార్త టి.వి. చానెళ్ళలో ప్రత్యక్షంగా ప్రసారం అవుతుండడంతో చుట్టుపక్కల ఊళ్ళనుంచీ, లొకాలిటీ నుంచి జనం తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు.
    వాళ్ళను కంట్రోల్ చేయడానికి అప్పటికప్పుడు రెండొందల మంది పోలీసులను పంపించమని పై అధికారిని వైర్ లెస్ లో కోరాడు ఇన్ స్పెక్టర్.
    "నీకేమైనా తెలివుందా? అంతమంది పోలీస్ లెక్కడున్నారు మన దగ్గర? ఉన్నోళ్ళలో 50 శాతం మినిస్టర్స్ ఇళ్ళ దగ్గరా, హై అఫీషియల్స్ ఇళ్ళ దగ్గర పెట్టాం కదా! ఇప్పుడు ఇంకొంత మందిని చిరంజీవి ఇంటి దగ్గరకు కూడా పంపించాం! పైగా అసలు 35 వేల వేకెన్సీలు ఇంకా భర్తీ చేయనేలేదు. అన్నీ తెలిసి రెండొందల మందిని పంపమంటావేంటి? నేనూ, డీజీపీగారు కూడా యూనిఫారం వేసుకువచ్చినా వందమంది కూడా ఉండరు"
    "పోనీ ఎంతమందుంటే అంతమందిని పంపించండి సార్! అన్నట్లు ఇంకో రిక్వెస్ట్ సార్"
    "ఏంటది?"
    "రేపు నాకు చిరంజీవి, రాజశేఖర్ ఇళ్ళ దగ్గర స్పెషల్ డ్యూటీ వేయండి సార్. సరదాగా చిరంజీవితో మాట్లాడ్డానికి ఛాన్స్ ఉంటుంది"
    "ముందా బాంబ్ సంగతి చూడు!" కోపంగా అరిచాడు అధికారి.
    మరి కాసేపట్లో బాంబ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాగానే రాజు మళ్ళీ యాక్టివ్ అయిపోయాడు. అసలు బాంబ్ అనేది ఎవరు కనిపెట్టారు అనే విషయాలు రాజు ఎడాపెడా వాగుతోంటే కెమెరా పట్టుకుని ఎడాపెడా షూటింగ్ చేసేస్తున్నాడు కెమెరామెన్.
    మా కాలనీ ప్రెసిడెంట్ హమీద్ మియా సెల్ ఫోన్లో ఆ టి.వి. న్యూస్ ఛానెల్ వస్తోంది. మేమంతా ఆ సెల్ ఫోన్లో కనబడుతుంటే మాకే 'థ్రిల్' కలుగుతోంది.
    ఈ విషయం తెలుసుకునేసరికి కాలనీ లేడీస్ అందరూ ఒకర్నొకరు తోసుకుంటూ కెమెరా ముందు నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నారు.
    "ఇప్పుడు హైదరాబాద్ లోని రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ లో కెళ్ళి అక్కడ స్కూటర్ బాంబ్ పరిస్థితేమిటో మన ఛానెల్ జర్నలిస్ట్ రాజు నడిగి తెలుసుకుందా!
    "రాజు! ఇప్పుడక్కడ ఏం జరుగుతోంది?"
    "ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ వచ్చింది వెంగమాంబా! వాళ్ళు స్కూటర్ డిక్కీని తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తరువాత లోపలున్న బాంబుల్ని దిఫ్యూజ్ చేస్తారు వెంగమాంబా!.
    "ఈ సమయంలో ఆ బాంబ్ స్క్వాడ్ ఇన్ ఛార్జీగారేమంటున్నారు రాజూ!.
    "ఇప్పుడే అడిగి తెలుసుకుందాం వెంగమాంబా! హలో సర్ ఇప్పుడు ఈ బాంబ్ ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇంత రిస్కీ సిట్యుయేషన్ లో వర్క్ చేస్తోంటే మీకెలా అనిపిస్తోంది?"
    "ఏయ్ నీకేమయినా దమాకుందా? నీయవ్వ-బాంబ్ మా చేతుల్లోనే ఎక్కడ పేల్తుందో అని నానా టెన్షన్ తో మేము ఛస్తుంటే మధ్యలో మీ లొల్లి ఏంది? ఛల్ హట్!"
    "వాళ్ళు చాలా టెన్షన్ ఫీలవుతున్నారు వెంగమాంబా! ఎందుకంటే అది బాంబ్ తో వ్యవహారం కదా!" బాంబ్ స్క్వాడ్ వాళ్ళు స్కూటర్ డిక్కీ ఓపెన్ చేస్తూంటే చిన్నెత్తు శబ్దం కూడా లేకుండా సస్పెన్స్ తో చూస్తున్నారు అందరూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS