ఏమీ జవాబు చెప్పలేకపోయాడు.
"మాట్లాడరేం?"
"అన్నమాట నిజమే కాని....వాళ్ళ మాట కాదనలేను"
సీతలో సహనం నశించిపోతోంది. ముఖంలో చిరునవ్వు అంతరించింది.
"అంత కాదనలేనివారు మొదట్లో నా స్నేహాన్ని ఎందుకు ప్రోత్సహించారు?"
"అప్పట్లో...ఆకర్షణ తప్పించుకోలేకపోయాను?"
"కేవలం ఒకళ్ళు అన్నారని-యిప్పుడు తగ్గించుకోగలిగారా?"
మాట్లాడలేదు.
"ఎదుటివాళ్ళది ఒక హృదయమనీ, ఆ అమాయక స్పందనల ప్రభావం అంతవిడిచిపెట్టగలిగేది కాదని-గుర్తించలేరా?" ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
మెదలకుండా రాయిలా నిలబడిపోయాడు.
"అంతేనా?" ఆమెగొంతు వణుకుతోంది.
ధైర్యంచేసి ఆమె ముఖంలోకి చూశాడు"మ....రి.....అం.....తే..." అన్నట్లున్నాయి యీ చూపులు.
"సరే" ఆమె కదిలింది. వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏదో అంది.
ఆ మాటలతనికి యీ విధంగా వినిపించాయి.
"వొట్టి-కంది పచ్చడి."
ఉలిక్కిపడ్డాడు. వంటిమీద బురద చల్లినట్లయింది? ఏమన్నది? తననేమన్నది?
స్థాణువులా నిలబడిపోయాడు.
చీకటి పడ్డాక యింటికి వెళితే "యింత ఆలశ్యమైందేమిట్రా?" అనడిగింది సుందరమ్మగారు.
"కాలేజీలో మీటింగున్నదమ్మా."
కాసేపటికి ఆవిడ భోజనానికి పిలిస్తే "నాకాకలి లేదమ్మా" అన్నాడు గదిలోంచే.
"అదేమిట్రా! ఆకలి లేకపోవటం ఏమిటి? ప్రొద్దుట ఏం తిన్నావని? నీకిష్టమని కందిపచ్చడీ, పచ్చిపులుసూ చేశాను. లేలే."
వంటిమీద బురద.
సీతారామయ్యగారువచ్చారు. "ఏమిటంటున్నాడు?"
"ఆకలి లేదుట."
"ఆకలి లేకపోవట మేమిటి వాడి మొహం? కంది పచ్చడి వాడికిష్టమేగా? వడ్డించు వడ్డించు. యిద్దరం వస్తున్నాం.
నిజంగా ఆకలిలేదు. కాని కాదనటం ఎలాగో తెలియటంలేదు.
అన్నం ముందు కూర్చుంటే జయిల్లో ఉన్నట్లుగా వుంది. కంది పచ్చడి.....సీత వదిలిన బాణం. కందిపచ్చడి...సీత చూపులు...
ఆనాడు అన్నం రాఘవ కాబట్టి తినగలిగాడు.
* * *
ఆ తర్వాత కొంతకాలంబాటు సీతా వాళ్ళూ ఆ యింటి ప్రక్కనేవున్నా యిద్దరూ ఒకరొకొకరు లేనట్లేలెక్క. ఆ తర్వాత కొన్నాళ్ళకు వాళ్ళా యిల్లు ఖాళీచేసి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో, ఎలా వున్నారో అతనికి తెలియదు.
* * *
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు తెలిశాయి. రాఘవ పరీక్ష ప్యాసయ్యాడు. మూర్తిది పోయింది.
మూర్తి తండ్రి రామనాధంగారు యింత ఎత్థున్క లేచాడు. "ఒరేయ్! నువ్వు మొదట్నుంచీ చదువుమీద శ్రద్ద చూపలేదురా నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. పెద్ద వాళ్ళమాట కాదన్నావు. పుస్తకాలనీ, ఏవేవో వ్యాపకాలనీ అఘోరించావు. నీతోటివాడే ఆ రాఘవచూడు. చక్కగా పరీక్ష ప్యాసయ్యాడు. అతను పెద్దవాళ్ళ మాట విన్నాడు. నువ్వు మా మాటల్ని లెక్కచెయ్యలేదు. నువ్విలా పరీక్షలు తప్పుతూ కూర్చుంటే చదివించే స్తోమత నాకు లేదు. నీ యిష్టం ఏం చేసుకుంటావో చేసుకో-నేనుమాత్రం పట్టించుకోను."
ఆ రాత్రంతా అనంతమూర్తి దీర్ఘంగా ఆలోచించాడు.
అప్పట్నుంచే అతని జీవితంలో మార్పు మొదలయింది. రెండు రోజులు కష్టపడి ఊరంతా తిరిగి, ఓ ప్రెస్సులో కంపోజిటర్ పని సంపాదించాడు.
అతని ఉద్యోగం ఏమిటో తెలిసి తండ్రి మండిపడ్డాడు. తల్లి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంది.
అనంతమూర్తి చలించలేదు. పనిలోకి వెళ్ళటం మొదలుపెట్టాడు.
ఒకరకంగా చూసే అతను పనిచేసేది పెద్ద ప్రెస్సే మామూలు జాబ్ వర్కేగాక, ఆ ఊరినుంచి వెలువడే ఓమాస పత్రికా, అడపాతడపా పెద్దపెద్ద రచయితలు రాసిననవలలూ అచ్చవుతూ వుండేవి.
అతను మధ్యాహ్నం విరామసమయంలో భోజనానికి ఇంటికి వెళ్ళేవాడుకాదు. అక్కడే ఓ మాడిపోయిన బెంచీమీద నడుంవాల్చి, అచ్చుకోసం వచ్చిన వ్రాతప్రతులూ, ఆ మూల యీమూల పడివున్న పుస్తకాల గుట్టలు వెతికితే ఎన్నో అమూల్యగ్రంధాలు కనిపించేవి-అవి తిరగేస్తూవుండేవాడు. ఆకలేసినప్పుడు ఎదురుగుండావున్న మలబార్ హోటల్లోంచి రెండు పరోటాలు, టీ తెప్పించుకుని అదేభోజనంగా మార్చుకునేవాడు. ఆ ప్రెస్సులో ఓ పాతగది, చీకటి గుహలాంటిది వుండేది. అందులో పనికిరానివని పారేయబడి పాత పత్రికలు, పుస్తకాలరాసులు దొర్లుతూ వుండేవి. ఒక్కోసారి రాత్రిపూట అక్కడే వుండిపోయి ఆ రాసుల్లోపడిన పొర్లాడుతూ వుండేవాడు. ఆ చీకటికోణంలొ అతనిలో ఏవో వెలుగురేఖలు విచ్చుకుంటున్నట్లయేవి.
అవకాశం వచ్చినప్పుడల్లా చిన్న చిన్న కథలూ, గేయాలూ, వ్యాసాలూ రాస్తూ పత్రికలకు పంపిస్తూ వుండేవాడు.
రెండు మూడు రోజులకోసారి మూర్తి- రాఘవ కలుసుకోవటంమాత్రం మానలేదు.
రాఘవ యింటర్ ప్యాసయ్యాక బి.ఏ.లో చేరాడు.
అతను బి.ఏ. ప్యాసయ్యేసరికి మూర్తి కంపోజిటర్ నుండి ప్రూఫ్ రీడర్ గా మారాడు. రచయితగా కొంత పేరుకూడా వచ్చింది.
ఓరోజు ఉదయం మూర్తి ఆఫీసులో పనిచేసుకుంటూంటే బాయ్ వచ్చి అయ్యగారు పిలుస్తున్నారని చెప్పాడు. మూర్తి వెళ్ళేసరికి రఘురామయ్యగారు టేబిల్ ముందు ఏవో పేపరు చూసుకుంటూ కూర్చున్నారు.
అతన్ని చూసి తల ఎత్తి "కూర్చోమూర్తీ" అన్నారు సాదరంగా.
మూర్తికి ఆయనంటే ఎంతో గౌరవం. తన జీవిత గమనం నిర్దేశించబడింది-ఆయన సాన్నిధ్యంలోనే.
"ఫరవాలేదు సార్. చెప్పండి" అన్నాడు మూర్తి వినయంగా.
"చూడు మూర్తీ. నాకు ఓ పక్షపత్రిక పెట్టాలన్న ఆలోచన వచ్చింది. పెట్టినప్పుడు ఏదో నామ మాత్రంగా గాక అన్ని హంగులతో, పాఠకుల్ని కదిలించే శీర్షికలు వుండాలి. నువ్వు పత్రికల్లో అప్పుడప్పుడూ చేసే రచనలు చూస్తున్నాను. ఈ పత్రికల్లో ఓ శీర్షిక నువ్వెందుకు కండక్ట్ చెయ్యకూడదూ?"
