Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 6


    
    "మళ్ళీ ఇలా శ్రమపడితే గుండెల్లో నొప్పుస్తుంది. మీకు నొప్పి వచ్చిన ప్రతిసారీ నవీన్ ఎంత గిలగిలలాడిపోతాడో తెలుసుగా" అంది నిష్టూరంగా.
    
    దయామణి నవ్వేసి "అలాగే, ఇప్పటినుంచీ ఎవరు బట్టలు తెచ్చినా మా ధృతి కుట్టడానికి వీల్లేదంటోంది అని చెప్తాను. సరా" అంది.
    
    ధృతి కూడా నవ్వేసి "చీకటి పడుతోంది, కాండిల్స్ వెలిగించలేదేం?" అంటూ ఏసుప్రభు ఫోటో ముందున్న కొవ్వొత్తుల స్టాండ్ లో వున్న కొవ్వొత్తిని పక్కనే వున్న అగ్గిపెట్టె తీసి వెలిగించింది.
    
    ధృతి చేసే ఆ పనిని దయామణి అపురూపంగా చూస్తూ నిలబడింది.
    
    క్యాండిల్ వెలిగించాక ధృతి కళ్ళు మూసుకుని, చెంపలు వేసుకుని నమస్కరించింది.
    
    దయామణి తలమీదుగా కొంగు కప్పుకుని, క్రాస్ చేసుకుని, మోకాళ్ళమీద కూర్చుని ప్రార్ధన చేసుకోసాగింది.
    
    ఈలవేస్తూ లోపలికి వచ్చిన నవీన్ ఆ దృశ్యం చూసి కదలకుండా తలుపు దగ్గరే నిలబడిపోయాడు.
    
    ధృతి కళ్ళు తెరిచి నవీన్ ని చూసి "నీతో అర్జెంటుగా ఓ విషయం చెప్పాలి. బయటికిరా" అంది.
    
    "ఏమిటి? ఉద్యోగంలో చేరబోతున్నావా?" కొంటెగా అడిగాడు.
    
    "లేదు, ఆ విషయమే...." అంటూ ఇంట్లో జరిగినదంతా యధాతధంగా చెప్పేసింది.
    
    దయామణి లేచి టీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది.
    
    నవీన్ వెలిగిపోతున్న ధృతి మొహం చూస్తూ "ఇప్పుడేంచేస్తావూ??" అని అడిగాడు.
    
    "రేపు ప్రొద్దుటే వెళ్ళి మా వాళ్ళు అన్న విషయం చెప్పేస్తాను" అంది ఆనందంగా.
    
    దయామణి తెచ్చిన టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకున్నాక "పద నిన్ను ఇంటిదాకా దింపుతాను" అంటూ లేచాడు నవీన్.    

    ధృతి దారిపొడుగునా ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంది. నవీన్ కాస్త ముభావంగా వుండటం గమనించి "ఏమిటలా వున్నావు?" అని అడిగింది.
    
    అతను ఎప్పటిలా నవ్వేసి "ఏమీలేదే" అన్నాడు.
    
    ఆమె నిలబడిపోయి "లేదు ఏదో వుంది. నా దగ్గర కూడా దాపరికాలా?" అని తీవ్రంగా అడిగింది.
    
    అతను ఆమె భుజంమీద తట్టి "పద" అని నడుస్తూ "ఇందాకా వామనమూర్తి.... అదే ఆ కార్ల గారేజీ ఓనర్ కలిశాడు" అన్నాడు.
    
    "ఆ..... ఏమన్నాడూ?" అడిగింది.
    
    "రవి ఆయన దగ్గరకు వెళ్ళి చదువు ఆపేస్తానూ, పని నేర్పించండీ అన్నాడట" అని ధృతివంక చూశాడు.
    
    ధృతి మాట్లాడకుండా నడక వేగం పెంచింది.
    
    నవీన్ ఆమెని పలకరించే ప్రయత్నం చెయ్యలేదు. అతనికి ఆమె మనస్తత్వం బాగా తెలుసు. బాగా బాధలో వున్నప్పుడు ఎవరైనా ఓదార్పు మాటలు చెప్తే ఆమెకి ఏడుపొచ్చేస్తుంది. కానీ ఏడవటాన్ని ఆమె అసహ్యించుకుంటుంది. ఆ పరిస్థితి తెచ్చినవారిని కోపగించుకుంటుంది. అందుకే అతను ఆమెని పలకరించే ప్రయత్నం చేయలేదు. ఆమె మనసులో తమ్ముడు చేసిన పనికి ఎంత బాధపడుతుందో గుప్పెట బిగించి నడవటంలోనే తెలుస్తోంది. తనేమీ చెయ్యలేకపోతోంది. తమ్ముడు చదువు ఆపేసి చిన్నతనంలో మోటు పనులు చెయ్యబోతున్నాడు అన్న ఆలోచన ఆమెని నిలువునా దహించివేస్తోంది. ఇందులో వాడి తప్పు కూడా ఏమిలేదు. రవి చాలా తెలివైన విద్యార్ధి. చదువుమీద ఇష్టంలేక ఆ పని చేస్తాననడంలేదు. తండ్రి, అక్కా ఇల్లు నడపడానికి పడుతున్న అవస్థ చూడలేక ఈ నిర్ణయానికొచ్చాడు. అలా అనుకోగానే తమ్ముడి మీద జాలితో మనసంతా భారమయిపోయింది.
    
    ఆమె ఇల్లు దగ్గరపడుతుండగా చెప్పాడు నవీన్ "వాడిని ఏమీ అనకు".
    
    ధృతి బుద్దిమంతురాల్లా తల వూపింది. ఆమె నవీన్ మాటకి చాలా విలువనిస్తుంది. సాధారణంగా తోసిపారెయ్యదు.
    
    గుమ్మందాకా వచ్చి "గుడ్ నైట్" చెప్పి వెళ్ళిపోయాడతను.
    
    ధృతి కూడా "గుడ్ నైట్" చెప్పి లోపలికి నడిచింది.
    
    "త్వరగా కాళ్ళు కడుక్కునిరా! అందరూ నీ కోసమే అన్నాలు తినకుండా కూర్చున్నారు." అంది తల్లి.
    
    అందరూ అలా కలిసి భోజనాలు చేస్తుంటే, ఆ దృశ్యం చాలా మనోహరంగా వుంటుంది ధృతికి. తినేది చారు అన్నం అయినా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే చాలా తృప్తిగా వుంటుంది.
    
    "అక్కా! నాకు సైన్స్ లో నైన్టీ పర్సెంట్ ఖాయమట. మా ట్యూషన్ సార్ అన్నారు. కోచింగ్ తీసుకుంటే మెడిసిన్ సీట్ రావచ్చు కదక్కా!" కళ్ళు మిలమిలా మెరుస్తుండగా కృతి అడిగింది.    

    రవి చిరాగ్గా చూస్తూ "ముందు అన్నం తిను తరువాత తీరిగ్గా కలలు కనచ్చు" అన్నాడు.
    
    కృతి ఉడుక్కుంటూ "అలా అంటావెందుకూ? అక్కకి మంచి ఉద్యోగమొస్తే నన్ను చదివించదా?" అంది.
    
    ధృతి మనసంతా చేదుగా అనిపించింది. ఏమీ తెలియని అమాయకపు వయసు. లోకమంతా ఎంత అందంగా కనిపిస్తుందో కదా! తనకి ఉద్యోగం రావడం, కృతిని డాక్టర్ని చేయడం! అహో! ఎంత అందమైన ఊహ!
    
    రవి లేచి కంచం ఎత్తుకుని వెళుతూంటే, ఇందాక నవీన్ చెప్పిన విషయం గుర్తొచ్చి మనసంతా కలచివేసినట్లయింది.    

    "ఎంత తెలివైనవాడూ! చిన్నప్పటినుంచీ ఇంజనీర్ అవుతాననేవాడు. ఇంటర్లో చదువాపేసి కారు షెడ్లో, మాసిన బట్టలతో, బుగ్గలమీద ఆయిల్ మరకలతో, కారుకింద పడుకునీ...."
    
    "లే, లే.... లేచి చేయి కడుక్కుని తీరిగ్గా ఆలోచించు" అంటూ తల్లి విసుక్కోవడంతో ఈ లోకంలోకి వచ్చింది ధృతి.
    
                                                                 * * *
    
    "పదయిపోతోంది వెళ్ళాలి" పదోసారి అనుకుంది జడ అల్లుకుంటూ ధృతి. ఆ రోజు తల్లికి మళ్ళీ ఆయాసం తిరగబెట్టడంతో వంటపనీ, ఇంటిపనీ అంతా ధృతి మీదే పడింది. మనసు త్వరగా ధర్మానందరావు దగ్గరికి వెళ్ళి, ఇంట్లో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా తనవాళ్ళు తనని వదిలి వుండడానికి ఒప్పుకోవడంలేదని గర్వంగా చెప్పెయ్యమంటోంది.
    
    చెప్పులు తొడుక్కుని బయటికి రాబోతుండగా తల్లి మూలుగులు వినిపించి మళ్ళీ లోపలికి వెళ్ళింది. సుభద్ర కనుగుడ్లు తేలేసి, ఊపిరి అందక నానా తిప్పలూ పడుతోంది. కృతి తల్లి గుండెలమీద చేత్తో రాస్తూ ఏడ్చేస్తోంది. తండ్రి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేస్తే, ఆవిడ కాస్త నిద్రలోకి జారుకుంటుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS