Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 5


    సుభద్ర ఇంకేమీ మాట్లాడలేదు. కానీ ఆమె మౌనంలో ధృతికి ఎన్నో భావాలు గోచరించాయి.  'చదువుకున్న దానివని నీకు అహంకారం నీ మొండితనం నీదే కానీ ఏం చెప్పినా వినిపించుకోవు. ఆ క్రిస్టియన్ పిల్లాడితో నీకేమిటి స్నేహం?' అన్నట్లున్నాయి ఆ చూపులు. కానీ ధృతి అంటే ఉన్న కాస్త భయంవల్లా, వాళ్ళ ఆర్ధికపరిస్థితివల్లా ఆమె ఆ భావాలు కళ్ళల్లో మాత్రమే చూపిస్తుంది.
    
    "ప్రొద్దుటనగా రెండు మెతుకులు తిన్నావు అన్నానికి రా" అంటూ కంచం పెట్టింది సుభద్ర.
    
    ధృతి అన్నం గిన్నెల మూతలు తీసి చూసింది. అన్నం, చారూ, అరటికాయ వేపుడు ముక్కలూ వున్నాయి. "కూరముక్కలు తమ్ముడికి వుంచు" అంటూ చారూ, మజ్జిగతోటే భోజనం పూర్తిచేసింది ధృతి.
    
    రాత్రి.....ధృతికి చెరోవైపూ తమ్ముడూ, చెల్లెలూ పడుకున్నారు. చిన్నప్పటి నుంచీ అదే అలవాటు. కృతి అక్క పొట్టమీద ఓ చెయ్యివేసి, మెడ పంపులో తలదాచుకుని కబుర్లు చెపుతోంది.
    
    "తనకారోజు క్లాస్ టెస్ట్ లో మంచి మార్కులు వచ్చాయనీ, మెరిట్ రావచ్చనీ ట్యూషన్ సార్ అన్నారు" ఆనందంగా చెపుతోంది.
    
    ఇంతలో...."అయ్యో అక్కా!" నాటో నుదురు కొట్టుకుంటూ లేచి కూర్చున్నాడు రవి.
    
    "ఏమైందిరా?" అడిగింది ధృతి."
    
    వచ్చేటప్పుడు నీ కోసం శేఖర్ వాళ్ళింటి నుండి జామకాయలు కోసి తెచ్చాను. ఇవ్వడం మరిచిపోయాను" అన్నాడు బాధగా.
    
    "ఫరవాలేదు! ప్రొద్దుట తినచ్చు. చేసే రాచకార్యం ఏముందికనుకా?" అంది ధృతి.
    
    రవి అసంతృప్తిగానే పడుకున్నాడు.
    
    సీతారామయ్య కూతురి తల దగ్గరగా నేల మీద కూర్చుని ప్రధాన మంత్రి అమెరికా పర్యటన గురించీ, గ్యాస్ సిలిండర్ ధర మళ్ళీ పెరగడము గురించీ మాట్లాడుతున్నాడు.
    
    "అబ్బ! దాన్ని పడుకోనివ్వండీ! బిడ్డ అలిసిపోయి వచ్చింది" అంటోంది సుభద్ర.
    
    ధృతికి కళ్ళు మూసుకుంటే ధర్మానందరావుగారూ, ఆయనతో జరిగిన వాదనా గుర్తురాసాగింది.
    
    నిద్రలో తనకి మరింతగా దగ్గరగా జరుగుతున్న చెల్లెల్నీ, తను జామకాయలు తినలేదన్న బాధలో అటు తిరిగి బాధపడుతూ పడుకున్న తమ్ముడ్నీ, తను ఎంతో తెలివైనదన్న నమ్మకంతో ప్రతి విషయం తనతో చర్చించే తండ్రినీ, అనుక్షణం తన బాగోగులు చూసుకునే తల్లినీ వదిలి తను వెళ్ళగలదా? అసలు ఆయన మాట్లాడిన విషయం చెప్తే వీళ్ళు ఏమంటారో? ఆ ధర్మారావుగారిని తిడతారేమో అనుకుంటే ఆమె పెదవుల మీదకి చిరునవ్వు చేరింది. అంతలోనే ఆయన మీద జాలి కూడా కలిగింది. ఆ రోజు మామూలుగా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు "ధర్మానందరావుగారికి ప్రేమాభిమానాల విలువ తెలిసేటట్లు చెయ్యి స్వామీ" అని కూడా మొక్కుకుని పడుకుంది.
    
                                                            * * *
    
    ధృతి పెరట్లో మామిడి చెట్టు క్రింద మంచం వాల్చుకుని పడుకుంది. కాస్త దూరంలో సుభద్ర రోట్లో పచ్చడి రుబ్బుతోంది. 'రిథమిక్' గా వినిపిస్తున్న పొత్రం చప్పుడు వింటూ నిన్నటి ఇంటర్వ్యూ సంగతి ఎలా చెప్పాలా? ఎవరితో చెప్పాలా? అని ఆలోచిస్తోంది ధృతి.
    
    "ఒంట్లో బాగాలేదేమో, పడుకోనిద్దురూ!" అంది సుభద్ర.    

    "సరే అయితే" అంటూ ఆయన వెళ్ళిపోబోయాడు.
    
    ఉపయోగపడని ప్రశాంతత కంటే ఉపయోగపడే సంఘర్షణే మేలు అన్న నిశ్చయానికొచ్చిన ధృతి లేచి కూర్చుంటూ "నాన్నా" అని పిలిచింది.
    
    ఆయన ప్రశ్నార్ధకంగా చూస్తూ దగ్గరకొచ్చాడు.
    
    "నిన్న ఇంటర్వ్యూలో...."
    
    "పోనీలే అమ్మా! ఇది కాకపోతే మరొకటీ.." అనునయంగా అన్నాడాయన.
    
    "అదికాదు నాన్నా! అసలు ఏమైందంటే..." అంటూ మొత్తం పూసాగుచ్చినట్టు చెప్పింది. కానీ తమ మధ్య పందెం ప్రసక్తి దాచిపెట్టింది.
    
    సుభద్ర కొంగుకి చేతులు తుడుచుకుంటూ వచ్చి "ఏమిటీ! వయసులో వున్న పిల్ల, ఒంటరిగా వుండడమా?" అంది.    

    "మరి నువ్వేం నిర్ణయించుకున్నావూ?" అడిగాడు సీతారామయ్య.
    
    "మీతో సంప్రదించి చెపుతానన్నాను" అంది ధృతి
    
    "ఏమిటే సంప్రదించేది నీ మొహం! తల్లీ, తండ్రి ఇంకా బ్రతికే వున్నాము. నీ సంపాదనకి ఆశపడి అలా ఒంటరిగా వదిలిపెట్టేస్తాం అనుకున్నావా?" అంటూ గయ్యిమంది తల్లి.    

    ఈ గొడవకి కృతీ, రవీ కూడా మంచం మీద కూర్చుని అక్కచెప్పేది వినసాగారు.
    
    "జీతం పదహారు వందలిస్తామన్నారు...." అంటూ తల్లిదండ్రుల మొహాల్లోకి చూసింది ధృతి.
    
    తండ్రి మధ్యలోనే అందుకుంటూ "ఎంతయినా మనకి అనవసరం. అలా ఆడపిల్లని ఒంటరిగా వదలలేమమ్మా! ఈ ఉద్యోగం మనకి సరిపోయేదికాదు. ఒద్దని చెప్పిరా" అన్నాడు.    

    కృతీ, రవీ కూడా "అక్కా! నువ్వు లేకుండా మేము ఉండలేము. నువ్వు మాత్రం వుండగలవా?" అన్నారు బిక్కమొహాలతో.
    
    ధృతికి ఆ నిమిషంలో చాలా తృప్తిగా పోటీలో మొదటి మెట్టు గెలిచినంత ఉత్సాహంగా అనిపించింది. ఈ విషయం ఇప్పటికిప్పుడే ఆయనకి తెలియజేయాలన్నంత కోరిక కలిగింది. పదహారొందలంటే వారి స్థితికి చిన్నమొత్తం కాదు.
    
    "సరే! ఇంట్లో ఒప్పుకోవడంలేదని ధర్మానందరావుకి చెప్పేస్తాను" అంది సంతోషంగా అయినా సణుగుతూనే వున్న తల్లిని చూసి నవ్వుకుంది.    

                                                           * * *
    
    "ఆంటీ! మళ్ళీ మిషన్ కుట్టడం మొదలుపెట్టారా?" అంటూ లోపలికి అడుగుపెట్టింది ధృతి.
    
    దయామణి తలెత్తి చూసి "రామ్మా రా! ఇప్పుడే.... ఈ జాకెట్టు అర్జెంటు అంటేనూ..." అంది కాస్త తడబడుతూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS