సుమారు ఓ గంటకు నా పక్క నెవరో కదిలినట్టనిపించింది. కళ్ళు తెరచి చూచాను. భూషణం లేచి సూరీడు వంటిమీద చెయ్యివేసి లేపుతున్నాడు. సూరీడు లేచి "ఏమిటి బాబూ" అంది. భూషణం జేబులోంచి డబ్బుతీశాడు. మెల్లగా అంటున్నాడు "నా మనసు తీర్చు -యిదిగో డబ్బు"
సూరీడు ఇటూ అటూ చూసింది. చిన్నగా నవ్వింది. "అందుకు డబ్బెందుకు బాబూ" అంది.
"అయితే" -ఆశగా అడిగాడు భూషణం.
"నే నలాంటిదాన్ని కాను. పోయి పడుకో అయ్యా. నవ్వుతారు కూడా" అంటూ మరోవైపు తిరిగి పడుకుంది.
భూషణం అనుమానంగా చూస్తూ నాపక్కకివచ్చి పడుకున్నాడు. రామచంద్రం గుర్రు బరుకు బరుకుమంటూ వినిపిస్తోంది. నేను నవ్వాపుకుని పడుకున్నాను. గుడిసె బయట మేకపిల్ల అరుస్తోంది.
భూషణం నన్ను లేపుతున్నాడు. "లేరా లే -బస్సు వచ్చే వేళయింది" అంటున్నాడు. ఉలిక్కిపడి లేచాను. తెల్లారిపోతోంది. గుడిసె చూరులోంచి చీకటి పలచబడిపోవడం కనిపిస్తుంది. రామచంద్రం అంటున్నాడు."అంత మొద్దునిద్ర పోయేవాడు పరీక్షలో ఏం చదువుతాడు?" మంచి గంభీరంగా ఉత్సాహంగా వుంది రామచంద్రం గొంతు. రాత్రి మేం పడిన బాధ భయమూ అంతా పీడకల ఏమో అనిపించినట్టుంది. రామచంద్రం తీరుచూస్తే. రామచంద్రం మామూలు పెద్దమనిషి, శ్రీమంతుడూ, టెన్నీస్ ఛాంపియనూ అయిపోయాడు.
"నువ్వేం తీసుకోనన్నావుట సిద్దయ్యా. నాకు తృప్తిగాలేదు" అన్నాడు రామచంద్రం.
"మంత్రం పట్టివ్వదు బాబూ. పైగా బెడిసికొడుతుంది. బాబూ. బస్సు వచ్చేస్తుంది" అన్నాడు సిద్దయ్య.
సిద్దయ్యా, కూతురూ ముందు నడుస్తూంటే వెనకాల మేం వెళ్ళాం. అడవి అంతా మేల్కొంది. పక్షుల కిలకిలలతో కోలాహలంగా వుంది. కాళ్ళకి చల్లని గడ్డీ, ఆకులూ తగిలి జివ్వుమంటోంది. అర్ధరాత్రి భయంకరంగా ఉన్నా అడవి ప్రాతః కాంతిలో పచ్చపచ్చగా ఠీవిగావుంది..సూరీడు దారిలో తీగలు మా కాళ్ళకి తగలకుండా పక్కకు వంచుతోంది. ఒడ్డూ పొడుగూ నల్లటి పెద్ద జుట్టువున్న ఆమె ఆ అడవిలాగ స్వచ్ఛంగా , ప్రాకృతికంగా కనిపించింది.
రోడ్డుమీదకి వచ్చి నిల్చున్నాం. సిద్దయ్యా, కూతురూ "ఇంక మేం వెళ్ళివస్తాం బాబయ్యా సెలవు తీసుకుంటాం" అన్నారు.
"ఎప్పుడైనా మా వూరు వస్తే కనిపించు సిద్దయ్యా. నీ కూతుర్ని కూడా తీసుకురా, బహుమతి తీసుకుందువుగాని" అన్నాడు రామచంద్రం కృతజ్ఞతాభావం ఉట్టిపడేలాగ.
"చిత్తం" అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటూ అటూ చెట్లు బారులు తీరిన రోడ్డు లేత వెలుగులో ఎంతో అందంగా వుంది. చల్లని గాలి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. "చిరుతపులులు ఈ అడవిలో కనిపించవేం మామయ్యా" అన్నాను నేను, రాత్రి సంఘటనని తలచుకుంటూ.
"ఆగరా వెధవ పులులూ నువ్వూ. కలక్టరుగారింటికి వెళ్ళి వేళకు చేరుకోకపోతే" భూషణం ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఎన్నో బాధ్యతలూ గౌరవాలూ వహించవల్సిన మామయ్య విద్యుక్తధర్మం మరచిపోడు.
"పాపం వాళ్ళేం తీసుకోలేదు" అన్నాడు రామచంద్రం తన ప్రాణదాతల్ని గురించి. "అన్నట్టు భూషణం -మన కారు!" అన్నాడు.
కారు దగ్గరికి వెళ్ళాం. తడిసిపోయివుంది మంచులో. తణుకు వెళ్ళగానే దీన్ని తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని నిశ్చయించారు.
"ఒరేయ్ రామచంద్రం ఈ వెధవ కారు అమ్మేసేయ్. ఇప్పటికైనా నా మాట విను" అన్నాడు భూషణం.
"ఇలా అమ్మితే అంతా నష్టమే. రిపెయిర్ చేయించి రంగు వేయించి కండిషన్ లో పెట్టి అమ్ముతాను. భూషణం! ఇన్ని సెకండ్ హాండ్ కార్లు కొన్నాను. ఒక్కదానిలో అంటే ఒక్కదానిలోనైనా నష్టం వచ్చిందా?" అన్నాడు రామచంద్రం గర్వంగా.
"బాబయ్యా" అని అడవిలోంచి కీచుగా కేక వినపడింది. అందరం అటు చూశాం. సూరీడు పరుగెత్తుకు వస్తోంది.
"బాబూ మా అయ్యని పాము కరచింది. ఒక్కసారి రండి బాబూ. రండి" వగరుస్తోంది సూరీడు. ఆమె కళ్ళల్లో భయం సుళ్ళు తిరుగుతోంది.
"అరెరెరె!" - అన్నాడు భూషణం. అందరం ఈ దుర్వార్తకి స్తంభించిపోయాం.
"రండి బాబూ సగం దూరం వెళ్ళగానే వేరుముక్క కోసం పొదలో చెయ్యిపెట్టి మొక్క పీకబోయాడు బాబు. బుస్సునలేచి కాటువేసింది. తాచు బాబూ తాచుపాము" సూరీడు దీనంగా అడుగుతోంది.
