Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 53

    సిద్దయ్య రెండు చిరిగిన సంచుల్ని ఒక పక్కగా పరచి  "కొంతసేపు పరుండండి బాబూ" అన్నాడు. రామచంద్రం పాలు తాగి నిద్రపోయాడు.

    "అలసిపోయారు బాబుగారు. రెండు జాంపళ్ళు కోసి ఇవ్వనాండీ "అంది సూరీడు.

    "నిజమే , ఏదేనా తినాలనిపిస్తోంది." అంటూ గోనెపట్టామీద చతికిలబడి  "ఏం సిద్దయ్యా నీ అల్లుడేం చేస్తున్నాడు?" అన్నాడు భూషణం.

    "మొగుణ్ణి ఒగ్గేసింది బాబూ మా సూరీడు"

    "ఏం?" అన్నాడు ఉలిక్కిపడి భూషణం.

    "వాడంటే మొదటినుంచీ దీని కిష్టంలేదు బాబూ. వద్దు వద్దంటుంటే నేనే బలవంతాన పెళ్ళిచేశాను" అన్నాడు సిద్దయ్య.

    "కట్టుకున్న మొగుణ్ణి వదిలెయ్యడమే!"  ఆశ్చర్యంగా అన్నాడు భూషణం, "పాపం సుమీ సిద్దయ్యా"

    "ఇష్టం లేకపోతే కాపురమెట్టా చెయ్యడం బాబూ నా కర్ధంకాదు" అంది సూరీడు. కోడిగుడ్డుదీపం ముందు కూర్చొని చాకుతో జామిపళ్ళు ముక్కలకింద కోస్తోంది. మధ్య మధ్య మొహంమీద పడే జుట్టుని చేత్తో వెనక్కి తోసుకుంటోంది. చామనచాయ రంగైనా, నవలావణ్యంతో అంగసౌష్టవంతో ఆమె ఆకర్షణీయంగా ఉంది. నుదుటిమీద గీరుకుపోయిన చార లేత ఎరుపుతో మెరుస్తోంది.
 
    "నాతోనే చాలాకాలం తిప్పుకున్నాను బాబూ మా సూరీడిని. సికాకుళం, సాలూరు, బొబ్బిలీ -ఇవన్నీ తిరిగొచ్చాం . తాచునుపట్టి గరళం తీయడంలో నాదే పేరండి ఆ రోజుల్లో. ఇప్పుడు శరీరంలో జవ పోయింది. ముసలి వాణ్ణయిపోయాను. నా సూరీణ్ణి చూచుకునే బతుకుతున్నాను. దానికైనా నేను తప్ప ఎవరూ లేరు సామీ. చంద్రంబాబు ఎప్పుడొస్తాడో ఏమో....." అన్నాడు సిద్దయ్య.

    "అతనెవరు?" భూషణం ప్రశ్నించాడు.

    "నూజివీడులో సూరీడు కా బాబుతో సావాసం అయింది. ఒకరి కొకరు పడిచచ్చేవారు. ఈ చంద్రంబాబు పెద్దింటి అబ్బాయి బాబూ.  సూరీడునే పెళ్ళాడతానన్నాడు. తండ్రి కోపం వచ్చి ఇంట్లోంచి తగిలేశాడు. ఆ పోక పోక ఎక్కడికి పోయినాడో సామీ, ఉద్యోగం సంపాదించుకుని వస్తానని చెప్పిపోయాడు సూరీడుతో. నాల్గునెలలాయె. అతీ గతీ లేదు. సూరీడు కడుపులో బిడ్డ చంద్రంబాబు బిడ్డే బాబూ"  అన్నాడు  సిద్దయ్య. "చంద్రంబాబు రాకపోతే దీని గతేంకానా అని బెంగ బాబూ. అతనిమీదే ధ్యాస...."

    "తప్పకుండా వస్తాడు బాబూ. ఎప్పటికైనా వస్తాడు. ఎందుకు రాడు? నన్నిడిసి వుండగలడా?" సూరీడు కళ్ళల్లో విశ్వాసం మెరుస్తోంది.

     "ఎన్నవ నెల నీ కూతురుకి" అని అఢిగాడు భూషణం.

    "నాల్గోనెల బాబూ."

    సూరీడు జామిపండు ముక్కల్ని తీసుకువచ్చి ఎదురుగా పెట్టింది. నన్ను కూడా తీసుకోమన్నాడు భూషణం. నాకు నిద్ర వచ్చేస్తుంది. సిద్దయ్య లేచి "మేం కూడా కొంచెం నడ్డి వాలుస్తాం బాబూ. కాసేపు పరుండండి" అన్నాడు!

    "నీ మేలు మరిచిపోను సిద్దయ్యా. నీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియడంలేదు. డబ్బు తీసుకోనన్నావు."
   
    "డబ్బు ఎంతచేస్తుంది బాబూ, మీ దయవుంటే చాలు. బాబూ నేను గుడిసె అవతల పడుకుంటాను. లోపల చోటులేదు. అవసరమైతే పిలవండి" అన్నాడు సిద్దయ్య.

    "వద్దు బాబూ, చలివేస్తది" అంది సూరీడు.

    "చూరుకింద కంబళీ కప్పుకుని పడుకుంటాను, నువ్వు పడుకో"

    "సిద్దయ్యా ఆరుగంటలకి బస్సులో వెళ్ళిపోతాం. కలక్టరుగారింట్లో పెళ్ళి సమయానికి వెళ్ళాలి. ఇప్పుడు దాదాపు మూడుగంటలయింది. ఒకవేళ మెలకువ రాకపోతే లేపుసుమీ" అన్నాడు నాగభూషణం ఆవలిస్తూ.

    "చిత్తం" అని సిద్దయ్య కంబళి తీసుకువెళ్ళాడు. రామచంద్రం ప్రక్కగానే నేలమీద గుడ్డ పరచి సూరీడు పడుకుంది. భూషణం నావైపు తిరిగి  "వీళ్ళకి నీతిలేదు. ధర్మంలేదు చూశావా" అని మెల్లగా అన్నాడు. నాకు నిద్ర ముంచుకువచ్చేస్తుంది. అడవిలోంచి అస్పష్టరవాలు ఏవో వినపడుతూనే ఉన్నాయి. నాకు నిద్ర పట్టేసింది.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS