నవ్వుకున్నాను. బయట పడ్డాను. ఆడది, మరో దారి లేనిది. అలా అవేశపడడానికి మించి మరేం చేయగలదు? ఆమెకు మరి కాస్త టైమిచ్చి - నన్ను వివాహం చేసుకో దల్చుకుంటే అభ్యంతరం పెట్టను. నాలుగు లక్షల కోసం కోర్టు ఎక్కడం కంటే అదే మంచిదని పించింది. చూడాలి- ఏమవుతుందో?
5
"నాకు విరేచనాలవుతున్నాయి. నేను రాలే నన్నయ్యా" అంది చెల్లాయి.
గురువారం కొండ కార్యక్రమం చెల్లాయి లేకుండా ఎలా? ఒకప్పుడైతే ఈ కార్యక్రమాన్ని సుబ్బారావుని హత్య చేయడం కోసం ఏర్పాటు చేశాను. చివరి క్షణాల్లో చెల్లాయిని రాకుండా చేయాలని కూడా అప్పుడనుకున్నాను. అయితే ఇప్పుడు అలాగే జరిగింది. కానీ చెల్లాయి రావాలి ఈసారి ఇప్పుడు హత్య ప్రసక్తి ఏమీ లేదు గదా?
"సుబ్బారావు చాలా డిజప్పాయింట్ అవుతాడు మరి!" అన్నాను.
"ఈమధ్య మాటిమాటికి సుబ్బారావు ప్రసక్తి తీసుకుకోస్తున్నావ్ . కారణం తెలియడం లేదు -" అంది చెల్లాయి చిరాగ్గా.
"నిజంగా తెలియదూ నీకు -" అన్నాను చిలిపిగా.
"ఒట్టు -"
"సుబ్బారావు ని నువ్వు రహస్యంగా కలుసుకుంటున్న సంగతి నాకు తెలియదను కున్నావా?' అన్నాను.
"చా - అవెం మాటలు - అతగాడితో నాకేం పని."
"ఏమో నాకు తెలియదు. చూసింది చెప్పాను - అంతే!"
'అన్నయ్యా - నాక్కోపం వచ్చేస్తుంది మరి -- అలాంటి మాటలంటే నిజంగా నీ మిత్రుడి గా తప్పితే వ్యక్తిగతంగా అతగాడితో నాకే పరిచయమూ లేదు."
నాకు కోపం వచ్చింది. "అయితే అతనింట్లోంచి నువ్వు రావడం చాలాసార్లు చూశాను." అన్నాను చిరాగ్గా. చూసింది ఒక్క మారే అయినా.
"అతని ఇంట్లోంచి అనకు దొడ్డి గుమ్మం లోంచి అను. అప్పుడు కరెక్టు!"
'అంటే?" అన్నాను కాస్త ఆశ్చర్యంగా.
"నన్ను క్షమించు అన్నయ్యా- సంసారం నడపడానికి నువ్విచ్చే డబ్బు చాలడం లేదు. అందుకని వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా ఉంటుందని నేను ప్రయివేట్లు చెబుతున్నాను. సుబ్బారావు ఇంట్లో అద్దె కుంటున్న రామశర్మ గారి కూతుళ్ళకు - నే నేర్చుకున్న సంగీతాన్నీ విధంగా సక్రమ వినియోగం చేస్తూ -- నెలకు యాభై రూపాయలు అదనంగా సంపాదిస్తున్నాను."
నా తల తిరిగింది. "కానీ ...సుబ్బారావు ...."
"సుబ్బారావా! అతగాడు తలిదండ్రు లూళ్లో లేనప్పుడల్లా పనిమనిషితో కులుకుతాడని వదంతి ఉంది. నిజానిజాలు తెలియవు మరి."
నేను ఆలోచిస్తున్నాను. చెల్లాయి ఇంకా చెబుతోంది. "ఆ అనామకుడిని ప్రేమించవలసిన గతి నాకేం పట్టింది. రామశర్మ గారి స్నేహితుడొకాయన నన్ను చూసి వివరాలడిగి తెలుసుకు వెళ్ళాడు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళట. బహుశా తన కొడుక్కి నన్ను చేసుకోవడం విషయంలో త్వరలో నీ దగ్గరకు రావచ్చు కూడా --"
నా బుర్ర చాలా తీవ్రంగా పనిచేస్తోంది. సుబ్బారావు నేననుకున్నట్లు బుద్ది మంతుడు కాడు. బహుశా వాడు నా చెల్లెలిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడనుకుంటాను. నా అనుమాన పరిస్థితి కనిపెట్టి నెమ్మదిగా నన్ను మోసం చేశాడు. వీడు ఎంతకైనా తగినవాడు. వేడిని బ్రతకనివ్వ కూడదు.
చెల్లాయి నడిగాను." సుబ్బారావెప్పుడైనా నీ దగ్గర పొరపాటుగా ప్రవర్తించడం గానీ ....."
అది కొద్దిగా జంతుకున్నట్లు కనబడింది. ఒక్క క్షణం ఆగి -- "నీ స్నేహితుడనీ, బాధపడతావనీ నీకు చెప్పకుండా ఊరుకున్నాను. కానీ - ఒకసారి ఇంట్లో నేనిక్కర్తీనీ ఉన్నప్పుడు మనింటికి వచ్చి నా చేయి పట్టుకున్నాడన్నయ్యా! నన్ను ప్రేమించాననీ, పెళ్ళి చేసుకుంటాననీ అన్నాడు. సమాధానంగా చెంప వాయగొట్టాను. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరేం జరుగలేదు. నిజం చెప్పాలంటే అతగాడితో రావడం ఇష్టం లేకనే ఈరోజు విరోచనాలని చెప్పాను. నన్ను బలవంత పెట్టోద్దన్నయ్యా!" అంది.
నా పిడికిళ్ళు బిగిశాయి. ఇంక సుబ్బారావు బ్రతకడు. సుమతి ఎంతగానో సంతోషిస్తుంది. ఈ వార్తతో సోమవారం నాడు ఆమెను ఆశ్చర్య పరచాలి. సుబ్బారావుని చంపడం ద్వారా నా చెల్లెల్ని భగ్న ప్రేమికురాలిని చేస్తున్నానన్న భయం లేదిప్పుడు నాకు. అయితే వాడిని చంపబోతున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఆఖరికి నా చెల్లెలికి కూడా...
అందుకే ఆమెతో - "అయితే ఈరోజు కార్యక్రమం క్యాన్సలైపోయింది. వాడొక వేళ మనింటికి వస్తే - ఏదో అర్జ్జంటూ పని మీద బయటకు వెళ్ళాలని చెప్పు -" అని బయట పడ్డాను. కానీ నేను తిన్నగా వాడి ఇంటికే వెళ్ళాను. వాడు నా కోసం ఎదురు చూస్తున్నాడు.
"ఆదివారం - గురువారం కొండ -" అని నవ్వాడు.
"రెండూ కలిపితే నీ చావు --' అనుకుని నవ్వుకున్నాను.
"చెల్లాయి ఆరోగ్యం బాగాలేదు. రాలేనంది. ప్రోగ్రాం అపు చేయడం ఇష్టం లేక నేనొక్కడినే వచ్చాను-"
"మంచి పని చేశావు . అలాంటి కొండ ప్రాంతాలకు ఆడవాళ్ళు రాకపోవడమే మంచిది -" అన్నాడు వాడు.
ఇద్దరం బయల్దేరాం.
గురువారం కొండ దూరానికి రెండు కొండల మధ్య నుంచి కనబడుతూ ఉంటుంది. ప్రదేశం కాస్త భయంకరమైనదే అయినా అప్పుడప్పుడు జనం పిక్నిక్ కార్యక్రమాలు వేస్తుంటారక్కడికి. కానీ కొన్ని ప్రాంతాలకు ఎవ్వరూ వెళ్ళరు. భయంకరమైన నిశ్శబ్దం . నిర్జనత్వం . ఆ ప్రాంతాలను కూడా భయంకరం చేశాయనుకుంటాను. కానీ ఇప్పుడు మేము అటువంటి ప్రాంతానికే వేడుతున్నాము. కొండ వెనుక వైపు మధ్య ప్రాంతంలో ఒక చిన్న గుహ ఉంది. ఒకసారి కాలేజీలో స్నేహితులతో వచ్చినప్పుడు నేను కాస్త ధైర్యం చేసి తిరగడంతో ఆ గుహ కనుగొన్నాను. హత్య చేయడానికి ఆ గుహను మించిన ప్రదేశం లేదు. జేబులు తడుముకున్నాను. కత్తి పిడి తగిలింది. కత్తి కూడా సామాన్యమైనది కాదు. విషం పూసిన కత్తి అది. ఒకే ఒక్క పోటుతో మనిషి ప్రాణాలు తీస్తుంది. ఆతర్వాత.....
"ఇటువంటి ప్రయానామ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది." అన్నాడు సుబ్బారావు.
"అవును!"అన్నాను. మళ్ళీ ఇలాంటి ప్రయాణాలు చేయవు పాపం అని మనసులో అనుకున్నాను.
"ఎక్కడికి వెడుతున్నాం మనం ఇప్పుడు-"
"ఒక చక్కని గుహకు వెళ్ళడం కాస్త కష్టమే అనుకో - అయినా థ్రిల్లింగ్ గా ఉంటుంది -"
గుహను చేరాం. లోపలికి మెట్లున్నాయి. దిగాం. ఎక్కడ్నించొ కన్నం ద్వారా కాంతి వస్తోంది. గుహలో గునపం, పార, రెండు తట్టలు ఉన్నాయి. నాకు పూర్తీ ఆశ్చర్యమూ, భయమూ కూడా కలిగాయి-- "ఇక్కడికి ఎవరూ రారనుకున్నానే -- వస్తువులేమిటి?' అన్నాను.
"ఇది హత్యకు చాలా అనువైన ప్రాంతం. హత్య చేసేక హతుడిని పాతి పెట్టడాని కయుంటాయి-" అన్నాడు సుబ్బారావు తాపీగా. అంతే కాకుండా - "నన్నీలాంటి ప్రదేశాని కెందుకు తీసుకొచ్చావు?' అని కూడా అడిగాడు.
"భయం గా ఉందా?' అన్నాను.
"భయమంటే తెలియదు నాకు. కానీ నీ ఉద్దేశ్యమేమిటీ అని?' అన్నాడు.
వాడంత సూటిగా అడిగితె కాస్త జాలే వేసింది. అయినా ఎలా తట్టుకుంటాడో చూద్దామని పించింది . "నిన్ను చంపాలని తీసుకు వచ్చాను. అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నాను చంపనా, మాననా అని. ఏం చేయమంటావ్ ?' అన్నాను.
వాడేక్కడా తొణకలేదు. బెణకలేదు - "ఇటువంటి విషయాల్లో నా కనుభవం లేదు. నేనేదైనా అనుకోవడమే కానీ- చేయనా, మాననా అని ఆలోచించడమనేది ఉండదు. ఉదాహరణకు నిన్ను నేను చంపా లనుకున్నాననుకో ఇక్కడికి తీసుకు వచ్చేక గునపాలను, పారలనూ చూసి ఆశ్చర్యపడను. ముందుగా నేనే అక్కడ పెట్టి ఉంచుతాను -" అన్నాడు.
ఉలిక్కిపడ్డాను. "అంటే?' అన్నాను.
"ఏం లేదు కానీ మన మిక్కడికి వచ్చిన పని చెప్పు-" అన్నాడు.
యేమని చెప్పాలో తెలియలేదు. ఆలోచిస్తున్నాను.
"సరే నువ్వు ఆలోచించుకుని చక్కని అబద్ద మొకటి కల్పించు. ఈలోగా నేను నిజం చెబుతాను. ఇలాంటి ప్రదేశానికి నువ్వు రమ్మనపుడు నేనంగీకరించానంటే కారణం తెలుసా?' అని అడిగాడు.
"ఊ చెప్పు -" అన్నాను గాబరాగా.
"నేను నిన్ను చంపాలి కాబట్టి -" అన్నాడు.
"ఎందుకు?" అన్నాను తడబాటు నణుచుకుంటూ.
"సుమతి కోసం ?' అన్నాడు.
"అంటే?"
"మొన్న సుమతి నాకు కబురంపింది. తను నీతో కలిసి నన్ను చంపాలని వేసుకున్న పధకం గురించి చెప్పింది. నిన్ను చంపితే చాలు. తను ఏమై పోయినా ఫరవాలేదంది. నన్ను చంపాలనుకున్నందుకు క్షమార్పణ కోరింది. నీలాంటి మోసగాడి చెల్లెలి ని నేను వివాహ మాడ రాదంది.
'అప్పుడు నేనేం చేశానో తెలుసా? బాగా తర్జన భర్జనలు చేసి ఒక పధకం వేశాను. ఎంతకాల మానుకుంటావు - ఒకే ఒక గంట - ఆ ప్రకారం నేను రామన్న పంతులు కొడుకుని కాదనీ, అయన చెల్లెలి కొడుకుననీ సుమతి నీ నమ్మించాను. ఎందుకో తెలుసా? సుమతిని పెళ్ళి చేసుకోడానికి. రామన్న పంతులు రాసిన విల్లులో నాకూ ఆయనకూ ఉన్న బంధుత్వ ప్రసక్తి లేదుట. నా వివరాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఆస్తిలో వాటానీ, సుమతినీ పొందగలను.
"అయితే సుమతి నిన్ను వివాహం చేసుకుంటానని రాసి ఇచ్చింది. 4 లక్షల కు ప్రామిసరీ నోటు రాసిచ్చింది. కాబోయే భార్యగా నేనామెను ఈ ఇబ్బంది నుండి రక్షించాలి. నేను కూడా నీకో కాగితం రాసిచ్చేను. వీటన్నింటినీ నీ దగ్గర్నుంచి తిరిగి తీసుకునే ప్రయత్నం చేయడం కంటే -- నిన్ను అంత చేయడం - అందులోనూ సుమతిని మోసం చేయబోయిన నేరానికి- నిన్ను అంతం చేయడం ముఖ్యమనిపించింది. నిన్ను చంపి - ముక్కలు ముక్కలుగా నరికి ఫర్లాంగు కో గొయ్యి చొప్పున తీసి పాతి పెడతాను.
"ఇక్కడున్న ఈ గునపం, పార- నేను నిన్ననే ఇక్కడ పెట్టాను. నీ చెల్లెలు నీతో రాదనీ నాకు తెలుసు. ఈ ప్రాంతానికి నన్ను నువ్వు తీసుకొచ్చే అవకాశ ముందని కూడా నాకు తెలుసు. అందుకే నిన్ను ఇక్కడ చంపాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చెప్పు . నన్ను నువ్వు ఇక్కడికి కెందుకు తీసుకు వచ్చావు?' అన్నాడు.
నాకు సరిగ్గా మాట రాలేదు. ఎదురుగా సుబ్బారావు కనిపించలేదు. ఒక భయంకరాకారుడు నిలుచున్నాడు.
వాడు నవ్వుతున్నాడు. "సుమతి నీకు సుమారు వారం రోజుల క్రితం ఈ కార్య భారాన్నప్పగించింది. నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు- ఏం చేయడమా అని! రెండు రోజుల్లో నేను చెల్లెలిని మరదలుగా మార్చి - అడ్డాలన్నీ తొలగించుకుని అష్టయిశ్వర్యాలనూ అనుభవించబోతున్నాను-"
నిజమే - వాడి నిర్ణయం అలాంటిది. వాడికి వావివరసలు లేవు. బంధుత్వపు మమకారాలు లేవు. అనుకున్నది సాధించి తీరతాడు. ఇటువంటి వాడిని వదలకూడదు. చంపి తీరాలి! ఇంక ఆలోచన ప్రసక్తి లేదు. సుబ్బారావుని చంపాలి!
జేబులోంచి కత్తి తీశాను. కాని అప్పటికే సమయం మించిపోయింది.
వాడు విసిరిన కత్తి సూటిగా వచ్చి గుండెల్లో గుచ్చుకుంది.
"విషం పూసిన ఈ కత్తి క్షణంలో నీ ప్రాణాలు తీస్తుంది -" అంటూ వాడు విజయ గర్వంగా నవ్వసాగాడు.
నా కళ్ళు తెలిపోసాగాయి. గుడ్లు బయటికి తన్నుకొస్తున్నాయి. వళ్ళంతా నల్లగా మారిపోయింది.
అంతే, క్షణంలో నేను కుప్పగా కూలిపోయాను.
***
