అతను నన్ను పంజరంలో పెట్టి బంధించలేదు. ఈ విశాల విశ్వంలోకి నెట్టేసాడు.... కేవలం రెక్కలు కత్తిరించి! నేను ఎగరడానికి ప్రయత్నించి క్రింద పడిపోతున్నాను. ఒకవేళ ఎగిరినా చాలా కొద్దిదూరమే. మళ్ళీ క్రింద పడిపోతాను.
దీపూకి నేనంటే ఆరాధన! అభిమానం.... ఆపేక్ష.... క్రోధం.... ఇవన్నీ కలిసి వుండటంవలన నాతో మాట్లాడడు.
"నేను మీ కళ్ళల్లోకి చూడలేను. ఆ చీకటి నేను భరించలేను. మీరే కాదు. మీలాంటి స్త్రీలని ఎవర్నీ నేను క్షమించలేను. మీరు ఎవరికోసమో తయ్యారు కాబడ్డారు. ఒక వ్యక్తి చుట్టూ మీ జీవితాన్ని గిరిగీసుకుని సంసారం అనే వృత్తంలో ఇమిడిపోతూ అశేష జనాన్ని దూరం చేసుకుంటారు. ఆ కేంద్రస్థానంలో వున్న ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేసినా, దూరం చేసినా మీరు ఏకాకిగా, అనాథలుగా మారిపోతారు. ఐయామ్ సిక్ ఆఫ్ విమెన్!" అన్నాడు.
"పెళ్ళీ.... భర్తా.... పిల్లలూ... సంసారం.... ఇవి నమ్ముకుని బ్రతకడం తప్పంటావా?" అడిగాను.
"కావు! అవన్నీ మిమ్మల్ని మీరు పోగొట్టుకోబడకుండా సంపాదించవచ్చు. కుటుంబంలో పురుషుడికన్నా స్త్రీకే పాత్ర ఎక్కువ. ఎవరు ఎక్కువ ఆధారపడతారూ అన్నది ఆలోచిస్తే....పురుషుడే! పాత అహల్య అయ్యి ఆలోచించండి. మీకు మంచి సంపాదన వుండేది. ఆ డబ్బుతోనే మీరు కోరుకున్న వ్యక్తిని పైకితెచ్చి, సంఘంలో ఒక స్థానంలో నిలబెట్టారు. అందం, తెలివీ, ప్రతిభా, డబ్బూ అన్నీ వున్న మీరు ఒక ఆటబొమ్మలా అతను ఎలా చెప్తే అలా ఎందుకు ఆడారూ? అన్నయ్యలో, నాన్నలో, పి.ఏ.లో, మీ జీవితాలతో ఆడుకునేటట్లు ఎందుకు ఆస్కారం యిస్తారూ? కేవలం బాధ్యతారాహిత్యం సోమరితనం....ఔను! ఆలోచించి నిర్ణయాలు చేసుకోవడం వల్ల సోమరితనం!
మొదట్లో అశ్రద్ద! చేతులు చివరకంతా కాలాక ఆకులకోసం గోల. విడాకులొచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే పోగొట్టుకున్న కాలం తనతో మీ పూర్వపు అందాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్నీ తీసుకుని వెళ్ళిపోయి వుంటుంది. సారం దీసిన మీరు సంసారంలోంచి బయటపడి, మళ్ళీ మొదటి నుండీ యుద్ధం ప్రారంభించాలి. ఎంతమందికి ఆ ధైర్యం వుంటుందీ? అందుకే 'జరిగిపోతోందిగా' అని సర్దుకుపోతారు. సర్దుకోండి.... తప్పులేదు. కానీ గుండెలూ, దిండులూ తడిసేటట్లు ఏడవకండి. మీ జాతి ఏడుపు సమాజాన్ని ముచేస్తుంది."
దీపూకి మా జాతంతే గౌరవంలేదు. కానీ అపారమైన ప్రేమ! అది ఎవరు అర్ధం చేసుకుంటారు? అతను నమ్మే స్వేచ్చని రేపు అతని భార్య కూడా కొట్టిపారేయచ్చు! అందుకే అతను ఆ వివాహ వ్యవస్థ జోలికి వెళ్ళడానికే భయపడతాడు. "నువ్వెందుకిలా చేసావు? నువ్వెందుకిలా ఆలోచిస్తావు?" అంటూ మొదటిరోజు నుండీ మన ఆలోచనలతో నడవడికతో జరిగే సంవాదం అతను భరించలేదు. 'నాకిలా ఇష్టం..... నేనిదే చేస్తాను' అంటే యుద్దమే! యుద్దానికి అతను సిద్దంకాడు. అందుకే పెళ్ళి చేసుకోడు.
కానీ ఒకటి మాత్రం నిజం వివాహం స్త్రీకన్నా పురుషుడికే ఎక్కువ సెక్యూరిటీ ఇస్తుంది. అతనికి ఒక ఇల్లూ, ఆ ఇంటిని నిర్వర్తించడానికి లైఫ్ లాంగ్ బేసిన్ మీద ఎపాయింట్ అయిన సర్వెంటూ, ముద్దుకోసం పిల్లలూ.... ముసలితనంలో సేవలు పొందడానికి అర్హతా లభిస్తున్నాయి.
"పోనీ నేను పెళ్ళి చేసుకోకుండా వుంటే ఏం పోగొట్టుకునేదాన్ని?" అని ఆలోచించాను.
'పునీతని!' నేను మాతృత్వాన్ని పోగొట్టుకునేదాన్ని. ఆ ఊహే నాకు భయం కలిగించింది. ఈ భయమే ఎనభైశాతం ఇలాంటి భర్తలు కలిగిన స్త్రీలని బంధించి వుంచుతోంది.
స్త్రీకి దేవుడు చాలా శరీర ధర్మాలు అదనంగా పెట్టాడు. అప్పుడే తెలివిగా పిల్లల పట్ల మమకారం కూడా రక్తంలో కలిపేసాడు!
* * *
దీపూ నా అశక్తతని హేళన చేశాక నాకు రోషం వచ్చింది.
రఘుకి చెప్పకుండా అతని ఆఫీసుకి రెండుసార్లు వెళ్ళాను. అతను చాలా ఆశ్చర్యపోయాడు.
"ఇక్కడికెందుకొచ్చావు?" అన్నాడు.
"మీతో కలిసి లంచ్ చెయ్యాలనిపించింది" అన్నాను.
"ఈ రోజు చాలా బిజీగా వున్నాను" అన్నాడు.
"ఫర్లేదు వెయిట్ చేస్తాను" అన్నాను.
"వద్దు ఇంటికెళ్ళు" కాస్త కఠినంగా అన్నాడు.
ఆ రోజు మొదటిసారిగా మాళవికని చూశాను. నల్లగా, సన్నగా వుంది. రఘు అంత వేలం వెర్రిగా ఆమె వెంటపడడానికి ఏం వుందో నాకు అర్ధంకాలేదు.
నన్ను చూశాక ఆమె రఘుతో ఏం అందో నాకు తెలీదుకాని, రఘు ఆ రోజు ఇంటికొచ్చి నామీద అరిచాడు.
"నువ్వు అపురూప సౌందర్య రాశివనీ, అయినా నిన్ను ఇంట్లో వదిలి వేరే ఆడపిల్లలతో నేను ఫ్లర్డ్ చేస్తున్నానని అందరికీ తెలియడానికా నువ్వు ఆఫీసు కొచ్చావు?"
నాకు నవ్వొచ్చింది. అతని గురించి అందరూ చెడుగా అనుకుంటున్నారని అతని కోపం చెడుగా ప్రవర్తిస్తున్నందుకు ఏమీ ఫీల్ అవడం లేదు.
"నా భార్య పక్షవాతంతో మంచాన పడి వుంది అని చెప్పారా?" అన్నాను.
"కాదు ఆమె ప్రఖ్యాత సింగర్ అనీ, చాలా అందగత్తెననీ, తెలివైనదానిననీ ఆమె ఫీలింగ్ అని చెప్పాను" అన్నాడు.
నేను విస్మయంగా "రఘూ! అలా ఎందుకు చెప్పావు?" అన్నాను.
"నాకు నిన్నుచూస్తే అలాగే అనిపిస్తుంది కాబట్టి!" అని వెళ్ళిపోయాడు.
ఇంటింటికీ సైకిల్ మీదెళ్ళి చీటీలు కట్టించుకునే రఘుని నేను మరిచి పోయాను. కానీ అతను మరిచిపోలేదు. అతను ఈ రోజున ఇంత ఎత్తుకి ఎలా ఎదగగలిగాడో అతని మనస్సాక్షి విస్మరించలేదు.
ఇరవై లక్షలు తృణప్రాయంగా సాయం చేసిన అహల్యని, తన పాటకోసం సంగీత దర్శకులు ఎదురుచూసేటట్లు చేసిన అహల్యని, ఒకప్పటి అందాలరాశిని అతను మరువలేడు. ఫలితమే ఈ ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్... ఇందులో నేను చేసిన తప్పేమిటీ?
దీపూకి ఫోన్ చేసాను.
ఆ గొంతు వినగానే అతను ఆశ్చర్యపోయాడు. "మీరా? పర్సనలా?" అడిగాడు.
"అవును!" అన్నాను.
"ఒక గంటలో వస్తాను." అన్నాడు.
వెనకనుండి ఓ అమ్మాయి నవ్వుతూ ఏదో అనడం వినిపించింది.
గంట తర్వాత వచ్చాడు.
"దీపూ! నేను అందంగా లేనా? నాలో లోపం ఏమైనా వుందా?" సూటిగా అడిగాను.
"ఎవరికి? అది చెప్పండి ముందు నాకా? మా అన్నయ్యకా?" అడిగాడు.
నేను ఆశ్చర్యంగా "మనిషి మనిషికీ బేధాలుంటాయంటారా ఈ విషయంలో" అన్నాను.
"అవును! నాకయితే అప్సరసలా కనిపిస్తారు. మా అన్నయ్యకైతే భార్యలా కనిపిస్తారు" అన్నాడు.
