Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 51


    దీపూ ఆ గదిలోంచి వెళ్ళిపోతుండగా అరిచాను.
    
    "దీపూ.... నేను తోడుకోసం అల్లాడుతున్నాను. వదినగా కాకపోయినా కనీసం ఒక మనిషిగానైనా నన్ను గుర్తించి నాతో మాట్లాడకూడదా?"
    
    దీపూ తలుపు దగ్గర నిలబడి నావైపు చూశాడు. గదిలో చీకటి, బయట అరభాగం తెరిచిన తలుపులో నుండి వచ్చే వెలుగుచార! నా చీకటి జీవితంమీద వెన్నెల సంతకంలా వుంది.
    
    "మా అమ్మ లేచిపోయింది. తన ఇష్టాల్నీ, వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోలేక ఆమెని మానసికంగా హత్య చేస్తున్న నాన్నని తట్టుకోలేక అమ్మ లేచిపోయింది. భర్తకోసం తన కళనీ, ఆశల్నీ, వ్యక్తిత్వాన్ని చంపుకుని పడివుండే మీమీద నాకు గౌరవంలేదు. కానీ మా అమ్మ అంటే నాకు చాలా గౌరవం. షీ డిసెర్వ్స్ ఇట్! ఎందుకంటే ఆమె నమ్ముకున్న సిద్దాంతాల కోసం లేచిపోయింది. ఆమె వునికిని ఆమె కాపాడుకోడం కోసం లేచిపోయింది. ఎక్కడున్నా ఆమె సుఖంగా, సంతోషంగా వుంటుంది. మీ అందరిలా భర్త పడకగదుల్లో అలంకరణ సామాగ్రిల్లా వంటగదుల్లో బూజుపట్టిన పాత జాడీల్లా పడి వుండదు. ఐయామ్ ఫ్రౌడ్ ఆఫ్ హర్!"
    
    దీపూ వెళ్ళిపోతుంటే శిలాప్రతిమలా చూస్తూ కూర్చుండిపోయాను.  అతని మాటలు ఎంత లోతుగా వున్నాయీ..... నాలా చాలామంది ఈ ఇల్లాలు అనే పోర్ట్ ఫోలియో కోసం ఎన్నో కష్టాల్ని భరిస్తూ పాకులాడుతున్నారు. మమ్మల్ని ఎవరో అణగద్రొక్కుతున్నారన్న సెల్ఫ్ పిటీతో మగ్గిపోతుంటారు. కానీ ఎదిరించడానికి ఏమీ ప్రయత్నం చెయ్యరు. హీ హేట్స్ మీ! ఎందుకో నాకు అర్ధమైంది.
    
                                                                 * * *
    
    దాసుగారికి ఒంట్లో బాలేదుట. దాసమ్మగారు ఉత్తరం వ్రాశారు. నేను పునీతని తీసుకుని ప్రయాణమై వెళ్ళాను. ఆ ఇంటి పరిస్థితి చూస్తుంటే నా గుండెల్లో దేవేసింది. సున్నం మొహం మరిచిపోయిన గోడలు పెళ్ళలూడి పోతున్నాయి. ఎక్కడ చూసినా దరిద్రం తాండవిస్తోంది. దాసమ్మగారికి కళ్ళు కనబడడంలేదు. దాసుగారు అవసానదశలో వున్నారన్న విషయం ఆయన గురకే చెపుతోంది. వూపిరి ఆడక అవస్తపడుతున్నారు. వెంటనే హాస్పిటల్ కి తరలించే ఏర్పాటు చేశాను. ఆయన అంగీకరించలేదు. నా చెయ్యి పట్టుకుని.... ఒక్కసారి నిధి చాలా సుఖమా.... పాడు తల్లీ" అన్నారు.
    
    నేను తంబూరా తీసుకున్నాను. "నిధి చాల సుఖమా.... రాముని సన్నిధి.....సుఖమా..." నా గొంతు దుఃఖంతో జీరపోయింది. ఆయన కళ్ళల్లో ఆనందం మెరిసింది.
    
    "నన్ను క్షమించండి నాన్నగారూ!" అన్నాను. ఆయన ఆశలు నేనెలా వమ్ముచేశానో నాకు తెలుసు.
    
    "అమ్మని గురించి బెంగపడద్దు" అని మాటిచ్చాను.
    
    ఆ రాత్రి ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. జరగవలసిన కార్యక్రమాలన్నీ కానిచ్చి దాసమ్మగారిని తీసుకుని నేను ఇల్లు చేరాను.
    
    రఘుకి ఇంట్లో ఏం జరుగుతోందో పట్టడమేలేదు. ఫ్రెండ్సూ, పార్టీలూ ఎక్కువయ్యాయి. ఒకటి రెండుసార్లు నన్నుకూడా తీసుకెళ్ళాడు. నాకు ఆ వాతావరణంలో వూపిరి అందక ఉక్కిరిబిక్కిరయ్యాను. ఇంకోసారి రానంటే అతనూ పెద్దగా బలవంతం చేయలేదు.
    
    దాసమ్మగారికి అతని ముందు, మగువల గురించి తెలియకూడదని ప్రయత్నించాను. కానీ అతను ఇంటికే రాకపోవడం, వచ్చినా పూర్తిగా నిషాలో రావడంతో ఆవిడకి నా జీవితం తేటతెల్లమైపోయింది.
    
    ఒకరోజు రఘుని పట్టుకుని చాదస్తం కొద్దీ అడిగేసింది. "రఘు బాబూ.....హలని వదిలి నువ్వు తిరిగే తిరుగుళ్ళు మంచివికావు బాబూ! నీకూ ఓ ఆడపిల్లుంది. జాగ్రత్తగా వుండాలి."
    
    రఘు ఆ రోజు నన్ను గదిలోకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. "ఆ ముసలావిడ నోర్మూసుకుని వుంటే సరే.... లేకపోతే హోమ్ ఫర్ ది ఏజ్డ్ లో చేర్పిస్తానని చెప్పు" అన్నాడు.
    
    దాసమ్మగారు విన్నారు. "ఆ రోజు అమ్మాయి దగ్గరకి పూటకి ఠికానా లేని స్థితిలో వచ్చావు. తన డబ్బుతో నీచేత వ్యాపారం పెట్టించింది. ఇప్పుడు నువ్వున్న స్థితికి మా అమ్మాయే కారణం. అవన్నీ మరచిపోయి పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడిలా నీ వేషాలూ నువ్వూ... అన్నీ చూస్తూనే వున్నాను. అప్సరసలాంటి పిల్లని గాజుబొమ్మలా మార్చావు. ఇది నీకు శుభంకాదు! అమ్మా.... నేను నిన్నీ ఇంట్లో ఇలా చూస్తూ వుండలేను. నన్నెక్కడైనా ఆశ్రమానికి పంపించెయ్యి" అంది.
    
    నాకూ అదే మంచిదనిపించింది. ఆవిడ ఈ వయసులో ప్రశాంతంగా వుండాలి. అందుకే ఆవిడ్ని మంచి వృద్దాశ్రమానికి పంపించేశాను.
    
    పునీత స్కూల్ ఫైనల్ పాసయినరోజు ఆ వార్త రఘుకి చెప్పడానికి నేను రోజల్లా ట్రై చేస్తూనే వున్నాను. అతనెక్కడా దొరకలేదు. సెల్ ఆఫ్ లో పెట్టాడు. పునీత-"డాడీకి చెప్పాలి అప్పుడే అన్నం తింటాను" అని మొండిపట్టు పట్టి కూర్చుంది. డిస్టింక్షన్ లో పాసయిన దానికి ఆ కోరిక వుండడం సహజమే..... కాని రఘు ఎక్కడున్నాడో పట్టడం అసాధ్యమైపోయింది. రాత్రి పది గంటలకి డోర్ బెల్ మ్రోగింది.
    
    "డాడీ....డాడీ..." అంటూ పునీత పరుగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది.
    
    ఎదురుగా రఘుకాదు - దీపూ నిలబడున్నాడు. అతని చేతిలో వాల్ పోస్టర్ సైజ్ లో గ్రీటింగ్ కార్డు వుంది. "బేబీ...." అంటూ చేతులు జాపాడు. పునీత చిన్నపిల్లలా వెళ్ళి అతన్ని "బాబాయ్" అంటూ చుట్టుకుపోయింది. ఆనందంవల్ల ఏడ్చేస్తూ "నాన్నకీ విషయం తెలీనే తెలీదు తెలుసా?" అంది.
    
    దీపూ ఆమె తలని నిమిరి దగ్గరకు తీసుకున్నాడు. నావైపు చూశాడు. ఆ కళ్ళల్లో అదే నిందారోపణ!
    
    "పొద్దుటినుండీ ఆయనకోసం ట్రై చేస్తున్నాను. ఇదేమో మెతుకు ముట్టకుండా కూర్చుంది" అన్నాను.
    
    దీపూ టేబుల్ దగ్గరకొచ్చి - "రారా ఆకలిగా వుంది భోంచేద్దాం" అన్నాడు.
    
    "డాడీ రానీ" అంది గునుస్తూ పునీత.
    
    దీపూ ఆమెకి అన్నం కలిపి నోట్లో పెడుతూ కబుర్లు చెప్పాడు. ఆమెని త్వరగానే ఏమార్చాడు.
    
    నాకెంతో రిలీఫ్ గా అనిపించింది.
    
    భోజనాలయ్యాక బయట లాన్ లో కూర్చుని మాట్లాడుతూనే పునీత ఉయ్యాల్లో అతని ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోయింది.
    
    "దీపూ.... పెళ్ళి చేసుకోవా?" అడిగాను.
    
    "చేసుకున్నవాళ్ళు ఏం సుఖంగా వున్నారని?" అన్నాడు.
    
    "అందరి అదృష్టాలూ ఒక్కలా వుండవు. చెప్పు నీకు ఎలాంటి పిల్ల కావాలి?" అడిగాను.
    
    అతను చిన్నగా నవ్వి - "వృధా ప్రయత్నం దొరకదు!" అన్నాడు.
    
    "చెప్పు ఫరవాలేదు" అన్నాను.
    
    "అచ్చు మీలాగా వుండాలి" అని అతను గదిలోకి వెళ్ళిపోయాడు.
    
    నేను తెల్లబోయి చూస్తుండిపోయాను.
    
    అతని గదిలోంచి నా గొంతు వినిపిస్తోంది - "వేయబోవని తలుపు....తీయమంటూ పిలువు.... రాధకెందుకో నవ్వు గొలుపూ....
    
    నాకూ నవ్వొచ్చింది.
    
    దీపూ నన్ను తప్పుకు తిరగడానికి కారణం తెలిసింది!
    
    సరిగమలు మరిచిపోయాను. సరాగాలూ మరిచిపోయాను. యాంత్రికంగా బ్రతుకుతున్నాను. రఘు నన్ను గురించి పట్టించుకోడు. ఎప్పుడైనా నా గదిలోకొస్తే అతనినించి వచ్చే ఆ డ్రింక్ వాసనల్ని నేను తట్టుకోలేను. మా మధ్య శృంగారం అసంతృప్తిగా సమాప్తం అవుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS