Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 50

   
    "సిద్దయ్యని బాబూ పాములవాణ్ని" అన్నాడు ముసలివాడు.

    "పాములవాడివా?"

    "అవును బాబు."

    "ఇక్కడ ఎందుకున్నావు?" భూషణం గొంతులో కొంచెం ధైర్యం కనిపించింది.

    "నల్లతాసు గరళం తియ్యాలి బాబూ - జమీందారుగారు పురమాయించారు బాబయ్యా. నేనూ నా కూతురూ ఈ అడవికి కూంత లోపల్నే పాక వేసుకున్నాం. ఈ రేతిరేల ఇఖ్కడుండిపోయారేం బాబూ?" అన్నాడు సిద్దయ్య.

    మాకు కొంత ధైర్యం కలిగింది. అంతవరకూవున్న బ్రహ్మాండమైన ఒంటరితనమూ నిస్సహాయతా పోయినట్టనిపించింది. భూషమంలో ఒక్కసారిగా వివేకమూ, వోపికా కలిగాయి. దైవసంకల్పం వుంటే కాని ఈ అడవిలో ఇటువంటివేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనుపించడు. ఒక్క గంతులో కారులోంచి దూకాడు. సిద్దయ్య రెండు చేతులూ పట్టుకున్నాడు "చూడు సిద్దయ్యా, నీకు మంత్రం వచ్చునా? మా వాడికి పాము కరచింది. చచ్చిపోవడానికి సిద్దంగా ఉన్నాడు" అన్నాడు మినుకు మినుకుమనే ఆశ కలిసిన భయంతో దుఃఖంతో పూడిపోయిన గొంతుకతో.

    సిద్దయ్య రామచంద్రాన్ని పరీక్షగా చూశాడు. "ఇంకా బతికే ఉన్నారు బాబయ్యా" అన్నాడు బాధతో తోక తెగిన బలిల్లా గిజగిజలాడుతున్న ప్రాణిని చూసి.

    "రక్షించాలి సిద్దయ్యా, దేవుడిలాగవచ్చావు పెద్ద కుటుంబీకుడు పాపం భార్యాపిల్లలూ ఉన్నారు. మంత్రంవేసి బతికించావా సగం ఆస్తి నీకు రాయిస్తాను."

    సిద్దయ్య ఓ సెకను ఆలోచించాడు. ఆకాశంకేసి చూశాడు. నల్లని మేఘం చంద్రుడ్ని కప్పివేస్తోంది! "అధృష్టం ఉంటే బతకొచ్చును బాబయ్యా. అక్కడ పాకలోకి తీసుకురండి బాబూ! వేరుముక్కతో మంత్రం వెయ్యాలి" అన్నాడు.

    "ఎలాగ తీసుకురావడం?" భూషణం ప్రశ్నించాడు అయోమయంగా చూస్తూ.

    "ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబయ్యా. ఆలోచిస్తూంటే అపాయం. మీరిద్దరూ మోసుకురావాలి బాబూ"

    "అడవి లోపలికే! పాములుంటాయేమో" అంత ఆదుర్దాలోనూ జాగ్రత్త వహించడం భూషణానికి తెలుసును.

    "నేను ముందుండి దారి చూస్తుంటాను. మువ్వల చప్పుడికి పురుగూపుట్రా దూరంగా పోతయ్ బాబూ. రండి" అంటూ ముందుకు వెళ్ళి రోడ్డువారనున్న పొదల్ని పక్కకి వంచి పట్టుకున్నాడు.

    భూషణం రామచంద్రం భుజాలకింద నుంచి చేతులు పోనిచ్చి పైకెత్తి పట్టుకున్నాడు. నేను కాళ్ళు పట్టుకున్నాను. అడవిలోపల చీకటి. శవప్రాయమైన ఒక మనిషిని అంత చిన్న వయస్సులో మోయవలసి వచ్చిన భయంకరమైన అనుభవం నన్నిప్పటికీ తలచుకున్నప్పుడల్లా విచలితుణ్ని చేస్తుంది. చంద్రుడు మబ్బుల చాటుకి పోవడం మూలాన ఉన్న వెన్నెలగూడా లేకుండాపోయింది. కాళ్ళకి తగిలే ఎండుటాకులూ విరిగిన రెమ్మలూ కూడా మమ్మల్ని పాముల్లాగా భయపెడుతున్నాయి గూండె దిటవుచేసుకుని సిద్దయ్య అడుగులో అడుగు వేసుకుని నడుస్తున్నాం. చేతులు లాగుతున్నాయి. భూషణం నేనూ వగరుస్తున్నాం. ఏదేనా చిరుతపులి పక్కనున్న పొదలోంచి దూకుతూన్నట్టే అనిపించింది. సిద్దయ్యతో చెప్పాలనుకున్నాను. రాత్రి నిద్రలో పీడకలలో గొంతు నొక్కుకుపోయినట్లుగా మాట విడివడడంలేదు. రెండు ఫర్లాంగులు నడచి వెళ్ళేటప్పటికి చెట్టూ చేమాలేని శూన్యప్రదేశం కనిపించింది. ఎత్తయిన రాతి ప్రదేశంలాగా ఉంది. అక్కడ నుంచి మినుకు మినుకుమని దీపపు వెలుతురు వస్తోంది.

    "కొవ్వొత్తి ఆఖరయిపోతోంది అవధానిగారూ" అని హఠాత్తుగా అన్నాడు ఆచారి - అవధానిగారి కథనానికి అంతరాయం కలిగిస్తూ.

    అవధానిగారు ఆచారికేసి నిరసనగా చూసి సొరుగులోంచి ఆఖరు కొవ్వొత్తి తీసి వెలిగించారు, ఒక్కమాట కూడా మాట్లాడకుండా. ఆచారి పెదవులు  వణుకుతున్నాయి. ఎప్పుడు నారాయణ దగ్గరికి చేరాడో కాని ఒక చేత్తో నారాయణ నడుముని గట్టిగా కౌగిలించుకున్నాడు. తోటలోంచి కీచురాళ్ళమోత వినపడుతోంది. అవధానిగారు మళ్ళీ ప్రారంభించారు.

    "ఇదే బాబయ్య గుడిసె" అన్నాడు సిద్దయ్య.

    "ఇక్కడ అపాయం కదా నీకు! పురుగు పుట్రా......" భూషణం ఆయాసపడుతున్నాడు.

    "మంత్రించిన యిసుక చుట్టూ జల్లుతాం బాబయ్యా. పురుగు రానే రాదు."
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS