"మామయ్యా" అన్నాను నేను.
భూషణంకి దుఃఖం పొరలుపొరలుగా వస్తోంది. ఆడదానిలా ఏడ్చేస్తున్నాడు. నాకేం తోచలేదు. ఏదో చెప్పాలనుకున్నాను గాని నాకు మాట పెకిలి రావడంలేదు. రామచంద్రం నోటి చివరలనుంచి నురగ వెన్నెలలో పొంగుతూన్న సోడాలాగ వుంది. అతని గుండెలు కిందకీ పైకీ లేస్తున్నాయి. మృత్యువుతో ముఖాముఖి. ముష్టాముష్టి యుద్దం చేస్తున్నాడు రామచంద్రం...... అవతలి ఒడ్డున ఈ బ్రతుక్కి యీ మధ్యకి యీ రహస్యానికి అవతలి తీరాన.
"మనంకూడా చచ్చిపోతాంరా. ఈ అడవిలో దిక్కుమాలిన చావుచస్తాంరా. మనకెంతగతి పట్టిందిరా" ఏడుస్తూనే అన్నాడు నాగభూషణం.
"పారిపోదాం మామయ్యా" అంతకంటె ఏడుస్తూ అన్నాను నేను.
"ఎక్కడికి?"
"పరుగెత్తుకుపోదాం. గూడెంవరకూ పరుగెత్తుకుపోదాం"
"రామచంద్రం?"
"వదిలేద్దాం. ఎలాగూ చచ్చిపోతాడుగా"
నాగభూషణం ఆలోచనలో పడ్డాడు. అవును. చచ్చే రామచంద్రం కోసం యిద్దరుకూడా ఎందుకు చావాలి? అయితే పరుగెత్తగలమా, మాట రావడంలేదే. ఇంక కండలలోకి వోపిక ఎలా వస్తుంది? కొంతదూరం వెళ్ళి ఆగిపోతే అక్కడ గతి ఏమిటి? ఈ కారుకూడా ఉండదే పడుకొని చావడానికి!
ఆ నిముషంలో స్వార్దంకన్నా గొప్పశక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలూ, ఆశయాలూ అన్నీ ఆ ప్రాథమిక స్వార్ధానికి అంతరాయాన్ని కలిగించనంతవరకే. ప్రతీ మనిషి లోపల్లోపల ఒక పాము!
"అయితే రోడ్డమ్మట పాములుంటాయి ఎలాగ?" అన్నాడు నాగభూషణం.
అవును అక్కడ వుండలేం, అలాగని ఎక్కడికీ వెళ్ళలేం అరణ్యం మా చుట్టూ కనపడని ఉచ్చులు పన్ని ఉంచింది. ఎన్నోమైళ్లు పరుగెత్తితేకాని గూడెం రాదు. భగవాన్! ఎందుకిలాగ బాధిస్తున్నావు? ఆశలేదు, ధైర్యంలేదు. అక్కడ చెట్ల ఆకుల్ని తిని బతికే కీటకంకన్నా మానవుడు నికృష్టంగా అయిపోతున్నాడు. నీచంగా దిక్కులేకుండా చచ్చిపోతున్నాడు.
రామచంద్రం కదిలినట్లయింది. "రామచంద్రం" అని పిలిచాడు నాగభూషణం. రామచంద్రం మెలికలు తిరుగుతున్నాడు. గుప్పిట మూస్తున్నాడు. మళ్ళీ పిలిచాడు భూషణం. రామచంద్రం తెలివిలో లేడు. అతని ప్రాణం విపరీతమైన బాధపడుతోంది. అతని దేహం వంకరలు తిరుగుతోంది. భూషణం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. "దేవుడా?" అంటూ కాతరంగా ఆర్తనాదం చేశాడు. అడవి అంతా ప్రతిధ్వనించినట్టయింది. నాకు నాలిక పిడచకట్టుకుపోతోంది. నాకు తెలుసు. ఏ పామూ కరవకుండానే మేం యిద్దరమూ కూడా ఉదయానికల్లా ఈ కార్లో చచ్చిపడి ఉంటామని.
ఇంతలో ఏదో మువ్వల చప్పుడు వినిపించింది. మా ప్రాణాలు మరీ పైకి పోయాయి. కర్ర నేలని తాటించిన చప్పుడుతో కలిసిన మువ్వల చప్పుడు. క్రమంగా దగ్గరవుతూన్న చప్పుడు. నేను భూషణాన్ని గట్టిగా కౌగలించుకున్నాను. ఇది తప్పకుండా ఏదో దెయ్యమే అయి ఉంటుంది. గజ్జెలు కట్టుకుని అడవుల్లో అర్ధరాత్రి పిశాచాలు నృత్యం చేస్తాయి కాబోలు. మమ్మల్ని చూసివుంటుంది ఏదో దెయ్యం - తింటానికి ఇటువైపే వస్తోంది.
"ఎవరది బాబూ!" -మనిషి గొంతు, మనిషి భాష!
చటుక్కున భూషణం నేనూ ఎగిరిపడ్డాం. నా చెయ్యి రామచంద్రం పాదంమీద పడింది. చల్లగా తగిలింది. వెర్రికేక వేశాను. పాపం రామచంద్రం భయపడే స్థితిలో లేడు.
"ఎవరు బాబూ కేకవేసింది?" మళ్లీ మనిషి ప్రశ్న.
భూషణం కళ్ళు గట్టిగా మూసుకునే తడబడుతూ అన్నాడు "ఎ...ఎ. ఎవరది?"
"నేను మనిషినేనయ్యా, భయపడకు" -ఆ మనిషి సమాధానం.
కళ్ళు తెరచి చూశాం. ఒక ముసలివాడు రోడ్డుమీదనున్న పొదల్ని తప్పించుకొని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన వళ్ళు, తెల్లని నెరసిన గుబురులాంటి జుట్టు, మాకు నమ్మకం చిక్కలేదు. పైగా అనుమానం ఇఁకా దృఢమైంది.
"ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకున్నావు?" భూషణం ఎంత ధర్యాన్ని కూడదీసుకుని ప్రశ్నించినా, కంఠస్వరంలో వణుకూ, భయమూ తెలిసిపోతున్నాయి.
