Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 5


    గోడమీదకి వరిగిన చెట్టు సజీవంగానే వుంది. పూలుపూస్తూనే వుంది. అందువల్ల దానిని ఎవరూ అక్కడనుంచి తొలగించలేదు.
    పోలీస్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఆచెట్టు వేపే చూస్తూ దీర్ఘాలోచన చేయటం చూసి "సార్!" అన్నాడు టూనాట్ టు అహోబిలం.
    "ఏమిటి?" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు యింకా చెట్టువేపే చూస్తూ అడిగాడు.
    "ఆ చెట్టు పేరు"......
    టునాట్ టు అహోబిలం చెట్టుపేరు చెప్పబోయాడు. ఇన్ స్పెక్టర్ వర్ధనరావు టకీమని యిటు తిరిగి కళ్ళురిమి చూశాడు.
    సగంలోనే.
    అహోబిలం నోరు మూతపడిపోయింది.
    "రోగం కుదిరింది." అనుకున్నారు మరో కానిస్టేబుల్ కనకారావు.
    ఆ ఏరియాకి ఇన్ స్పెక్టర్ వర్ధనరావు. ఆ చుట్టుప్రక్కల గ్రామాల లో ఏం జరిగినా ఇన్ స్పెక్టర్ వర్ధనరావు చూసుకోవాల్సిందే. గుడిలో దొంగలు దూరారు అన్న విషయం మరీ పెద్దది కాకపోవటంవల్ల ఇన్ స్పెక్టర్ తన మంది మార్భలంతో రావటం జరిగిందిగాని పై అధికారులు కదిలిరాలేదు.
    క్రితంరాత్రి సింహాచలం విన్న చప్పుళ్ళకి శివుడు కల్పించి చెప్పిన కధకి సాక్ష్యాధారాలు గుడి ప్రాంగణంలో కనిపించాయి.
    గర్భ గుడిలోకి దొంగలు దూరలేదు, అసలు గుడి లోపలికి పోలేదు గుడికి ఎడమవేపు ఖాళీ స్థలంలో నాలుగడుగులు వెడల్పున త్రవ్వారు. అదసలే కొండప్రదేశం రాళ్ళురప్పలు చదునుచేసి దానిమీద రాళ్ళుపరిచి అతుకుపెట్టారు. అవన్నీ చిన్న చిన్న నాపరాళ్ళు నాపరాళ్ళని తొలగించినా కింద తొవ్వటం కష్టం.
    అందువల్ల.
    దొంగలు నాలుగడుగులు వెడల్పున రాళ్ళని తొలగించగలిగారుగాని లోతు ఎక్కువ తొవ్వలేకపోయారు. వాళ్ళు తవ్వింది అంతా కలిపి లోతు అయిదంగుళాలు కూడా ఉండదు.
    దొంగలు అక్కడ.
    తొవ్వటానికి ప్రయత్నించటమే కాదు, రెండు గడ్డపలుగులు చిన్నపార పక్కనే పారేసిపోయారు.
    జనం ఇది చూసి ముక్కుమీద వేళ్ళు (వేలు) వేసుకున్నారు.
    వాళ్ళలా ఆశ్చర్యపోతూ వేళ్ళు వేసుకోటానికి తగిన కారణం ఉంది.
    ఎక్కడైనా దొంగలు.
    విగ్రహాలని దొంగతనం చేస్తారు.
    గుడిలో దూరి దేముడి నగలు అక్కడవున్న వస్తువులు దొంగలిస్తారు.
    కాని యిలా!
    ఖాళీగా కనిపించినచోట అర్దరాత్రి అనవసరంగా తొవ్వేపని పెట్టుకోరు.
    దొంగలు పనిగట్టుకుని తొవ్వారూ అంటే తెలియని ఏదో పెద్ద కారణం వున్నట్లే.
    ప్రస్తుతం ఆ కారణమేదో ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి తెలియదు కాబట్టి లోపలికి దొంగలు ఎలా ప్రవేశించారా! అన్న పరిశోధనలోపడి తల మునకలవుతున్నాడు.
    పరిశోధించి తెలుసుకోండి రిపోర్టు ఎలా తయారుచేస్తాడు! కనుక అనుమానాస్పధంగా తోచిన ప్రతి చిన్నవిషయాన్ని చిన్న వస్తువుని వదలకుండా చూస్తున్నాడు.
    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ప్రస్తుతం శోధిస్తున్నది పరిశోధిస్తున్నది గోడమీదకి వాలిన ఓ పెద్ద పూలచెట్టుని.
    రాత్రి రెండు ముఫై ఎనిమిది నిమిషాలకి.
    శివుడు చెప్పింది విని,
    పూజారిగారు వక్కరే రాలేదు. ఆయన దూరదృష్టితో ఆలోచించి ఆలయ అధికారి ధర్మకర్త అనబడే ధర్మారావుని కర్ణం రామచంద్రయ్యని మరి ముగ్గురు పెద్దలని వెంటతోడ్కొని గుడికి వచ్చాడు.
    పెద్దలు పిన్నలు అందరి సమక్షంలో తలుపులు తెరవపడ్డాయి.
    పోలోమంటూ అందరూ లోపల జొరపడ్డారు.
    గర్భగుడి తలుపులు వేసే ఉన్నాయి. గుడి ఆవరణలో అక్కడక్కడా వున్న చిల్లరదేముళ్ళు చిట్టిపొట్టి విగ్రహాలు, మండపాలు అన్నీ నిక్షేపంగా ఎక్కడివి అక్కడే బెల్లంకొట్టిన రాళ్ళులా (పడి) ఉన్నాయి.
    పరమేశ్వరుడు తనకేమి పట్టనట్లు ఆయన ఉన్నాడు.
    పరమేశ్వరీ అమ్మవారు చిరునవ్వు చిందిస్తూ "పిచ్చివాళ్ళులారా! నా జోలికి ఎవరు వస్తారు?" అన్నట్లు నవ్వుతూ ఉంది.
    గుడికి ఎడంవేపు స్థలంలో రెండు పలుగులు పార తవ్విన గుర్తులు తప్పించి ఇంకేది కనపడలేదు.
    అనుమానానికి అది చాలదా?
    ముందే జాగ్రత్తపడితే ఉత్తరోత్రా మంచిదని పెద్దలు ఆలోచించి పోలీసు స్టేషనుకి వార్త చేరేయటం జరిగింది.
    అంతే.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS