Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 4


    వీళ్ళ గోలకి మెట్లమీద పడుకున్న బిచ్చగాళ్ళు లేచారు. వాళ్ళలో సగంమంది కుంటి, గుడ్డి రకరకాల అవిటివాళ్ళు హటాత్తుగా నిద్రలేచేసరికి వారికంతా అయోమయం అయింది. ఏదో ఘోరం జరిగిపోయిందనుకున్నారు. వేగంగా మెట్లు ఎక్కలేరు, వేగంగా మెట్లు దిగలేరు. వక్కసారిగా గొల్లుమన్నారు.
    అందరూ సగంమెట్లు ఎక్కేసరికి మెట్లుదిగి కిందకి పరుగెత్తుకు వస్తూ శివుడు కనిపించాడు.
    "దొంగలు దొంగలు గుళ్ళో దూరారు." అంటూ పెద్ద గొంతుకలో అరిచాడు శివుడు.
    "నువ్వు చూశావా?"
    "ఇంకా లోపల వున్నారా?"
    "ఎంతమంది వున్నారు."
    తలోమాట అడుగుతున్నారు. శివుడు ఎంతమందికి సమాధానం ఇస్తాడు? ఎవరిదోవన వాళ్ళు మాట్లాడుకుపోవటం అంతే.
    ముందు శివుడు ఆ వెనుక జనం అందరూ కలిసి మెట్లుఎక్కి పైకి వెళ్ళారు.
    అంతా గుడి ముఖద్వారం ముందు ఆగారు,
    ద్వారం తలుపులు నిక్షేపంగా వేసి ఉన్నాయి. అంతకన్నా క్షేమంగా తాళంవేసి ఉంది. వీళ్ళ గోలతప్ప ఎటువంటి శబ్దాలూ లేవు. గుడిలోపల గాని వెలుపలగాని.
    "దొంగలు ఏరిరా శివుడూ?" ఎవరో అడిగారు.
    శివుడు తెల్ల ముఖం వేశాడు.
    ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పువ్వుల మాలక్ష్మమ్మ అందుకుంది "మన గోలకి దొంగలు ఇంకా ఉంటారురా ఎప్పుడో పారిపోయి ఉంటారు."
    శివుడికి మాలక్ష్మమ్మ మధ్యవున్న లింకు చాలామందికి తెలిసిందే సగంమంది నవ్వేశారు. మాలక్ష్మమ్మ అన్నదానికి శివుడు వేసిన తెల్లముఖానికును.
    "నీ చేతిలో కర్రేదిరా!" శివుడిని అడిగాడు ఇంకోడు.
    ఈ తఫా శివుడి బుర్ర వెంటనే పనిచేసింది, "దొంగ అటు పరుగెత్తుతుంటే నేను తెలివిగా వాడికి తగిలేలా కర్ర విసిరేశాను వాడికి దెబ్బ ఎటు తగిలిందోగాని "అమ్మో అన్న కేకకూడా వేశాడు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు కనిపించేసరికి కిందకి పరిగెత్తుకు వచ్చాను"
    శివుడు అందమైన అబద్దం ఆడాడు మాలచ్చి లేపితే హడావిడిగా పరుగెత్తుకు వచ్చాను, మాలచ్చి గుడిసెలో మంచం పక్కనే కర్రవుంది అన్న నిజం ఎలాగూ చెప్పలేదు చిన్న బొంకు బొంకాడు.
    "అసలేం జరిగింది?" శివుడికి మరోప్రశ్న ఎదురయింది.
    ఏం జరిగిందో శివుడు ఎలా చెపుతాడు! జరిగిందేమిటో వాడికి తెలిస్తే కదా!
    శివుడిని రక్షించటానికా అన్నట్లు సింహాచలం ముందుకు వచ్చాడు తను గుడిలోపల నుంచి విన్న చప్పుళ్ళు గుడిముందు ఎవరూ లేకపోవటం అప్పుడు తను తెలివిగా కిందకి పరుగెత్తుకురావటం.....కథలా చెప్పేశాడు.
    జరిగింది ఏమిటో శివుడికి అర్ధమైంది.
    కథలు రాయటం కొందరికే వస్తుంది కథలు పుట్టించి (సృష్టించి) చెప్పటం అందరికీ వస్తుంది, అప్పటికప్పుడే శివుడు కొత్తకథ పుట్టించి చెప్పాడు.
    "కూర్చుని కూర్చుని కాళ్ళు నొప్పి పుట్టాయి లేచి అటూ ఇటూ నడుస్తున్నాను, గుడిలోపల నుంచి చప్పుళ్ళు వినపడ్డాయి గోడకి చెవిమొగ్గి విన్నాను, అవే చప్పుళ్ళు అలా టక్ టక్ అని వినపడుతూనే ఉన్నాయి. వేసిన తలుపులు వేసినట్లు ఉన్నాయి, వేసిన తాళం వేసినట్లు ఉంది ఎలా లోపలికి దొంగలు వెళ్ళారు? అని చాలా ఆలోచించి గోడకేమైనా కన్నం తొవ్వారేమోనని చెట్ల మధ్య నుంచి అటు నెమ్మదిగా వెళ్ళాను, ఈ లోపల గుడిమెట్ల మీద ఎవరో పరుగెత్తుతున్న  చప్పుడు వినిపించింది "ఏయ్, ఎవరది?" అని అరిచాను ఇటునుంచి ఎవరో పరుగెత్తారు కర్ర విసిరేశాను వెంటనే ఇద్దరు ముగ్గరు పడుతూలేస్తూ అటుకేసి పారిపోయారు చీకట్లో కొండ కిందకి అటునుంచి పరుగెత్తుతూ అంటే వాళ్ళెలాంటి దొంగలో ఆలోచించండి" అంటూ కధ ముగించాడు శివుడు.
    ఇప్పుడు కాస్త నమ్మకం కలిగింది వింటున్న వాళ్ళకి.
    "ఇప్పుడు మనం ఏం చేయాలి?" ఎవరో అడిగారు.
    "ఏం చేసేదేమిటి? గుళ్ళో కెళ్ళి చూడటమే"
    అవునంటే అవుననుకున్నారు అంతా.
    "అయ్యవారి దగ్గర తాళంచెవులు ఉంటాయి వెళ్ళి పిలుచుకువస్తాను మీరంతా ఇక్కడే ఉండండి" అంటూ శివుడు కిందకి బయలుదేరాడు.
    శివుడికోసం పూజారికోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు అందరూ.
    
                         3
    
    గుడి ఆవరణలో.
    వెనుకవేపు ఓ మూలగా పెద్ద పూలచెట్టు ఉంది కొన్నాళ్ళ క్రితం వచ్చిన గాలివానకి ఆ చెట్టు గోడమీదకి వరిగింది. గుడిప్రహరీగోడ రాళ్ళ తోకట్టింది కాబట్టి చెట్టువరగడంవల్ల గోడకేమీకాలేదు. చెట్టుకి కొంతఆధారం వుండటంవల్ల కూకటివ్రేళ్ళతో చెట్టుకూలిపోలేదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS