Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 5

           

                                    ఆడరచయితలు

 

                                                           ---డాక్టర్ కె. వి. కృష్ణకుమారి.


    "మీ రెంతదాకా వెళ్లాలండీ -"


    మర్యాదగా అడుగుతున్న అమ్మాయిని ఉలిక్కిపడి చూశాడా పెద్దమనిషి.


     "ఎంతదాకా ఐతేనేం? ముందర రిజర్వేషన్ ఐందో లేదో కనుక్కో... మేడమ్ గారు కిటికీ దగ్గర తప్పకూర్చోరు -"
     ఖండితంగా అంటున్న  అదేవయసమ్మాయిని - పరిశీలనగా చూసి చిన్నగా నవ్వుకున్నాడాయన.
     అంతలో - హడావుడిగా - ఆడంబరంగా - వెనకాల పి. ఎ. లాంటి మరో అమ్మాయితో  - కంపార్ట్ మెంట్ లోకి అడుగుపెట్టిన శాల్తీనిచూసి - కంగారు పడ్డారు ముందర ఇద్దరమ్మాయిలూ.
     "అరే మేడమ్ గారు వచ్చేశారే..... -"
    "ఏదీ .... కిటికీ దగ్గర సీటు ఖాలీలేదా?-"
    దర్పంగా అడుగుతున్న ఆవిడ్ని చూడంగానే పోల్చుకున్నాడా పెద్దమనిషి.
     "మీరు ప్రముఖరచయిత్రి కరుణాదేవి కదూ - "
     సంస్కార విహీనంగా - విద్యారహితంగా కన్పిస్తున్న ఆ పెద్దమనిషి కూడా - తనని గుర్తుపట్టినందుకు.... రెండింతలుగా ఉబ్బిపోయినట్టు కన్పించిందావిడ...... -
     "నన్ను రామూర్తంటారు -"
    అది తన కనవసరమన్నట్టు  -అతి తేలిగ్గా అతనివంక చూసి నిర్లక్ష్యంగా తలవిదిలించింది కరుణాదేవి .....-
     ఎదుటిసీట్లో దంపతులు మటుకు కొయ్యలా పక్కన లేచి నిలబడ్డారు.
    వొళ్ళంతా కళ్లుచేసుకుని కరుణాదేవిని చూస్తూ.... -
     కిటికీ దగ్గరున్న వాళ్లసీటుని మర్యాదగా ఇచ్చి - రామ్ముర్తి ప్రక్కన వినయంగా వొదిగి కూర్చున్నారిద్దరూ.
     తను కోరింది దొరికినా - గుర్తుపట్టికూడా - పట్టనట్టు - సీటివ్వని రామ్మూర్తివంక గుఱ్ఱుగా చూస్తూ - కిటికీ దగ్గర సీట్లో కూర్చున్న తమ అభిమాన రచయిత్రికి - చివరికి న్యాయం జరిగినట్టు సంబరపడిపోయారు - ఆవిడ్ని ఫాలో అయినవాళ్లు.
     "మేడమ్ ... మా అవిడా - నేనూ... మీకథలంటే పడి చస్తాం... అసలు ముందర ట్రైన్ కే వెళ్లాల్సింది మేము. - కానీ మిమ్మల్ని చూసే అదృష్టం వల్లనేమో.... ఈట్రైన్ కి వచ్చాం - "
     సుతారంగా  నవ్వుతూ తలపంకించింది కరుణాదేవి.
     "మా ఆవిడకి చచ్చేలోగా మిమ్మల్ని చూడాలన్న కోరిక - ఒక్కటే మిగిలిందట -"
     కొంటిగా భార్యవంక చూస్తుంటే -
    ఆవిడ వొళ్ళంతా కళ్లు చేసుకుని కరుణాదేవినే చూస్తోంది. నిజంగా ఎంత అదృష్టవంతురాలు తను. ప్రాణాలు పెట్టె తన అభిమాన రచయిత్రిని ఇప్పుడు ఈవిధంగా కల్సుకోగలనని  కలలోకూడా అనుకుందా?  - ఆవిడ ఫోటోలన్నీ పుస్తకాల్లోంచి కట్ చేసి - చిన్న ఆల్బం తయారుచేసు కోటంతో ఆవిడరచనలతో.... ప్రత్యేకంగా బీరువాను - నింపటంతో ..... సంతృప్తిపడే.... తనకి ఇంత అదృష్టం - అనుకోకుండా వస్తే - కలో - నిజమో..... ఇంకా అర్దంకావటంలేదు.
     "ఏమ్మా... నీపేరు!!!"
    కరుణాదేవి పలకరిస్తూంటే - ఆనందం పట్టలేనిగుండె గొంతులోకి వచ్చినట్టైంది.
     "రమ ...మీరు చాలాసార్లు ఉత్తరాలు వ్రాశాను... .ఒకసారి జవాబు వ్రాశారుకూడా....-"
    ముచ్చెమటలతో అంటున్న రమవంక నిశితంగా చూసి చిరునవ్వు చిందించింది  కరుణాదేవి.
     "పేరు విన్నట్టుగుర్తు... ఐనా..... రోజుకి - యాభై - అరవై దాకా ఉత్తరాలొస్తూవుంటాయి..... అన్నీ చదివి అందర్నీ గుర్తుపెట్టుకోవాలంటే - మాలాంటివాళ్లకి సాధ్యంకాదు....... - సెక్రటరీ వ్రాస్తుంటే - సంతకం పెట్తుంటా - ఎందుకంటే - నాకై నేను ఎవరికి -ఇంతవరకూ ఉత్తరం వ్రాయలేదు. "
     రమ మొహం చిన్నబుచ్చుకున్నా - తనతో.... అంత గొప్ప ఆవిడ అంతవివరంగా -మాట్లాడుతున్నందుకు ...మరో వైపునుంచి తృప్తిని కావాలని తెచ్చుకుంది.
     "మేమూ చాలా ఉత్తరాలు వ్రాశాం మేడమ్ గారూ... జవాబు రాకపోయినా బాధపడలేదు.. .ఎందుకంటే - మీలాంటి వాళ్లకి - ఒక్కొక్కప్పరుడు ఉత్తరాలు వ్రాయాలంటే బద్దకం.... మీలాంటి వార్ని అస్సలు అనుకోకూడదు కూడా- మా సంస్థ మిమ్మల్ని సన్మానిస్తుందని తెల్సి... .ఇంతదూరమైనా - మిమ్మల్ని దగ్గరుండి తీసుకువెళ్లటానికి వచ్చాం....."
     కరుణాదేవిని ఫాలో అవుతున్న ఒక అమ్మాయి ఆరాధనతో చూస్తుంటే -
     కరుణాదేవి చిద్విలాసంతో -కళ్లు చికిలిస్తూ నవ్వింది - ఎటోచూస్తున్న రామ్మూర్తి - ఒక్కక్షణం ఇటుచూసి - మరు క్షణంలో - ప్రకృతిని చూడటంలో - లీనమైపోయాడు.
    "మేడమ్ గారికి సన్మానమా?  - ఎక్కడ -"
    ఎక్కడలేని కుతూహలంతో ముందుకువంగి - అభిమానాన్ని అణుచుకోలేనట్టు మెలికలు తిరుగుతున్న - రమ భర్తని - గర్వంగా చూసింది మరో అమ్మాయి.
     "అవును - హైద్రాబాద్ లోనే అక్కడ మేము క్రొత్తగా సాహితీసంస్థ నొకదాన్ని పెట్టాం. ఉత్సాహముండి - ఇప్పుడే కలంపట్టుకున్న మీలాంటి యువరచయిత్రులూ - రచయితలూ - వందలకొద్దీ - ఒకేతాటిమీద నిల్చి - మా సంస్థని నెలకొల్పుకున్నాం. దానికి  మొదటిసారిగా ... .మేడమ్ గారి సన్మాన కార్యక్రమం... శుభదాయకంగా వుంటుందని అందరం అనుకున్నాం - "
     కాస్త వాగ్దాటివున్న రెండవ అమ్మాయిని అర్దనిమిలితంగా చూస్తూ అలవొకగా నవ్వింది కరుణాదేవి.
     "నిజానికి - నాకీ సభలూ  -సన్మానాలూ అంటే అసహ్యం ఒకరకంగా చెప్పాలంటే - ఆస్థితిని దాటి చాలాకాలం ఐంది - పైకిరావాల్సినవాళ్లూ - పేరుకోసం ప్రాకులాడేవాళ్ళూ - సభల మొహం ఎరగనివాళ్ళూ - ఎక్కినా అందంచందం.... అన్ని స్టేజీలూ దాటిపోయిన నాకెందుకు చెప్పండీ సన్మానాలు....... అందుకే వద్దంటే వద్దన్నా...."
     కరుణాదేవిమీద భక్తి మరింత పెరిగింది అభిమానులకి "అలా అంటే ఎలాచెప్పండి... ఏదో ..... అభిమానుల తృప్తి కోసమైనా మీరు కొన్ని బాధలు పడాలి -"
     "అందుకనేగా - " విలాసంగా వేళ్లు విరుచుకుంటున్న కరుణాదేవి అల్సిపోయిందేమోనని  - వీపుదగ్గర  దిండు అమరుస్తూ చిన్నగా అంది మొదటి అమ్మాయి.
     "సన్మానం చెయ్యటానికి అర్హత ఎవరికుందా  అని బుఱ్ఱలు బ్రద్దలు కొట్టుకున్నాం మేడమ్.... చివరికి 'రాగశ్రీ' గార్ని మించినవారు లేరనిపించింది."
    రచయిత్రి సమాధానాన్ని ఆశిస్తున్నట్టు చూశారందరూ.
    "రాగశ్రీ అంటే....."
    రచయిత్రి సందేహానికి తెల్లపోయారందరూ -
     ఎందుకంటే - ఆయన ప్రఖ్యాతివహించిన మహారచయిత. ఆయన మాటలు  వ్రాయనిదే - పిక్చర్సు జయప్రదం కావు. ఆయన  పాటలులేని సినిమాయేలాదు. అంతేకాదు - 'కళా ప్రపూర్ణ' లాంటి బిరుదుల్ని కూడా - నిర్లక్ష్యంగా - వొదిలేసుకుని అతిసామాన్యంగా బ్రతికే మహాపండితుడాయన. ఒక మహా వృక్షం క్రింద మొక్కలు పైకి ఎదగవంటారు -కాని- రాగ శ్రీ గారి కీర్తి ఆకాశానికంటుతున్న కొద్దీ - ఆయన విశాలదృక్పథం నీడన ఎందరో యువరచయితలూ - రచయిత్రులూ - తమతమ స్థానాలను సుస్థిరం చేసుకుని - ప్రముఖ స్థానంలో - స్థిరనివాసం ఏర్పరచుకున్నారు -


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS