Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 5


    
    "అమ్మా! అయ్యా రమ్మంటున్నారు" సరస్వతి చెప్పడంతో బెడ్ రూమ్ లోంచి కింది హాల్లోకి వెళ్ళగా-
    
    సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి టెండర్లు వున్నాయని చెప్పి వెళ్ళిపోయాడు జగదీష్.
    
    రోజూ అంతే అతను ఉదయం ఎనిమిది గంటలకల్లా రెడీ అయిపోయి వర్క్ స్పాట్ కి వెళ్ళిపోతాడు. ఏ తొమ్మిదింటికో స్టార్ హోటల్ లో కాంట్రాక్ట్ మిత్రులతో గడిపి ఇంటికొస్తాడు. అంతవరకు ఒంటరిగానే వుండిపోతుంది సూర్యాదేవి.
    
    భర్త వెళ్ళిపోవడంతో బాత్రూమ్ లోకి వెళ్ళింది. బ్రష్ తీసుకుని పేస్ట్ వేసుకోవడానికి ట్యూబ్ అందుకుంది. కొత్త ట్యూబ్ ఇంకా ఒత్తకపోవడం వల్ల నిండుగా వుంది. ఎప్పుడైనా ట్యూబ్ అయిపోయి, పేస్ట్ కోసం దాన్ని రాయితో కొట్టి, కొద్దిగా బయటపడ్డ పేస్ట్ ను చూసి విజయగర్వంతో నవ్వాలని అనిపిస్తుంది. కానీ ఆమె కోరిక ఎప్పుడూ తీరలేదు. ముప్పాతిక భాగం అయిపోగానే కొత్తది వచ్చేస్తుంది.
    
    అన్నీ ఎక్కువ కావడం వల్ల వచ్చిన కొత్తరకం ఇబ్బంది ఆమెది. డబ్బు ప్రపంచంలో ఇమడలేక పోవడం ఆమె బలహీనత.
    
    స్నానానికి బాత్ టబ్ లోకి దిగింది. పాలరాతితో దంతపు పెట్టెలా వుండే బాత్రూమ్ కాకుండా తడికెలతో వుండే స్నానాలగదిని ఊహించింది.
    
    అలాంటి తడికెల బాత్రూమ్ లో తను స్నానానికి కూచుంటుంది. అప్పటివరకు బయటికెళ్ళిన భర్త అప్పుడే వస్తాడు. తను స్నానం చేస్తున్నానని తెలిసీ తెలియనట్లు నటిస్తూ తనను గట్టిగా పిలిచి వెతుకుతాడు. కాసేపు అలా పిలిచి స్నానాలగది దగ్గరికి వచ్చి మునికాళ్ళమీద నిలబడి లోపలికి చూస్తాడు.
    
    అప్పుడు తను సిగ్గుతో సున్నాలా ముడుచుకుపోయి, కళ్ళు గట్టిగా మూసుకుంటుంది.
    
    "పిల్లి కూడా కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది ఎవరూ తనను చూడడం లేదని అనుకుంటూ అదిగో - అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. చీకట్లో చూసిందానికీ, పగల్లో చూసిందానికీ చాలా తేడా వుంది సుమా ఇలాగని ముందే తెలిస్తే మన ఫస్ట్ నైట్ పగలే జరిపించాలని పట్టుబట్టి వుండేవాడ్ని"

    భర్త అలా అనడంతో తను చెంబుడు ఉడుకు నీళ్ళను చేతుల్తో పైకెత్తి అతని మీదకి చల్లుతుంది.
    
    "ఆహాఁ నువ్వు లా చేయెత్తుతూ వుంటే యెన్నిసార్లయినా ఉడుకు నీళ్ళు పోసుకోవడానికి సిద్దం తన పైకి బాణం వదిలే ఆడపిల్లతో గాలిబ్ అన్నట్లు "వెలదివిత్తు మరల వేయమనుచు" అంటాను."
    
    తను మరింత సిగ్గుపడిపోతుంది. ఆ చిలిపితనానికి మురిసిపోయి నగ్నంగా అతని యెదలో పూలహారం అయి వేలాడాలనిపిస్తుంది.
    
    ఇలా మధురంగా ఆలోచిస్తూ స్నానం ముగించింది సూర్యాదేవి.
    
    సూర్యాదేవి హాల్లో కూర్చుని వెంట్రుకలను ఆరబెట్టుకుంటూ వుండగా వంటవాడొచ్చి వినయంగా నిలబడ్డాడు.
    
    "మధ్యాహ్నం ఏం చేయమంటారు?"
    
    "ఏదో చెయ్! నీ ఇష్టం వెంకటయ్యా"
    
    "అలాగేనమ్మా! టిఫిన్ రెడీగా వుంది రండమ్మా"
    
    టిఫిన్ తిని తిరిగి హాల్లోకి వచ్చింది. కాలం ఇనుపముద్దలా తన తలమీద వున్నట్లనిపించింది.... ఏమీ తోచదు, ఏమీ తోచదు ఏం చేయాలో పాలుపోదు.
    
    ప్రతీదీ రొటీన్ గా అనిపిస్తుంది.... ఏదో చికాకు. అసహనం మనిషిని అతలా కుతలం చేయడం ప్రారంభిస్తాయి..... వాటినుంచి ఎలా బయటపడాలో తెలియక గింజుకుపోతుంది. భర్త వున్నా అంతే... అతను వెళ్ళిపోతే మరింత శూన్యం గుండెకు అడ్డం పడుతుంటుంది.
    
    నిజానికి ఆమె నైజం అదికాదు. ఎత్తయిన శిఖరం మీదనుంచి దూకే భావావేశం ఆమెది..... జలపాతం ఎక్కడికి ఉరకాలో తెలియక మధ్యలోనే గడ్డకట్టుకు పోయినట్టు అయిపోయింది.
    
    పెళ్ళికి ముందు ఏదో దిగులు అంతర్లీనంగా వున్నా.... చలాకీగా, సరదాగా వుండేది..... పెళ్ళయ్యాక తనకీ, ప్రపంచానికీ వున్న లింకు తెగిపోయినట్లయింది. తనకూ ఓ చక్కని తోడుంటాడని కలలుకంటూ ఆమె పెళ్ళి కూతురైంది.
    
    పెళ్ళికి ముందురోజు సాయంకాలం నాలుగు గంటలకి ఆమె ఊరి నుంచి పెళ్ళికూతురయి బయలుదేరింది.
    
    పెళ్ళి కూతురై ఇంటిమెట్లు దిగగానే బ్యాండ్ మేళం వాళ్ళు "బావలు సయ్యాఁ హె బావలుసయ్యాఁ" అనే సినిమా పాటను పాడడం ప్ర్రారంభించారు.
    
    పెళ్ళికూతురు జనంలోకి రాగానే ఆ పాట పాడడం ఏదో ఎబ్బెట్టుగా అనిపించింది ఆమెకి. దాంతోపాటు నవ్వు వచ్చింది.... ఆ పాట వద్దు. "సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే పాటను వాయించండి" అని చెప్పాలని వున్నా తను కొత్త పెళ్ళికూతురు కాబట్టి చెప్పలేక పోయింది.
    
    ఆ తరువాత పాట మరీ ఘోరం.... "చెన్నాపట్నం చిన్నదాన్ని, చైనా బజారులో వున్నదాన్ని, పూలదుకాణం దాటి, పాల డిపో మీదుగా అట్టట్టా దిగివస్తే అక్కడుంది మా యిల్లు" వాయించారు.....వేటూరి మంచి పనిచేశారు. మిఠాయిబండి పక్కన అంటూ బొడ్డును ప్రస్తావించలేదు అనుకుంది.
    
    ఇలాంటి పాతాళ హోరులో వీధి చివరి వరకూ ఊరేగింపుగా వచ్చి, అక్కడున్న దేవాలయంలో దేవుడికి మొక్క్మి  సత్రానికి బయల్దేరింది.
    
    పెళ్ళిపీటల మీద జగదీష్ చక్రవర్తిలా వున్నాడు..... నెత్తిమీద కుచ్చు పోస్న తలపాగా, మెడలో ముత్యాలదండతో పొడుగ్గా, నాజూగ్గా వున్న అతన్ని వాలుచూపులతో చూసింది..... అందగాడే అనిపించడంతో మరువం, దవనంతో కప్పేసిన తన గుండెల మీద ఎవరో పన్నీటిని చిలకరించినట్లనిపించింది. పెళ్ళిచూపుల్లో సిగ్గువల్ల బాగా చూడలేకపోయింది.
    
    పెళ్ళి అయ్యాక తిరిగి ఊరుకొచ్చారు. మొదటిరాత్రి కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.
    
    సూర్యాదేవి లైట్ గా అలంకరించుకుని పెరటివైపు సిమెంట్ చప్టా మీద కూర్చుంది.
    
    మబ్బుల్లేని ఆకాశంలో చందమామ మరింతగా ప్రకాశిస్తున్నాడు. వేసవికాలం కావడం వల్ల పగలంతా ఎక్కడో దాక్కున్న గాలి అప్పుడే బయటకొచ్చి చక్కర్లు కొడుతోంది.
    
    మల్లెపూల పరిమళం గాలిలో తేలుతూవచ్చి ఆమెను సుగంధాల సరస్సులో ముంచుతోంది. శరీరం ఏదో అనుభవం కోసం విచ్చుకుంటోంది.
    
    పదిగంటల ప్రాంతాన గదిలోకి అడుగుపెట్టింది. మంచుకొండల మధ్యనున్న గుహలా ఏసీ గది అతిచల్లగా వుంది. రోజూ తను పడుకునే గదే అయినా ఇప్పుడు గదిలాలేదు. స్వర్గానికి తామిద్దర్నీ మోసుకెళ్ళడానికి దిగివచ్చిన పూలపల్లకిలా వుంది.
    
    "కమాన్ డార్లింగ్" జగదీష్ పిలవడంతో సిగ్గంతా కాళ్ళల్లోకి జారినట్లు కదలలేకపోయింది.
    
    అతను లేచివచ్చి చేయి అందుకున్నాడు. ఆ స్పర్శ ఎదవరకు పాకి జలదరింపై, నడుమును చుట్టుకొని చక్కలిగింతై, కిందకుజారి పులకింతై పూసింది.
    
    అతనితోపాటే అడుగువేసింది. శివధనుస్సు విరచగానే సీతాదేవి పూలమాలను తీసుకుని రామునివైపుకు నడిచిన సన్నివేశం గుర్తొచ్చింది.
    
    ఇద్దరూ కాసేపటికి సర్దుకున్నారు.
    
    ఎదవైపు సాగుతున్న అతని చేతుల్ని ఒళ్ళోకి తీసుకుని, "ఏమైనా కబుర్లు చెప్పండి" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS