Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 4


    "అలా బయటికి వివేక్ థెంకర్ స్టాట్యూ దగ్గర వెయిట్ చేస్తుంటానన్నాడు. బయట వెన్నెల- ఎంత బావుందో- చూద్దువురా" అంటూ ఆమెను బలవంతంగా గేటు దగ్గరికి లాక్కొచ్చింది.
    
    కారిడార్ అంతా నిశ్శబ్దంగా వుంది.
    
    "అటు చూడు చందమామ - ఆకాశంలో వెండి గడియారంలా వేలాడుతోంది. కార్తీకమాసపు వెన్నెల్ని అనుభవించకుండా, అలా మూడంకి వేసుకొని రూమ్ లో పడుకోవడం కంటే మించిన పాపం మరొకటి వుండదు. కైలాసం నుంచి పడిపోయిన ఢమరకం, ఆవేశానికి భూమిలోకి సగం కూరుకుపోయి, మిగిలిన సగం కన్పిస్తున్నట్లు వుండే మన ఆడిటోరియంపైన పడుకోవడం ఎంత బావుంటుందో బ్రహ్మానందం అంటారే అదేనేమో, వెన్నెల్లో తడిసి మనసుకు జలుబు చేయడం అంటే అంతేనేమో"
    
    "గేట్లు అన్నీ మూసేశారుగదా! ఎలా వెళతావు?"
    
    "దొంగదారి ఒకటుందిలే ఏ విషయంలోనైనా మార్గదర్శకులు వుంటారు కదా అలాంటివాళ్ళు ఏర్పాటు చేసిందే ఆ దారి రా! అక్కడివరకు వచ్చి తిరిగి వచ్చేద్దువు" అంది రమ్య.
    
    సూర్యాదేవి మౌనంగా అనుసరించింది.
    
    హాస్టల్ గేటుకి బాగా దూరంలో ఉత్తరంవైపున వుంది ఆ దారి. ప్రహరీగోడకు దిగువున మనిషి దూరేంతకంత అంత సాహసం చేయలేని అమ్మాయిల దిగులంతా అవతలికి ప్రవహించడానికి తవ్వినకాలువలా వుంది.
    
    "ఓకే! టాటా! ఛీరియో"
    
    రమ్య వెన్నెల్లో కలిసిపోయింది.
    
    ఒంటరిగా సూర్యాదేవి మిగిలిపోయింది. వెన్నెల శరీరాన్నంతా చుట్టుకుంటోంది. రాత్రి రహస్యాలపై మేలిముసుగు కప్పుతోంది గాలి.
    
    అక్కడక్కడా వున్న నక్షత్రాలు ఒంటరితనంతో వణికిపోతున్నాయి. నైట్ క్వీన్స్ చెట్టు లోకానికి పరిమళాన్ని అద్దుతోంది.
    
    ఆమె అలానే ఎంతసేపుందో తెలియదు. ఏదో తెలియని బాధ శరీరాన్ని కిందకు లాగుతుంటే కదలలేకపోయింది. కనుపాపల మెడలో వెండిహారం వేసినట్లు బుగ్గలవరకు సాగిన కన్నీటి బిందువులు కిందకు జారుతుంటే తన గదిలోకి వచ్చేసింది.
    
    నాలుగుగంటల ప్రాంతాన రమ్య తిరిగొచ్చింది. చిన్నగా తలుపు చప్పుడైతే సూర్యాదేవి లేచి గడితీసింది. వెన్నెలంతా తాగి ముఖం ఉబ్బినట్లు రమ్య మెరిసిపోతోంది. ఏదో తెలియని ఆనందంతో కళ్ళు మరింత వెడల్పయ్యాయి.
    
    "ఏమైంది? ఏదో మార్పు నీలో!"
    
    "ఇది నాకు అమృతం కురిసిన రాత్రి" అని కాట్ మీద కూర్చుని మనో లోకంలోంచి భూలోకవాసికి జరిగింది జరిగినట్లు చెబుతోంది రమ్య.

    "ఇక్కడినుంచి వెళ్ళానా, స్టాట్యూ కింద స్టాట్యూలా నిలబడి వున్నాడు వివేక్. ఇద్దరం కలిసి అలా నడుచుకుంటూ సంస్కృత కళాశాల దాటి ఆసుపత్రి రోడ్డులో ఓ దగ్గర కూర్చున్నాం. అక్కడినుంచి సిటీని చూడడం గొప్ప థ్రిల్. ఏదో చుక్కల రాజ్యానికి మేమిద్దరం రాజూ రాణీ అయినట్లు ఫీలింగ్ రాత్రిమీద వెన్నెల జీను లేసుకొని నిశ్శబ్దం స్వారీ చేస్తున్నట్లుంది."
    
    "వివేక్"
    
    "ఊఁ"
    
    "నాకేమనిపిస్తోందో తెలుసా? మన రెండు శరీరాల్ని అదిగో- ఆ కనిపించే కొండశిఖరాలకు తగిలించి ఆత్మలతో వ్యాహ్యాళి కొచ్చినట్టు అనిపిస్తోంది" అన్నాను.
    
    "అందుకేననుకుంటా, నీ శరీరాన్ని ఎక్కడ తాకినా మనసు తగుల్తోంది" అన్నాడు.
    
    అప్పుడు గమనించాను నేను మతాల మధ్య వివేక్ తొడపై తల ఆనించి పడుకున్నానని అది కూడా గమనించలేని ఆ స్థితి ఎలాంటిదో ఊహించు.
    
    కాసేపయ్యాక వివేక్ అన్నాడు "రెండురోజులు, మూడురోజులు ముద్దులు పెట్టుకున్న జంటలు అని పేపర్లో చదువుకుంటాం కదా మనం ఎన్ని గంటలు పెట్టుకుంటామో పరీక్ష పెట్టుకుందామా?"
    
    "ఓఁ" అని ఒప్పుకున్నాను.
    
    ఇద్దరం ఎదురెదురుగ్గా కూర్చుని పెదవుల్ని పెదవులతో పట్టుకున్నాం అప్పుడు అనిపించింది ఇది అమృతం కురుస్తున్న రాత్రి అని.
    
    అలా మేం రెండు నిముషాలు వున్నామో లేదో మరో జంట మాకు మరీ దగ్గరైంది. కానీ పరీక్ష గనుక మేం పెదవుల్ని లాక్కోలేదుగానీ ఇబ్బందిగా కదిలాం.
    
    వాళ్ళూ మమ్మల్ని అప్పుడే చూశారు. ఇద్దరూ మెడికోస్ కాబోలు ఆ ప్రాంతమంతా సుపరిచితమైనట్లు ముందుకు నడిచారు.
    
    మరో పదినిముషాలు గడిచాయనుకుంటా వివేక్ చేతులు మెల్లగా నాపై కదలడం ప్రారంభించాయి. సితార తీగలమీద ఒక్కోచోట నొక్కితే ఒక్కో రాగం పలికినట్లు ఒక్కో అవయవం ఒక్కో అనుభూతిని నాలో రేపుతోంది. మరుక్షణంలో ఇద్దరం ముద్దుల పరీక్ష గురించి మరిచిపోయాం మాధుర్యపు సుడిగుండంలో చిక్కుకున్న కాగితపు పడవలై పోయాము. మా శరీరాలు, ఆకాశంలో తెల్లటి బెలూన్ లా ఎగురుతున్న చందమామ సాక్షిగా..... ఐ లాస్ట్ మై వర్జినిటి"
    
    వింటున్న సూర్యాదేవి అలా బిగుసుకు పోయింది.
    
    "ఏమిటలా కొయ్యబారి పోయావ్?"
    
    "మరి మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారా?" ఒక్కో మాటను సాగదీస్తూ అడిగింది సూర్యాదేవి.
    
    "ఇంతవరకు అలాంటి ప్రస్తావనే రాలేదు మామధ్య. ఏదో ఆదర్శాన్ని ముందు పెట్టుకుంటున్నట్లు భ్రమలు కల్పించుకుని, చేసిన ప్రతి పనినీ ఆ ఆదర్శానికి ముడిపెట్టడం కంటే వేరే ఆత్మవంచన లేదనుకుంటాను. జీవితం..... ఎప్పుడో ఎవరో రాసిన వ్యాసాన్ని ఎక్సర్ సైజ్ నోటు బుక్కులో మనసు పెట్టకుండా చూచిరాత రాసినట్లు వుండకూడదు. గుండెల్ని ఊపేసిన అనుభవాణ్ని చిత్తుకాగితం మీద రాసిన కవిత్వంలా వుండాలి. లైఫ్ అంటే అదేనని నమ్ముతాను కాబట్టి ఏం జరిగినా నో రిగ్రాట్స్ గుడ్ నైట్" అని రమ్య పడకపై వాలిపోయింది.

    సూర్యాదేవికి మాత్రం తెల్లవారినా నిద్రరాలేదు. ఆ తరువాత కొన్ని రోజులకే రమ్య హాస్టల్ ఖాళీ చేసి టౌన్ లో రూమ్ తీసుకుంది. ఆమె స్థానంలో వచ్చిన నిర్మల పుస్తకం సాలెగూట్లో మెదడు పురుగు చిక్కుకు పోయినట్లు వంచిన తల ఎత్తేదికాదు. దాంతో రమ్య తుఫాను నుంచి తేరుకుంది సూర్యాదేవి.
    
                                              4
    
    యూనివర్శిటీ చదువైపోయిన వెంటనే సూర్యాదేవికి పెళ్ళి చేశాడు భూపతిరాజు. ఆమె భర్త జగదీష్ సిటీలో క్లాస్ వన్ కాంట్రాక్టర్ అన్నదమ్ములుగాని అక్కచెల్లెళ్ళుగానీ ఎవరూ లేరు అతనికి. కోట్ల రూపాయల ఆస్తినీ, కాంట్రాక్టుల్లో, మెళకువలనూ వారసత్వంగా ఇచ్చి ఇటీవల అతని తండ్రి చనిపోయాడు. తల్లి పదిసంవత్సరాల క్రితమే తనువు చాలించింది.
    
    రాజభవనం లాంటి ఇంట్లో సూర్యాదేవి, జగదీష్ వుంటున్నారు. కూతురి పెళ్ళయి మూడు సంవత్సరాలైనా ఇంకా తను తాత కాలేకపోయానన్న చింతతప్ప మరే బెంగాలేదు భూపతిరాజుకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS