"అయినా అంత చిన్నవయసులో పెళ్ళేమిటి?" అతని మీద ఒళ్ళుమండి అన్నాడు గోపాల్రావు.
"మరి మీలాగా నడివయసులో అక్షింతలు చల్లుకోమంటారా?" వెంటనే కాంచనమాల అంటించింది.
దాంతో ఊరుకుండిపోయాడు గోపాల్రావు. అందుకే మొదటిసారి తన మరదలు, అతనూ ఇంటికి వచ్చినా పలకరించాలనిపించలేదు. రాత్రి భోజనం ముగించాక గదిలోకి వచ్చేశాడు. అదంతా గుర్తొచ్చింది.
" వెంకటగిరి నేనెందుకులేవే- మీరెళ్ళండి" అతనితో వెళ్ళడం ఇష్టం లేక తప్పించుకోవాలని చూశాడతను.
"మీకు తెలిసిన అచారి వున్నాడు కదా. అక్కడికి వెళదాం" అంది కాంచనమాల.
"సరే" అంటూ పడకమీదనంచి లేచాడు గోపాల్రావు.
స్నానం ముగించుకుని రెడి అయి వచ్చేటప్పటికి శేఖర్ హాల్లో కూర్చుని వున్నాడు.
ఇక తప్పదని ముఖమంతా నవ్వుని పులుముకుని- " హలో శేఖర్" అంటూ పలకరించాడు.
టీ.వీ చూస్తున్న అతను గోపాల్రావుకేసి తిరిగాడు.
నిజంగానే అతను బావున్నాడు చిన్న వయసు. చక్కగా అమరిన కనుముక్కుతీరు, స్టయిల్ గా వుండడం ఇవన్నీ కలిపి అతన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి.
తను అతడికి తోడల్లుడవడమే ఇబ్బందిగా వున్నట్లనిపించి గోపాల్రావుకి. బావ గొంతు విని రత్నమాల వంటగదిలోంచి వచ్చింది పలకరింపులయ్యాయి.
టిఫిన్ లు చేశాక నలుగురూ బయల్ధారారు.
శేఖర్ కి బట్టలషాపు వుంది. రాబడి బాగానే్ వున్నట్టుంది. పెళ్ళి కాగానే మారుతీకారు కొన్నాడు. ఆకారులోనే వచ్చారు. ఇప్పుడు బయల్దేరింది. అందులోనే. రత్నమాలకంటే కాంచనమాలే హుషారుగా వుంది.
అమె వెంకటగిరికి బయల్దేరేప్పటికి వేరే చీరలోకి మారిపోయింది. బతిక్ ప్రింట్ డిజైన్ ఉన్న రోజ్ సిల్క్ శారీ, దానిమీద మ్యాచింగ్ బ్లౌజ్, మెడలో చైన్ తో పాటు రోజ్ కలర్ పూసలదండలో అమె గులాబీలా వుంది.
"రండి...రండి.... టైమైపోతోంది." అని ఒకటే తొందర పెట్టేసింది. అందరూ రెడీ అయి ఇంటి దగ్గర్నుంచి కారు బయల్దేరేప్పటికి ఎనిమిది గంటలయింది.
కారులో ఎవరెవరు. ఎక్కడెక్కడ కూర్చోవాలో అన్న విషయంపై పేచీ మొదలైంది. తను ముందర కూర్చుంటానని రత్నమాల, కాంచనమాల, పోటీపడ్డారు. తాను భార్య కాబట్టి శేఖర్ పక్కన తనుండాలని రత్నమాల అంటే, కారు వాళ్ళది కాబట్టి, గెస్ట్ లకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని, తనకి ముందుసీటు ఇష్టం కాబట్టి తనకే ఇవ్వాలని కాంచనమాల పట్టుబట్టింది.
ఎంతకీ విషయం తెగకపోవడంతో మధ్యలో శేఖర్ కల్పించుకున్నాడు. "దీనికి ఒకటే పరిష్కారముంది. అదేమంటే మీ ఇద్దరి పేర్లను ఒక పేపర్ మీద రాసి కలుపుదాం. ఎవరి పేరొస్తే వాళ్ళది ప్రంట్ సీటు అవుతుంది"
" గుడ్ ఐడియా"
కాంచనమాల శేఖర్ ను మెచ్చుకుంది.
చీటీలు రాసి కలిపాడు. కాంచనమాల పేరే వచ్చింది.
"మరేమిటనుకున్నావ్! అదృష్టం నా పక్కే వుంది" అంటూ కాంచనమాల కళ్ళతోనే శేఖర్ ను చూపించి అంది. శేఖర్ ని అదృష్టంతో పోల్చడం చూస్తుంటే గోపాల్రావుకి ఈర్ష్ట్య లాంటిది గుండెనంతా కెలికింది.
అట్లా కాంచనమాల ముందుసీట్లో , వెనక రత్నమాల, గోపాల్రావు కూర్చున్నారు. శేఖర్ కారు నడుపుతున్నాడు. ఇక కాంచనమాల ఉత్సాహానికి అవధుల్లేవు.
ఏమిటేమిటో మాట్లాడుతోంది. తన భార్య ఎప్పుడూ తనముందు అంత హుషారుగా నవ్వుతూ తుళ్ళుతూ వుండడం అతను చూడలేదు.
"కారులో వెళుతూ కాఫీ తాగడం బావుంటుంది. అదిగో ఆ కాఫీ హోటల్ దగ్గర కారాపు" అంది కాంచనమాల. శేఖర్ తో. అమె అలా అంటూ అతని భుజంపై చేయి వేసింది.
అమె క్యాజువల్ గా అతని భుజం మీద చెయ్యేసినా గోపాల్రావుకు మాత్రం గుండెల్లో కలుక్కుమంది. శరేరంలోని రక్తమంతా పొంగి కళ్ళల్లోకి వచ్చింది. ఏదో తెలియని కోపం ముఖాన్ని పొంగించింది.
కాని అతను భార్యను ఏమీ అనలేదు. ఏమైనా అంటే కాంచనమాల ఊరికే విని బాధపడే రకంకాదు.
తాను ఒకటంటే అమె రెండనగలదు.
కారును పక్కబెట్టి అపాడు శేఖర్.
అందరూ కారులోంచి దిగారు. అది చిన్న కాకా హోటల్. వాళ్ళు నలుగురూ అక్కడికి వెళ్ళేటప్పటికి ఒకరిద్దరు కస్టమర్లు తప్ప ఎవ్వరూ లేరు.
"కాఫీ స్ట్రాంగ్ గా" కాంచనమాలే అర్డరిచ్చింది.
కాఫీ మాస్టారు మరింత భయభక్తుల్ని ప్రదర్శిస్తూ కాపీ చేశాడు. కూర్చోవడానికి ప్లాస్టిక్ చైర్లు వేశాడు.
అయినా అందరూ నిలుచునే కాఫీలు తాగారు.
డబ్బులిచ్చాక తిరిగి బయలుదేరారు. కారు దగ్గరికి వస్తుంటే రత్నమాల తన అక్కను ఓ మారు పరిశీలించి.
"అక్కా. నీ మ్యాచింగ్ అదిరిందే" అంది.
"నింజగానా!" కాంచన శేఖర్ వైపు చూస్తూ అడిగింది.
అట్లా అంది రత్నమాల గానీ శేఖర్ కాదు. అందువల్ల "నిజం గానా" అని శేఖర్ ని కాదు అడగాల్సింది రత్నను అని చెప్పాలనిపించింది గోపాల్రావుకి.
"రియలీ- సూపర్బ్!" అన్నాడతను.
ఆ మాటలు అనేటప్పుడు అతని కళ్ళు మెరవడం కాంచనమాల గుర్తించింది. అమె ఎంతగానో అనందించింది. " ప్రతిది నీకు బాగా కుదిరింది" అంటూ కాంచనమాలని రత్నమాల యింకా మెచ్చుకుంటోంది.
అయితే నాకు మ్యాచింగ్ కుదరంది ఒకటుంది" అంది కాంచనమాల సీరియస్ గా.
నడుస్తున్న శేఖర్ ఎక్కడివాడక్కడే అగిపోయాడు.
"ఏమిటబ్బా అది?" రత్నమాల కూడా ఆలోచనలో పడింది. ఎవరికి అదేమిటో తట్టలేదు.
"మీరు ఊహించలేదు. నేను చెబుతాను" అని గోపాల్రావు దగ్గిరికి చరచరా నడిచివెళ్ళి పక్కన నిలుచుని "నాకు మ్యాచింగ్ కానిది భర్తే. నిజంగా మ్యాచ్ అయ్యాడా? లేదు కదా? నాతో అబద్దాలు మాత్రం చెప్పకండి. మొహమాటాలు పడకండి. మ్యాచ్ కాలేదు కదా?"
అమెకి ఏదో అవేశం పూనినట్టు మరీ అంత గట్టిగా ఒత్తిపలుకుతూంటే ఏం చెప్పాలో ఎవరికి తెలియకుండా మౌనంగా నిలుచుండిపోయాడు. గోపాల్రావుకైతే మొత్తం రక్తమంతా శరీరంలో నుంచి కారిపోయినట్టు అయిపోయాడు. ఆ బాధ, ఆ అవమానం వర్ణనాతీతం.
శేఖర్ అతనిని గమనించి పరిస్ధితిని అర్ధం చేసుకున్నాడు. అందుకే ఆ విషయాన్నేమీ అసలు పట్టించుకోకుండా " త్వరగా వెళదాం రండి. మళ్ళీ పొద్దెక్కితే ఎండ తగులుతుంది" అంటూ టాపిక్ మార్చాడు.
" మరి పదండి- పదండి" కాంచనమాలకి. ఆలాంటి మాటలు సన్నివేశాలూ సహజం. కాబట్టి అమె కూడా అప్పటికప్పుడే డైవర్ట్ అయిపోయింది.
