"తినబోతూ రుచులు చూడబోతూ విషయము అడగకూడదు మైడియర్ సన్!" లోకేశ్వరరావు నవ్వుతూ అన్నమాటల్లో కశి తొంగి చూస్తూనే వుంది.
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే శీతల్ వెనుక వైపుగా ఇరువురు వెళ్ళి రెండు చేతులూ గట్టిగా పట్టేసి బర బర లోకేశ్వరరావు గదిలోకి యీడ్చుకు వచ్చారు.
"ఇదేమిటి?" నౌకర్ల చేతిలో చిక్కి గింజుకుంటున్న శీతల్ ని చూసి తెల్లబోయి అడిగాడు కుందన్.
"ఇదే నే చెప్పిన బంగారు చేప." అంటూ గదంతా ప్రతిధ్వనించేలా నవ్వాడు లోకేశ్వరరావు.
29
"నా బొందిలో ప్రాణముండగా ఈ పెళ్ళి జరగదు."
శీతల్ ఈ మాట సరీగా పదిసార్లు చెప్పింది. లోకేశ్వరరావు నవ్వి వూరుకున్నాడు.
"అలా నీవనుకుంటూ వుండు ఇలా నేను నీ మెడలో మూడుముళ్ళు వేస్తాను. నా వల్ల నీకు అబ్బాయి పుట్టేటట్టు చేస్తాను." గట్టిగా నవ్వుతూ చెప్పాడు కుందన్.
శీతల్ కాళ్ళకి చేతులకి బంధాలు లేవు అయినా ఇప్పుడు ఆ గదిలో ఆమె బందీ కోరి మృత్యువుని ఆహ్వానిద్దామన్నా గది గుమ్మం దగ్గర ఏనుగంత పనిమనిషి కాపలా వుంది. అవసరం అయితే ఎడం చేత్తో శీతల్ ని ఎత్తి అయిదామడల దూరానికి విసిర వేయగల భీమ బలురాలు.
శీతల్ పట్టుబడ్డ తర్వాత కుందన్ వేషం మార్చేశాడు. పూర్తి ఆధునిక వస్త్ర ధారణలో వున్నాడు కళ్ళద్దాలు తీసేశాడు.
అప్పుడు గమనించింది శీతల్. కళ్ళకి వెలుగు పడకూడదని డాక్టరు చెప్పటం...ఆ కథ...అంతా కట్టు కథలు కుందన్ కి ఓ కన్ను పెద్దది ఓ కన్ను చిన్నది చాలా వికృతంగా వుంది ఓ కన్ను. అసలే అంతంత మాత్రం రూపం కుందన్ ది కళ్ళజోడు తీసే సరికి పూర్తి వికృతాకారుడుగ తెలిసిపోతున్నాడు. తల కట్టు (దుబ్బు క్రాపు) అలాగే వుంచి గడ్డం మీసం తొలిగించాడు. ఇప్పుడు ముఖానవున్న మచ్చలు కూడా కనిపిస్తున్నాయి.
"కుందూ! నీవు నా కోడలు పిల్ల తెలివి తేటలు బాగానే కనిపెట్టావు. మొత్తానికి నీ భార్య అందాల సుందరే గాక తెలివితేటల్లో కూడా అఘండురాలు. ధైర్యం చాకచక్యం అన్ని వున్నాయి.
తండ్రి అలా మెచ్చుకుంటుంటే కుందన్ ముఖం వెలిగిపోయింది. "తాళి యివాళ కట్టేసి రాత్రికే కాపురం పెట్టేస్తాను డాడీ!" అన్నాడు తొందరపడిపోతూ.
"కుందూ! నాకు కొన్ని సెంటిమెంట్స్ వున్నాయని నీకు తెలుసు. మన ఆస్తికి మన సామ్రాజ్యానికి పుట్టబోయే, వారసుడు చాకులాగా వుండాలి. పుట్టే వాడికి కోడలి అందము నీ తెలివితేటలు రావాలి, కనుక అన్ని శాస్త్రం ప్రకారం జరగాల్సిందే, మంచి ముహూర్తం మూడురోజులు తర్వాత వుంది. పెళ్ళి కాపురం సరీగ మూడు రోజుల తర్వాత, నిజం తెలిసింది కాబట్టి ఇంక ఆలస్యం చేసే పని లేదు." అంటూ లోకేశ్వరరావు వివరించాడు.
తన దాడికి ఈ గన్నయ్య గాడికి మధ్య వున్న శతృత్వం ఏమిటో తెలుసుకోవాలనుకున్న శీతల్. "పెళ్ళి మాట తర్వాత మా డాడీకి మీకు ఎందుకు పడలేదు? డాడీ మీకేం ద్రోహం చేశాడు?" అనడిగింది.
సరిగ్గా అప్పుడే లోకేశ్వరరావుకి అర్జంట్ కాల్ రావటంతో అవతలికి వెళ్ళాడు.
"విషయం నేను చెపుతాను పిల్లా!" అంటూ కుందన్ చెప్పసాగాడు.
"ఒకానొక నాడు అనగా మన చిన్నతనంలోనన్న మాట మీ డాడీ మా డాడీ కలసి ఏదో బిజినెస్ చేశారు. అప్పుడు మా డాడీ నిన్ను చూసి ముచ్చటపడి "నీ కూతురుని నా కోడలిగా చేసుకుంటాను. మా అబ్బాయికివ్వు" మా కన్నా మీ డాడీకే ఎక్కువ డబ్బుండేది దాంతో గర్వం కూడా వుండేది.
"మీ అబ్బాయి మా అమ్మాయి కాలిగోటికిపోలడు పైగా నీ అంతస్తు ఎక్కడ నా అంతస్తు ఎక్కడ అని అవమానంగా తిరస్కారంగాను మాట్లాడాడుట. నన్ను ఎక్కిదించటం కాకపోతే మగాడికి అందం ఏమిటి? మగవాడు అన్నవాడికి మగతనం వుండాలి. తెలివితేటలు వుండాలి. నా తెలివి మగతనం ఎలాగూ నాలుగు రోజుల్లోనే చూడబోతున్నావు కదా!
మీ డాడీ అలా అనగానే మా డాడీకి కోపం వచ్చింది. మిష్టర్ గోవర్ధన రావ్! నీకన్నా ఎక్కువ డబ్బూ సంపాదిస్తాను. నీ కూతురునే నా కోడలుగా చేసుకుంటాను అదెలాగన్నది నీ కళ్ళతో నీవే చూద్దువుగాని." అన్నారుట "మంత్రాలకి చింతకాయలు రాలవు. మంగమ్మ శబధాలకి ఇది పిట్ట కధల కాలం కాదు" అని మీ డాడీ మరోసారి హేళనచేశాడుట.
మాటా మాటా పెరిగింది. ఇరువురు విడిపొయ్యారు. బద్ద శత్రువులు అయ్యారు. మీ అయ్య ఈ విషయం మరిచిపోయినట్లున్నడు. మా అయ్య మాత్రం మరిచిపోలేదు. డబ్బుకి డబ్బు సంపాదించాడు. ఇప్పుడు నిన్ను ఎత్తుకొచ్చి నా భార్యని... ఈ యింటి కోడలిని చేయబోతున్నాడు చాలా యింకా వివరాలు కావాలా శీతూ!"
విషయం చెప్పి ముద్దుగా అడిగాడు కుందన్.
"అయితే మీకూ మాకు ఏ చుట్టరికము లేదన్న మాట?" శీతల్ ఈ విషయం కూడా తెలుసుకోవాలని అడిగింది.
"చుట్టరికము లేదు. చుట్టలు లేవు. నీ మెడలో తాళి కడతా కదా ఆ క్షణం నుంచి మీకూ మాకూ ఏర్పడుతుంది. చు...ట్ట...రి...కం..." వ్యంగ్యంగా అన్నాడు కుందన్.
"అది యీజన్మలో జరిగేపని కాదులే" నిర్లక్ష్యంగా కావాలని రెచ్చగొడుతూ అంది శీతల్.
కుందన్ మిత భాషి కాదు. కావాలని తండ్రి ఆజ్ఞ ప్రకారం అలా నటించాడు. వస్తుతహ వాగుడు కాయ. నిర్లక్ష్యంగా వాగుతుంటాడు. కోపం వస్తే వెనుక ముందు చూసుకోడు. మాట అంతే. ప్రవర్తన అంతే.
