"మేం ఈ ఇంట్లో వుండడం మీకెవరికీ యిష్టంలేదని మాకు అర్ధమయింది. మేం వెళ్ళిపోతాం. మా గురించి అమ్మాయిని మాత్రం బాధించకండి. ఈ గుండెలమీద మోసి, ఈ చేతుల్తో గోరుముద్దలు తినిపించి ఎంతో సుకుమారంగా పెంచుకున్నాం. దయచేసి నా బంగారుతల్లిమీద చెయ్యి చేసుకోకండి. మేం తక్షణం వెళ్ళిపోతాం."
"మీరూ నన్ను వదిలి వెళ్ళిపోతారా....?" భోరుమని ఏడుస్తూ అడిగాను.
"తప్పదమ్మా! కనిపెట్టుకుని ఇన్నాళ్ళూ వున్నామేకానీ కనిపెంచిన వాళ్ళం కాదుగా! ఈ పాశం ఏ చట్టానికీ అందదు. వచ్చే జన్మంటూ వుంటే మా కడుపునే పుట్టమ్మా" ఆయన నా తలమీద కన్నీరు కురిపిస్తూ వాత్సల్యంగా అన్నారు.
"జగదంబా...పద....మనం వచ్చినపని అయిపోయింది. ఈరోజు అమ్మాయి ప్రఖ్యాత గాయని! అమ్మాయి పేరు చెప్తేనే కాసులు గలగలా కురుస్తాయి. "నేను బాగా డబ్బు సంపాదించాలి" అని కోరింది. ఆ కోరిక తీర్చాం. మనకి భగవంతుడు నిర్దేశించిన పని నెరవేరాకా ఇంక యిక్కడ ఎందుకు? మన వూరికి పోదాం" అన్నారు.
"నేనూ వస్తానమ్మా....ఇక్కడ వుండను" చిన్నపిల్లలా ఆవిడ్ని అల్లుకుపోతూ అన్నాను.
"నీకు చాలా భవిష్యత్తుందమ్మా! మాకు భూతకాలం తప్ప ఏంలేదు. మమ్మల్ని పోనీ..." అందావిడ నా కన్నీళ్ళు తుడుస్తూ.
రేపటినుండీ ఈ రాబందుల మధ్యన ఎలా వుండాలీ? నా ఆకలి గుర్తించే ప్రాణులు ఎవరుంటారూ? నా ఆనందాలూ, విషాదాలూ ఎవరితో పంచుకోవాలి? అని మూగగా ప్రశ్నించాను.
ఆయన హాల్లో సరస్వతీదేవి ప్రతిమవైపు చూపిస్తూ ఆ తర్వాత తలవంచి నమస్కరించారు.
జరుగుతున్న పరిణామాలన్నీ ఎదుర్కోలేని నా నిస్సహాయత మీధనాకు చెప్పలేనంత అసహ్యం వేసింది.
దాసుగారూ, దాసమ్మగారూ ఆత్మల్ని నా దగ్గరే వదిలి శరీరాల్ని భారంగా మోస్తూ ఇల్లు వదిలిపెట్టిపోతుంటే "పీడా విరగడైంది" అంది ఆకక్సుగా పెద్ద వదిన.
నా జీవితం పరమ యాంత్రికంగా గడుస్తోంది. మూర్తి నాతో ప్రతిరోజూ రికార్డింగ్ ధియేటర్ వస్తాడు. నన్ను పహారా కాస్తున్నట్లు ఉంటాయి వాడి చూపులు. ఏ అర్ధరాత్రో ఇంటికి చేరితే ఒక్కోసారి గిన్నెలో ముద్ద అన్నం కూడా వుండదు. వదినల ఆడంబరాలకీ, షోకులకీ అంతులేకుండాపోతోంది. నాన్నగారి కోసం ఒక పనివాడ్ని పెట్టాను. వాడికి వదినలు బోలెడు పనులు చెపుతూ నాన్నగారి పనులు చూడనివ్వరు. నాకెంత రాబడి వుందో....ఇంటికెంత ఖర్చవుతుందో నాకు అర్ధం కావడంలేదు.
బాబు ఒక ఫియట్ కారు కొన్నాడు.
ఆ రోజు ఆదివారం నేను ఇంట్లోనే వున్నాను.
కాఫీకోసం కూడా కిందకి వెళ్ళబుద్దికాలేదు. ఎమ్.ఎస్.రికార్డ్స్ ఏవో వింటూ గదిలోనే పడుకున్నాను.
కిందనుండి ఏవో అరుపులు వినిపించాయి. లేచివెళ్ళి చూశాను.
రఘుతో చిన్నన్నయ్య గొడవగా మాట్లాడుతున్నాడు.
"నేను అహల్యను కలిసే వెళతాను" అతను స్థిరంగా అన్నాడు.
"వీల్లేదు ఎవర్నీ కలవనంది" మూర్తి కోపంగా అన్నాడు.
"రఘూ!" ఆనందం అంతా నా కళ్ళలోకి ఉబికి వచ్చి కన్నీళ్ళుగా పొంగాయి.
"అహల్యా!" అతను నావైపు ఆశ్చర్యంగా చూస్తూ మెట్లవైపు వచ్చాడు.
నేను అతని దగ్గరికి పరిగెత్తి "రఘూ....దాసుగారు వాళ్ళూ వెళ్ళిపోయారు. నేను ఒంటరిదాన్నయిపోయాను" అని ఏడ్చేశాను.
దాసుగారు నాకు జరిగిందీ, జరుగుతున్నదీ చెప్పే వెళ్ళారు. అసలు వీళ్ళందరూ నీమీద ఆధారపడి తింటూ, నీమీదే పెత్తనం చెలాయిస్తారేమిటీ? అంతా నీ చేతకానితనం" కోపంగా అన్నాడు రఘు.
"నువ్వెవర్రా మా ఇంట్లోకొచ్చి మమ్మల్ని అనడానికీ? మర్యాదగా బయటికి నడు" అరిచాడు బాబు రఘుమీద మీదకి వస్తూ.
"వెళ్ళిపో రఘూ! వీళ్ళు ఎంతకయినా తెగించిన వాళ్ళు!" అసహ్యంగా వాళ్ళని చూస్తూ అన్నాను.
"నేనెవరో నీకు త్వరలోనే తెలిసేటట్లు చేస్తాను" అన్నాడు రఘు.
"పోరా!" రఘుని గుండెలమీద చెయ్యేసి తోసాడు మూర్తి.
"ఆగండి" నేను అడ్డంగా వెళ్ళి నిలబడుతూ అన్నాను - "అతన్ని ఏమీ చెయ్యకండి వెళ్ళిపోతాడు."
"అహల్యా! నువ్వెందుకు వీళ్ళకి తల వంచుతున్నావు?" ఆశ్చర్యంగా అడిగాడు రఘు.
"నీకు తెలీదు రఘూ వీళ్ళ సంగతి! ప్రేమా, పాశం అనేవి వీళ్ళ డిక్షనరీలో లేవు. ఆస్త్రీ, అధికారం మాత్రమే వీళ్ళకి తెలుసు. వాటికోసం ఎంతకయినా తెగిస్తారు" ఛీత్కారంగా అన్నాను.
"ఇంకా నిలబడ్డావేం? పోరా!" మూర్తి రఘుని బయటికి తోస్తూ అన్నాడు.
"అహల్యా..... నీ ఇంట్లో నాకింత అవమానం జరుగుతూంటే అలా చూస్తూ నిలబడ్డావేం? నీకేం చేతకాదా?" వెనక్కి తిరిగి అడిగాడు రఘు.
నేను జవాబిచ్చే లోపే మూర్తి రఘు మొహంమీదే తలుపు భళ్ళున మూసేశాడు. నాతో బెదిరిస్తున్నట్లుగా అన్నాడు.
"వాడితో నువ్వు మాట్లాడినా, కలిసినా, వాడింక మిగలడు జాగ్రత్త!"
నేను బొమ్మలా చూస్తూ నిలబడిపోయాను. కన్నీళ్ళు కూడా స్తంభించి పోయాయి.
* * *
"ఏమిటిది రఘూ! ఎక్కడికి?" కార్లో ఆశ్చర్యంగా అడిగాను.
అతను చిన్నన్నయ్య సిగరెట్ కోసం వెళ్ళినప్పుడు నా కారులోకి ఎక్కి డ్రైవర్ని పక్కకి జరిపి, డ్రైవ్ చేసుకుంటూ పోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
"అహల్యా..... నా అప్పు ఇంకా ఐదు లక్షలుందని నాకు తెలుసు. అది నేనే తీర్చుకుంటాను. కాని నీకు తెలీనిది ఏమిటంటే ఈ ప్లాట్ బిజినెస్ నాకు చాలా కలిసొచ్చింది. ఇప్పుడు నాకు నెలకి మూడు లక్షల ఆదాయం నిన్ను నేను పోషించుకోగలను. ఇంక నువ్వు అహల్యగా ఆ మూర్ఖులకి చెల్లెలిగా బ్రతకనక్కర్లేదు. అహల్యా రఘురాంగా మారిపోవచ్చు" అన్నాడు.
"రఘూ....ఏమంటున్నావు?" కళ్ళు పెద్దవి చేసి అడిగాను.
"దిగు..." కారు ఆపుతూ అన్నాడు.
క్రిందకిదిగి ఆశ్చర్యపోతూ చూసాను.
అక్కడ నలుగురు అమ్మాయిలూ, నలుగురు అబ్బాయిలూ పూల దండలూ, స్వీట్ పాకెట్ లూ పట్టుకుని నిలబడ్డారు.
"నిన్న ఆదివారం అయింది. తాళిబొట్టు కొనడానికి కంచి వరకూ వెళ్ళాల్సొచ్చింది. అలాగే నీకు పట్టుచీరలూ కొన్నాను. లోపలకెళ్ళి కట్టుకురా!" అన్నాడు.
"పెళ్ళికుమార్తె వచ్చిందా?" పురోహితుడు హడావుడిగా వస్తూ అడిగాడు.
