Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 44


    రక్తం పంచుకుపుట్టావా? అందుకేనా అమ్మకి జబ్బుగా వుంటే నాకేం సంబంధంలేదు. నేను పెపకం వచ్చేసినవాడ్ని అన్నావుటా?" గొంతు పెంచి అడిగాను.
    
    "వాళ్ళు ముసలాళ్ళు చాదస్తం కొద్దీ ఏదో అంటారు. అవన్నీ నమ్ముతావా?" కోపంగా అన్నాడు.
    
    "అయినా పెద్దవాళ్ళం మేం వచ్చాంగా నీ వ్యవహారాలన్నీ మా మీద వదిలేసి నీ పాత సంగతి నువ్వు చూసుకో అన్నాము. దానికి బాధెందుకు?" అడిగాడు పెద్దన్నయ్య బాబు.
    
    "అక్కర్లేదు ఇన్నాళ్ళూ ఎవరు చూశారో వాళ్ళే చూస్తారు" అన్నాను.
    
    "అయితే పదిహేను లక్షలకి లెక్క చూపించాలి" అన్నాడు చిన్నన్నయ్య.
    
    "ఒరేయ్ మూర్తీ! నా యింట్లో తింటూ నన్ను లెక్క అడగడానికి నువ్వెవడివిరా?" నేను ఆవేశం చంపుకోలేక అరిచాను.
    
    "నీ అన్ననే! ఈ ముసలాళ్ళు నాటకాలాడి నీ దగ్గరున్నదంతా కాజేస్తుంటే చూస్తూ వూర్కోమంటావా?" ఇంకా గట్టిగా అన్నాడు.
    
    "ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాద దక్కదు" అన్నాను.
    
    "ఊర్కోమ్మా....అమ్మగారి జబ్బుకీ, ఇంటికీ చాలా ఖర్చయింది. అవన్నీ లెక్క వ్రాసే వుంచాను" అన్నారు దాసుగారు.
    
    ఆయన మొహంలోకి చూశాను.
    
    "ఒక పది లక్షలదాకా అమ్మాయి మాకు కావలసినవాళ్ళకి చేబదులిచ్చింది. త్వరలోనే ఆ అప్పూ తీర్చేస్తారు" అన్నాడాయన.
    
    నేను రఘురాంకి డబ్బు యిచ్చిన సంగతి వాళ్ళకి తెలీకూడదని తనమీద లేనిపోని అభియోగాలు వేసుకుంటున్న ఆయనవైపు చూడడానికి కూడా సాహసం లేక తలవంచుకున్నాను.
    
    "చూశారా దొంగతనం బయటపడింది. అహల్యకేం తెలుసు లోకం? ఇలాంటివాళ్ళని చేరనివ్వకూడదు" అంది పెద్ద వదిన.
    
    "మీరంతా నోర్మూసుకోండి. రేపే నా ఇంట్లోంచి దయచెయ్యండి" చేతులు జోడిస్తూ అన్నాను.
    
    "నువ్వు రమ్మంటే వచ్చామా పొమ్మంటే పోడానికి?" అన్నాడు మూర్తి.
    
    "ఆ మాటతో వాళ్ళు అంత తేలికగా వదిలే రకాలు కారని నాకు తెలిసిపోయింది.
    
    "ఛీ...! మనిషికోమాట..." అంటూ చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయాను.
    
    "అన్నం మీద అలిగితే మహాపాపం....మనం కానిద్దాం" అన్నాడు బాబు. అందరూ భోజనాలు కొనసాగించారు.
    
    గదిలో నాన్నగారు శూన్యంలోకి చూస్తూ పడుకుని కనిపించారు. నేవెళ్ళి ఆయన పక్కన కూర్చుని "చూశారా నాన్నా? ఇప్పుడు వీళ్ళకి మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో?" అన్నాను.
    
    ఆయన నావైపు భావరహితంగా చూశారు. ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. పెదవులూ కదిలాయి. కానీ శబ్దం బయటికి రాలేదు. మూతి వంకరబోయింది. చెయ్యి ఆగకుండా కొట్టుకుని ఆగిపోయింది. కనుగుడ్లు కూడా అదోలా పైకి తిరిగిపోతుంటే నేను భయం వేసి పెద్ద పెద్ద కేకలు వేశాను.
    
    పెద్దగా మాట్లాడుకుంటూ తింటున్న వాళ్ళెవ్వరికీ నా మాటలు వినపడంలేదు. నేను క్రిందకెళ్ళి కారుతీసి డ్రైవరు సాయంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళాను.
    
    నాన్నగారికి పెరాల్సిస్ ఎటాక్ వచ్చింది. ఆయన ఇంకెవరికీ జవాబులు చెప్పాల్సిన అవసరంలేదు. నోరూ, ఒక చెయ్యీ పడిపోయింది. ఉడకబెట్టిన దుంపలా ఆయన శేషజీవితం అంతా మంచంలో పడివుండి ఆ తర్వాత నశించిపోతారు. నేను ఒక్క వారంలో అమ్మని పోగొట్టుకున్నాను. నాన్న ఆరోగ్యాన్నీ, నా స్వేచ్చనీ కూడా పోగొట్టుకున్నాను. కొన్ని రోజులపాటు ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా నాన్నగారి దగ్గరే వుండి సపర్యలు చేశాను.
    
    "వాసవి వాళ్ళు ఫోన్ చేశారు. ఆదివారం రికార్డింగ్ వుందిట" అన్నాడు మూర్తి.
    
    "నేను వెళ్ళను" అన్నాను.
    
    "వెళ్ళాలి డబ్బు కూడా తీసుకున్నాకా వెళ్ళకపోతే ఎలా మరి?" అన్నాడు.
    
    "ఎవరిని అడిగి తీసుకున్నావురా డబ్బు? నీకేం హక్కుంది?" అంటూ ఫోన్ దగ్గరకెళ్ళి నెంబర్ డైల్ చేస్తుంటే నా చేతిలోంచి రిసీవర్ లాక్కుని చెప్పాడు.
    
    "పిచ్చి పిచ్చి వేషాలువేస్తే కాళ్ళూ చేతులూ విరిచి, చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి తీసుకెళ్ళి పాడించి తీసుకొస్తాను. నా సంగతి మన చుట్టుప్రక్కల వూళ్ళల్లో అడుగు చెప్తారు. దానయ్య హత్యకేసులో ఇరుక్కునే ఇలా మెడ్రాసు పారిపోయి వచ్చాను."
    
    అది బెదిరింపొ, తనని పరిచయం చేసుకోడమో అర్ధంకాక తెల్లబోయి చూశాను.
    
    కింద నుండి అరుపులు వినిపించాయి. వెళ్ళి చూస్తే దాసమ్మగారి మీద అరుస్తోంది చిన్నవదిన.
    
    "నా చెవిదిద్దు కనిపించడంలేదు. పనివాళ్ళందరి దగ్గరా వెతికాను. మీ పెట్టె చూపించమంటే అలా బెదురుచూపులు చూస్తావేం?"
    
    దాసమ్మగారు అవమానం భరించలేనట్లు తల కొట్టుకుని ఏడ్చింది.
    
    దాసుగారు చేతులు జోడించి "అది అలాంటి మనిషి కాదమ్మా! మీరే ఎక్కడో పెట్టి మరిచిపోయి వుంటారు" అని బతిమాలారు.
    
    నాకు నోటమాట రావడంలేదు. నాకు అన్నదానం, విద్యాదానం చేసిన అపరదైవ స్వరూపాలమీద దొంగతనం నేరం మోపి యింట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు వాళ్ళు.
    
    "పోలీసులకి ఫోన్ చేస్తే సరి!" అంటోంది పెద్ద వదిన.
    
    "ఒసేయ్....మీరు పురుగులు పడిపోతారే వాళ్ళెవరనుకున్నారే? నాకు తల్లిదండ్రులకన్నా ఎక్కువ" అని నేను మెట్లుదిగి కిందకి పరిగెత్తాను.
    
    "ఆగు! నువ్వు మధ్యలోకి రాకు నీకేం తెలీదు. వీళ్ళు నీకు మందు పెట్టారు" అన్నాడు బాబు మధ్యలో ఆపి.
    
    "అడ్డు తప్పుకోరా!" ఒక్కతోపు తోశాను.
    
    ఆ విసురుకి కిందపడినవాడు వెంటనే లేచి నా చెంప అదిరేలా కొట్టాడు. పుట్టాక నా శరీరం దెబ్బ ఎరగదు. అవాక్కయి పోయి చూశాను.
    
    "చంపేస్తాను జాగ్రత్త!" అన్నాడు కళ్ళెర్రజేసి మీద మీదకి వస్తూ.
    
    'శభాష్' ఒకడు తను హత్యలు చెయ్యగలనని హెచ్చరించి వదిలేస్తే...ఇంకోడు ఏకంగా చంపేస్తానని మీదకొస్తున్నాడు. వీళ్ళా తోబుట్టువులు!
    
    తోడబుట్టినదాన్ని రక్షించే అన్నలు!
    
    చెంప పట్టుకుని "అమ్మా" అని ఏడుద్దామన్నా నోరు పెగలలేదు. అమ్మ పైనించి ఇదంతా చూస్తే ఆమె ఆత్మకి శాంతి లేకుండాపోతుందేమోనని భయం వేసింది.
    
    నా చెంపలపై నుంచి జారే కన్నీళ్ళు తుడిచి నన్ను గుండెలకి హత్తుకుంది దాసమ్మ.
    
    "అ....మ్మా" అంటూ అప్పుడు బిగ్గరగా ఏడ్చాను.
    
    దాసుగారు అందరికీ నమస్కారం పెడుతూ దుఃఖంతో పూడుకుపోయిన గొంతుని అతికష్టంమీద పెగిలించుకుని అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS