Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 45

    పాతికేళ్ళక్రితం ఉన్నస్థితికీ ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైనది సాధారణంగా రెండు దశాబ్దాలలో యింత మార్పు ఎక్కడా చరిత్రలో జరగదు. కాని ఒక్కమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకు పారిశ్రామిక విప్లవమూ, సైన్సు పరిణామ ప్రయోజనమూ దాడి చేసేటప్పటికి పాతవి విచ్ఛిన్నంచేస్తూ నవీనలోకం కఠినంగా స్థిరపడుతోంది. ఈ తీవ్రవేగానికి తట్టుకోలేక మనుష్యులూ, సమాజమూ తమ చుట్టూ గోడలని కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికేదో కీడు మూడిందని గోల పెడతారు.....

    "మీరు కథని ఆపుచేశారు" అని జ్ఞాపకం చేశాడు నారాయణ అవధానిగారి ఉపన్యాస ధోరణికి కొంచెం భయపడి.

    "అవును కథ ఆగిపోయింది. ఎందుకంటే కారుకూడా సడెన్ గా అక్కడ ఆగిపోయింది" అన్నాడు అవధానిగారు చిన్నగా నవ్వుతూ.

    "కొవ్వత్తి అయిపోతోందండోయ్" అన్నాడు ఆచారి. వాడి చూపు దానిమీదే వుంది మొదటినుంచీ.

    అవధానిగారు సొరుగులోంచి ఒక కొవ్వుత్తితీసి వెలిగించారు. "ఇంకా ఒక్క కొవ్వత్తి మాత్రం ఉంది -యిదికాక"
అన్నారు.     "చచ్చాం!" అన్నాడాచారి.

    "ఎందుకురా అంత భయం" ప్రశ్నించాడు నారాయణ.

    "నాకు చీకటంటే పడదు" అన్నాడాచారి దిగులుగా తోటలో పేరుకుని ముద్దకట్టిన చీకటిని చూచి.

    ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కూత వినపడింది. ఆచారి భయంతో చటుక్కున లేచి "ఏమిటది అవధానులుగారు?" అని అడిగాడు.

    "నక్కలు"

    "మీ తోటలో నక్కలుకూడా వున్నాయాండీ?"

    "తోటలోకాదు. శ్మశానంలో ఉంటాయి."

    "శ్మశానమా?" ఆచారి గొంతు తడబడింది. వణికింది.

    "అవును, తోటకి అవతల కాస్త దూరంలో వుంది" అవదానిగారు తాపీగా జాగ్రఫీ మేష్టారు తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున హిందూ మహాసముద్రమూ ఉన్నవి అని చెపుతూన్నంత నిర్లిప్తతతో అన్నారు.

    "నోర్ముయ్యి ఆచారీ. ఇంత వయసొచ్చి కూడా, ఇంతమంది ఉండగా ఈ భయం ఏమిటి.... నవ్వుతారెవరైనా వింటే....." అన్నాడు నారాయణ కోపంగా.

    "నాకు దెయ్యాలంటే తెగ భయం......అయితే....హిహిహిహి" - నెర్వెస్ గా నవ్వాడు ఆచారి. ఈసారి బల్లమీద ఆదితాళం తొందరగా వేస్తున్నాడు. నక్కల కూతలు అప్పుడప్పుడు ఘోరంగా వినపడుతూనే వున్నాయి.

    "చెప్పండి" అన్నాను నేను అవధానిగారితో.
 
    రామచంద్రం విసుగ్గా కార్లోంచి దిగాడు. "మొదటినుండి నువ్వు అపశకునం మాటలే మాట్లాడుతున్నావు. అందుకే అభిమానవతి అయిన నా ఫోర్డు మారాం చేస్తోంది" అన్నాడు నాగభూషణంతో. బానెట్ తీసి పరీక్షించాడు. "సరిగ్గా కనపడటంలేదు. యీ గుడ్డి వెన్నెలలో" అన్నాడు. అంతవరకూ వెన్నెల ఉన్నట్టు మాకు అనిపించలేదు. ఆకాశంమీదికి చూశాను. జేగురురంగుగావున్న చంద్రుడుమీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. రామచంద్రం చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్న ఆసామీలను పిలిచాడు. "కొంచెం అగ్గిపుల్ల గీస్తారా! కారు ఆగిపోయింది" అని అడిగాడు. వాళ్ళు కుతూహలంగా ఒక్కొక్కటే, అగ్గిపుల్ల గీస్తోంటే ఆ వెలుగులో ఏదో మరమ్మతు చేశాడు రామచంద్రం. "థాంక్సు" అంటూ కారు ఎక్కి కూర్చున్నాడు స్టీరింగు దగ్గర.
 
    "ఏ వూరెడుతున్నారు బాబూ" అన్నాడొక ఆసామీ.

    "తణుకు" అన్నాడు నాగభూషణం.

    "శానాదూరం. జాగ్రత్తబాబూ, అడవిలో ఏదో చిరుతపులి కనపడిందని చెప్పుకుంటున్నారు.

    "అలాగే, అలాగే" అని కారు స్టార్టుచేశాడు రామచంద్రం, కారు సాగింది. నాకు ఏదో భయంగా ఉంది.
 
    "అడవి అంటే ఏ అడవి మామయ్యా?" అని అడిగాను.

    "అదేరా నల్లజెర్ల అడవి. ఉదయం వస్తూంటే నీకు చూపించలేదూ!" అన్నాడు మామయ్య.

     అవును, గూడెం దాటాక మైళ్ళకొద్దీ రోడ్డుకి రెండువైపులా అడవి పరచుకునివుంది. వందలకొలదీ కొండముచ్చులు రోడ్డుకడ్డంగా సబలు తీర్చి మా కారు సమీపించగానే కిచకిచలు చేస్తూ పరుగెత్తేవి. పగటివేళ సూర్యరశ్మిలో ఆ ఆకుపచ్చని అరణ్యం ఎంతో మనోహరంగా ఉంది. నోరులేని, తెలివిలేని వృక్షకోటి మౌన సౌహార్ధంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛ ఉన్నట్టున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS