Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 44

    "అందుకే ఆరుమైళ్ళకే ఆగిపోయింది" మామయ్య విసుగ్గా అన్నాడు.  "డొక్కు కార్లు కొనకురా అంటే విన్నావ్? సెకండ్ హాండ్ వి కొనవల్సిన ఖర్మ నీకేమొచ్చింది? మనమాట ఎలాగున్నా వీణ్ని కూడా మనతో తీసుకువచ్చాం. వీడి కర్మ! ఎనిమిది గంటలకి పడుకోకపోతే మా అక్కయ్య ఎనిమిదిమంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది" అన్నాడు నన్నుద్దేశించి.

    "ఏం భయంలేదు మామయ్యా. రాత్రిళ్ళు కార్లలో ప్రయాణం చెయ్యడం నాకు సరదా" అన్నాను నేను.

    రామచంద్రం మావూళ్ళో పెద్ద టెన్నీస్ ఛాంపియన్. పొడుగ్గా బలంగా హుషారుగా వుంటాడు. మావూరి క్లబ్ కి సహాయ కార్యదర్శి సేవాసదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో , ఏంచేసేదో ఇప్పటికీ నాకు తెలియదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు. రామచంద్రానికి కాలువవొడ్డున పెద్ద మేడ వుంది. మేడలో అతనికొక భార్య కుమార రత్నమూ కూడా వున్నారు. అతను భార్య నెక్కువ ప్రేమిస్తాడో భార్య పేర ఆమె తండ్రి వ్రాసి ఇచ్చిన ముప్పైనాలుగెకరాల్నీ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక తేలిక జిజ్ఞాసువులు చాలామంది బాధపడేవారు పాపం. మా నాగభూషణం మామయ్యకి వరుసకి బావ అవుతాడో బావమరది ఔతాడో - ఇటువంటి భోగట్టా నాకూ సరీగా తెలియదు. మా ఆవిడికి తప్ప - అసలు నాగభూషణం నాకు వేలువిడిచిన మేనమామ. అందరమూ ఒకే ఊళ్ళో ఉండడమూ, రాకపోకలూ, శుభకార్యాలూ, మంచిచెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడమూ -ఇలాంటి వాటివలన ఈ కుటుంబాలన్నిటికీ చనువూ, గాఢస్నేహమూ ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఊళ్ళో చెప్పుకోదగినవాడు. ఎం.ఏ చదివాడు. పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతీ ఏడాదీ భగవద్గీతమీదా, ఉపనిషత్తులమీదా పెద్దవాళ్ళని పిలిపించి ఉపన్యాసాలు ఇప్పిస్తుంటాడు. కట్టటం ఎప్పుడూ ఖద్దరే గాని జిల్లాబోర్డు ప్రెసిడెంటు ఏ పార్టీ అయితే ఆ పార్టీనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలక్టరు వచ్చినా, మంత్రి వచ్చినా ఇతని ఇంట్లోనే మకాం.

    "కారు బాగుపడిందాండీ?" అన్నాడు నారాయణ మధ్యలో అడ్డువచ్చి.

    "ఆ రామచంద్రం కారుచుట్టూ రెండుసార్లు ప్రదక్షిణం చేశాడు. కొంతసేపు గొణుక్కున్నాడు. కారు కిందా మీదా ఏవో పరీక్ష చేశాడు. చివరికి "ఆల్ రైట్" అంటూ కారులో కూర్చున్నాడు. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డుమీద కారు వెళుతూంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది." ఇటు అటూ పంటచేలు. కారు లైట్లకాంతిలో నెంబర్లువేసిన మైలురాళ్లు ఒకటొక్కటే జరిగిపోతున్నాయి. నల్లని ఆకాశంమీద జ్వాలా పుష్పాలలాగ నక్షత్రాలు మెరుస్తున్నాయి. మండుతున్నాయి. చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుడులాంటి అనిర్వచనీయమైన శక్తి సన్నిహితంగా వున్నట్టు వుంటుంది. మామయ్య నన్ను బి.ఏ. ఎక్కడ చదువుతావని అడుగుతున్నాడు. మద్రాసులో అని చెప్పాను. లజ్ కార్నర్ కి దగ్గర్లో అతనికో ధియాసఫిస్టు మిత్రుడున్నాట్ట. అతని దగ్గరవుండి చదువుకోమనీ, హాస్టల్సులో వుంటే పాడైపోతావనీ చెపుతున్నాడు. రామచంద్రం మధ్య మధ్య రాజమండ్రీ శంకరం టెన్నీస్ ఆటలో ఉండే లోపాన్ని గురించి చెపుతున్నాడు.

    "మిక్సెడ్ డబుల్స్ ఆడుతుందిట. ఆవిడెవరూ?" మామయ్య అడిగాడు.

    "మిస్ శర్మిష్ట"

    "బాగుంటుందా?"

    "ఆవిడా, ఆవిడ ఆటా?"

    "రెండూను" అంటూ మామయ్య నవ్వాడు.

    "దోబిచెర్ల వస్తున్నాం" అన్నాడు రామచంద్రం.

    అక్కడక్కడ. రెండు మూడు పాకలూ, గుడిసెలూ, చీకట్లో ముడుచుకుపోయి ఉన్నాయి. ఒక బండిదగ్గర ఇద్దరు మనుష్యులు తలలకు పాగాలు చుట్టుకుని జమిలిదుప్పట్లు కప్పుకొని చుట్టలు కాల్చుకొంటూ కూర్చున్నారు. ఊరు ఎక్కడో లోపలకు ఉంది. ఇప్పటిలాగా అప్పటికి పల్లెటూళ్ళలోకి నాగరికత ప్రవేశించలేదు. ఈ పాతికేళ్ళలో ఎంత అద్బుతమైన మార్పువచ్చిందో మీకు తెలియదు. మీకు ఆ రోజులు తెలియవు. విద్యుచ్ఛక్తి అంటే గ్రామీణులకు ఏమిటో తెలియదు. ఏలూరు నుంచి తణుకు వెళ్ళే రోడ్డుని గ్రాండ్ ట్రంక్ రోడ్డు అంటారు. రాత్రి ఎనిమిది దాటాక యీ రోడ్డు సంరక్షితం కాదు. నిర్జనంగా, చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోతూండేది . ఇఫ్పుడు చూడండి నిముష నిముషానికి ఒక లారీ వస్తూ వెళుతూ వుంటుంది. ప్రతీ గ్రామంనుండీ కూరలూ, పసుపూ, మిర్చీ మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి. ఈ దోబిచెర్లలో యిప్పుడొక డేరా సినిమా కూడా వుంది. గ్రామీణులీనాడు చుట్టలకన్న సిగరెట్టు ఎక్కువ కాలుస్తున్నారు. మొన్న కార్లో వస్తూ చూశాను. వెంకట్రామన్న గూడెంలో బాడ్మింటన్ పోటీలు జరుగుతున్నట్టు పెద్ద బోర్డు వ్రాసివుంది. పొడుగునా కాగితపు జెండాలు కట్టివేశారు. అక్కడ రెండు న్యూ మోడల్ కార్లు కూడా ఉన్నాయి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS