"తెలివి తెచ్చుకో మీరా, కాస్సేపు నిద్రపో" అంటూ ఆమె వద్దంటున్నా వినకుండా బలవంతంగా తీసికెళ్ళి పక్కమీద పడుకోబెట్టి దగ్గరే కూర్చున్నాడు.
"మీరంతా నా శత్రువులు. మీ వల్లనే నా జీవితం నాశనమయింది" అని వెక్కి వెక్కి ఏడవసాగింది. కన్నీటితో తలగడ తడిసి ముద్దయింది. గుక్కపెట్టి ఏడ్చి అలసిపోయిన చంటిపిల్లలా ఉంది మీర. ఇంతకు మునుపొకమారు ఇలాగే ఏడ్చి నిద్రపోయిన జాని గుర్తు కొచ్చింది. శాముకు చనిపోయిన ముద్దుల కూతురి మొహాన్నే గుర్తుకు తెస్తున్న మీర మొహాన్ని అరచేత్తో మృదువుగా నిమిరి నుదుటిమీద చిన్నగా ముద్దెట్టుకుని చప్పుడు చెయ్యకుండా బయటికి వచ్చాడు.
తరువాత ఇంకెన్నడూ వీణ వస్తువులు ఆమె కంటబడలేదు. రోజు రోజుకూ ఆమెకు జీవితం దుర్భరమనిపించసాగింది. కాళ్ళకు కట్టిన రాయి ఈతరానివాడిని సముద్రంలోపలికి లాగివేసినట్టే, వీణ మృతి మీరను దుఃఖ సముద్రంలోకి లాగసాగింది. అడుగడుక్క్కి వీణను గుర్తు కుతెచ్చే ప్రవేశం, సన్నివేశాలు ఆమె మెదడును తినివేస్తున్నాయి. వీణను మర్చిపోవటానికి, వీనలేని జీవితాన్ని గడపటానికి విశ్వప్రయత్నం చేసింది మీర. కాని ఆమె మనసులోని అశాంతి ఎక్కువయిందేగాని తగ్గలేదు. మరే వ్యాపకమూ లేకపోవటం మూలాన అస్తమానం గడిచిన రోజుల స్మృతులనే నెమరువెయ్యటం అలవాటయింది. మీర తనున్న సన్నివేశంలో ఏవీ చెయ్యలేక, తుఫానులో చిక్కుకుని కళ్ళనిండా దుమ్ము కొట్టుకున్న బాటసారిలా దిక్కూ తెన్నూ తెలియక అలమటించిపోయింది.
వీణ చనిపోయి రెండు నెలలు గడిచిపోయాయి. ఒకరోజు శాము గిత్తలకు నీరు తాగిస్తూ నిలుచున్నాడు. మీర అతడిని వెతుక్కుంటూ వచ్చింది.
చెదరిన జుత్తు, కృశించిన దేహం, మనసులోని వ్యధను స్పష్టంగా కనిపింపచేస్తున్న కళ్ళు.....శాముకు మీరను చూసి జాలివేసింది. "అయ్యో పాపం!" అనుకున్నాడు.
"మీకో విషయం చెప్పాలి. ఏమీ అనుకోరుగదూ?"
శాము మీరవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
"మనం ఈ పల్లె వదిలి వెళ్ళిపోదాం."
ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామన్నా శాముకు ఇంత ఆశ్చర్యం కలిగేదికాదు.
"నేనీ పల్లెలోనే ఉండిపోతే ఏమయిపోతానో చెప్పలేను. చనిపోవచ్చు. పిచ్చిపట్టవచ్చు. లేదా ఇల్లు వదిలి పోవచ్చు. నా కోరికను కాదనకండి. క్షణ క్షణానికి వీణస్మృతి నన్ను దగ్ధం చేస్తోంది. నామీద దయయుంచి రండి......"
"మైసూరికి వెడితే నువ్వు జానిని మర్చిపోగలవా?"
"ఈ పల్లెలో ఉండగా వీణను మరవటం అసంభవం. ఈ పల్లెలోని మట్టిలో కలిసిపోయింది వీణ. ఇక్కడున్నంతవరకూ వీణను మరవలేను. నా బిడ్డను మింగిన ఈ పల్లె అంటే నాకు ద్వేషం. కొత్తచోటు, కొత్త వాతావరణంలో నా మనసు లోని బాధ, దాని వేడి కొంతవరకయినా చల్లబడవచ్చు. ఇంతవరకూ మిమ్మల్నేమీ కోరలేదు. ఈ కోర్కెను కాదనకండి."
శాము నెమ్మదిగా తల అడ్డంగా వూపాడు.
"నీ కోర్కెను తీర్చలేను మీరా. ఎన్నో తరాలుగా మాపూర్వీకులు నివసించిన ఇంటిని, వంశ పారంపర్యంగా వస్తున్న భూములను వదిలి రాలేనునేను. వాటితో పెనవేసుకున్న నా జీవితాన్ని తెంపుకో లేను. ఈ నేలలోనే జాని విశ్రమించింది. ఎన్నటి కయినా ఆ నేలలోనే చిరవిశ్రాంతి తీసుకోవటానికయినా నే నిక్కడ ఉండకతప్పదు."
శాము కంఠంలో దృఢ నిశ్చయం ధ్వనించింది.
ఉప్పెనలా పొంగివస్తున్న మహా ప్రవాహంలో ఈతరానివాడు ఎదురీత ఈదటానికి ప్రయత్నించి, ప్రవాహంతోబాటు కొట్టుకుపోయినట్టుగా ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోటానికి ప్రయత్నించి, ప్రయత్నించి విఫలురాలయింది మీర.
వీణ పుట్టినప్పటినుండి తనకు నచ్చని పల్లెటూరి వాతావరణాన్ని కూడా ఆనందమయం చేపకుని జీవితంలో నూతనోత్సాహంపొంది గాలిమేడలు కడుతున్న మీరకు, వీణ చనిపోగానే ఇంకా పల్లెలో ఉండాల్సిన అవసరం కనిపించాలేదు, పల్లె జీవితానికి భర్తకు, మీరను, అతుక్కుపోయేలా చేసిన ఒకే ఒక కొక్కెం వీణ వూడి పడిపోగానే వీణతోబాటే తన జీవితానికి ముడిపడివున్న మిగిలిన బంధాలను కూడా త్రెంచుకుని ఎందుకు వెళ్ళిపోరాదని ఆలోచించసాగింది మీర. భర్తను వదిలిపెట్టిందన్న అపఖ్యాతి తప్పదని తెలిసినా చనిపోయిన బిడ్డ జ్ఞాపకాల తోరణాలతో అనుదినమూ జీవించలేక వ్యధాభారాన్ని భరించలేక, ఉడికిపోతున్న హృదయపు భారాన్ని మొయ్యలేక ఇక ఎప్పటికీ తన కడుపు పండదన్న శూన్యతను ఎదురంచలేక పల్లెను వదిలిపెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది మీర.
రోజులు వాటంతటవే గడిచి పోతున్నాయి. వేసంగి సెలవులు పూర్తవటానికింకా రెండు వారాలు మాత్రమే ఉన్నాయి. మీర హృదయం లోని ఆవేదన, ఆందోళనలకు మితి లేకుండాపోయింది. వారం రోజులుగా శాము మీరలోని పోరాట విప్లవాలను గమనిస్తూనే ఉన్నాడు. రెండు భావాల మధ్య జరుగుతున్న ఘర్షణ ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
ఓ రోజు రాత్రి పడుకునేముందు మీర శాముతో మాట్లాడాలని నిశ్చయించుకుంది. ఆమె మొహంలో నిర్ధారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శాము దీపపు వత్తి తగ్గించి మీర దగ్గర కూర్చుని,
"పడుకోవా మీరా?" అన్నాడు.
"నిద్ర రావటంలేదు......మరేమో......"
"ఏమిటో చెప్పు?"
"మీరు నన్ను చేతకాని పిరికిపంద న్నా ఫరవాలేదు. నన్ను అస్తమానం పీక్కుతింటున్న ఈ జ్ఞాపకాలనుండి తప్పించుకోవాలంటే ఈ పల్లె వదిలి వెళ్ళక తప్పదు. ఇక రెండోది .....నా మనసుకు, మెదడుకు ఒక్క నిముషమయినా విశ్రాంతి ఇవ్వకుండా వేరే వ్యాపకం పెంచుకోవాలి. ఈ రెండూ చెయ్యక తప్పదు నేను."
"అయితే నన్ను వదిలిపెడతావా?"
"మీకు నేను కావాలంటే మీరూ పల్లె వదిలిరావలసి వస్తుంది. మీరు దానికి ఒప్పుకోరని నాకు తెలుసు."
"మీ అసహాయత నాకు తెలియని విషయం కాదు. మనిద్దరి మనసులనూ దగ్గరకు తెచ్చిన జాని ఇక లేదన్నప్పుడు వారి తెగి విడిపోయిన విల్లుకొసల్లాగా మనిద్దరం దూరమయ్యాం. ఒకరి కోసం ఒకరు జాలిపడడం తప్ప మరేమీ చెయ్యకుండా ఉన్నాం. జాని పోయిన దుఃఖాన్ని మరిపించటానికి ఇంకో బిడ్డయినా ఉండిఉంటే.......!"
"బిడ్డ! ఇక ఈ జన్మకా ఆశ లేదు నాకు. ఈ పాపిష్టి జీవితానికీ, దుఃఖాన్ని మరిపించే, నవ్వించే పాపాయి కూడా లేదు."
శాము తన విషయంలో చూపిస్తున్నసానుభూతికి ఆశ్చర్యపోయింది మీర. మొదట్నుండి మొర టుగా ప్రవర్తించి, కావాలనుకున్నప్పుడు లాలించి, వద్దనుకున్నప్పుడు వదిలివేసే భర్త ఇలా మాట్లాడుండడని వూహించలేదామె.
వీణ ప్రేమజలంతో ఇద్దరి మనసులనూ మెత్తబరచి ఒకటిగా చేసింది. అతుక్కొని, ఒక్కమారు విదిలిస్తే వేరయిపోయే ఇసుకరేణువుల్లా మీర, శాము దూరంగా ఉన్నా, దైహిక ఆకర్షణలకు లోనయి దగ్గరయినా, వెంటనే అభిప్రాయ భేదాలతో దూరమయ్యేవారు. కాని వీణ పుట్టాక వీణమీది ప్రేమతో ఇద్దరిలోనూ ఆత్మీయత పెరగసాగింది. అందమయిన ఇంటిని నిర్మించి దానికి ఆధారస్తంభంగా నిలచింది వీణ. ఎపుడయితే ఆ ఆధారస్తంభం కూలిపోయిందో అపుడే ఇల్లూ కూలిపోయింది. కూలిపోయిన ఇంటిని మళ్ళీ కట్టడం ఇసుకలో ఇల్లుకట్టడం లాంటిదే.
"అయితే ఎక్కడికి వెడదామనుకుంటున్నావ్?"
"మైసూరికి వెళ్ళి మెడికల్ కాలేజీలో చేరుదా మనుకుంటున్నా. చదువులో పడి వీలయినంతవరకూ గత స్మృతులను మరవగలనేమో అనేదే ఆశ."
శాము మసకవెల్తుర్లో తనముందు కూర్చున్న చిక్కి శల్యమయిన మీరనే తదేకంగా చూడ సాగాడు. లోతుకు పోయిన బుగ్గలు, పాలిపోయిన మొహం కడుపులోని దుఃఖాన్నంతా ప్రతిబింబించే కళ్ళు, నల్లటి జుత్తులో అక్కడక్కడా వెండిలా మెరుస్తున్న తెల్ల వెంట్రుకలు ..... ధైన్యమే మూర్తీభవించినట్టున్నది మీర. శాము హృదయం వ్యధాభరితమైంది. జాలితో అతడి హృదయం నీరయింది. ఆమెను అక్కున చేర్చుకుని ఏదడిగినా ఇచ్చేయాలన్న కోర్కె కలిగింది. కాని, ఆమెను దగ్గరకు తీసుకునే ధైర్యం కలగలేదు.
"అలా చేస్తే నీ బాధ ఉపశమిస్తుందా మీరా?"
"అలాగే అనుకుంటున్నా."
"మరే మార్గమూ లేదా?"
"నా కింకేం తోచటంలేదు."
శాము కాస్సేపు మౌనంగా కూర్చున్నాడు.
తను కోరి పెళ్ళాడిన మీర తనను వదిలి వెళ్ళిపోబోతుందని తల్చుకోగానే హృదయం కంపించింది. మీరలేని జీవితం శూన్య మనిపించింది. మీర నిర్ణయాన్ని తల్చుకుని కోపం కలిగింది. తను ఏం చేశాడని తనకీ శిక్ష? ఆమెను ప్రేమిస్తున్నందుకా? శాము మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. తను ఆమెను ప్రేమించాడా? కామించాడా? మొత్తంమీద మీర అతడికి కావలసిన వస్తువు. మీరలాంటి అందమూ, తెలివీ గల అమ్మాయిని భార్యగా పొందినందుకు అతనెంతో సంతోషించాడు. వెంకట్రమణయ్యగారు తమ బంగారంలాంటి జమీని తక్కువ ఖరీదుకు అమ్మినపుడు కలిగినలాంటి సంతోషం-మీర తనకు కావలసిన వస్తువు. కనుక ఆమె కోర్కె తీర్చటం అసంభవం అనుకున్నాడు.
కాని, మరుక్షణంలోనే ప్రాణప్రదమయిన బిడ్డను పోగొట్టుకుని, అనాథలా, పిచ్చిదానిలా పరితపిస్తున్న తన ప్రీతిపాత్రురాలైన భార్య అసహాయతకు జాలిపొంగిందాతని హృదయంలో పాపం! కాలేజీలో చదివే రోజుల్లో ఎన్ని కలలు కందో తన భవిష్యత్తును గురించి! ఇప్పుడు పాప చావుతో కృంగిపోయి, దిక్కుతోచక బాధతో విలవిలలాడిపోతూ దైన్యమూర్తిలా ఉన్న తన ముద్దుల భార్యను పల్లెలో ఉండమని నిర్బంధించి జీవచ్చవంగా మార్చటానికి ఇష్టపడలేదు శాము.
స్వార్ధానికీ, త్యాగానికీ పోరాటం జరిగింది.
"మీరా, మైసూరులో మీ పెదనాన్న ఇంట్లో ఉంటం నా కిష్టంలేదు. ఆయన ఎపుడైతే నిన్ను నా చేతుల్లో పెట్టారో అపుడే ఆయన బాధ్యత కూడా తీరిపోయింది. నువ్వు హాస్టల్లో ఉంటేనే మంచిది. ఏమంటావ్?"
"నిజమే. కాని, డబ్బో .....?"
"నే నున్నాగా-డబ్బు గురించి ఆలోచించకు." తెల్లగా పాలిపోయిన మీర మొహంలోకి, దేహంలోకి ఒక్కసారిగా రక్తం ప్రవహించినట్టయింది. తనంతట తాను భర్తను వదిలి వెడుతున్నా, తన చదువుకు సిద్దపడుతున్న భర్త హృదయవైశాల్యం ఆమెలోని కోమల భావనలను పైకి రేపింది. ఆమె కళ్ళు చెమర్చాయి.
"నన్ను కాకుండా మరే అమ్మాయిని చేసుకున్నా మీరు సుఖపడేవారు. నాలాంటి అతృప్త స్వభావపు పిల్లను కట్టుకున్నందువల్ల మీ జీవితం ఇలా అయింది."
"అలా అనకు మీరా. నా జీవితంతోబాటు ఏ జీవితం కూడా ముక్కచెక్కలయింది. పెళ్ళయి నప్పటినుండి నా కనిపిస్తూనే ఉంది. నిన్ను పెళ్ళి చేసుకుని పొరపాటుపని చేశానని. కుశా గ్రమయిన నీ బుద్ధిని ఎందుకూ పనికిరాకుండా బంధించి నేరం చేశాననిపించేది నాకు. సారవంతమయిన భూమిని పాడుపెడితే గవర్నమెంటేం చేస్తుందో తెలుసా? అలా చేసినవాడికి జుల్మానా విధిస్తుంది. నేను ఇస్తున్న జుల్మానా అని నా డబ్బు స్వీకరించు. నా అపారమయిన సంపదనుండి నీకు లేశమాత్రమయినా సంతోషం కలిగితే అంతకన్నా నాకు కావలసిందేమీ లేదు....."
మీర మౌనంగా మోకాలిమీద తల ఆన్చి భర్త మాటలనే వింటోంది. ఆ మసక వెల్తురులో ఆమె మొహంలోని భావాలు స్పష్టంగా కనిపించటంలేదు.
తనవల్లే భర్త జీవితం నాశనమయిందన్న భావనకలిగిందామెకు. ఒకరినొకరు చేపట్టడంవల్ల ఇద్దరి జీవితాలూ వ్యర్ధమయిపోయాయి. సామరస్యం లేని సంసారం ఇద్దర్నీ బలితీసుకుంది.
"కాని ఒక్కమాట గుర్తుంచుకో మీరా."
మీర తలెత్తి శామువైపు చూసింది.
శాము నిట్టూర్చి అన్నాడు.
"నా జాని మొహాన్ని గుర్తుకుతెచ్చే నీ మొహం అంటే నాకు చాలా యిష్టం."
ఒక్క నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు.
"నువ్వు కోరుకుంటున్న జీవితం నీకు విసుగని పిస్తే నీ ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి."
:-అయిపోయింది-:
