16
మీర తలుపు తెరచింది. ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకోగానే తలవంచుకున్నారు.
"భోంచేద్దువుగాని పద మీరా"
"నాకాకలి వెయ్యడం లేదు"
"భోంచేసి రెండు రోజు లయిందట."
".........."
"ఉపవాసాలు చేసి నువ్వు నన్ను వదిలిపోతావా? ఉపవాసాలు చేసినంతమాత్రాన జాని తిరిగివస్తుందా? నువ్వు కూడా ఇలా ప్రాణాలు పోగొట్టుకోకు మీరా"
"నేనెలా ఉంటే మీకేం?"
శాము వోర్పుతో ఆమెను వోదార్చటానికి ప్రయత్నించిన కొద్ది మీర పిచ్చిదానిలా ప్రవర్తించసాగింది. శాము కంగారుతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.
మీరకు ఇంటా బయటా ఎక్కడెక్కడా వీణ జ్ఞాపకాలే బాధించేవి. కూతురి ఆటపాటలూ, అల్లరి, చిలిపితనం, అందం అంతా ఆమె మనసులో చిరస్మరణీయంగా నిలిచి, ఆరని మంటలా ఆమెను దహించివేస్తోంది.
ఓరోజు భోజనానికి కూర్చున్నపుడు వెంకమ్మ గారు బంగాళాదుంపల సాంబారు వడ్డించారు. మీర చెవిలో వీణ క్షీణకంఠం వినిపించింది.
"అమ్మా నేనూ బంగాళాదుంపల సాంబారు తింటాను" మీర కంచం దూరంగానెట్టి వేరే కంచం తెచ్చుకుని మజ్జిగన్నం కలిపి అదీ తినలేక కన్నీరు కారుస్తూ లేచి వెళ్ళిపోయింది.
అయిదేళ్ళు ఆమె జీవితాన్ని నందనవనంలా చేసి, వెనకటి ఆకాంక్షల నన్నిటినీ మరిపించి సంసారంలో సుఖముందని నమ్మించి, ఆ నమ్మకం దృఢం కాక మునుపే ఆమె జీవితాన్ని అగాధమయిన చీకటిలో ముంచి వెళ్ళిపోయింది వీణ.
బోచ్సుకుక్క, కోడి, ఏనుగు బొమ్మలు మూలలో నుండి తొంగి చూసి "మా వీణెక్కడ?" అని అడుగుతున్నట్టనిపించింది. వీణ పరికిణీ, స్వెట్టరు, పైజామా, బనీను అన్నీ ఆమె కంటబడి శూలాల్లా పొడిచేవి. తల్లిని కోల్పోయిన అనాధ శిశువుల్లా, వీణలేని, వీణ వస్తువులు అక్కడక్కడా పడి ఏడుస్తున్నాయి. కన్నెత్తితే గోడలమీది వీణ ఫోటోలు, "నే నిక్కడే ఉన్నను సుమీ, నానుండి తప్పించుకో లేవు నువ్వు" అంటున్నట్టుండేవి. కళ్ళు మూస్తే వీణ నవ్వు మొహం ఎదుటకువచ్చి నిలచేది. కూతురి జ్ఞాపకాలను మాటి మాటికి రెచ్చగోడుతున్న ఆ ఇల్లు, పల్లె, భర్త వీటన్నిటినుండీ దూరంగా పారిపోవాలనిపించే దామెకు. ఆహారం చుట్టూ మూగిన చేపల్లాగా తన్ను చుట్టు ముట్టి వేధిస్తున్న జ్ఞాపకలనుండి తప్పించుకోవడానికోసం తనకు అత్యంత ప్రియమయిన పుస్తకాల ఆసరా పొందాలని చూసింది మీర. కాని ప్రతీ పేజీలో, ప్రతీ అక్షరంలో వీణ ముద్దు మొహమే కన్పించేది. అసహాయురాలై సుడిగుండంలో చిక్కుకున్న నావలా తల్లడిల్లింది మీర.
పశువుల పాకలో దూడకు గడ్డి తినిపిస్తోంది మీర. అకస్మాత్తుగా రెండునెల్లక్రితం వీణ ఆ దూడతో ఆడుకుంటున్న దృశ్యం గుర్తుకొచ్చింది. ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ నిలవలేక వంటింట్లోకి వెళ్ళింది. వెంకమ్మగారు వీణ వెండికంచం కత్తిపీత ముందుంచుకుని దోసకాయలు తరుగుతున్నారు. మీర లోపలికి రాగానే ఆమెకు కనిపించింది కూతురికంచం. ముళ్ళమీద అడుగు పెట్టిన దానిలా బయటికి వచ్చింది. హాల్లో స్టాండు మీద వీణ గులాబి రంగు స్వెటర్ కనిపించింది. "ఏం పాపం చేసుకున్నానని నాకీ శిక్ష' అనుకుంటూ గదిలోకివెళ్ళి మంచంమీద కూలబడింది. నెలరోజుల క్రితం తన ముద్దుల కూతురు, అదేచోట అదేమంచంమీద ఆఖరి శ్వాస తీసిన దృశ్యం కళ్ళముందు నిలిచింది. తన మనసులోంచి ఆ దృశ్యాన్ని తొలగించినకొద్దీ అదే దృశ్యం కళ్ళముందు మెదలసాగింది. సలసలా కాగే నూనెలా మరిగిపోతోందామె మనసు. కాళ్ళీడ్చు కుంటూ వచ్చి వరండాలో బెంచిమీద కూర్చుంది. బల్లకింద కాలికేదో తగిలినట్టయితే వంగిచూసింది. వీణ బూడ్సులు దుమ్ము తెరకింద పడి ఉన్నాయి. భక్తుల కళ్ళకు ఎక్కడెక్కడా సర్వ వ్యాపితుడయిన భగవంతుడే కనిపించినట్టు, బిడ్డను కోల్పోయిన తల్లి కళ్ళకు ఎక్కడెక్కడా కూతురి ప్రతిరూపమే కనిపిస్తోంది. ఆమె కళ్ళలో ఉధృతమయిన కోపపు ఛాయ మెరిసి క్రమేణా ఉన్మాదంలా మారిపోయింది.
మీర మూల మూలలా వెతికి వీణ వస్తువుల నన్నిటినీ పొగు చెయ్యసాగింది. పాత వస్తువులన్నీ ఉన్న గదిలోనుండి పెరాంబులేటర్ లాక్కొచ్చింది. ఇక వీణ ఆటవస్తువులూ, గుడ్డలు, పుస్తకాలు గోడ మీదున్న ఫోటోలు అన్నీ ఒకచోట కుప్పగా పేర్చింది, పెట్టె తెరచి సిల్కు లంగాలు, నెక్లెస్, కమలాల లోలక్కులుతెచ్చి కుప్పమీద పడేసింది. ఇంకా ఎక్కడయినా వీణ వస్తువు లున్నాయేమోనని పెదవిని వంటితో నొక్కిపట్టి వెతుకుతున్న మీరను చూసి గాబరా పడ్డారు వెంకమ్మగారు. దోసముక్కలు తరిగి ఉంచుకున్న వీణ కంచాన్ని తెచ్చి కుప్పమీద పడెయ్యగానే వెంకమ్మగారు పెరటి తలుపు తెరచి బోరన్ని పిలచి,
"బోరా, శామన్న ఎక్కడున్నాడో చూసి తీసుకురా. మీర ఏదో పిచ్చి పిచ్చిగా చేసేస్తోందని చెప్పు" అన్నారు.
బోరడు జాలితో" అత్తయ్యగోరికి మాత్రం బుద్ధి సరిగ్గా ఉందా? చూత్తున్నాగా ఎటోబోతారు ఎక్కడో కూకుంటారు. వందమార్లు పిలిసినా పలకరు" అన్నాడు.
"నిజమే. శామన్నకు సగం పిచ్చయితే మీరకు పూరా పిచ్చిపట్టింది. త్వరగా శామన్నను తీసుకురా"
బోరడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడెక్కడో వెతికి శామును తీసుకొచ్చాడు. మీర తన లోనే గొణుక్కుంటూ వీణ వస్తువులకోసం వెతుకు తోంది.
"వీణదంటూ ఒక్క వస్తువు కూడా ఇక్కడుండకూడదు. వీణే లేనప్పుడు దని వస్తువులెందు కుండాలి? అన్నిటినీ కాల్చి పారేస్తాను" అంటూ తనలో తానే గొణుక్కుంటోంది.
పిచ్చిగా తిరుగుతున్న మీర మొహంలోని దుఃఖో న్మాదాల రుద్రనాట్యాన్ని చూసి దిగులు పట్టు కుంది శాముకు.
వీణ పోయినప్పటినుండి తెగిపోయిన గొలుసులా దూరమయా రిద్దరూ.
మీర అగ్గిపెట్టెకోసం వెతకబాగానే శాము ఆమె దగ్గరకొచ్చి మృదువుగా.
"మీరా ఏం చేస్తున్నావ్?" అన్నాడు
"వీణ వస్తువులన్నీ కాల్చిపారేస్తాను"
"ఎందుకూ?"
"దాని వస్తువులు ఇక్కడెందుకుండాలి?"
"వద్దు మీరా. నీ మనస్సు బాగాలేదు. కాస్త నిద్రపోధువుగాని పద."
"ఉహు....." అంటూ అగ్గిపుల్ల వెలిగించింది మీర. శాము దాన్ని, లాక్కుని దూరంగాపారేసి అగ్గిపెట్టెను కూడా లాక్కున్నాడు.
"ఇచ్చేయండి. అగ్గిపెట్టిచ్చేయండి నాకు. నా దగ్గరికి రాకండి. నా యిష్టం వచ్చినట్టు చేసుకుంటాను మీకేం?" అని అరుస్తూ శామును దూరంగా తోసేసింది మీర. శాము ఆమె భుజాలు పట్టుకుని కుదుపుతూ.
