Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 43


                                  చిత్ర రహస్యము
    

    ఆ యుదయమున మధుసూదనుడాలోచనాయత్తచిత్తుడై
    యుండెను. అట్టి సమయమున నేనట కేగితిని.
    "వానిని గాంచితివా?" యని నన్నతడడిగెను.
    గుమ్మము దాటిపోవుచునొక మధ్యవయస్కుడు నాకగు
    పడెను. అతడే గదా యని "చూచితి"నని ప్రత్యుత్తర
    మిచ్చితిని.
    "అతనిని గూర్చి యేమి గ్రహించితివి?"
    "నా కంటికి మిక్కిలి దీనునివలె జూపట్టెను. అతనిని చూచినవే హృదయము కరిగిపోవును. వ్యర్ధ జీవి యనవచ్చును."
    "సత్యమే! కాని, యనంతా! జీవితమే వ్యర్ధము కదా? ఇతడు దీనుడనుటకు సందేహమేమి? వీని చరితము వింటివేని. ఇంతటి దౌర్భాగ్యుడుండ బోడని నీవే పల్కుదువు ఐనను వీనికి నేనేమి సహాయము చేయగలను? సంగతులన్నియు విశదము కావయ్యెను. ఇతడు చెప్పినదానిలో నేడుపుతక్క, నెక్కుడు లేకుండెను!"
    నాకు గుతూహలమయ్యెను. "ఈతడు నీ సహాయార్దియా?" యంటిని.
    "అట్లే యనవచ్చును. తన కథ చెప్పి పోలీసువారి సహాయ మపేక్షింప వారీతనిని నాయెద కంపిరి. ఇంతవరకాతడేదో మొర్ర పెట్టుకొనుచు నిప్పుడే, వాని విషయమై మనస్పూర్తిగా బనిచేయ దలంచితినని పల్కిన పిమ్మట వెడలి పోయినాడు."
    "సరియే! వాని కథ యేమి?"
    "వినుము ఈతని పేరు సుబ్రహ్మణ్యము ధనికుడనుట నిర్వివాదాంశము. వయసేబది యారేండ్లు. రెండు సంవత్సరముల వెనుక భార్య పోవుటచే పునర్వివాహము చేసికొనెను. ఇతని కాపుర స్థలమనకాపల్లి.
    "వర్తక వ్యాపారమున నతడింతటి ధనము గడించెను. కాని యిటీవల నారోగ్యము చెడిపోవుటచే సుప్రశాంతిగోరి యనకాపల్లికి వచ్చి యచ్చటనే సుఖజీవన మొనర్పజొచ్చెను. అపారమగు ధనము, అభినవ యౌవనవతియగు భార్య, అవసరమున్నంత విశ్రాంతియు గలిగి యత్యంత ధన్యజన్ముడనని యానంద మొందుచుండెను. కాని యచిరకాలములో నీ విపుడు చూచుచున్నటులు దీనులలో దీనుడై, హతాశులలో హతాశుడై నిర్భాగ్యులలో నిర్భాగ్యుడై పోయినాడు. పాపము! వ్యర్ధజీవియై పోయినాడు."
    "అందులకు గారణమేమి?"
    "ఏమి చెప్పవలెను! విశ్వాసహీనుడగు మిత్రుడు. కుటిలవర్తని యగు భార్య! సుబ్రహ్మణ్యమునకితర దుర్గుణములు లేవు. కాని చతురంగమన్న మాత్రము చెవికోసుకొనుచుండును. అనకాపల్లిలోనానందరావను నొకడు కలడు. వీరిరువురకును జంతురంగమున పరిచయము కల్గి క్రమక్రమముగా దృఢమైత్రియై పరిణమించినది ఆనందరావనవరతము వారి యింటికి వచ్చి పోవుచుండును. ఇక నితని భార్యతో ఆనందునికి సంపర్కము కలిగెనన్న వింత ఏమి? ఇరువురును గూడి వారము రోజుల వెనుక నొక దినము పటాయితులైరి. ఎక్కడి కేగిరో యెరుక పడకుండెను. అతని భార్య తనతో గూడ ధనము తీసికొని పోయినది. మనమిక చేయునదేమి? ఆ కాంత పట్టుపడునా? ధనము మరల దొరుకునా? ఇదియే సమస్య. చూపులకు సాధారణముగనే గన్పట్టుచున్నది.
    "నీ వేమి చేయ దలతువు?"
    "నేనేమియు చేయదలచుకొనలేదు. నా కింకొక యవసరకార్యమున్నది. ఈ రహస్యము భేదింప గుతూహలమగుచుండెను. కాని నేనట కేగవలయును కావున మిత్రమా! నీ కేది కష్టము కాకున్న నొక్కసారి యనకాపల్లి వెళ్ళగోరెదను. సుబ్రహ్మణ్యము నన్నే రమ్మనెను గాని యితర కార్యావసరమున నేగజాలక నిన్నంపుదునని చెప్పగా సమ్మతించినాడు. ఇక నీవు వెళ్ళక తీరదు. చని దొరికినన్ని సూత్రములు సేకరింపవలెను."
    "అభ్యంతరమేమి? నా సర్వశక్తులను వినియోగింపదలచినాను." ఇట్లు పలికి బయలుదేరితిని. బయలుదేరితినే కాని నేనెగెడు కార్యములు గూర్చి వారము దినముల లోపున మండలమంతయు మారుమ్రోగనున్నదని కలనైన దలపలేదు.
    మరునాడే తిరిగివచ్చితిని. మధుసూదనరావు వాలుకుర్చీ మీద కూర్చుండి యుండెను. నేనొక యాసనము మీద నాసీనుడనైతిని. నేను వెళ్ళిన పని నెరవేర్చుకొంటినని పలికి యతని కోరికమీద సంగతి నిట్లని తెలియజెప్పితిని:
    "పొగబండి మీద పోయి సాయంకాలం మగునప్పటికీ అనకాపల్లి చేరితిని సుబ్రహ్మణ్య మొక తోటను, అందలి యింటిని కొని కాపురమున్నారు. అది తోటయన్న మాటయే కాని అంతయు చీదరగా నుండెను. ఏవో వృక్షములున్నను అవి కాపలికాని కారణమున దైవికముగ బెరుగుచుండెను. ఎన్నియో తీగలు దట్టముగ అలముకొని యున్నవి. ఒక చిన్న యటవివలె నున్న యా తోట నరసి సుబ్రహ్మణ్యమునకు శ్రద్దలేదని యనుకొంటిని.
    "తోటకు జుట్టు నొక గోడ కలదు. అది మిక్కిలి యెత్తైనది. అదియు గూడ శిథిలావస్థలోనే యుండెను. పెంకుతో గట్టబడి యక్కడక్కడ నాచుతోడ నిండి మిక్కిలి జుగుప్సాకరముగ నుండెను. చాలచోట్ల సున్నమూడి నిజస్వరూప మగు పడుచుండెను ప్రదేశమంతయు నిర్జనమై భయంకరముగ నుండెను. మరియు నందందు.
    "ఆ వర్ణనముల కేమిలే! ప్రస్తుతాంశము దెల్పుము. అతని యా వాస మొకనిర్జన ప్రదేశమున దోటలో గలదు. మరి?
    "అతని యిల్లది యని నాకు తెలియకపోయి యుండును. కాని, దారిలోని యొక పురుషు నడిగి తెలిసికొంటిని. అతనికి దెల్పుటకు గారణమున్నదిలే! కోరమీసములు కథ యతడు సన్నగా పొడవుగా నుండెను. చామనఛాయ మేను కొంచెము విసువుతో నింటివెను వ్రేలు చూపెను.
    "ఆ వైపున తోటనుండి యొక సన్నని బాట కలదు. దాని మీదుట నిల్లు దేరితిని. అది యింటికి వెనుకదారి అట్లేగినను నా కక్కడనే సుబ్రహ్మణ్యమగుపడియెను.
    "అక్కడ నెన్నియో చిన్న గదులుండెను. ఒక గదిముందు నా కతడు కనబడెను. అతని కన్ను లెర్రబారి యుండెను. చేతులు కంపించుచుండెను. అట్టి యా దీనస్థితిని జూడ నాకు జాలి యయ్యెను. అది యేమో కాని యతని చూపులలో గ్రౌర్యము తాండవించుచుండెను."
    "బాగుబాగు. అతడే మనును?"
    "అదే విధముగా తన దుఃఖ చరిత్రము నేకరువుపెట్టెను. నేను వినజాలకుంటిని. అతడు పరిపరి విధముల భార్యను. మిత్రుని దూషించుచు 'మనుష్య స్వభావ మెట్టిది? దానికి నేనేమి తక్కువ జేసితిని? కోరినదేమి లేదంటిని! అయినను నన్ను కూల్చివేసినదే! ఆ మిత్రుడో! ఎంత యోగ్యమున జూపట్టెను? ఎంత నీచముగ ప్రవర్తించెను! ఛీ! ఇక లోకమున నెవ్వరిని నమ్మనగును!" అని చింతించుచుండెను.
    "ఈ లోపున నేనా యింటిని బరీక్షింప జాలితిని. తోట మాట జెప్పితిని కదా! ఇల్లుకూడా నదే వైఖరి. ఆ ప్రదేశమెల్లను ధూళిదూసరితమై యుండెను. ఎల్లయెడల పట్లు పట్టియుండెను. గోడలు గూడ నేనాటి నుండియో సున్నములు లేక పాడుపాడి యుండెను. పాపము సుబ్రహ్మణ్యము చేయునదేమి? ఇంటి దుఃస్థితి నరసియే కాబోలు నాతడు నే నేగుసరికి తలుపులకు రంగువేయుచుండెను. ఆ వాసన భరింపశక్యము కాకుండెను. కాని రంగులు మాత్రము ప్రశస్తమైనవి.
    యథాప్రకారముగా నాతడు తన పాట సాగించెను. నేనాతని నోదార్చుచు ముఖ్యాంశములను గ్రహింపజొచ్చితిని. ఆ రాత్రి తానును. ఆనందుడును నాటకమునకు బోదలచిరట-ముందే టిక్కెట్లు కొనిరట. కాని యాకస్మికముగా ఆనందరావేదో సాకు చెప్పి వెళ్ళుట మానెను. కావున తానొక్కడే వెళ్ళవలసి వచ్చెను. నాటకమునుండి తిరిగివచ్చునంతట నతనికి బంజర కీరము పలాయితమయ్యెనని బోధపడియెను. అతడిట్లని నాకు వాడని టిక్కెట్టు కూడా చూపినాడు.
    "ఆ! అట్లు చేసెనా! చెప్పుము. చెప్పుము. దైవికముగా టిక్కెట్టు సంఖ్యను గూడ గుర్తింపలేదుకద."
    కొంచెము గర్వముతో "చూచితి" నంటిని. "అది నా చిన్నప్పటి బడి యంకెయగుటచే జ్ఞాపకముండిపోయెను. అది యిరువది యైదు."
    "అట్లయిన ననంతా! సుబ్రహ్మణ్యము కూరుచున్నది యిరువది నాల్గవదో, ఇరువది యాజనదో కావలయును."
    "అవునవును పై కథ విసుము-సంభాషణము ముగిసినపిమ్మట నాతడు బల్లమీద కాగితములో నగుపడుచున్న ఛాయాపటమును నొకదానిని తీసి కోపముతో చించివేయుచు ఛీ! ఛీ! ఇక నా దుష్టురాలి ముఖము చూడనని యరచెను. నే నాతని స్థితికి జింతించితిని. పిదప పోవుదునని పల్కి మరలి వచ్చితిని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS